S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాన మర్మం తెలుసుకో.. గాయకుడై నిలిచిపో!!

ఏ గాయకుడైనా పాటకు లొంగిపోతాడు. కానీ పాట గాయకుడికి అంత సుళువుగా లొంగదు. నాటిన విత్తనం ఫలదీకరణ చెంది వృక్షమవ్వాలంటే చేసే కృషి ఎంతో పాటైనా అంతే - పదాల పొందిక అల్లికా కాదు పాటంటే. కేవలం కొన్ని మాటల సమాహారం కాదు - ఆ మాటల్ని మోస్తూ, వెలువడే నాదం అందులోనే వుంది ఆకర్షణ. మనిషిని మైమరపించేది అదే. పాడే ప్రతి గాయకుడికీ ఈ నాద సుఖం తెలుస్తుందనుకోలేం.
జ్ఞాపకశక్తి, కండబలంతో కేవలం తాళమే ప్రధానంగా సాగే గాయకులకు నాదసుఖం ఎప్పుడూ ఆమడ దూరంలోనే వుంటుంది. ఏదో బాధలన్నీ మరిచిపోయి కాస్సేపు కూర్చుని ప్రశాంతమైన సంగీతం వినాలనుకునే శ్రోతకు ‘్ఢమ ఢమ’ ‘కర కర’ శబ్దాల ‘వాద్య ఘోష’ ఎటువంటి సుఖాన్ని కలిగిస్తుందో వినేవారినే అడగాలి - ఇందుకే ‘త్యాగయ్య’ మృదంగాన్ని సొగసుగా వాయించే వాద్యాల్లో చేర్చారు.
మిగతా వాద్యాలకంటే ఈ లయవాద్యానికే ప్రాముఖ్యత ఎందుకు లభించిందో తెలుసుకుంటే చాలు.
రాగ ప్రధానమైనది సంగీతం - వర్ణాలతో అలంకరిస్తూ పాడేది రాగం. స్వరానికి రంగు, రుచి, వాసనా వున్నాయి - ఒక రూపం వుంది. కలకత్తా వెళ్లినా కంబోడియాలో విన్నా సంగీతమంతా స్వరాల్లోనే వుంది. స్వర వర్ణాలతో అలంకరిస్తే ఆ పాడే పాటకు భావం ఏర్పడుతుంది. ఈ జ్ఞానం కేవలం వినికిడితో రాదు. జీవితాన్ని ధారపోసి సాధనతో సంపాదించాలి.
‘పరమానందమనే కమలముపై ఒక భేకములు చెలగే మనసా’ అని త్యాగయ్య, అనటానికో కారణముంది. బురద నీటిలో క్రిమికీటకాలు కొంగలూ, కప్పలూ తిరుగుతూన్నా పక్కనే కనిపించే కమలాల్లోని మకరంద మాధుర్యం తెలిసేది మాత్రం ఒక్క తుమ్మెదకే.. హాయిగా ఎగురుతూ ఏ హడావిడీ లేక, చల్లగా, ఎక్కడి నుంచో వచ్చి తామరలో దూరి మకరందం కడుపునిండా తాగేసి మత్తెక్కిపోతుంది. పక్కనే 24 గంటలూ చుట్టూ తిరిగే జీవరాశికి దక్కేది బురదే. తుమ్మెద ఎందుకు కమలాల మీద వాలుతోందో తెలుసుకోవాలనే ఆశ పొరపాటున దిగితే కెలికేసి రావటం తప్ప, సాధించేది ఏదీ వుండదు. అంతే నాకు చాలు. తమలపాకు తొడిమే పదివేలు. ఉన్న జ్ఞానం చాలనుకుంటూ బురదలో తిరుగాడే ఒక భేకాల్లా అజ్ఞానంలో అహంకరించే గాయకులున్నారు. లోకానికి ఒనగూడే ఉపయోగం సున్నా. దివ్యమైన సంగీతం ముందు తేలికైన బాణీలు కూడా అంతే.
గానయోగం ఎక్కడో ఏ పుణ్య పురుషుడికో, యోగులకో మాత్రమే సాధ్యమనుకోవటంలో ఆశ్చర్యం లేదు. సంగీతం మనిషిని జీవన్ముక్తుణ్ణి చేయగలదని గాఢంగా నమ్మినవాడూ, రామనామ తారక మంత్రమే దైవం అని భావించాడు త్యాగయ్య.
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నాదోపాసనతోనే వశులౌతారని ఘంటాపథంగా చెప్పిన ధీరుడు, ఆయన.
