ఇంగితమెరిగిన సంగీతలోలురు
Published Sunday, 24 June 2018గ్రంథాలకంటే, శాస్త్రాల కంటే, ప్రవచనాల కంటే, దేవుణ్ణి గుర్తు చేసేవి గుడులూ, గోపురాలే.
కానీ ఈవేళ పరిస్థితులు మారాయి. మనశ్శాంతి నివ్వవలసిన ఆలయాలు మాన్యత కోల్పోతున్నాయి. వ్యాపార కేంద్రాలై, ప్రసాద వితరణే పరమావధిగా మిగిలిపోతున్నాయి.
సంగీత కచేరీలన్నీ ఒకప్పుడు దైవసన్నిధిలో దేవాలయాల్లోనే జరిగేవి. పనీ, పాటూ ముగించుకుని ప్రశాంతంగా కూర్చుని విని పరమానందంగా ఇళ్లకు వెళ్లేవారు. ఆరాధనా భావం పుట్టాలంటే ‘ఆర్తి’ వుండాలి. దీనికి అంతరంగ శుద్ధి అవసరం - ఇది బజారులో దొరికేది కాదుగా? మనస్సును భగవదర్పణం చేయకపోతే ఐహిక బంధాల వైపే దృష్టి పెరిగిపోతుంది. దీనికి అంతుండదు. అదుపుండదు. వీటికి దూరంగా ఉండటం కోసమే లలిత కళలు పుట్టాయి.
ఉదర పోషణార్థం.. బహుకృత వేషంతో మొదలై, కూటి కోసం కోటి విద్యలు ఏర్పడ్డాయి. మనిషి బ్రతకడానికి ఏదో ఓ దారీ, తెన్నూ ఉండాలిగా. ఈ విభూతిని దైవమే అని కొందరే గుర్తించారు. ఇదంతా పరం చేస్తేనే పరమార్థమని సృష్టికర్తకు బాగా తెలుసు. అందుకే కొందరికి అడక్కుండానే ఆ విభూతులిచ్చాడు.
కారణజన్ములైన భక్తులుగా, వాగ్గేయకారులుగా పుట్టించాడు. వీరికి లౌకిక విషయ వాంఛలు వుండవు. ఆత్మోద్ధరణే లక్ష్యంగా నాదాన్ని పరమాత్మ స్వరూపంగా భావించి, తపస్సుగా చేసిన సాధనతో పునీతులయ్యారు. వారి సంగతి వారు చూసుకోలేదు. మనం కూడా తరించే మార్గాన్ని కూడా చూపించారు.
దాశరథీ! నీ ఋణము తీర్ప తరమా
పరమ పావన నామ! ఆశదీర దూర దేశముల ప్రకాశింపజేసిన రసిక శిరోమణి’ అంటాడు.
త్యాగరాజుకు ‘ఆశ’ ఏముంటుంది? ఈ ఆశ రాముడిదే. ఈ కీర్తనలు వింటే భక్తి, ముక్తీ కలుగుతుందని కాశీలో వున్న సంగీత విద్వాంసుడికి కలలో కనిపించి చెప్పినవాడు రాముడే.
విశ్వవ్యాప్తమైన త్యాగరాజు పేరు, అదేదో యథాలాపంగా వచ్చినది కాదు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు ఆ సంగీత సద్గురువును ఆశ్రయించుకుని అన్నీ వదిలేసి ఒక్క సంగీతానే్న పట్టుకున్న శిష్యులు, ఒక్కొక్కడూ పది పదిహేను మంది విద్వాంసులను తయారుచేయగల సత్తా సామర్థ్యాన్నీ సంపాదించేశారు. సంగీతంపై గల శ్రద్ధ్భాక్తులే వారి పెట్టుబడి. గురుదక్షిణ కూడా కోరుకోని సద్గురువు సాన్నిహిత్యంలోనే బ్రతికారు.
ఆ సంగీత ‘గురుకులాలకు’ కులాలు, మతాల పట్టింపులంటూ లేవు. ఆకలేస్తే గురువుగారింట్లోనే కాస్త తినేసి, నిద్రొస్తే పడుకోవటం మినహాయించి, మిగిలిన వేళ అంతా సాధనా సంగీతమే. మహావిద్వాంసులవటంలో ఆశ్చర్యం ఏముంది? సంగీతమే గురుశిష్యుల ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా. అలా ఎనే్నళ్లు గడిచాయో ఎవరికీ తెలియదు. నేర్చుకోవలసినదంతా హాయిగా గురువు పెట్టే అన్నప్రసాదం కాస్తా తిని నేర్చేసుకున్న వారికి, అంతకంటే లౌకిక అవసరాలు ఏముంటాయి? తాను సంగీతాన్ని నమ్ముకుని పాడుతూ బ్రతుకుతూ, తనను ఆశ్రయించుకున్న శిష్యుల్ని కన్నకొడుకులుగా భావించిన గురువు ఉంఛవృత్తితోనే వాళ్లను జ్ఞానసంపన్నులను చేశాడు.
