S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కీళ్లవాతానికి ఆహార వైద్యం

ఫ్రశ్న: కీళ్లవాతం ఎక్కువగా ఉంది. చేతివేళ్లు బాగా వాచిపోయాయి. మీరు ఆహారంలో నొప్పులు తగ్గించే వాటి గురించి చాలాసార్లు చెప్పారు. వాపు తగ్గించే ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఈ వాపులకు విముక్తి తెలియజేయగలరు.
-పట్ట్భారామయ్య అవిర్నేని
(ఖమ్మం)
జ: కీళ్లవాతాన్ని తగ్గించేందుకు ఉపయోగపడేవన్నీ నొప్పినీ, వాపుని కూడా తగ్గించేవిగానే ఉంటాయి. నొప్పులకూ వాపులక్కూడా వాతం అనే దోషం కారణం. కీళ్లవాతానికి ప్రధాన కారణాలు వేరే ఉన్నప్పటికీ, వౌలికంగా అది కారణం. లైఫ్ స్టయిల్ డిజార్డర్. ఆహార విహారాలు నాణ్యంగా ఉన్నప్పుడు వాత దోషం అదుపులో ఉంటుంది. జీర్ణశక్తికి మించి కఠినమైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాతం పెరిగి వాత వ్యాధి అయినా రావచ్చు. ప్రముఖంగా కీళ్ల వాతానికి జీర్ణశక్తి మందగించటం ముఖ్య కారణం. దాని గురించి తెలియకపోవటం వలన మామూలు కీళ్లనొప్పులు భయంకర కీళ్ల వాతంగా పరిణమిస్తూ ఉంటాయి. ఎప్పటికైనా పొట్ట సరిచేసుకుని, జీర్ణకోశాన్ని బలసంపన్నం చేసుకుంటేనే కీళ్ల వాతం మన అదుపులోకొస్తుంది.
కీళ్లవాతం వచ్చినవారు ఎప్పటికైనా ఒక ప్రశ్న వేసుకుంటే ఈ వ్యాధి తేలికగా తగ్గుతుంది. ఆహార నియమాలు మార్చాను, ఇన్నిన్ని మందులు మింగాను, అయినా వ్యాధి తగ్గలేదంటే ఇందులో నా వంతు కారణం ఏదైనా ఉన్నదా? వ్యాధిని తగ్గించుకోవటానికి నేను చేయాల్సినదేమైనా ఉన్నదా? ఇందులో నా పాత్ర ఏమిటన్నది ముఖ్య ప్రశ్న.
మన జీవన విధానంలో నాణ్యత లోపించటం, మన ఆహార విహారాలు, మన మానసిక స్థితి, మన పర్యావరణం ఇవన్నీ ఆస్టియో ఆర్థ్రరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ వ్యాధి రావటానికి కారణాలు. వ్యాధి రావటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ అవి తగ్గకుండా దీర్ఘవ్యాధిగా మారి, జీవితాంతం వెన్నాడేలా చేసేది మాత్రం మన అజాగ్రత్తే. ఆస్టియో ఆర్థ్రరైటిస్ అనేది కీళ్ల లోపల ఎముకలు, ఆ ఎముకల మధ్య ఉండే మెత్తని ఎముక పదార్థాల తేడాల వలన వస్తుంది. రుమాటాయిడ్ ఆర్థ్రరైటిస్ అనేది వివిధ ఎలర్జీల మాదిరే శరీరానికి సరిపడనివే. రెండూ కీళ్లలో నొప్పులు, వాపులూ కలిగించే వ్యాధులే! రెండింటినీ కీళ్ల వాతం అనే పేరుతో వ్యవహరిస్తారు.
మన శరీరానికి సరిపడని వస్తువులు అనేకం మనం తింటున్నాం. గోంగూర, వంకాయ మాత్రమే సరిపడనివని చాలామందిలో ఉన్న ఒక అపోహ. గోంగూర, వంకాయ ఏ పాపం చేసుకు పుట్టలేదు. ఏ వ్యక్తికైనా ఏ ఆహార పదార్థమైనా పడకపోవచ్చు. అది పడకపోవటానికి వ్యక్తి శరీర తత్వమే కారణం. పడకపోవటానికి గానీ, కీళ్లలోపల తేడాలు, ఆహార పదార్థాల్లో కల్తీలు, విష పదార్థాలైన ఎరువులు, పురుగుమందులు, అపకారం చేసే కూల్‌డ్రింకుల్లాంటి పానీయాలు, ఏ మాత్రం శరీరానికి మేలు చేయని ఝంక్ ఆహార పదార్థాలు కారణం అవుతాయి.
నాణ్యమైన జీవితం అంటే ఏసీ కారులో తిరగటమో, ఫైవ్‌స్టార్ హోటల్లో గడపటమో కాదు. నాణ్యమైన ఆరోగ్య స్పృహతో ఆరోగ్యదాయకంగా జీవించటం. అది పూరిపాకలో కూడా తేలికగానే దొరుకుతుంది.
