S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘మనసు నిలుపకున్న మరి ముక్తి లేదు’

రూకలు పదివేలున్న చేరెడు
నూకలు గతిగాని, ఓ మనసా!
‘ఊరేలిన తాఁబండుట మూడు మూర తావుగాని/ నూరు భక్షణము లబ్బిన ఎంతో నోటికంతగాని/ ఏరు నిండుగ పారిన పాత్రకు తగు నీరు వచ్చు/ సారతరుని, హరిని, త్యాగరాజ సన్నుతుని మరువకే మనసా!’
అన్నం అమృత స్వరూపం, అంటాయి శ్రుతులు.
పరమాత్మ స్వరూపం అంటున్నాయి స్మృతులు
అన్నపూర్ణ స్వరూపం అంటారు పండితులు.
అన్నం లేకపోతే అధ్వాన్నవౌతాయి పరిస్థితులు.
అన్నదాతా సుఖీభవ అన్నారు ధర్మశాస్తజ్ఞ్రులు.
అన్ని దానాల్లో అన్నదానానిదే అగ్రస్థానమన్నారు అభిజ్ఞులు.
నిజానికి భగవంతుడే అన్నస్వరూపుడు. భక్తితో భగవంతుడికి అన్నం నైవేద్యం చేస్తాం.
ఎందుకంటే అన్నమిచ్చేదీ ఆయనేగా?
భూమి, నీరు, నాగలి, నారు పంట అన్నీ వాడే-
ఇందులో ఆయన లేనిదేమీ లేదు.
ఈ ఒక్క భావన మనసులో వుంటే చాలు - భగవంతుడున్నాడనే నమ్మకం స్థిరవౌతూ బుద్ధి నిలకడగా ఉంటుంది.
కానీ, మానవ స్వభావం చాలా చిత్రంగా ఉంటుంది. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తారు. ఓ మంచి మాట వినటానికి ఓపికుండదు. ఉన్నదల్లా ఒకటే కోరిక. లోకాన్ని కబళించేయాలన్నంత కోరిక. ఏమీ అనుకోవద్దు. నిజానికి మనకు తినటానికి ఉన్నంత ఉత్సాహం, వింటానికి ఉండదు.
అది కాల మహిమ కాదు. జీవలక్షణం. మనం దైహికంగా భారతీయులం. మానసికంగా పాశ్చాత్యులం. దేన్నైనా పాశ్చాత్య భూతద్దంల్లోంచి చూడటం అలవాటై పోయింది. తెలుగులో తిట్టితే చాలా నొచ్చుకుంటారు. ‘ఇడియట్’ అంటే పెద్దగా పట్టించుకోరు.
ప్రాక్పశ్చిమ సీమ వ్యవహారాల్లోంచి పరస్పర విలీనం వల్ల పుట్టిన రంగు, రుచి, వాసన లేని సంపదే. ఇదంతా నాగరికతా వ్యామోహం. ఇదో పెద్ద వలయం. యిందులోంచి బయటపడటం దుస్సాధ్యం. అదలా వుంచండి. శాస్త్రం అంటే అదేదో శృంగార గీతం కాదు. ‘అక్షర ఖడ్గం’. మరిచిపోయే మనిషిలోని మాలిన్యాన్ని శుభ్రంగా కడిగేసి కొత్త ఊపిరులు పోయటమే దాని పని. అందుకే వేద పురాణ వాఙ్మయమంతా ఉద్భవించింది - ఋషులు, యోగులూ యిందుకే పుట్టారు - వేదాంతులు పుట్టారు.
ఆ సాధు జనుల ప్రవచనాలు మిగిలాయి. ఆ మాటల సారం మన రక్తంలో యింకిపోయింది. కాబట్టే ఏ గుడియో గోపురమో కనిపించగానే ఎవరూ చూడకుండా చెంలేసుకుంటూ ఉంటాం.
తినే ఆహారాన్నిబట్టే బుద్ధులేర్పడతాయని పెద్దలు చెప్పిన మాట.
అయితే ఎంత తినాలి? ఎలా తినాలనేది కూడా వుంది. కడుపే కైలాసం - ఇదే వైకుంఠంగా బ్రతకడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది.
ఈ లోక వ్యవహారాన్ని చూసిన త్యాగయ్యకు జాలేసింది. అలాంటి లక్షణాలు తనక్కూడా సంక్రమిస్తాయేమోనన్న భయం కూడా వుండి వుండచ్చు.