చేయి జాపి ఏ ప్రభువునూ ప్రభుత్వాన్నీ ఒక్క రూపాయి అడగలేదు. ఆశించలేదు. యిక్కడి వాడు, అక్కడకు వెళ్లి మన తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాడు. జీవన్ముక్తుడై, కీర్తి శరీరంతో చిరస్మరణీయుడై సంగీత లోకానికే వెలుగు రేఖలను ప్రసరింపజేసిన ఆ నిష్కామ యోగి. ‘త్యాగయ్య మా తెలుగువాడని గర్వంగా చెప్పుకునేలా’ జీవించాడు. ఆయన పేరు చెప్పుకుని పాడే ప్రతి గాయకుడూ అన్నోదకాలకు లోటులేకుండా చేసి ధన్యుడైన, మూర్థన్యుడై, జన్మసార్థకం చేసుకొన్న ‘నాదయోగి’.
* * *
మన తెలుగువాడైన కాశీనాథుని విశ్వనాథ్ 1980లో ‘శంకరాభరణం’ అనే చిత్రాన్ని విడుదల చేసి ఒక ప్రభంజనం సృష్టించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో నేనో రోజు రేడియో లైబ్రరీలో వుండగా కాంప్లిమెంటరీ కాపీలుగా ‘శంకరాభరణం’ పాటల సీడీనిస్తూ, క్రియేటివ్ కమర్షియల్స్ ఏజెంట్ పాపయ్య అనే వ్యక్తి ‘అయ్యా! ఈ సినిమా మీ బోటివాళ్లే చూడాలి. సంగీతం సినిమా ఇది. మామూలు వాడికెక్కదు’ అని పెదవి విరుస్తూ ఆ సీడీలు నా చేతికిచ్చాడు వినమని.
స్టూడియోలో కొన్ని పాటలు వినేసి మళ్లీ లైబ్రరీలో పెట్టేశాను. మీరు నమ్మండి. అదేమి చిత్రమో! వారం వరకూ ఆ సినిమాను పెద్దగా ఎవరూ తలుచుకోలేదు. అన్నిచోట్లా విద్యుత్ కాంతి మెరిసినట్లుగా ఒక్కసారి పేరందుకుంది. ప్రశంసల వర్షం మొదలైంది. సంగీత ప్రధానమైన చిత్రాలు గతంలోనూ వచ్చాయి. ఖాన్ సాహెబ్ బడే గులామాలీఖాన్, ఉస్తాద్ అమీర్‌ఖాన్ సాహెబ్ లాంటి దిగ్గజాలైన విద్వాంసులు పాడటంవల్ల సినిమా సంగీత స్థాయి పెరిగి అలాంటి సినిమాలు ఎన్నో విజయవంతమయ్యాయి కూడా. కర్ణాటక సంగీతంలోని శంకరాభరణ రాగానికి సమానమైన హిందూస్తానీ రాగం రాగ్‌బిలావల్. సి.మేజర్‌గా పాశ్చాత్య సంగీతంలో వినబడే శంకరాభరణం, 72 మేళకర్త రాగాలలో రక్తిగా వుండే అతి పెద్ద రాగం. ఈ రాగానికి పుట్టిన ఎన్నో జన్యరాగాలు కూడా ప్రసిద్ధమైనవే.
‘నరసయ్య’ అనే ఒక ప్రసిద్ధ విద్వాంసుడు ఈ శంకరాభరణ రాగాన్ని రోజుల తరబడి పాడేవాడని, ‘శంకరాభరణం నరసయ్య’గా ప్రసిద్ధుడని ప్రతీతి. కొన్నికొన్ని రాగాలు రెండు నిమిషాల నుండి రెండున్నర గంటలు పాడవచ్చు. రెండు మూడు రోజులపాటు పాడవచ్చు. రాగానికున్న పరిధి అనంతం. అపరిమితం. ఒకే రాగంలో ఎన్నో కీర్తనలు వాగ్గేయకారులు రచించటానికిదే ప్రధాన కారణం. ‘తోడి సీతారామయ్య’ అనే విద్వాంసుడు తోడి రాగం పాడటంలో చాలా ప్రసిద్ధుడుట. డబ్బు కోసం ఆ రాగాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలున్నాయి.
