కనుగొంటిని
Published Sunday, 13 May 2018కొలంబస్ అమెరికాను కనుగొనెను. అమెరికా కొలంబస్ చేత కనుగొనబడెను అని అర్థం వచ్చే వాక్యాలు చెప్పి ఇంగ్లీషులో వాయిస్ పద్ధతి నేర్పించాలని ప్రయత్నించారు. ఇక మార్కొని రేడియోను కనుగొనెను అని కూడా చెప్పారు. ఆ రెండు సంగతులు మనకు సంబంధించినవి కావు కనుక నేను ఎప్పుడో మర్చిపోయాను. మా ఆవిడగారు పాలమనిషి వచ్చిందీ లేనిదీ కనుక్కుంటాను అన్నారు. అప్పుడు నాకు పాత సంగతులు బోలెడు ఫ్లాష్‌బాక్‌లాగా గుర్తుకు వచ్చేశాయి.
అమెరికా అన్న ఆ దేశం అప్పటికే ఉంది. దానికి ఆ పేరు కూడా ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు. ఆ దేశం అక్కడ ఉంది అన్న అనుమానంతో కొలంబస్ అనే పెద్ద మనిషి అటుగా బయలుదేరాడు. భారతదేశం మనుషులు ముక్కుమూసుకుని అంతర్ముఖులయి మెదడులోని ప్రపంచాలను పరిశీలిస్తున్న ఆ దశలో ప్రపంచ దేశాలలో కొన్నింటి నుంచి మనుషులు బయలుదేరి భౌతిక ప్రపంచాన్ని వెతికారు. కొలంబస్‌కు అమెరికా కనిపించింది. నిజానికి అతను భారతదేశం వెతుకుతూ బయలుదేరినట్టు చెపుతారు. ప్రస్తుతం మన విషయం అది కాదు కనుక ఒక్క కనుగొనెను అనే మాట మీదనే ముందుకు సాగుదాము. అప్పటికే అక్కడ ఉన్న అమెరికాను కొలంబస్ కనుగొన్నాడు.
గుగ్లీయెల్మో మార్కొని అనే పెద్దమనిషి ధ్వనిని మరొకరకంగా మార్చి గాలిలోకి పంపించి మరొకచోట యంత్రం సాయంతో దాన్ని తిరిగి వినవచ్చు అనే పద్ధతిని తయారుచేశాడు. దాని పేరే రేడియో. ఎందుకో తెలియదుగానీ, చిన్నప్పుడు మాకు అతని పేరును గుగిల్‌మో మార్కొని అని చెప్పారు. పుస్తకాల్లో కూడా అట్లాగే రాసినట్లు జ్ఞాపకం. ఒక మనిషి పేరును కూడా చక్కగా పలకాలన్న ధ్యాస మనకు లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. నాలుక బయటకు వెల్లబెట్టి, చింపిరి జుట్టుతో ప్రపంచాన్ని పలుకరించే మహామేధావి ఒకాయన ఉన్నాడు. అతను ఆస్ట్రియా దేశం వాడు అనుకుంటాను. వారి భాష జెర్మన్‌లాగే ఉంటుందని నా ఊహ. ఆయన పేరు అందరూ ఐన్‌స్టీన్ అని రాస్తారు. ఇంగ్లీషులో స్పెల్లింగ్ మాత్రం ఐన్‌స్టైన్ అని ఉంటుంది. ఆ మాటకు జెర్మన్ సంబంధ భాషలలో ఒక రాయి అంటే ఏకశిల అనే అర్థం కూడా ఉంది. ఆయన పేరును అందరూ ఐన్‌స్టీన్ ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. నేను ప్రయత్నించి ఐన్‌స్టైన్ అని రాసిన చోట కూడా చాలామంది తప్పుబట్టి దానిని సవరించిన సందర్భాలు వున్నాయి. ఇది కూడా మన విషయం కాదు కనుక కనుగొనెను అనే మాట మీదనే మరోసారి ముందుకు వెళదాం. మార్కొని కనుగొనిన రేడియో అంతకు ముందు లేదు. అతను దాన్ని సరికొత్తగా ఆవిష్కరించాడు. నిజానికి అతనితోబాటే మరొకరు కూడా ఆ పద్ధతిని సిద్ధం చేసినట్టు లేదా కనుగొన్నట్టు చెపుతారు. అది కూడా మనకిక్కడ కొమ్మల దూకుడే అవుతుంది. కనుక వదిలేద్దాము.
