S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంప్రదాయ సంగీత వారధి

క్షిణ దేశంలో బాగా పేరున్న తమిళ విద్వాంసులతో సమానంగా పాడగలిగిన ప్రతిభా సంపన్నులైన సంగీత విద్వాంసులు మన తెలుగు నేల మీద పుట్టారు. సంప్రదాయ బాణీని సొంతం చేసుకున్నారు. నేర్చుకున్న సంగీతం సార్థకమయ్యేలా విద్వాంసులు మెచ్చేలా పాడవలసినంతా పాడేశారు.
ప్రక్కవారి మెప్పుల కోసమో ప్రభుత్వాల గుర్తింపు కోసమో, రివార్డుల కోసమో, రికార్డుల కోసమో వెంపర్లాడలేదు. నిశ్చల భక్తితో, దీక్షగా, సంగీతం కోసమే సంగీతం నేర్చి, దివ్యమైన గానం పాడి వెళ్లిపోయారు. యోగ్యత ఒక్కటే సరిపోదు. యోగం వుండాలి. వందలాది మూర్తిత్రయం వారి కీర్తనలు కంఠోపాఠం చేసి, రాగానుభవంతో పండి, నాదయోగానుభూతి నిండిన అరుదైన సంగీత విద్వాంసుడు పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాడని ఆకాశవాణి నిలయ కళాకారుడు బలిజేపల్లి రామకృష్ణశాస్ర్తీ.
1962లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కేర్‌టేకర్‌గా అంటే వివిధ వాద్యాల సంరక్షకునిగా చేరి, కొంతకాలానికి ‘తంబురా సహకారమందించే’ నిలయ విద్వాంసుడై స్వయంకృషితో తండ్రి నుండి సంక్రమించిన సంగీత విద్యకు సార్థకత ఏర్పరచుకున్న విద్వాంసుడు - పదిచోట్లా పాడి మెప్పించారు. కీర్తి కాంక్షలేని విద్వాంసుడు. సంగీతానందమే పరమావధిగా భావించిన గాయకుడు.
ఆ రోజుల్లో దక్షిణాదిలో బాగా పేరున్న విద్వాంసులలో కోనేరి రాజపురం వైద్యనాథ అయ్యర్ (1878-1921) ఒకరు. ఆయన సమకాలీనులు మధురై పుష్పవనమయ్యర్, తిరుక్కోడికానల్ కృష్ణయ్యర్ (వయొలిన్ విద్వాంసుడు).
అఖండ స్వరజ్ఞానానికీ, అపూర్వమైన మనోధర్మానికి ప్రతీక కోనేరి రాజపురం పాట.
సంగీత కళానిధి డా.శ్రీపాద పినాకపాణికి ప్రాణ స్నేహితుడైన సంగీత రసికుడు డా.పొదిల బ్రహ్మయ్య శాస్ర్తీ ‘ఈ కోనేరి రాజపురం పాట’ను ప్రస్తావిస్తూ, సుదీర్ఘమైన వ్యాసం పంపారు.
ఉన్నట్లుండి ఒక్కసారి ఆకాశం మేఘావృతమై వాతావరణమంతా ఉరుములు మెరుపులతో నిండిపోయిన మరుక్షణం వెంటనే చలచల్లని పిల్లవాయువులతో బృందావనం మారిపోతే ఎలా ఉంటుంది?
జలజలపారే సెలయేళ్ల ముందు కూర్చుని పచ్చని ప్రకృతిని చూస్తోంటే ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది? అద్భుతమైన ఈ ప్రకృతిని సృష్టించావు దేవా ఏమి నీ లీల? అని దైవాన్ని పొగడకుండా ఉంటామా? ఉండగలమా?
అదిగో అలా వుండేదిట కోనేరి రాజపురం పాట.
బలిజేపల్లి వారి తండ్రి సీతారామయ్య ఈ కోనేరి రాజపురం గానానికి పరవశుడై విన్నాడు. ఆయన శిష్యుడై ఆయన పాదాల చెంత చేరాడు. ఇది ఎలా జరిగిందో చూడండి.
మచిలీపట్నంలో సంపన్నుల యింట వివాహ సందర్భంగా ‘కోనేరి రాజపురం పాట’ కచేరీ జరిగింది. వివాహ వేడుకలన్నీ ముగిసాయి. అయినా ఆ పాటకు మత్తెక్కిన జనం పది పదిహేను రోజులపాటు బందరులోనే వుండమని ప్రాధేయపడ్డారు. ఉండక తప్పినది కాదు - ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీతారామయ్య ఆయనతోనే వుండిపోయాడు. మద్రాసు కూడా వెళ్లి కొన్నాళ్లుండి సంగీతాభ్యాసం చేశాడు.
ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠాంతరం బలిజేపల్లికి సంక్రమించటానికి ప్రధాన కారణం ఆయన తండ్రి సీతారామయ్యే. ఈయన ఎవరో కాదు ‘హరిశ్చంద్ర నాటకం’ రచనతో యావదాంధ్ర దేశానికి పరిచయమున్న బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, సీతారామయ్య తండ్రి.
1971లో రేడియోలో చేరినా శాస్ర్తీగార్ని కేవలం తంబురా సహకారం అందించే స్ట్ఫా ఆర్టిస్టుగానే ఎరుగుదును. కానీ నాలుగైదేళ్ల వరకూ ఆయన మహావిద్వాంసుడన్న సంగతి తెలియదు. గౌరవమైన సంప్రదాయం తొణికిసలాడే అద్భుత గానం ఆయనది.
నిజం చెప్పాలంటే రేడియోలో తంబురా శ్రుతి కోసం ఓ ఉద్యోగం సృష్టించటం విద్వాంసులకు లభించిన అరుదైన అవకాశం. శ్రుతికి దక్కిన గౌరవం.