నిజానికి నిగ్రహించే ప్రయత్నం చేసిన కొద్దీ పెరిగే ప్రమాదం ఎప్పుడూ కాచుక్కూర్చుంటుంది. అన్నశుద్ధి లేనిదే ప్రాణశుద్ధి లేదు.
ప్రాణం హాయిగా ఉంటేనే మనస్సు నిర్మలంగా ఉంటుంది. తిండి ఎక్కువైనా, తక్కువైనా ధ్యానం కుదరదు. పరిమితమైన ఆహారం, నిద్ర వుంటేనే జపతపాదుల మీద ఏకాగ్రత ఉంటుంది.
తినేందుకే బ్రతకడం కాదు. బ్రతకడానికే తినాలి.
పైగా ఎంత సంపాదించి కూడబెట్టినా మనిషి తినేది పట్టెడన్నమే - బీరువాల్లో వెయ్యి చీరెలున్నా కట్టుకునేది ఒక్కటే - ఎంతటి గొప్పవాడైనా ఆ మూడు మూరల జాగాలోనే, నిద్ర. షడ్రసోపేతమైన పదార్థాలు ఎన్ని వడ్డించినా తినగలిగేది ఎంతో అంతే. లక్షలిచ్చినా ఒక్క మెతుకు ఎక్కువ తినలేడు. అలాగే పరిమితం కాని సంపాదన కూడా. అనర్థానికి హేతువౌతుంది.
నదిలో ఎంత నీరున్నా మనం తీసుకునే పాత్రనుబట్టే ప్రాప్తం.
ఇది తెలిసి కూడా మనిషికి తృప్తి పడాలని లేదు - ఆకాశానికి నిచ్చెనలు వేసేస్తాడు - అలా కాకుండా యుక్తాహార విహారాలతో జీవిస్తూ సారతరుని హరిని త్యాగరాజ సన్నుతుని మరవకే మనసా అంటాడు త్యాగయ్య.
సత్త్వగుణంతో తిన్న కాస్తంత అన్నం చాలు. మనస్సు పవిత్రవౌతుంది. ఆత్మ సాక్షాత్కారం కోసం సాధన చేసే ప్రతి వ్యక్తీ ఎప్పుడూ తనను శోధించుకుంటూ వుండాలని చెప్పిన త్యాగరాజ కీర్తనలోని సారాంశమిదే.
అన్న తెలివియేగానీ, అక్షర తెలివి అనే మాట లోకంలో వుంది.
అక్షరం బ్రహ్మపదార్థం. ఆనంద స్వరూపం. దాన్ని సాధించే ప్రయత్నం మానేసి కేవలం కడుపు నింపుకోవడమే ధ్యేయంగా ప్రవర్తించే వారి పట్ల ఈ సామెత బాగా సరిపోతుంది.
‘మరువను ఆహారంబును
మరువను సంసార సుఖము
మరువను ఇంద్రియ భోగము
మాధవ నీ మాయ
మరచెద సుజ్ఞానంబును
మరచెద తత్త్వరహస్యము
మరచెద గురువును దైవము మాధవ
నీ మాయ’ అంటాడు అన్నమయ్య.
తినటం కోసమే బ్రతికేవాడికి ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అజ్ఞానం, భక్తి రాహిత్యం, పరధన కాంక్ష, సుఖలాలస, కాంతాసక్తి, ఈషణత్రయం మొదలైనవన్నీ చుట్టేసుకుని ఊపిరాడనీయకుండా చేస్తాయి. యుక్తాహార విహారాలను గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధ చేసినది కూడా యిదే.
అన్నకోశాన్ని అదుపులో వుంచుకుని ప్రాణాలకు ఏ ఒడిదుడుకులు రాకుండా చూసుకున్నవారి మనసు ఎప్పుడూ నిలకడగా, నిశ్చలంగా ఉంటుంది. అటువంటి మనసులోకి తెలుసుకోవలసిన విషయాలు చక్కగా ప్రవేశిస్తాయి - ఆరడుగుల మనిషి విలువ ‘నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి వుంటుంది. మనిషికి కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించాలనే అత్యాశ దుఃఖానే్న కలిగిస్తుంది. లక్షాధికారైనా కడుపునకు పట్టినంతే తినేది. బంగారపు కణికెలు మింగలేడు. నిరాడంబర జీవనం, ఆదర్శవంతమైన నడవడి, ఉన్నతమైన ఆలోచనలు పుట్టాలంటే కావలసినది మనోనిగ్రహమే అంటాడు త్యాగయ్య.
