S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకాశవాణి క్రియాకలాప చక్రవర్తులు

ఆకాశవాణి అంటే సంగీతం, సాహిత్యాలే. హితాన్నీ, సుఖాన్నీ ఇవ్వటమే రేడియో లక్ష్యం.
అలసిన మనసులను సేదతీర్చేలా కార్యక్రమాలుండాలే గాని ‘బాబ్బాబు! చూడండి!’ మీరు స్తిమితంగా కూర్చుని, బుద్ధిగా వింటే నాలుగు మంచి విషయాలు మీ చెవిని వేస్తామనే ధోరణిలో (చదివేస్తూ) చెప్పుకుంటూ పోతే వినరు. పుస్తకాల్లో కనిపించే భాషకూ రేడియోలో వినబడే భాషకూ తేడా వుంది. గ్రాంథికంగా మాట్లాడే శైలి కుదరదు.
ఎదురుగా కూర్చుని మాట్లాడినట్లుగా, వుంటేనే ఆ కాస్సేపైనా వింటారు. ఎలా చెప్పగలిగామో అన్నదే ప్రధానం. ఎన్ని పేజీలు రాశామన్నది కాదు. చెప్పే విషయం కంటే, మాట్లాడే వైఖరే ప్రధానం.
దేశంలో అన్ని రేడియో కేంద్రాల ప్రసారాలూ ఓ వయొలిన్ ట్యూన్‌తో (సిగ్నేచర్ ట్యూన్) ప్రారంభవౌతాయన్న విషయం మీ అందరికీ తెలుసు. ‘శివరంజని’ రాగంలో సెచ్‌మన్, వాల్టర్ కాఫ్‌మన్ అనే యూదు శరణార్ధి, న్యూఢిల్లీ కేంద్రంలో సంగీత శాఖకు డైరెక్టర్‌గా వున్న రోజుల్లో (అంటే 1936లో) రికార్డైంది. మీరు వినే ఆ వయొలిన్ వాద్యం సుప్రసిద్ధ వాద్యబృంద నిర్వాహకుడు జుబెన్ మెహతా తండ్రి వాయించారు.
1947లో దేశానికి స్వతంత్రం రాగానే ప్రజల నుద్దేశించి ఢిల్లీ స్టూడియోకి వచ్చి, మొదటిసారి మాట్లాడుతూ ‘జాతిపిత మహాత్మాగాంధీ’ ని ఒళళ డ్ద్ఘరీఆజ, ఆ్దళ ౄజ్ఘూషఖ్యఖఒ ఔ్యతీళూ యచి ద్యిజూ జశ గ్ఘజూజ్య’ (్భగవంతుని వైభవాన్ని, శక్తినీ రేడియోలో చూస్తున్నాను) అన్నప్పుడు, అందరూ హర్షాతిశయంతో పులకించిపోయి విన్నారు-
‘1938లో విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ కలకత్తా రేడియో కేంద్రాన్ని ప్రారంభిస్తూ బెంగాలీ భాషలో తాను సిద్ధం చేసుకున్న పద్యాలు ‘ఆకాశవాణి’ అనే పేరుతో సంబోధించి ప్రారంభించారు. ఆ తర్వాత చాలాకాలానికి ‘అదేమాట’ స్థిరమైంది. ఆలిండియా రేడియో ఆకాశవాణి అయింది.
సంప్రదాయ సంగీతం, సాహిత్యం, నాటకం లాంటి క్షేత్రాలలో విశేష కృషి చేసిన సమర్థులూ, విఖ్యాతులూ రేడియో ప్రొడ్యూసర్లవటంతో ప్రతి రేడియో కేంద్రం ఓ సరస్వతీ నిలయంలా కనిపించేది. ఆ రోజుల్లో పనిచేసిన అధికారులూ, ఆర్టిస్టులూ సమాజాన్ని దేవాలయంగానే భావించేవారు. కార్యక్రమాల నిర్వహణలోగానీ రూపకల్పనలో గానీ అణువణువు శ్రద్ధ్భాక్తులు కనపడేవి - నిర్లక్ష్య భావాలు ఎరగని రోజులు. ముఖ్యంగా మాటల వైఖరిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. సూక్ష్మంగా కనిపించే ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా ఆలోచించి గాల్లోకి వదిలేవారు. ఎలా మాట్లాడినా చెల్లుతుందనీ ఏం పాడినా శ్రోతలు వింటారని భావించేవారు కాదు. ఉన్నత ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీలేదు. అజమాయిషీ చేసే వారందరికీ అన్నీ తెలియాలని లేదు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి వెనకటి తరంలో వారికి ఎక్కువగా వుండేది కాబట్టే ఆ రోజుల్లో ఎంతో ఆలోచించి చేసిన కార్యక్రమాలు శ్రోతలు ఈనాటికీ మరచిపోలేదు. విజయవాడ కేంద్రం తీసుకోండి.
