S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జ్ఞానం ఉంటే.. సంపద మీ వెంటే..

లక్ష్మి, సరస్వతి .. ఈ ఇద్దరూ ఒకరున్న చోట మరొకరుండరు అంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాలం ఇది. ఎక్కడ సరస్వతీ దేవి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటోంది. ఒకప్పుడు సంపన్నుల సంతానం మాత్రమే ధనికులు. ఇప్పుడు సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మి వారిని వెతుక్కుంటూ వస్తోంది. బెంగళూరు ఐటి కంపెనీలో ఉద్యోగం చేసే నిజామాబాద్ కుర్రాళ్ల మెదడులో పురుడు పోసుకున్న ‘రెడ్‌బస్’ ఆలోచన వారిని సంపన్నులుగా మార్చింది. వారిని కోటీశ్వరులుగా మార్చింది సరస్వతి దేవే. ఆలోచనలే మనుషులను సంపన్నులుగా మారుస్తున్న కాలం ఇది.
‘డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది..’- అనేది పాతమాట. మనకు ప్రతి రోజు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టిన వారే విజేతలవుతారు. పూర్వకాలంలో సాంప్రదాయ వ్యాపారంలో ఉన్న వారికి సరస్వతి తోడు ఉండడం అచ్చిరాలేదేమో! సరస్వతి, లక్ష్మి ఒకే చోట ఉండరనే మాట ఆ కాలనికి సరిపోవచ్చు. ఇప్పుడు ఒకటి లేకపోతే మరొకరటి ఉండదు. సరస్వతి లేకపోతే లక్ష్మీదేవి ఈ కాలంలో ఎక్కువ రోజులు నిలువదు.
ప్రపంచంలో ప్రముఖ కంపెనీల సిఇఓలందరికీ ప్రధానంగా ఉండే అలవాటు ఏమిటంటే ప్రతినిత్యం ‘చదవడం’. సిఇఓలే కాదు, ఏ రంగంలో ఉన్న వారిలోనైనా కామన్‌గా కనిపించే అలవాటు ఇది. కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ‘పోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించుకున్న ప్రపంచ సంపన్నులు, ప్రముఖ కంపెనీల సిఇఓలకు బాగా చదివే అలవాటుంది. చదవడం నుంచే వారు విశ్రాంతి పొందుతున్నారు. వారు పని చేసే రంగానికి సంబంధించిన కొత్త ఆలోచనలను పుస్తకాలు చదవడం నుంచి పొందుతున్నారు.
రాజకీయాల్లోనూ బాగా చదివే అలవాటున్నవారు రాణిస్తున్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా కొత్త కొత్త ఆలోచనలతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బాగా చదివే అలవాటు దీనికి దోహదం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సిఇఓల అలవాట్లపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. బాగా చదివే అలవాటు తమను ఉన్నత స్థితికి తీసుకు వెళ్లిందని వారు పేర్కొన్నారు.
ప్రఖ్యాత కంపెనీల సిఇఓలు ఏటా సగటున 60 పుస్తకాలు చదువుతున్నట్టు తేలింది. ఎక్కువగా వీరు తమ రంగానికి సంబంధించిన పుస్తకాలు, జీవిత చరిత్రలు, మానవ సంబంధాలు, వృత్తిలో నైపుణ్యానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు. సక్సెస్ సాధించిన వారి జీవిత చరిత్రలను చదవడం వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన తీరు తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ‘ఫేస్‌బుక్’ సృష్టికర్త జుకర్ బర్గ్ యూనివర్సిటీ చదువును మధ్యలోనే ఆపినా పుస్తకాలు చదివే అలవాటు తనకు ఎంతగానో ఉపయోగపడిందని చెబుతుంటారు. ప్రపంచంలో ఇనె్వస్ట్‌మెంట్ గురుగా పేరుపొందిన వారెన్ బఫెట్‌కు పుస్తకాలు బాగా చదివే అలవాటుంది. 11ఏళ్ల వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టి 13 ఏళ్ల వయసు నుంచి ఆదాయ పన్ను చెల్లిస్తున్న బఫెట్‌కు పుస్తకాలే పెట్టుబడులకు సంబంధించిన గురువులు. ప్రపంచ సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో ఈసారి మూడవ స్థానంలో నిలిచిన బఫెట్‌కు- అత్యంత ఇష్టమైన పని పుస్తకాలు చదవడం. అన్ని రకాల పుస్తకాలు ఆయన చదువుతారు. ఏ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుటుంది? అనే అంశాలపై కొత్త ఆలోచనలను ఆయనకు పుస్తకాల నుంచే లభిస్తుంది. ‘నేను రోజుకు కనీసం ఐదువందల పేజీలు చదువుతాను. ఇలా చదవడం ద్వారా వచ్చిన జ్ఞానం చక్రవడ్డీలా ఉపయోగపడుతుంది’ అని ఆయన చెబుతారు. ఈ రోజుల్లో పుస్తకాలు కొనడం ఖరీదైన వ్యాపకం ఏమీ కాదు. పైగా ఇంటర్‌నెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పుస్తకాలు మన అర చేతిలో ఇమిడిపోతున్నాయి.
చాలా మందికి పుస్తకం చదవాలంటే బద్ధకం. జుకర్ బర్గ్ 2015 నుంచి నెలకు రెండు పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నారట! ఇప్పటికీ ఆచరిస్తున్నారు. మంచి పుస్తకాలు పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అపూర్వమైన, అరుదైన వేలాది పుస్తకాలను సేకరించి నెట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రాజెక్టు చేపట్టారు. ఆయన కుమారుడు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. దీన్ని అనవసర ఖర్చుగా వారు భావించడం లేదు. భారతీయ జ్ఞాన సంపదను అందరికీ అందుబాటులో తీసుకు వచ్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. నారాయణమూర్తి భార్య సుధామూర్తి పుస్తకాలు చదవడమే కాదు, చాలా పుస్తకాలు రాశారు. వివిధ గ్రంథాలయాలకు వీరు పెద్ద సంఖ్యలో పుస్తకాలు సమకూర్చుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ బిల్‌గేట్స్ ఎంత బిజీగా ఉంటున్నా వారానికి ఒక పుస్తకం చదవాలనే నియమం పెట్టుకుని కచ్చితంగా పాటిస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే పుస్తకాలు చదవాలంటారు ఆయన.
ఇక, ఆర్థికంగా విజయం సాధించిన వారు రోజూ కనీసం అరగంట పాటు చదువుతారని సర్వేలో తేలింది. ఎక్కువగా జీవిత చరిత్రలు, చరిత్ర, రాజకీయ పరిణామాలు, కంపెనీల విజయగాధలకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు. సంపద కూడబెట్టుకోవడం అంటే అంతా డబ్బు రూపంలోనే కాదు. ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా బలంగా ఉండడం, జీవితాన్ని ఆస్వాదించడం అన్నీ సంపదనలే. జ్ఞాన సముపార్జన కూడా ధనమే. కంటికి కనిపించక పోవచ్చు కానీ అదీ ఆరోగ్యమే. సంపాదన మరింత పెరగాలంటే జ్ఞాన ధనం ముఖ్యం.

--బి.మురళి