S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సారూప్య సౌఖ్యదం సంగీతం

ఈవిశాల విశ్వంలో బ్రతుకు తెరువుకోసం పుట్టిన ఎన్నో విద్యలున్నాయి. అన్నిటిలోనూ అదృశ్యంగా కనిపించేది ఒక్క సంగీతమే. శ్రుతిలయలు రెండూ కంటికి కనిపించేవి కావు. మన పిల్లలకు సంగీతం నేర్పించాలని వున్నా, నేర్పే గురువుకు ఎంత సంగీతం తెలుసో తల్లిదండ్రులకు అంత తెలిసే ఆస్కారం లేదు. మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? గురువు ఎలా నేర్పుతున్నాడు? ఎంత వరకూ నేర్చాడో, నేర్చుకోవలసినది ఎంత మిగిలివుందో ఒక పట్టాన అర్థమయ్యేంతవరకూ అదో బ్రహ్మపదార్థమే!
ఈ విద్యకు కాలపరిమితి అసలు లేదు. లంక నుండి తిరిగిరాగానే ‘‘దృష్ట్యా సీతా’’ అని ఆంజనేయుడు ఒక్క మాటలో చెప్పినంత సులువుగా సంగీతం తెలిసిన దాఖలాలు లేవు. మనసులో సహజసిద్ధంగా పుట్టుకొచ్చిన అనుభూతికి సంగీతం జోడై వినేవారి హృదయాలను ఒక్కసారి స్పందింపజేస్తూ, ‘‘ఆహా! ఎంత ధన్యుడు? అనగల సంస్కారం కలిగిన శ్రోతలుంటేనే ఆ సంగీతానికి సార్థకత. లేదా అడవిగాచిన వెనె్నలతో సమానం.
మూలాధారజ నాదమెరుగుటే
ముదమగు మోక్షమురా
కోలాహల సప్తస్వరముల గుఱుతే సంగీతమన్న త్యాగయ్య మాటల్లోని సారాంశాన్ని పట్టుకోవాలి. త్యాగానికి మారుపేరు నిజంగా చెప్పాలంటే మన శరీరమే శరీరంలోని ప్రతి అణువూ త్యాగబుద్ధితో లేకపోతే మనిషి మనుగడ ఎప్పుడూ ప్రశ్నార్థకమే.. ఆలోచించండి. ఐదు మిల్లీగ్రాముల మాత్రతో తలనొప్పి ఎలా తగ్గుతోంది? అవన్నీ శరీరంలోని నాడీమండల వ్యవస్థ మీద పనిచేస్తాయి కాబట్టే రోగాలు తగ్గుతున్నాయి. అలాగే భావతరంగాల నుంచి వెలువడే మాటలు వాక్యాలుగా మారి ప్రసంగంగా మారి, మనస్సులో ప్రవేశించగలిగినప్పుడు ‘ఉపన్యాసం’ బాగుందనిపిస్తుంది. సంగీతమైనా అంతే.. బాగోలేకపోతే వీడియో లేదా టి.వి.లు కట్టేస్తాం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకూ వ్యాపించిన నాడీమండలంలోని నరాలన్నీ భావ, భాషణాది వాగ్ వ్యాపారానికి ఉపయోగపడతాయని యోగశాస్తమ్రే చెప్పింది. మూలాధారం నుంచి సహస్రారం వరకూ వ్యాపించిన వెన్నుపాము అనే కుండలిని ద్వారా ‘ ఓంకారం’ తంత్రి మీటకుండానే మ్రోగుతూంటుంది. అదే ప్రణవనాదం. త్యాగయ్యవంటి కొద్దిమంది నాదయోగులు మాత్రమే విన్నది ఈ ప్రణవనాదమే..