కూచిమంచి కుటుంబరావు (అప్పట్లో అనౌన్సర్) సీతారత్నమ్మ కలిసి చేసిన చిన్న నాటిక ‘నాటికి నేడు’ ఎన్నిసార్లు ప్రసారమైనా విసుగు లేకుండా విన్నారు.
* * *
కందుకూరి చిరంజీవిరావు ప్రభృతుల ‘వరవిక్రయం’ సరేసరి. యక్షగానాలకూ, సంగీత రూపకాలకూ లెక్కలేదు. నండూరి సుబ్బారావు, ఎఫ్.రామ్మోహనరావు జంటను ఎరగని శ్రోత లేడు. బందా కనకలింగేశ్వర్రావు విజయవాడ కేంద్రంలో నాటక విభాగాధిపతిగా ఉన్న రోజుల్లో రికార్డైన ‘గణపతి’ నాటకం, ఎనె్నన్నిసార్లు ప్రసారమైనా మళ్లీమళ్లీ వినాలనిపించటానికి ఆ రోజుల్లో పనిచేసిన చిత్తశుద్ధిగల వ్యక్తులే కారణం. కీ.శే. వంగర వెంకటసుబ్బయ్య (సినీ నటుడు) వరవిక్రయం నాటకం ప్రదర్శనకు నోచుకున్నట్లుగా ‘గణపతి’ నాటకానికి ప్రదర్శన భాగ్యం పట్టలేదు. పుస్తకానికే పరిమితమై చదువుకోవడానికే సరిపెట్టుకున్న ఈ నాటకం వెలుగులోకి రావటానికి కారణం రేడియో తెలుగు నేల నాలుగు చెరగులా చిలకమర్తి కీర్తి వ్యాపించడానికి కారకులైన బందా వారిని, నండూరి సుబ్బారావును ఎలా మరిచిపోగలరు?
రాధాకృష్ణ, పూటకూళ్లు, సతీసక్కుబాయి, అనార్కలి, మొదలైన ఎన్నో నాటకాలు శ్రోతల మనోఫలకాలపై అలాగే నిలిచిపోలా?
పశ్చిమగోదావరి జిల్లా వసంతవాడలో పుట్టి ‘ఎంకి పాటల’ సుబ్బారావుగా ప్రసిద్ధి చెందిన నండూరి వెంకట సుబ్బారావు ఈ తరంవారికి తెలియకపోవచ్చు.
ఆంధ్రదేశంలో ఆయన పేరును శాశ్వతం చేసిన గాయనీమణులలో ప్రముఖులు సీత, అనసూయ. అనసూయకు ఈవేళ 98 సంవత్సరాలు. నండూరి వెంకట సుబ్బారావు కుటుంబం నుంచి అభ్యంతరాలు రాకుండా వుండి వుంటే ఈ ఎంకి పాటల ప్రసారం అర్ధంతరంగా ఆగి వుండేది కాదు. రేడియో కేంద్రాల్లో కొన్నిచోట్ల అవి అలా మూలుగుతూనే ఉన్నాయి.
డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, రమణమూర్తి, ఎం.ఎస్.రామారావు లాంటి గాయకులెందరో ఏనాడో ఈ పాటలు పాడేసి రికార్డులిచ్చారు. ఆ పాటలన్నీ ఆకాశవాణి టి.ఎస్.రికార్డుల్లో యిప్పుడున్నాయో లేదో మరి. ఆ దైవానికే ఎఱుక.
‘ఎంకి నాయుడు బావ’ సరసాల్ని సుబ్బారావులాగా సరసంగా వర్ణించిన కవులేరీ? ఈ పాటలకు ప్రాణం పోసింది ఆకాశవాణి. మరిచిపోయేలా చేసింది ఆయన కుటుంబం.
ఆ రోజుల్లో ఏ ప్రత్యేక కార్యక్రమమైనా, నాటకమైనా, యక్షగానమైనా శ్రోతలకు వారం రోజులు ముందుగా ఉత్తరాలు రాశి’ విని అభిప్రాయాలు తెలియపరచమనేవారు.