సంధ్యావందనం శ్రీనివాసరావు గారోసారి ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత రసికుల సమక్షంలో, వేదికపై రెండు తంబురాలూ పర్‌ఫెక్ట్‌గా శ్రుతిచేసి పెట్టారు. పదిహేను నిముషాలసేపు విన్న నాద మాధుర్యానికి సభా ప్రాంగణంలో కూర్చున్న శ్రోతలు ఆనంద లోకాల్లో విహరించిన అనుభూతిని పొందారు. మనిషి నీడలా, గాయకుడి ప్రక్కన వుండేది శ్రుతి స్వయం భూధ్వనులతో నిండిన సుస్వరం ఒక తంబురాలోనే వినిపిస్తుంది. ఆలిండియా రేడియోలో తంబురా వాదకులుగా ఏళ్ల తరబడి పనిచేసి, తంబురా శృతి మాధుర్యాన్ని అనుభవింపజేసిన విద్వాంసులలో బలిజేపల్లి ఒకరు. ప్రముఖ విద్వాంసుడు డా.ఎల్లా వెంకటేశ్వర్రావు, పారుపల్లి, వారి శిష్యులైన చల్లపల్లి కృష్ణమూర్తి, అడుసుమిల్లి కుటుంబయ్య, ఎం.వి.రమణమూర్తి తంబురా శ్రుతి చేయటంలో నిష్ణాతులు. శ్రుతి శుద్ధతకు మారుపేరు ఎన్‌సివి జగన్నాథాచార్యులు కూడా రేడియోలో తంబురా విద్వాంసుడే, పక్వమైన తంబురా శ్రుతి నాదం ఎంతో గొప్ప సంగీత సంస్కారమున్న వారికే సాధ్యం. అందరికీ ఆ నాద సుఖం లభించదు. అది కూడా ఒక యోగమే.
రేడియోలో పాడే గాయనీ గాయకులకు ఓవైపు శుద్ధమైన తంబురా నాదం చెవులకు సోకుతోంటే, అపశ్రుతి దోషం వినగానే మాత్రం శాస్ర్తీగారి మనస్సు చివుక్కుమనేది. పాడే గాయకులకు ఏ మాత్రం తెలిసేది కాదు. అదీ చిత్రం? మీకో రహస్యం చెప్పమంటారా?
‘తంబురా శ్రుతిలో సాధన చేయని దోషం, ఒక్క రేడియోలో మాత్రమే కనిపిస్తుంది. బయట ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ పాట శ్రుతిలో చేరని దోషంతో వెనుతిరిగిన వీర గాయకులెందరో ఉన్నారు. ‘బంగారానికి మధ్యస్థ తూకం’ లాంటిది రేడియోలో వినబడే ఈ తంబురా నాదం-
తండ్రి ద్వారా నేర్చుకుని సంపాదించిన కట్టుదిట్టమైన పాఠాంతరం శాస్ర్తీగారి స్థిరమైన ఆస్తి. కొన్ని అపురూపమైన స్వరపల్లవులు, స్వరజతులు, వర్ణాలు, కృతులూ సేకరించుకున్న విద్వాంసుడు. ఎన్నో క్లిష్టమైన కీర్తనలు నేర్చుకున్న అనుభవం దండిగా వుండి, కచేరీలో చూసి పాడని విద్వాంసుడంటే ఆయనే్న చెప్పుకోవాలి. అహంకారం లేదు. తెలుసునన్న గర్వం ఎరగడు. కీర్తికండూతి లేదు. ‘ఇష్టమైతేనే వినండి’ అనే ధోరణిలో నిక్కచ్చిగా, ఎంతో నిలకడగా సంప్రదాయం ఉట్టిపడేలా వుండేది ఆయన పాట. తంబురా ఆర్టిస్టుగా వుంటూ, తంబురా పట్ల గౌరవ మర్యాదలు చూపించిన విద్వాంసుడు.
‘అర్ధనారీశ్వర స్తోత్రం’ ‘నమశ్శివాభ్యాం’ ‘ఖమాస్’ రాగంలో శాస్ర్తీ స్వరపరచి పాడిన అద్భుతమైన స్తోత్రం. విజయవాడ రేడియో కేంద్రానికి తలమానికంగా నిలిచిన ‘్భక్తిరంజని’లో శాస్ర్తీ పాడిన శృతులు అనేకం. ఎంతో క్లిష్టమైన వోలేటి స్వరపరచిన అధ్యాత్మ రామాయణ కీర్తనలు రికార్డింగ్‌లో ప్రత్యక్ష పాత్ర ఉంది. ఆ కీర్తనలు స్వరం చూసి పాడేసేవారు. ఆయన విద్వత్తుకు తగిన గౌరవం లభించలేదు.
అవార్డుల కోసం, రివార్డుల కోసం, దరఖాస్తు చేసుకునే దుస్థితిలో విద్వాంసులున్న ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాతులేమీ ఆశించక, అంతర్ముఖుడై తన పాటేదో తాను పాడుకున్న విశిష్టమైన విద్వాంసుడు బలిజేపల్లి రామకృష్ణ శాస్ర్తీగారితో ప్రత్యక్ష పరిచయం ఉండటం నా సుకృతం. సంగీత శిక్షణలో నాలుగైదు కృతులు నేర్చుకున్న అదృష్టవంతుణ్ణి. ‘ఆయన పాట విన్నవారికి ఏ మాత్రం సంస్కార గుణం వున్నా’ తమ గానంలోని లోపాలను సవరించుకోవాలనిపిస్తుంది. విద్వాంసులు మెచ్చిన విద్వాంసుడు బలిజేపల్లి.

-- మల్లాది సూరిబాబు 90527 65490