సంగీత కచేరీలు చేసే కొద్దిమందికే ఈ నాదం యోగమబ్బుతుంది. దక్షిణాదిలో కొన్ని దశాబ్దాల క్రితం పాడి గానగంధర్వులుగా ప్రసిద్ధులైన వారిలో మహావైద్యనాథయ్యర్ మహావైద్యనాథశివన్, మధురై పుష్పవనమయ్యర్ లాంటివారు ప్రముఖులు. మన తెలుగునాట మహావాది వెంకటప్పయ్యశాస్ర్తి , పిరాట్ల శంకరశాస్ర్తి , తాడిగడపశేషయ్యలాంటివారు అలా పాడేవారని ఒకసారి పినాకపాణి చెప్పగా విన్నాను. ఆ స్థితిని అందుకోగలిగిన వారంటూ లేకపోతే శిష్యులంటూ ఎవరూ తయారవ్వరు అందుకే వారి గంధర్వగానం వారితోనే అంతరించింది’’ అంటూండేవారు. ఇది సత్యదూరం కాదు. మహాద్వైతిగా తన ప్రతిభావ్యుత్పత్తులతో, అన్ని కళలను స్వాధీన పరచుకుని ‘హరికథాప్రక్రియ’కు ఆద్యుడై, పితామహుడనిపించుకున్న ‘ఆదిభట్ల నారాయణదాసు సంగీత రసజ్ఞత’ ఎటువంటిదో తెలియజేసే సంఘటన. న్యాయ, వేదాంత, వ్యాకరణ శాస్త్ర విషయాలు ఆకళింపు చేసుకుని, గానశాస్త్ర మర్మాలు తెలిసిన విద్వాంసుడు, సకలజన రంజకంగా పాడిన ఉత్తమగాయకుడు. హరికథలురాశి అసంఖ్యాక శిష్యుల్ని తయారుచేసిన సంగీత సద్గురువు. తాను పాడిన పాటకు తానే ఆనందపడటమొక్కటే కాదు. ఇతరుల గానంలో గల విశేషం మెచ్చుకోగల సంగీత రసికుడు నారాయణదాసు. విజయనగరంలోని గంట స్తంభం దగ్గర నిత్యమూ ఎవరెవరో భిక్షకులు కూర్చుండి పాటలు పాడుతూండేవారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క కంఠస్వరం వినిపించినప్పుడు మన దాసుగారు అలాగే చేతికర్ర గడ్డానికి ఆనించి కాస్త వంగి నిలిచి ఆ పాట వినేవారు. దాసుగారు పాట వింటున్న సంగతి తెలిసిన ఊరిజనం ఒక్కొక్కరూ వింతగా ఆయన చుట్టూ పోగై నిలబడిపోయేవారుట. ఇంచుమించు రెండు, మూడు వందలమంది పోగయ్యేసరికి, ఆ రోడ్డంతా స్తంభించిపోయేది.
ఆ జనమంతా అక్కడ కూర్చుని పాడే గాయకుణ్ణి చూసేందుకు కాదు. అతని పాట వినేందుకూ కాదు. ఆ భిక్షకుడి పాట వినే దాసుగారిని చూసేందుకు జనం ఎగబడేవారుట. కొంతసేపు విని దాసుగారు ‘అచ్ఛా’ అని పెద్ద గౌళకంఠంతో గట్టిగా అభినందిస్తూ జేబులో చెయ్యిపెట్టి తోచినది తీసి ఆ భిక్షకుని ఒడిలో వేసేవారు. యిక చూడండి. పక్కనున్న ప్రతివాడూ ఎంతో కొంత ఆ జోలెలో వేసి వెళ్ళేవాడు. ఒక్క క్షణంలో ఆ భిక్షుకుడి జోలె నిండిపోయేది. రసజ్ఞత కూడా మనిషికి ఏర్పడవలసిన అత్యవసరమైన సంస్కారం. ఏళ్ళ తరబడి గురువు శుశ్రూష చేసి, సంగీతానందం అనుభవించిన వారి సంగీతాన్ని వినేందుకు కూడా అర్హత వుండాలి. తృప్తి లేని బ్రహ్మానందాన్ని ఒక్క సంగీతం వల్ల మాత్రమే పొందగలం. మిగిలిన విద్యలకు ఈ శక్తి లేదు.. కూపస్థ మండూకంలా శ్రోతలస్థాయికి దిగిపోయి పాడేపాటకు విస్తృతమైన ఆదరణ వుండవచ్చు. కానీ ఆ సంగీతానికి ఎదుగుదల వుండదు. ‘్భరతరత్న’ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీత జీవితం అందరికీ తెలిసినదే. పూర్తిగా సంగీతానికే జీవితాన్ని అంకితం చేసిన విద్వన్మణులలో ఆమె ప్రముఖమైన వ్యక్తి. ఆమె జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. సాధారణ వ్యక్తి కుండే ఒడిదుడుకులు ఆమెకూ వున్నాయి అయినా భగవంతుడిచ్చిన విభూతిని దైవపరం చేసిన వ్యక్తులలో అగ్రగణ్యురాలు. సంప్రదాయ సంగీతాన్ని హిమాలయ శిఖర సమానం చేసి దేశవిదేశీయులను తన్మయుల్ని చేసిన గంధర్వగాయని.