ప్రసంగించటానికి వచ్చేవారి చేతుల్లోని కాగితాలు చూస్తూ స్టూడియోకి తీసుకెళ్లి ‘గుండుసూదులు తీసెయ్యండి’ మా మైక్‌లు చాలా శక్తివంతమైనవి సుమా? చీమ చిటుక్కుమన్నా లాగేస్తుందని ‘బూచి’ని చూపించినట్లుగా భయపెట్టి ఖంగారు పెట్టకుండా, ‘ఒకటికి రెండు పర్యాయాలు స్క్రిప్టు బాగా ఒంటపట్టేలా చదివించి, తృప్తిపడిన తర్వాతే రికార్డు చేసేవారు.
రచయిత వ్యక్తిత్వాన్ని, హావభావ చేష్టల్నీ ప్రతిబింబిస్తూ కళ్లముందు కనపడేలా చదివించి తర్ఫీదునిచ్చే ప్రొడ్యూసర్లుండేవారు.
‘వాగ్వైఖరి’ బాగోలేకపోతే ఎటువంటివాడైనా శ్రోతలకు లోకువే. నచ్చకపోతే రేడియో కట్టేయగల సర్వహక్కులూ శ్రోతలకుంటాయనే యింగిత జ్ఞానం కలిగిన వ్యక్తులుండేవారు. నాలుగు నిమిషాల సూక్తిముక్తావళికీ ప్రాధాన్యత వుండేది.
సూక్తులు ఎలా పలకాలో, రాసినది ఎలా చదవాలో తెలిసిన పింగళి లక్ష్మీకాంతం, జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ, జమ్మలమడక మాధవరామశర్మ వంటి అనుభవజ్ఞులు రేడియోకి కొన్ని ప్రమాణాలు చూపించారు.
జనం, మనం అనే ధోరణే వుండేది గానీ, నేనూ, నా ప్రజ్ఞ, నా తెలివితేటలు’ అనే అహంకారం మచ్చుకైనా కనిపించని ప్రజ్ఞాపాటవాలున్న వ్యక్తులు మసలిన కాలమది.
వృత్తిని దైవంగా భావించటం, తమ ప్రవృత్తికి అనుగుణంగా శ్రద్ధ్భాక్తులతో పనిచేసే వారికి విజయాలు నల్లేరుబండిపై నడకలే. సాధారణంగా సృజనశీలురందరూ ఒకేచోట పనిచేయటంలో ఈసునసూయలుంటాయి. పోటాపోటీలుంటాయి. ఒకప్పుడు రేడియోకు లభించిన ఆదరణకు ప్రధాన కారణం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేకపోవడం వల్ల కాదు. రేడియోలో పనిచేసిన అప్పటి కళాకారుల సమిష్టి కృషే కారణం. మన సంగీతం, మన సాహిత్యం, మన తెలుగు భాష, మన సంస్కృతి వికాస వైభవంలో రేడియో కళాకారుల పాత్ర చాలా వుంది.
ఏదైనా మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా ఆదర్శంగా కనిపించేది రేడియో. కొంతమందికి వ్యవస్థల వల్ల పేరొస్తే, మరికొందరు వ్యక్తుల వల్లే వ్యవస్థకు కీర్తి లభిస్తుందనటానికి ఓ ఉదాహరణ చెప్తాను.
ఆ రోజుల్లో తెల్లవారితే వార్తాపత్రికల్లో చాతక పక్షుల్లా ఎదురుచూసే అవసరం వుండేది కాదు. 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు వార్తలు వినటం కోసమే ఉబలాటపడేవారు.
తాపీగా తర్వాత పేపరు చదువుకునేవారు.
ఇరవై నిమిషాలకు సరిపడ్డ సమాచారాన్ని పది నిమిషాల వ్యవధిలో ఖంగారు పడకుండా, తడబడకుండా స్పష్టమైన ఉచ్చారణతో, ప్రతి వార్తా విశేషాన్ని కళ్లకు కట్టినట్లుగా చదివిన పన్యాల రంగనాథరావు, అద్దంకి మన్నారు, దివి వెంకట్రామయ్య, తిరుమలశెట్టి శ్రీరాములు వంటి ఎందరెందరో న్యూస్ రీడర్ల కంఠస్వరాలను గుర్తుపెట్టుకున్న శ్రోతలు యింకా ఈ వేళ వున్నారు.