పాలమనిషి వచ్చాడా, లేదా అన్నది ప్రశ్న. అది కొలంబస్ అమెరికాను కనుగొన్నంత శ్రమకు దారితీయదు. మార్కొని లాగ పరిశోధనల అవసరం కూడా ఉండదు. పాలమనిషి పక్కింటి వాళ్లకు కూడా పాలు పోస్తాడు కనుక వాళ్లను అడిగితే తెలుస్తుంది. తెలుగులో చాలా మాటలకు నానార్థాలు ఉంటాయి. చాలా విషయాలకు రకరకాల పదాలు ఉంటాయి. ఇక సంస్కృతంలోనయితే ఒక మాటకు ఎక్కువ అర్థాలు, ఒకే అర్థం వచ్చే ఎక్కువ మాటలు మరింత మామూలుగా ఉంటాయి. ఇక్కడ పాలమనిషి గురించి చేయవలసింది అడిగి తెలుసుకోవడం మాత్రమే.
ఉన్నదానినే పరిశీలించి, పరీక్షించి నిశ్చయం చేస్తే ఇంగ్లీషులో అది డిస్కవరీ. ఇక లేని ఒక అంశాన్ని కొత్తగా ఆలోచించి సిద్ధం చేస్తే దాని పేరు ఇనె్వన్షన్. పాలమనిషి లాంటి పరిస్థితిలో అడిగి తెలుసుకుంటే, అది ఎంక్వయిరీ. వాళ్లకు చక్కగా మూడు పద్ధతులకు మూడు వేరువేరు మాటలు ఉన్నాయి. మనకు మూడింటికీ కలిపి ఒకేమాట మిగిలింది. నేను కోడిగుడ్డు మీద వెంట్రుకల కోసం వెతికే మనిషిని. కనుక నాకు ఈ విషయం గురించి బోలెడు అభిప్రాయాలు, అభ్యంతరాలు ఉంటాయి. వాటిని ప్రదర్శిస్తే మా ఆవిడగారు మంచి మూడ్‌లో వుంటే నవ్వుతారు. పరాకుగా ఉంటే చిరాకు పడతారు. గిరీశం తనతో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అన్నాడు. ఇక నాతో మాట్లాడడం కన్‌ఫ్యూజన్ అని అనుభవం మీద చాలామంది నాతో చెప్పారు. నేను మాటల వెనుకగల చరిత్రను, భూగోళాన్ని, భాషా శాస్త్రాన్ని వెతుకుతూ ఉంటాను. ఏ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పను అని నన్ను ఎరిగిన చాలామంది అభిప్రాయం.
ఒక సంగతి. ఈ సంగతి ఇప్పటికే చెప్పాను గానీ, సందర్భం కనుక మళ్లీ చెపుతాను. రేడియో పెడితే (?), టి.వి. వేస్తే ఒకే పాట మళ్లీమళ్లీ వస్తుంది. అందరూ ఆనందంగా చూస్తారు. నేను మాత్రం అయిదు సంవత్సరాలుగా ఈ లోకాభిరామంలో రాసిన సంగతి రాయకుండా రాస్తున్నాను. అయినా కొన్ని ఆలోచనలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి అని నాకే అనిపిస్తుంది. ఇంతకూ అది కాదు సంగతి. ఒక కొత్త తిండి పదార్థం ఏదో బల్లమీదకు వస్తుంది - ఎవరో ఒకరు దీన్ని ఏమంటారు అని అడుగుతారు. ఆ ప్రశ్నకు నేనే ఒక జవాబు చెప్పానని నా కుమార శేఖరుడు ఈ మధ్యన నిర్ణయించాడు. (మా అబ్బాయి పేరు శేఖర్ కాదు) తిండి పదార్థాన్ని ఏమి అంటారు అన్నది ప్రశ్న. ఏమీ అనరు, తింటారు అన్నది నా జవాబు. మాటల తీరు ఈ రకంగా ఉంటుంది.
అది పాత సంగతి గానీ, కొత్త పద్ధతి గానీ పాలమనిషి రాక గానీ మాటలు వేరుగా ఉండాలి. ఇక, సైన్స్‌లో ఎనె్నన్నో డిస్కవరీలు ఉన్నాయి, ఇనె్వన్షన్‌లు కూడా ఉన్నాయి. వాటికి తేడా తెలియాలి. ఆయన గారు ఎవరో కిరీటం బరువు గురించి ఆలోచిస్తూ స్నానానికని నీళ్ల తొట్టెలో దిగాడు. శుభ్రంగా నీళ్లు వొంటి మీద పోసుకొని రుద్దుకోవడం ఒక పద్ధతి. నీళ్లలో దిగి యమమహిశంలాగ ఆ నీటిని మురికి చేసి లేచి రావడం మరొక పద్ధతి. ఈ తొట్టి స్నానం నాకు నచ్చలేదు. మరొకసారి కొమ్మ దుంకినందుకు క్షమించాలి. నీటిలో దిగిన పెద్దాయనకు సైన్స్ తోచింది. అతను ఏకంగా లేచి తుండుగుడ్డ చుట్టుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా పరుగులు పెట్టాడట. యురేఖా అని అరిచాడట కూడా. అంటే కనుగొన్నాను అని అర్థం. కిరీటం బరువు తెలుసుకునే పద్ధతి ఏదో ఆయనకు తోచిందన్నమాట. ఇక్కడ కూడా ఒక కనుగొనడం ఉంది. దాన్ని ఇంగ్లీషులో ఏమనాలో నాకు తెలియదు.