ఒకవైపు సాహిత్యం పదిమందికే తెలిసేలా పాడుతూ, మాధుర్యంతో తన్మయులను చేస్తూ, మరోవైపు కచేరీ ధర్మాన్ని పాటిస్తూ మనోధర్మసంగీతం విచ్చలవిడి మార్గాల్లో వెళ్ళేలా కాకుండా సంగీత గౌరవాన్ని యినుమడింపజేసిన ఆదర్శగాయని. సంగీతం వ్యక్తి ప్రధానమని నమ్మిన ఏకైక గాయని సుబ్బులక్ష్మి. కొన్ని తరాల పాటు కర్ణాటక సంగీత రంగంలో మహారాణిగా వెలుగొందింది. భగవంతుడిచ్చిన మందార మకరంద మాధుర్యంతో నిండిన కంఠస్వరంతో ముగ్ధుల్ని చేసిన గాయక శిరోమణి. రెండు చేతులా సంపాదించి నాలుగు తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టాలనే కాంక్షలేని ‘విద్వాంసురాలంటే’ సుబ్బులక్ష్మినే చెబుతారు.
లాభాపేక్షలేని ఔదార్యంతో ఆమె చేసిన సంగీత కచేరీల వల్ల, ఆర్థికంగా ఎనె్నన్ని ధార్మిక సంస్థలు బాగుపడ్డాయో లెక్కేలేదు. భారతీయ సంస్కృతికీ, సంప్రదాయానికీ, సంగీతానికీ ‘బ్రాండ్ అంబాసిడర్’. తలనిండా మల్లెపూలదండ ధరించి, నుదుట ఎర్రగా మెరిసే కుంకుమబొట్టుతో, దక్షిణాది చీరకట్టుతో ముక్కులకు రవ్వ బేసరులతో చెవులకు వజ్రాల దుద్దుల ధగధగలతో, తేజస్సుతో వెలిగే ప్రసన్న ముఖంతో పాడే ఆమె గానానికి దాసులవ్వని శ్రోత లేడు. ఇక్కడ మన సంగీతాన్ని ఎల్లలు దాటించిన గాయనీమణి. 1977లో అమెరికాలోని పిట్స్‌బర్గు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం హిందూ దేవాలయాల ప్రతిష్ట కోసం ఆమె చేసిన కచేరీలకు వచ్చిన ఆదాయాన్ని విరాళంగా యిచ్చిన దాత. శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత ప్రార్థన ఒక్కటి చాలు ఆమె కీర్తి శరీరంతోనే వుంటుందనటానికి సాక్ష్యం. తృప్తిలేని బ్రహ్మానందాన్నిచ్చే సంగీతాన్ని రాక్షసవిద్యగా భావించి, మార్చి తృప్తిపడేవారికి సంప్రదాయ సంగీతంలోని గొప్పదనం ఎలా తెలుస్తుంది? భాషాభేదం లేకుండా విదేశీయులు ఆమె గానానికి పరవశులైన సంఘటన అమెరికాలోనే జరిగిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. 1980 ప్రాంతంలో ఇంపెరల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆడిటోరియంలో సుబ్బులక్ష్మి అంతర్ముఖురాలై గానం చేస్తోంది. ఇంచుమించు 1500మంది రసికులైన శ్రోతలు కూర్చుని తదేక ధ్యానమగ్నులై వింటున్నారు. కచేరీ ముగిసే సమయానికి సుబ్బులక్ష్మి తాళాలు తీసుకుని నెమ్మదిగా భజన్‌లు ప్రారంభించింది. హాలులో నిశ్శబ్దంగా కూర్చుని వింటున్న వారి నేత్రాలు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ బయటకొచ్చేశారు. ఆ సన్నివేశాన్ని కళ్ళారా చూసిన సంగీత రసికుడు తన డైరీలో ఆ దృశ్యాన్ని ప్రక్షిప్తం చేసుకున్నాడు. వింటున్న శ్రోతల్లో కర్ణాటక సంగీతం బొత్తిగా తెలియనివారే ఎక్కువ. పైగా విదేశీయులు. బ్రహ్మానందసాగరంలో నింపిన సుబ్బులక్ష్మిగానం, ఆమె రూపం రసికులైన ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతమై నిలిచిపోయింది.
