S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

*గీర్వాణ భాషా గ్రంథాలలో
ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం
*వాసుదాసు వ్యాఖ్యానం *అరణ్యకాండ-4
*
‘రామాయణంలో ఏముంది.. ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?’ అని ప్రశ్నిస్తూ, శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణానికి వాసుదాసుగారు పీఠిక రాస్తూ అనేకానేక విషయాలను చెప్పారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...
శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. వేద వేదాంత అర్థోపబృంహితంబులు. ఈ మూడింటిలో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రథమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. శ్రీమద్రామాయణం - ఉత్తరకాండ 94వ సర్గలో చెప్పినట్లు రామాయణాన్ని చక్కగా తెలిసినవారు - అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. (రామాయణ తత్వాన్ని తనకు తెలిసినంత వరకు ఆంధ్ర వాల్మీకంలో చెప్ప సాహసించానని, తన ఆ సాహసానికి క్షమించమని వాసుదాసుగారు పాఠకులకు విజ్ఞప్తి చేశారు.)
మన పూర్వీకులకు తెలియని నాగరికతలు లేవు. మన పూర్వులు ఏ కారణం వల్ల ఆర్యులయ్యారు? వారు ఎటువంటి గుణాలు కలిగి, ఎటువంటి మహోన్నత స్థితిలో వుండేవారు? వారి నాగరికత విధానం ఎటువంటిది? వారి కులాచార ప్రవర్తనలెలా వుండేవి? రాజుకు ప్రజలకు మధ్య ఐకమత్యం ఎలా వుండేది? భార్యాభర్తలు, సోదరులు, తల్లిదండ్రులు, పుత్రులు పరస్పరం ఎలా ప్రవర్తించేవారు? సుఖ దుఃఖాల విషయంలో స్ర్తి పురుషులు ఏ విధమైన నడవడి గలవారు? వారికి దేవుడంటే ఎలాంటి ఆలోచన వుండేది? దైవాన్ని వారెలా ఆరాధిస్తుండేవారు? ఇలాంటి లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు.
జనన మరణ చక్ర బంధంలో ఇరుక్కొని, పరిభ్రమిస్తూ, ఆ బాధ తొలగించుకునేందుకు పారలౌకిక చింత కలిగి, నిరామయమై - నిత్యమై - నిర్మలమైన పరమపదానికి పోవాలనుకునే కోరిక గలవారికి, కరతలామలకంగా సుఖమైన మార్గాన్ని బోధించగల గ్రంథం శ్రీ రామాయణం తప్ప మరొకటి లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. ఏ విధంగా చదివినా, చదివిన తర్వాత, సమయాన్ని సద్వినియోగం చేశామన్న తృప్తినిచ్చేది రామాయణమే. శ్రద్ధ్భాక్తులతో చదివిన వారికి కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చేదీ రామాయణమే. కాబట్టి, ఇహ పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి, శ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం.
భరత ఖండంలో శైవులని, వైష్ణవులని, శాక్తేయులని భిన్న మతాల వారున్నారు. అయితే వీరిలో కొందరు వైష్ణవులకు శైవుడంటే ఇష్టం లేకపోవడం, అలానే నారాయణుడి పేరంటేనే ముఖం చిట్లించుకునే శైవులుండడం అందరికీ తెలిసిందే. ఐనప్పటికీ, శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. ఇలా సీతారాములు సార్వజనీన సం పూజ్యులు కావడానికి కారణమేంటి? హరిశ్చంద్రుడి లాంటి సత్యాత్ములు, ధర్మరాజు లాంటి ధర్మాత్ములు, దమయంతి - సావిత్రి లాంటి పతివ్రతలు లేరా? వారి మీద ఎంత గౌరవం వున్నా లోకులు వారిని పూజించడం లేదే? మరి, సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే! ఎవరెవరు - ఏయే పేరుతో పిలిచినా, భగవంతుడనేవాడు ఒక్కడే అని ఆర్యుల నమ్మకం. భిన్న భిన్న రూపాల్లో దర్శనమీయడం భవత్‌కళా విశేషం. అలాంటి భగవంతుడే, శ్రీరాముడుగా, లోక రక్షణార్థం జన్మించాడన్న నమ్మకమే, లోకులందరు ఒకే విధంగా శ్రీ సీతారాములను అర్చన చేయడానికి కారణమైంది. ప్రత్యక్షానుభవమున్న భక్తులే దానిలోని గూడార్థాన్ని వెల్లడిచేయగల సమర్థులు - శక్తిమంతులు. అలాంటి వాడైన వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, ‘కంఠోక్తి ఘోషించినాడు’.
‘శ్రీ రామాయణం’ అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. దంపతుల మాదిరిగా, వారి ‘అభిధానంబులు అనపాయంగా’ వుండినట్లే, తత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షి. తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని ‘సీతాయాశ్చరితం మహత్తు’ అని వెల్లడి చేశాడు. ఈ చిత్రం గ్రంథం పేరులోనే కాకుండా, గ్రంథమంతా కనపడుతుంది. శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకేమో వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి ఉంది. రామాయణాన్ని చదివేవారందరు, ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని ప్రతి అంశాన్ని - ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించిన వారికి - పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి - ఇతర రామాయణాలకు (ఆ మాటకొస్తే, ఏ భాషలో వున్న ఏ గ్రంథాలకు) గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది. కవి హృదయాన్ని తెలుసుకోకుండా, ఆయన శైలిని అనుసరించకుండా చదివిన వారికి, అందులోని సారాన్ని అర్థం చేసుకోలేక, ఆ శక్తిహీనతను వాల్మీకి దోషంగా భ్రమించి సంతోషపడవచ్చు.
శ్రీ రామాయణం మహాకావ్యం. పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గాని, సర్వజ్ఞుడికి గాని మాత్రమే సాధ్యమవుతుంది. అనంత కల్యాణ గుణ విశిష్టుడైన భగవంతుడిని, దయావంతుడని - సర్వజ్ఞుడని - సర్వ శక్తిమంతుడని, ఏవో కొన్ని గుణాలు వర్ణించి సంతసించడానికి, రామాయణం చదివిన వారు, వారివారి శక్తికొలది కొన్ని గుణాల వరకు అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినకొద్దీ, శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో ఉన్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా ఉంటుంది. లోకంలో కొన్ని కృతులను పాడుతుంటే శ్రావ్యంగా ఉంటాయి గాని, మామూలుగా చదువుతుంటే, నీరసంగా అనిపిస్తాయి. కొనే్నమో చదవడానికి ఇంపుగా వున్నా, రాగానికి తాళానికి అనువుగా వుండవు. రామాయణం అలాంటి కోవకు చెందింది కాదు. చదివినా, పాడినా మధురమే. ఆ విషయం గ్రంథంలోనే ఉంది. ఆ ప్రకారమే కుశలవులు పాడారు కూడా.
-సశేషం

*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా.. 7036558799 - 08644-230690
*

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12