S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (అరణ్యకాండ-12)

తమను రక్షించమని శ్రీరాముడిని
ప్రార్థించిన మునులు
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ-12
*
ఇంతకు ముందు జరిగిన రామాయణ గాథలో, ఆ రెండు-బాల, అయోధ్య కాండలలో, శ్రీరాముడు అనేకానేక గుణాలు కలవాడని చెప్పడం జరిగింది. ఈ అరణ్యకాండలో సజ్జన రక్షణ అనే ధర్మం గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. రామావతార ప్రథమ ప్రయోజనం కూడా చెప్పడం జరుగుతుంది. సజ్జన సంరక్షణ ఈ కాండలో సారాంశమని ఆది నుండీ చెప్పడం జరుగుతుంది. అయోధ్యకాండలో సామాన్య లౌకిక ధర్మాలు, పుత్ర ధర్మం, రాజధర్మం, భ్రాతృ ధర్మం, మిత్ర ధర్మం, సత్యధర్మ నిష్ఠ లాంటివి చెప్పడం జరిగింది. ఈ కాండలో విశేష ధర్మాలు చెప్పడం విశేషం.
శ్రీమద్రామాయణంలో శ్రీ సీతారామలక్ష్మణులు ముఖ్యం. తక్కినవారందరూ సందర్భానుసారంగా వచ్చినవారే. ఈ ముగ్గురి సంబంధం చిద చిదీశ్వరుల సంబంధాన్ని తెలుపుతున్నది. ప్రకృతికి అధిష్ఠాన దేవత లక్ష్మి - సీత. ఈమె చైతన్య స్వరూపిణి. ప్రకృతి బద్ధాత్మ స్థానంలో ఈమె చెప్పబడింది. లక్ష్మణుడు ప్రకృతి సంసర్గంలేని జీవుడు. కాబట్టే ఈయన్ను భార్యతో జంజాటంలేని వాడిగా చెప్పడం జరిగింది. శ్రీరాముడు ఈశ్వరుడు. ప్రకృతి బద్ధజీవుడు. శుద్ధజీవుడు.. ఇరువురూ ఈశ్వరుణ్ణి ఆశ్రయించి, ఆయనకు శేషభూతులై వుండేవారే. ఈ తత్వం తెలిసినవాడు ముక్తులవుతాడని భగవద్గీతలో చెప్పబడింది. శ్రీమద్రామాయణం ఈ ముగ్గురి సంబంధమనే విషయం ఆద్యంతం బోధిస్తున్నది. ఇందులో సీతాలక్ష్మణులకు శ్రీరామచంద్రమూర్తి మీద గల ప్రేమ బాలకాండలో సూక్ష్మంగా వర్ణించడం జరిగింది.
తీవ్ర పరాక్రమవంతుడు, ధీరుడు, శ్రీరామచంద్రమూర్తి భయంకరమైన క్రూర మృగాలతో కూడిన దండకారణ్యంలో ప్రవేశించి, అక్కడ నానారకాలైన సుందర వృక్షాలతో అందంగా, శుభ్రంగా వున్న మునీశ్వరుల ఆశ్రమాలను చూశాడు. నార చీరెలతో, దర్భలతో వ్యాపించి, సారవంతములైన వేదాధ్యయనాలతో వచ్చిన బ్రహ్మ వర్ఛస్సు అనే సంపదతో వుండి, మిక్కిలి కాంతివంతంగా వున్న దుర్దశ్శమైన సూర్యమండలంలాగా కనిపించే ఆశ్రమ మండలాన్ని సమీపం నుంచి చూశాడు శ్రీరాముడు. ఆ ఆశ్రమ మండలం.. పలు రకాలైన మృగాలతో వ్యాపించి, నగరాల్లో ఎప్పుడూ కనపడని కొత్తకొత్త పక్షులతో కూడి, చూడడానికి కన్నుల పండుగగా వుండి, యజ్ఞార్థమై వచ్చే దేవతల వెంట వచ్చిన దేవతా స్ర్తిల = అప్సర స్ర్తిల ఆట పాటలతో, పూజలతో సంతోషం కలిగించేదిగా వుంది. విశాలమైన అగ్నిహోత్ర గృహాలతో, స్రుక్కులు, స్రువాలు, దర్భలు, సమిధలు, జలకుంభాలు, పండ్లు, కందమూలాలు కలిగి, తీయటి పండ్లతో నిండిన అడవి చెట్ల గుంపులతో సత్కరించబడిందిగా ఉన్నాయా ఆశ్రమాలు. వేద పాఠ రవం కలిగి కమలాలున్న కొలనులతో ప్రకాశిస్తున్నాయి. ఫలాలు, కందమూలాలు ఆహారంగా, ఇంద్రియ నిగ్రహం కలిగి, నారచీరెలు, జింక చర్మాలు కట్టి, బ్రహ్మ వర్ఛస్సుతో సూర్యాగ్నులలాగా ప్రకాశించే మునులున్నారక్కడ. వానప్రస్థ, సన్న్యాసాశ్రమం స్వీకరించిన వారితో, తపస్వులతో, వేదనాదంతో, పరబ్రహ్మ జ్ఞానం కలవారితో నిండివున్న ఆ ప్రదేశంలోకి ప్రవేశించాడు శ్రీరాముడు.
శ్రీరాముడి రాకను దివ్యదృష్టి ద్వారా అవతార రహస్యం తెలిసిన ఆ మునీశ్వరులు కనుక్కున్నారు. ఇన్ని జన్మలకు తమకు సాక్షాత్ భగవత్ దర్శన భాగ్యం కలిగింది కదా! మనం వెతుక్కుంటూ పోతే దొరకనివాడు మనల్ని అనుగ్రహించి ఇక్కడికే వస్తున్నాడు కదా! ఆహా! ఏం దయ? ఏమి సౌలభ్యం? ఏమి భక్త వాత్సల్యం? అనుకుంటూ, ఎదురుపోయి సీతారామ లక్ష్మణులను చూశారు.
శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని, సీతాదేవిని మునులంతా నిండారు మనసుతో, ప్రేమతో, సగౌరవంగా, మంగళాశాసనాలు చేసి సేవించారు. అడవిలో నివసించే ఆ ఋషీశ్వరులు లక్ష్మీదేవైన సీతాదేవికి ప్రియమైన శ్రీరాముడిని ఎంత చూసినా ఇంకా చూడాలని తృప్తిలేక ఆశ్చర్యంతో అలాగే వుండిపోయారు. సీతాదేవిని, లక్ష్మణుడిని, శ్రీరామచంద్రమూర్తిని ఋషీశ్వరులందరూ చూసిచూసి ఆశ్చర్యపడి రెప్పవాల్చకుండా తృప్తిలేక మళ్లీ మళ్లీ చూశారు. (దీనివల్ల భక్తులకు ఆనందానుభవమే ముఖ్యమని అనుకోవాలి). బ్రహ్మవర్ఛస్సుతో ధర్మాత్ములైన ఆ ఋషీశ్వరులు తమ పర్ణశాలకు రామచంద్రమూర్తిని పిలుచుకుని పోయి, ఆసనం చూపించి, కూర్చుండబెట్టి, కందమూలాలు, ఫలాలు, పుష్పాలు సమర్పించి చేతులు జోడించి ఇలా అన్నారు:
‘ఈ మునులందరినీ రక్షించే శక్తికలవాడివి నువ్వే. వారివారి స్వధర్మం వారు చేసేట్లు రక్షించగల గొప్పతనం కలవాడివీ నువ్వే! కాబట్టి మా స్వధర్మంలో మేముండేట్లు చూడు. నువ్వు ఇలాంటివాడివని నీ కీర్తిని అందరూ ఇదివరకే పొగుడుతున్నారు. నువ్వు గురువులందరికీ గురువువి.. పరమ గురువు కాబట్టి పూజార్హుడివి. కాబట్టి మేం చేసే పూజలను అంగీకరించి బిడ్డలను తల్లిదండ్రుల లాగా రక్షించు. నువ్వెందుకు రక్షించాలంటావా? నువ్వు మా స్వామివి.. మేం మాది అనుకునేదంతా నీ సొమ్ము కాని మాది కాదు. నీ సొమ్ము నువ్వే కాపాడుకోకపోతే మరెవరు కాపాడుతారు? నీ సొమ్ము నువ్వు కాపాడుకోవడానికి మేమెందుకు ప్రార్థించాలి? అది నువ్వే చేయాల్సిన పని కదా? సర్వస్వామివి కాబట్టే గౌరవించాల్సిన వాడివి. మాలో లోపం ఏదైనా వుంటే నువ్వు శాసించు. నువ్వు అసహాయుడవై ఎంత పనైనా చేయగల సమర్థుడివి. కాబట్టి నువ్వు మమ్మల్నందరినీ రక్షించు. రాజు దేవేంద్రాది అంశం గ్రహించి ప్రజలను రక్షించుకుంటూ ప్రజలచే శ్లాఘించబడి ఎక్కువ సంతోషంగా వుంటాడు. మేమందరం ఈ దేశవాసులమైనందున నీ వల్ల రక్షించబడాల్సిన వాళ్లం. కాబట్టి నువ్వు అధిక దయతో మమ్మల్ని రక్షించు.’
‘చూసి, భరించడానికి సాధ్యపడని, తేజస్సుగల శ్రీరామచంద్రమూర్తీ! ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటున్న మేము, ఎప్పుడూ మా మనసు నీ మీదే వుంచినందువల్ల, నీ సత్వగుణం మాలోనూ కొంచెం వున్నందున, తమోగుణమైన దండించడం మాకు తగదు. అలా చేస్తే మా తపస్సు నాశనమై మేం స్వతంత్రులమనే అహంకారం మాకు కలుగుతుంది. దానివల్ల మాకు స్వరూపహాని జరుగుతుంది. కాబట్టి మేం ఆ పని చేయం. నీ గర్భంలో వుండేవారం. తల్లిగర్భంలో వున్న శిశువును తల్లి కాకుండా మరెవరు రక్షిస్తారు? శిశువు తనను తాను రక్షించుకోగలదా? కాబట్టి మమ్మల్ని రక్షించే భారం సర్వకాల సర్వావస్థలలో నీ మీదే వుంది. అందుకే నువ్వు మమ్మల్ని రక్షించాలి. నువ్వు ఎక్కువ దయ కలవాడివి కదా! నీ మీద మా రక్షాభారం వేసి నినే్న నమ్ముకుని వుంటాం. అలాంటి మా మీద కాకుండా నీ అపారమైన దయ మరెవరి మీద చూపుతావు?’
ఈ విధంగా ఆ మునులు శ్రీరామచంద్రుడిని పూజించి, తమ వద్ద వున్న కందమూలాలను ఇచ్చి ఆయన్ను తృప్తిపరిచారు. దీనర్థం భగవంతుడిని పరివార సమేతంగా అర్చించి పూజించాలని, సిద్ధసాధననిష్ఠులు, అగ్నిహోత్ర సమానులు, ఇతర తాపస శ్రేష్ఠులు, న్యాయవృతుతలు వారివారి వర్ణాశ్రమ ఆచార పద్ధతుల ప్రకారం ఈశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తిని సంతోషంగా పూజించారు.

-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా.. 7036558799 - 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12