నిత్యం మననం చేయటం వల్ల నిర్మలమయ్యేది మనస్సు. నాదయోగం కూడా మంత్రమే. నాభి నుండి పుట్టి, హృదయం, కంఠం, నాలుకను స్పృశిస్తూ వాక్‌రూపంగా బయటపడే అమృతోపమానమైన సంగీతం కూడా మంత్రమే. నాదమయుడైన పరమేశ్వరుణ్ణి కొలిచి ధన్యులైన భక్త శిఖామణులూ, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు ‘చెవిని ఇల్లు కట్టుకుని బోధించిన మాటలు మనకు కర్తవ్య బోధన చేస్తోంటే వాటిని పక్కనపెట్టేసి, తాత్కాలిక సుఖం కోసం, క్షణికానందం కోసం వినేదీ పాడేదీ సంగీతమ’ని భావించేవారికి బ్రహ్మానందం దొరకదు.
ఒకే స్వరం, పది మందికీ పది రకాలుగా కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా సంగీత దర్శకులు రాగంలోని రుచిని అనుభవించి పాటలు కట్టేవారు. ఇప్పుడా అవసరం లేదు. ఎవరి ఆనందం వారిది. ఇప్పుడు ‘బీటు’ బాట పట్టారు. స్వర వర్ణాలతో పనిలేదు. రాగ రసంతో నిమిత్తం లేదు. కాని రాగరసంలోని మాధుర్యం ఒక్కసారి మనసుకు అలవాటైతే ప్రపంచం తెలియదదు. అందుకే యాగఫలం, యోగఫలం, త్యాగఫలం, భోగఫలం.. రాగసుధారస పానంతో లభిస్తాయన్నాడు త్యాగరాజు.
అందుకే నాద రహస్యం తెలిసిన ఆ మహానుభావులు చిత్తవృత్తిని నిరోధిస్తూ తాదాత్మ్యంతో మనసు తీరా పరవశించి పాడుకున్నారు. నాద యోగులయ్యారు. ‘నాదానందంలో వున్న రుచి, మాటల్లో చెప్పేది కాదు. అంతా స్వానుభవమే’ అన్నాడు త్యాగయ్య. గాయకుడు, ఏ వాగ్గేయకారుడో రాసిన కీర్తన తనదిగా భావిస్తూ రాగభావ తాళ సమన్వయంతో పాడగలిగే శక్తికి.. పునాది.. సాధన.
మనిషి నీడలా సాధన ఎప్పుడూ విద్వాంసుణ్ణి అనుసరించే వుంటుంది. అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదించి మార్గదర్శకులై మన తెలుగు గడ్డ మీద పుట్టిన మహావిద్వాంసులలో దక్షిణాది విద్వాంసులకే తలమానికమైన సంగీత కళానిధి బిరుదును పొందిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ (చిత్తూరు) నాదస్వరం, షేక్ చినవౌలానా సాహెబ్ (చిలకలూరిపేట), టి.వి.సుబ్బారావు, కన్యాకుమారి, డా.బాలమురళీకృష్ణ, డా.ద్వారం వెంకటస్వామి నాయుడు (వయొలిన్), డా.శ్రీపాద పినాకపాణి, డా.నేదునూరి కృష్ణమూర్తి గారలు మనకు చిరస్మరణీయులు.
మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో మొత్తం 90 మంది విద్వాంసులలో ‘సంగీత కళానిధి’ బిరుదును పొందిన తెలుగువారు కేవలం తొమ్మిది మందే. శ్రుతికి మారుపేరుగా, మహావిద్వాంసుడైన ద్వారం నాయుడుగారితో డా.పినాకపాణి గారి సాహచర్యం కేవలం 3 మాసాలు. నిద్ర, భోజన వేళలు తప్ప మిగిలిన సమయంలో నాయుడిగారింట్లో సంగీతమే వినబడేది. ఆయన శిష్యులెవరెవరో ఒకరు వీణ మీద, వయొలిన్ మీద పాఠాలు వల్లిస్తూ వుండేవారు. ఆ వినికిడి ఎంతో లాభంగా వుండేది.
కాలనాధభట్ల కృష్ణమూర్తి, గున్నయ్య, మద్దెల సత్యం, అల్లు వెంకయ్య, చాగంటి బాబు మొదలైన వారితో సాధన సాగేది. ఖండవల్లి జనార్దనాచార్యులు వీణపై, చాగంటి బాబు వయొలిన్ మీద సాధకం చేసేవారు. ఇద్దరూ బాగా పాడేవారు. కొన్ని పల్లవులు ఈ చాగంటి బాబు దగ్గర నేర్చుకున్నాను. ‘ఆకాశం మేఘావృతమైన మరుక్షణం కుంభవృష్టిగా వర్షం కురిసినట్లుగా విన్న ద్వారం వారి వయొలిన్ వాద్యం నా మనోద్వారాలను తెరిపించి, నాదమాధుర్యంలోని రుచిని అలవాటు చేసిందని’ పాణిగారు నాతో అన్న మాటలు ఇంకా గుర్తే. *

- మల్లాది సూరిబాబు 90527 65490