సుప్రసిద్ధ హిందూస్తానీ సంగీత గాయకురాలు బేగం అఖ్తర్ ఒక ధనవంతుణ్ణి వివాహమాడింది. ఆమె నలుగురిలోనూ పాడటం యిష్టంలేక ఆమె భర్త కచేరీలను, పాటను కట్టడి చేశాడు. అంతే, అక్తర్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కారణం గ్రహించిన భర్త కాస్త నెమ్మదిపడి మళ్ళీ ఆమెను కచేరీలు చేయమని ప్రోత్సహించాడు. అప్పటినుండి ఆమె కోలుకోవడం ప్రారంభమై, ఆరోగ్యం కుదుటపడింది. ‘్భరతరత్న’ సుబ్బులక్ష్మి జీవితం సంగీతానికే సమర్పించబడటానికి ముఖ్యకారకుడు భర్త సదాశివమే. పాట పాడుతున్నప్పుడు నేను చాలా ఉద్విగ్నవౌతాను. పాటను అర్థం చేసుకుని భావాన్ని గ్రహించి పాడితే శ్రోతలు వెంటనే స్పందిస్తారు. నేను ఏ భాషలో పాడినా అర్థం తెలుసుకోకుండా పాడలేదు. పాడను. అలా భావంతో పాడినప్పుడు నా గొంతు ఆర్తితో పూడ్చుకుపోతుంది. నాకు దైవమే ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ధార్మికమైన కార్యక్రమాల పట్ల, దైవం పట్ల అచంచల భక్తి కలిగిన మధురగాయని సుబ్బులక్ష్మి. ఆమె మార్గం సంగీత విద్వాంసులకే రాజమార్గం.
‘‘దివ్యమైన సంగీతాన్ని పాడి వెళ్ళిపోయిన సుబ్బులక్ష్మి ఈ మాటలు విద్వాంసులకు నిరంతర స్ఫూర్తి సింధువులు. సుబ్బులక్ష్మి సంగీతపరమైన జీవితం ఒక ఎతె్తైతే, వ్యక్తిగతమైన జీవితం ఇంకో ఎత్తు. సంగీతంలో ఆమె సాధించిన విజయాలు లెక్కకు మించినవి. ఆమె వ్యక్తిత్వం కూడా ఉన్నతమైనదే.. కర్ణాటక సంగీతం పేరు చెప్పగానే పండిత పామరులను సైతం ఆకర్షించి రెండు పేర్లు గుర్తుకొస్తాయి. ఒకటి ఎం. ఎస్. సుబ్బులక్ష్మి, మరొకరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ్ణ. కోట్లాదిమంది సంగీతాభిమానులే సుబ్బులక్ష్మి ఆస్తి. కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కచేరీలతో ధార్మిక సంస్థలకిచ్చి ఈమె తనకేమీ మిగుల్చుకోలేదు. సంగీతంలోని ఆధ్యాత్మికతను మానవీయ విలువలను మనసులలో ప్రతిష్టించిన సుబ్బులక్ష్మితో మరే విద్వాంసుణ్ణీ పోల్చలేము. అవివేకులైన మానవులకు లౌకిక విషయాల పట్ల ఎటువంటి ప్రీతి వుంటుంది, అటువంటి ప్రేమ భావం దేవుడి పట్ల కలిగిన గాయని ఆమె.
*

- మల్లాది సూరిబాబు 90527 65490