భారతదేశంలో ఆడవాల్లలో కీళ్ల వాతం ఎక్కువ. కారణాలు మనం తేలికగా అర్థం చేసుకోగలిగినవే. భారత సమాజంలో స్ర్తి రెండవ స్థాయి పౌరురాలుగా పరిగణింపబడి గృహ హింసకు ఎక్కువగా గురికావటం, అందరికీ వడ్డించి అప్పుడు తీరిక దొరికితే తినటం లేకపోతే లేదన్నట్టుగా జీవించటం, వేళాపాళా లేని రీతిలో ఆహార నియమాలు పాటించటం, మానసిక వత్తిడి, మెనోపాజ్, శరీర శ్రమే తప్ప మేథకు పని చెప్పకపోవటం, మేథకు చెప్పేందుకు చాలామంది స్ర్తిలకు ఏ పనీ లేకపోవటం ఇవన్నీ కీళ్లవాతం పెరగటానికి దోహదపడతాయి. ఇలాంటి జీవితం గడిపే పురుషులకూ వస్తాయి. స్థూలకాయం, వంశపారంపర్య లక్షణాలు, పొగతాగే అలవాటున్న వారు చాలా త్వరగా కీళ్లవాతానికి లోనౌతారు.
ఏ వయసు వారికైనా కీళ్లవాతం రావచ్చు. 40-60 వయసు మధ్య ఎక్కువమందిలో ఇది కనిపిస్తుంది.
కదిలినా కదలకుండా ఉన్నా నొప్పి వెన్నాడటం, కీళ్ల దగ్గర వాపు ఏర్పడటం, వాచిన కీలు కదలకుండా బిగుసుకుపోవటం, వాపు పెరిగి కీలు స్వరూపం మారిపోవటం, వంకర్లు తిరిగినట్టు అయిపోవటం, కీలుకు సంబంధించిన కండరాలు శుష్కించటం, బలహీనత ఇలాంటి బాధలు అనేకం కలుగుతాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని చెప్తారు గానీ, మనిషి వొంటరివాడై పోతున్న మన సామాజిక వ్యవస్థలో చేతులు మరీ ప్రధానమైన అంశంగా చెప్పాలి. ఒకళ్లు వచ్చి బట్టకట్టి పెట్టవలసి రావటం, ఒకల్లు వచ్చి ముద్ద కలిపి పెట్టాల్సి రావటం నిజంగా దుర్భరమైన విషయాలే. కీళ్లవాతానికి చేతులు, చేతివేళ్లు వాచిపోయి బిగుసుకుపోవటం మొదలైతే ఎక్కువ బాధాకరమైన పరిస్థితి అవుతుంది.
కీళ్లవాత వ్యాధిలో జీర్ణశక్తిని కాపాడుకోవాలి. తేలికగా అరిగేవి మాత్రమే తినాలి. బజ్జీల బండి మీద దండయాత్ర చేసేవారికి కీళ్లవాతం ఎన్నటికీ తగ్గదు. అతిగా చింతపండు కలిపితే తేలికగా అరిగే సొరకాయ కూడా కష్టంగా అరిగేదిగా మారిపోతుంది. శనగపిండి, మైదాపిండి, బఠాణీ పిండి లాంటివి కలిపి వండితే ఆ కూర కష్టంగా అరుగుతుంది. కష్టంగా అరిగేవన్నీ వాతాన్ని పెంచుతాయి. నొప్పి వాపు కూడా పెరుగుతాయి. తేలికగా అరిగేవి వాతాన్ని, నొప్పుల్నీ వాపుల్నీ తగ్గిస్తాయి. ఇదీ చికిత్సా సూత్రం. కష్టంగా అరగటం అనేది జీర్ణశక్తినిబట్టి ఉంటుంది. జఠరాగ్ని తక్కువగా ఉంటే, మంచినీళ్లు కూడా అరగని పరిస్థితి వస్తుంది. వీళ్లకు వాతం పిలవకుండానే పలుకుతుంది. పర్వతాలు ఫలహారం చేయగలంత జీర్ణశక్తి ఉన్న వారికి విషం పెట్టినా ఏమీ కాదు. నాణ్యమైన ఆహారం, నాణ్యమైన జీవితం ఇవి రెండూ జీర్ణశక్తి బలంగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి.
ఆహార ద్రవ్యాల్లో ధనియాలు, జీలకర్ర, శొంఠి, దాల్చిన చెక్క, వాము, వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, మెంతులు, నువ్వులు ఇలాంటివన్నీ జీర్ణశక్తిని పెంచుతాయి. నొప్పినీ, వాపునీ తప్పకుండా తగ్గిస్తాయి. ఇవి పరిమితంగా తీసుకుంటే మేలు చేసేవిగా ఉంటాయి. వంకాయ, బెండకాయ సహా కాయగూరలు, ఆకుకూరలన్నీ లేతవిగా ఉన్నవి వాతాన్ని తగ్గిస్తాయి. ముదిరిన కూరగాయలు, పుల్లని కూరగాయలు, పుల్లని ఆకుకూరలు, ఎక్కువ పిండి పదార్థాలున్న దుంపకూరలు వాత దోషాన్ని పెంచుతాయి. ఎవరికి వారు తమ శరీర తత్వానికి అనుగుణంగా ఎలాంటి అసౌకర్యమూ కలగని ఆహార పదార్థాలు తీసుకుంటే అదే నాణ్యమైన ఆహారం, అరుగుదలను బట్టి ఆహార ప్రణాళికలను వేసుకోవాలి.
మానసికమైన సంతోషం, సంతృప్తి పెంచుకోగలిగితే కీళ్లవాతం అదుపు సాధ్యమవుతుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com