వార్తలక్కూడా రంగు, రుచీ, వాసనా అద్దిన కంఠాలవి. కళలతో, కళాకారులతో కలిసి ఆలోచనలు కలబోసుకుని ‘సృజన’కు దోహదం చేయటం ‘అధికారిత్వం’ కంటే గొప్పవని గ్రహించిన వ్యక్తులు పనిచేసిన గొప్ప సంస్థ ఆకాశవాణి. దీనికి మూల పురుషుడనదగ్గవాడు రజని. ‘చేతిలో వున్న విషయాలను నేర్పుగా, శ్రోత ఏకాగ్రంగా వినగలిగేలా చెయ్యలేని వ్యక్తి రేడియో ప్రసారానికి అర్హుడు కాదనేవారు. ఉషశ్రీ రామాయణ ప్రవచనం, ధర్మసందేహాలతో, రెండు మూడేళ్లపాటు విజయవాడలో ఆదివారాల్లో మధ్యాహ్నాలు ప్రతి ఇంటినీ ఓ ‘నైమిశారణ్యం’లా మార్చేసిన ‘మాటల మాంత్రికుడు’ ఉషశ్రీ. ‘లైవ్’లో నామమాత్రంగా చేతిలో ఓ పుస్తకం వుండేదంతే. కానీ ప్రవచనమంతా గంగా ప్రవాహంలా సాగిపోయేది. మధ్యమధ్యలో నేను శ్లోకాలు పాడేవాణ్ణి. నాకు తెలిసినంతవరకూ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నింటికీ బాధ్యత వహించేవారు రెండు రకాలుగా వుంటారు. ఒకరు ప్రోగ్రామ్ స్ట్ఫా, ఇంజనీరింగ్ అధికారులు కాగా, రెండవవారు కళాకారులు - నిలయ విద్వాంసులు మాత్రమే కాదు. బయట నుండి వచ్చి పాల్గొనేవారూ వుంటారు. ‘ఎవరి కోసం వింటారులే, వినకేం చేస్తారు?’ లాటి ధోరణితో మొక్కుబడిగా చేస్తే, రేడియోకు దిక్కులేదు. ‘సినిమా వాసనంటూ లేకుండా కార్యక్రమాలుండాలి’ అని అధిష్టానం కనక ఒక్కసారి ఆదేశిస్తే రేడియో ప్రయోజకత్వానికి అసలు పరీక్ష అప్పుడే, మొదలవుతుంది. దశాబ్దాలుగా ఎటువంటి ప్రమోషన్లూ లేకపోయినా, ఎనౌన్సర్‌గా చేరి, ఎనౌన్సర్‌గానే రిటైరైన ప్రజ్ఞావంతులు, జాతీయ స్థాయిలో ఈ రేడియోకు అవార్డులు తెచ్చిపెట్టారంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ నిజం. కవికుమారులైన జంటకవులు నిర్మించిన కవితా కుటీరంలో, భావయిత్రి, కారయిత్రి, సాధయిత్రి శక్తులను ఉపాసించి, సంగీత సాహిత్య కోవిదుడై, తాను నేర్చిన విద్యలన్నిటినీ ప్రదర్శించి, ఆకాశవాణి క్రియాకలాప చక్రవర్తిగా కళాప్రపూర్ణుడిగా వెలుగొందిన డా.బాలాంత్రపు రజనీకాంతరావే తరువాత తరం వారికి స్ఫూర్తిప్రదాత. ఎఫ్.ఎం. స్టేషన్లు వచ్చాయి. ప్రైవేటు ఎఫ్.ఎం. ఛానెళ్లు బయలుదేరాయి. శ్రోతలు సినిమా పాటలు వినాలంటే, రేడియో మీద ఆధారపడక్కర్లేదు. రేడియో ‘ప్రసారభారతి’ అయ్యింది. పాతకాలంలో వున్న రేడియో వైభవం తగ్గిపోయింది. మొక్కుబడి కార్యక్రమాలు మొఖం మొత్తుతున్నాయి. మార్పు రావాలి. వస్తుందో? లేదో?
*
చిత్రాలు..తిరుమలశెట్టి శ్రీరాములు

*అద్దంకి నాన్న

*నండూరి సుబ్బారావు

*పన్యాల రంగనాథరావు

*బాలాంత్రపు

*ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

*ఉషశ్రీ

*సి.రామమోహన్‌రావు

- మల్లాది సూరిబాబు 90527 65490