సైన్స్ నిండా ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. అదే పనిగా పరిశోధనలు చేసేవారికి బతుకంతా ఏమి కనుగొందాము అన్నది ఒక్కటే ప్రశ్న. అప్పటికే తెలిసిన విషయాలను పట్టుకుని ముందుకు సాగితే కొత్త సమస్యలకు సమాధానాలు కనుగొనే అవకాశాలు ఉంటాయి. ఇక అంతకు ముందు లేని సంగతులను కూడా ఆలోచించి అప్పటికి ఉన్న సంగతుల ఆధారంగా ప్రయోగాలు చేస్తే మరిన్ని వివరాలను, విషయాలను కనుగొనడానికి వీలు ఉంటుంది. సైన్స్ ఈ రకంగానే ముందుకు సాగింది. మన బతుకులను కొత్త దారులకు మార్చింది. ఈ కనుగొనడం అనే కృషిలో చాలామందికి బోలెడంత ఆసక్తి ఉంటుంది. మరి కొంతమందికి అదే రకమయిన ఆసక్తి, ప్రేమ పాట పాడటంలో ఉండవచ్చు లేదా కొండలు ఎక్కడంలో ఉండవచ్చు. అలా పాడుతూ రాళ్ల మీద ఆడుతూ కూడా వాళ్లు కొత్త సంగతులను కనుగొంటారు. మానవుని తెలివి అంచులను మరింత ముందుకు కదిలిస్తారు.
అన్నట్టు ఏడు స్వరాలు ఉన్నాయి. వాటి కలయికతో చాలా బోలెడు రాగాలు ఉన్నాయి. ఉన్నట్టుండి ఒకాయన నేను కొత్త రాగం తయారుచేశాను. ఆయన దానిని తెలుసుకున్నాడా? ఉన్న దానిని బయటకు తీశాడా? కొత్తదిగా కనుగొన్నాడా? ఆ రాగం అంతకు ముందు లేదు. ఆయనే కొత్తగా సిద్ధం చేశాడు. అయినా ఎందుకో తెలియదుగానీ, కొత్త రాగం ఇనె్వంట్ చేశాడు అని అనరు. తయారుచేశాడు అని ఊరుకుంటారు. ఈ కనుగొనడం అన్న అంశం కనుగొనే వాళ్లకు ఏమి కనిపించుచున్నది అంటే పక్షి కన్ను అని అర్జునుడు చెప్పిన పద్ధతిలో అది ఒక్కటే కనబడుతూ ఉంటుంది. మనలాంటి వాళ్లకు పాలమనిషి రాక గురించి తెలుసుకోవడం కూడా బద్ధకంగానే ఉంటుంది.
నిర్వచించి చెప్పదలుచుకుంటే డిస్కవరీలు అన్నీ అంతకు ముందు మనకు తెలియని విషయాన్ని పరిచయం చేస్తాయి. అవి ఉండడం లేదా కొత్తగా రావడం వల్ల కొంత తేడా జరుగుతుంది. ఈ కనుగొనడంలో కొన్ని అనుకోకుండా కూడా జరుగుతాయి. ఇంగ్లీషులో దాన్ని సెరెండిపిటి అంటారు. ఒక సంగతి కోసం బయలుదేరితే అనుకోకుండా మరేదో చేతికి అందడం అన్నమాట. ఎన్ని రకాలుగా ఉన్నా ఈ డిస్కవరీ, ఇనె్వన్షన్, ఎంక్వయిరీ వాటి వెనుక బోలెడంత కృషి మాత్రం తప్పకుండా ఉండి తీరాలన్న సంగతి మీకు ఇప్పటికైనా తోచిందా? కొంతమంది సంవత్సరాల తరబడి కష్టపడి కూడా ఏమీ కనుగొనకుండానే వెళ్లిపోతారు. కానీ వారు సేకరించిన సమాచారం ఆధారంగా ప్రపంచం ఎంతో ముందుకు కదులుతుంది. మైలురాళ్లు ముఖ్యమయినవే. కానీ వాటి మధ్యన దూరం కూడా ఉంది కదా! ఆ దూరాన్ని నడవనిదే మైలురాళ్లను చేరడం కుదరదు.
ఒక విషయం ఉన్నా లేకున్నా అంతకుముందు తెలియకున్నా కొంత ప్రయత్నించి, మరింత తెలుసుకోవడంలో కావలసినంత ఆనందం ఉంది. నిజంగా అందులోని స్వారస్యం తెలిస్తే అది అంతులేనిది అవుతుంది. అందుకే విజ్ఞానం కాదు, ఆ విజ్ఞానం మనకు కలిగిందన్న ఆనందం అసలయిన పరబ్రహ్మము అంటున్నది తైత్తీరీయము.