సంగీతాన్ని నమ్ముకున్నవారి బ్రతుకులు వేరు. అమ్ముకునే వారి సంగతి వేరు. అదలా వుంచండి. గ్రహించవలసిన విషయం, ఆ రోజుల్లో సంగీతాన్ని నమ్ముకున్న వారి పట్ల గౌరవం, ఔదార్యం గల సంగీత సంస్కారుల్ని మెచ్చుకోవాలి. రాగాన్ని తాకట్టు పెట్టగలిగిన ధైర్యం, కేవలం సంగీతానికి అప్పివ్వగల సంస్కారం కలిగిన మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారా? అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ‘ప్రేమ, భక్తి, వాత్సల్యం, సంగీతం వల్ల ఏర్పడతాయనీ, నియమ నిష్టలేర్పడతాయనీ, సార్వజనీనమైన సంస్కారం ఏర్పడుతుందని’ త్యాగరాజే చెప్పాడు. (సంగీత శాస్త్ర జ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా)
చిత్తూరు వి.నాగయ్య ‘త్యాగయ్య’ పూర్తిగా సంప్రదాయ సంగీత ప్రధానమైన సినిమా త్యాగరాజ కీర్తనలే మూలం. కష్టమైనా ఇష్టపడి ప్రత్యేకంగా నేర్చుకుని ఆ కీర్తనలు పాడి, పేరు సంపాదించిన నటుడు. 1952లో హిందీలో తీసిన ‘బైజు బావరా’ ఒక ద్రుపద్ గాయకుని కథ. చరిత్ర సృష్టించింది. 1965లో డ్యఖశజూ యచి ఖఒజష వచ్చింది. ఐదు ఆస్కార్ అవార్డులందుకుని చరిత్ర సృష్టించింది.
థియేటర్‌లో ఆ చిత్రం చూసిన సంగీతజ్ఞులందరి నరనరాల్లోనూ శంకరాభరణం రాగ స్వరగంగ ప్రవహించిందంటే ఆశ్చర్యంలేదు. సంగీతం అవసరమేమిటో, ఎందుకు ఎలా ఉద్ధరిస్తుందో మనుషుల్ని ఎలా మార్చేస్తుందో చెప్పిన చిత్రం డ్యఖశజూ యచి ఖఒజష.
ఈ శంకరాభరణం చిత్రం వేరు. శాస్త్ర ప్రమాణాన్ని వదిలేసి చిందులు తొక్కే పాటలను నిరసిస్తూ, సమాజంలో సంప్రదాయ సంగీతానికున్న గౌరవాన్ని గుర్తు చేసిన ‘శంకరాభరణం’లోని శంకరశాస్ర్తీ పాత్రకు ప్రేరణ ఎవరో కాదు. ‘గాయక సార్వభౌమ’ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారే.
సంప్రదాయ సంగీతం ఎలా ఎందుకు నేర్చుకోవాలో చాటిచెప్పిన చిత్రమే కాని, దాన్ని సంగీతమయం చేసేస్తూ రాగసౌందర్యాన్ని ఆవిష్కరించి చూపించాలనే ప్రయత్నం కాదు. కానీ ఒకటి నిజం - విడుదలైన కొత్తలో ఈ చిత్ర ప్రభావంతో సంగీతం నేర్చుకోవాలనే తపన పెరిగి ఒక్కసారిగా సంగీత కళాశాలలకు గిరాకీ ఏర్పడింది. ఎందరో యువతీ యువకులు క్యూలు కట్టి కళాశాలలలో చేరటం ప్రారంభించారు. అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. సరళీ స్వరాలు, జంట స్వరాలు, పిళ్లారి గీతాలతో బెంబేలెత్తిపోయారు.
నాలుగుసార్లు వినేస్తే కరతలామలకంగా పాడగలిగే సినిమా పాటలు వడ్డించిన విస్తళ్లులా వుంటే ‘ఈ కంఠశోష’ ఎందుకనుకున్నారో ఏమో, సంగీతానికి స్వస్తి పలికారు. సంగీత మార్గదర్శకులు మనవారై, భాష మనదై, మనకే దానియందు అభిమానం వుండి వున్నట్లైతే ‘ఇది మా ఆంధ్ర సంగీతం’ అని ఢంకా బజాయించి చెప్పి వుండేవాళ్లమేమో?’
*
సంగీతానికి మనస్సే కొలమానం. సంగీత స్థాయిని నిర్ణయించేది కేవలం బుద్ధి. అంతఃకరణే ప్రమాణం. తూనికలు, కొలతల శాఖ కిరాణా షాపుల్లో దాడిచేసి జొరబడినట్లు ‘సంగీతం ఎలా పాడుతున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఏమి బోధిస్తున్నారనే ‘నిఘా’ ఉండదు.’
మనసుకు ఆనందం కలిగించే విద్య. మనసు పెట్టి నేర్పవలసిన, నేర్చుకోవలసిన విద్య. డిప్లమోలు, డిగ్రీలు పాట పాడించవు. సాధనే శరణ్యం. ప్రతిభా మలం ధారాళంగా ప్రవహించి, స్వతంత్రంగా పాడగలిగే గాయకులకు అనుకరణలో ఆనందం వుంటుందా? వుండదు.
ఒక పని నిన్న చేసినట్లే ఈ వేళ కూడా చేస్తే అర్థమేమిటి? మొక్క నిన్నటి కంటే మరునాటికి కొంచెం పెరుగుతోంది. గాయకులలో అటువంటి ‘పెరుగుదల’ కనిపించవద్దా? మొక్కపాటి చేయమా మనం? మొక్కపాటి చేయనప్పుడు దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కి ఏం లాభం? పాడిందే పాట. ఎన్నాళ్లు వింటారు? ఎనే్నళ్లు ఆనందిస్తారు?