చీమ సేవ (కథ)
Published Saturday, 31 March 2018
పూర్వం దండకారణ్యంలో చిదానంద మహర్షి అనే ముని తపస్సు చేసుకుంటూ, తమ ఆశ్రమానికి విద్యార్జన కోసం వచ్చిన వారికి విద్యాబోధ చేస్తూ ప్రశాంతంగా జీవించసాగారు. ఆయన ఆశ్రమానికి చుట్టూ ఉండే పశు పక్ష్యాదులన్నీ ఆయన ఆశ్రమ విధులకు, తపస్సుకు ఏ మాత్రం భంగం కలుగకుండా దూరదూరంగా తిరుగుతూ, ఐకమత్యంగా జీవించేవి. ఆయన ప్రభావం వల్ల అవి పోట్లాడుకోకుండా స్నేహభావంతో మసలేవి.
ఒకమారు ఆయన సహాధ్యాయులు దూర ప్రాంతాల నుండీ ఆయన్ను చూడాలనీ, ఆత్మవిద్యా సంబంధమైన చర్చ జరపాలనీ వస్తున్నట్లు వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందుకున్న చిదానంద మహర్షి తమ శిష్యులతోపాటుగా, తమ ఆశ్రమం చుట్టూ తిరిగే జంతువులు, పక్షులన్నింటినీ పిలిచి ‘ప్రియమైన జీవులారా! ఇంతకాలంగా మీరంతా మా నిత్యకృత్యాలకు ఏ మాత్రం ఆటంకం కలుగకుండా జీవించడం మీ మంచితనానికి నిదర్శనం. ఐతే మూడు దినాల్లో మా ఆశ్రమానికి మా చిరకాల మిత్రులు సందర్శనార్థం వస్తున్నారు. వారికి తగు ఆహార, విశ్రాంతి సదుపాయాలు చేయవలసిన ఉన్నందున మిమ్ము సహకరించమని అర్థిస్తున్నాము. మీమీ అవకాశం కొద్దీ మా మిత్రులకు సదుపాయాలు అందించడంలో కావలసిన వస్తు సామాగ్రి సమకూర్చి సహకరించగలరు’ అని కోరాడు.
అన్నీ ఆయన ప్రతిపాదనకు సంతోషంగా తలలూ ఊపాయి. ఒక గండు చీమ కూడా ఆ మహర్షి సమీపానికి వెళ్లి ‘స్వామీ మాకూ తమ సేవ చేసుకునే భాగ్యం అందించండి. మా జన్మసార్థకమవుతుంది’ అని వేడుకుంది భక్తిగా. అక్కడున్న పశు పక్షి జంతు జాలాలన్నీ పకపకా నవ్వాయి. ఐతే మహర్షి ప్రేమగా దాని వీపు మీద తడిమి ‘మహద్భాగ్యం పిపీలికమా! చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ఉండే పరమాత్మ ఒక్కరే కదా! నీవు చేయాలనుకున్న సేవ నిశ్చింతగా చేయి. అదే మాకు మహాభాగ్యం’ అన్నారు.
వెంటనే జంతువులు, పక్షులు అన్నీ వెళ్లి సాయంకాలానికి వారికి తగినట్లు, కాయలు పండ్లు, ఫలాలూ ఆకులు అన్నీ తెచ్చాయి. ఏనుగులు కొబ్బరిబోండాలు, చెరుకు గడలూ వంటివితేగా, మిగతా జంతువులు పక్షులు పుష్పాలూ, తేనెలు వంటివి తెచ్చాయి. మహర్షి శిష్యులు వాటన్నింటినీ భద్రపరిచారు. రానున్న మహర్షులందరికీ చక్కని పాన్పులు తయారుచేశారు. అనుకున్న రోజుకు అంతా వచ్చారు. ఆశ్రమం కళకళలాడింది. వారు మూడు రోజులు చర్చలు సాగించి ఇహ వెళతారనగా ఒక ఋషి ‘మిత్రమా! చిదానందా! నాకు చాలాకాలంగా తీపి అన్నం తినాలని కోరికగా ఉంది. నీవేమైనా ఏర్పాటు చేయగలవా? భుజించి సంతోషంగ వెళతాము’ అన్నాడు.
చిదానంద మహర్షి ముఖం చిన్నబోయింది. ఇప్పటికిప్పుడు బియ్యం ఎక్కడ నుంచీ తేవాలీ? చెరకు గడలు ఉండటాన శిష్యులు రసం తీస్తారూ, తీపన్నం వండుతారు. బియ్యం ఎలాగ అనుకుంటున్న సమయంలో చీమ వచ్చి ‘స్వామీ తమరు ఒకమారు ఇలా విచ్చేస్తారా?’ అని కోరింది. మహర్షి లేచి వెళ్లగా ఒక గుట్టలో ఆకుల మీద ఒక బియ్యపు రాశి ఉంది. సుమారుగా నాలుగైదు శేర్ల బియ్యం ఉండవచ్చు. మహర్షి ఆశ్చర్యంగా ‘ఇంత ధాన్యం ఎక్కడ సేకరించారు?’ అని అడిగాడు. ‘స్వామీ మేము చిరుజీవులం. ఎవరి కాలి కిందపడ్డా చనిపోతాం. ఐతే మేము మాకంటే పదిరెట్ల పైన బరువు మోయగలం. మేమంతా కలిసి మీ అనుమతి ఐన రోజు నుంచీ పొలాల్లో రైతులు పంట నూర్పిడి చేయగా పక్కనపడి ఉన్న ధాన్యాన్ని మోసి తెచ్చి ఉంచాము’ అని చెప్పింది.
మహర్షి సభ జరిపి తమ స్నేహ బృందంతోపాటుగా శిష్యులకు, పశుపక్ష్యాదులన్నింటికీ ‘చీమ స్వార్థరహిత, భక్త్భివంతో కూడిన సేవను వివరించి ‘ఎవరైనా మనస్ఫూర్తిగా తలంచితే ఎంత పనైనా చేయవచ్చు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, చేయాలనే ఆకాంక్ష ఉంటే చాలు, ప్రపంచానే్న జయించవచ్చు, ఈ చిన్న చీమ చేసిన పెద్ద సాయానికి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను.
ఓ చీమరాజా! మిమ్ము మానవ జాతంతా శాశ్వతంగా క్రమశిక్షణకు, శ్రమజీవనానికి, ఐకమత్యానికీ, భవిష్యత్ జాగ్రత్తకూ, ముందు చూపునకూ, ఓర్పునకూ, నేర్పునకూ ఉదాహరణగా చెప్పుకుంటారు. మీ సేవ మాకెంతో ఉపయోగకరమూ, ఆవశ్యకమూ ఐంది. మీరు బంకమట్టితో కట్టే కోటలు ఎవ్వరూ కట్టలేరు. గొప్ప నిర్మాణాత్మకమైన వాస్తు శాస్తజ్ఞ్రులుగా పేరు పొందుతారు. క్రమశిక్షణకు, పట్టుదలకు, నిరంతర శ్రమకు, విశ్రాంతి లేకుండా, బద్దకించక మీ జాతి చేసుకునే పనిని అంతా గమనించి ఉదాహరణగా మిమ్మే చెప్పుకుంటారు. మీ మేలు మరువలేము. మీ జాతికి మేమెంతో రుణపడి ఉన్నాం’ అని దీవించి ఆశీర్వదించారు. ఆయన స్నేహితులంతా శిష్యులు వండిన తీపి ఆహారం తిని సంతృప్తిగా తమతమ ప్రాంతాలకు బయల్దేరారు.