భార్యైనా, భరె్తైనా, సోదరులైనా, బంధువులైనా, సలహాలిచ్చేవరకూ ఓపిక పడతారు. సద్గురువులు చెప్పేది సలహాలనుకుంటే పొరబాటు. అది శాసనమే. ఆచరించటం ధర్మం. వినకపోతే మన ఖర్మం.

బలిజేపల్లి రామకృష్ణశాస్ర్తీ
=================
దక్షిణ దేశంలోని విద్వాంసులతో పోటీగా పాడగల మహావిద్వాంసులు మన ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి అఖండ జ్ఞానంతో పాడేసి వెళ్లిపోయారు. పక్కవాడి మెప్పుకోసమో, ప్రభుత్వాల గుర్తింపు కోసమో కాదు. సంగీతం కోసమే సంగీతం నేర్చుకున్నారు. ఆత్మానందం కోసమే పాడారు.
మహావాది వేంకటప్పయ్య శాస్ర్తీ, తాడిగడప శేషయ్య, పిరాట్ల వెంకటేశ్వర్లు, బలిజేపల్లి సీతారామయ్య వంటి వారు యిందులో ప్రముఖులు.
‘హరిశ్చంద్ర పౌరాణిక నాటకం’ రాశిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కొడుకు సీతారామయ్య దక్షిణాదిలో ఆ రోజుల్లో ప్రసిద్ధుడైన బాగా పేరున్న కోనేరి రాజపురం వైద్యనాథ అయ్యర్ శిష్యరికంలో అద్వితీయ సంగీత జ్ఞానం సంపాదించి తన కోసమే సంగీతం పాడుకున్న జ్ఞాని. ఈయన పుత్రుడే బలిజేపల్లి రామకృష్ణశాస్ర్తీ. గత వారం కన్నుమూశారు.
విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రెండున్నర దశాబ్దాలపాటు విద్వాంసుడుగా పనిచేస్తూఆయన ఎన్నో సంగీత కార్యక్రమాల్లో, రూపకాల్లో, యక్షగానాల్లో డా.బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు, కనకదుర్గ వంటి హేమాహేమీలతో కలిసి పాడారు. అఖండ మనోధర్మం ఆయన సొత్తు. మూర్తిత్రయం వారి అపురూపమైన కృతులు చూడకుండా పాడగలిగిన ఆదర్శ సంగీత విద్వాంసుడు, సంప్రదాయ సంగీతవాది.
ఆయన నిర్వహించిన రేడియో ‘సంగీత శిక్షణ’ కార్యక్రమంలో అలభ్యమైన కొన్ని కీర్తనలు విద్యార్థిగా పాల్గొని నేర్చుకున్న భాగ్యం నాది. మహా నిగర్వి. పొగడ్తలు ఎరుగని, పబ్లిసిటీకి దూరంగా వుండే స్వభావం కల విద్వాంసుడు, బలిజేపల్లి రామకృష్ణ శాస్ర్తీ.
శ్యామాశాస్ర్తీ, ముత్తు స్వామి దీక్షితుల వారల అపురూపమైన కీర్తనలు, పెద్దపెద్ద విద్వాంసుల వల్ల సేకరించుకుని సంగీతం ఒక తపస్సుగా భావించి, పాడుకున్న అరుదైన సంగీత విద్వాంసుడు, ‘యింగిత మెఱిగిన’ సంగీతలోలుడు. సంగీత కళానిధి, నేదునూరి, డా.శ్రీపాద పినాకపాణి, వోలేటి వెంకటేశ్వర్లు వంటి మహావిద్వాంసుల ప్రశంసలు పొందిన విద్వాంసుడు. అద్భుతమైన సంగీత జ్ఞానం ఉండి, కీర్తికండూతి లేకుండా, అంతర్ముఖుడై తన పాట తాను పాడుకోవటమే తెలిసిన ఈ అరుదైన విద్వాంసుడు, శిష్యులెవర్నీ తయారుచేయకపోవటం దురదృష్టం.

-- మల్లాది సూరిబాబు 90527 65490