S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుస్తకాల పండుగ

ఒక విషయాన్ని పట్టుకుని తర్కిస్తూ పోతే, అంటే ఒక క్రమంలో చర్చిస్తూ పోతే, ఆ విషయాన్ని రుజువు చేసే వీలు ఉంటుంది. కానీ ఒక కొత్త విషయాన్ని కనుగొనే అవకాశం రాదు. కొత్త విషయం కనుగొనడానికి మనసులో ఒక కొత్త ఊహ పుట్టాలి. కేవలం చర్చవల్ల అది పుట్టదు. ఈ మనసులోని ఊహకు ఇంట్యూషన్ అని పేరు. ఇందుకు తగిన మాట తెలుగులో ఉందేమో వెతకాలి.
పై భావాన్ని చెప్పిన పెద్దమనిషి పేరు హెన్రీ పాయింకరే. అతను బహుశా ఫ్రాన్స్ దేశంవాడు. చాలా గొప్ప గణిత శాస్తజ్ఞ్రుడు. అనుభవపూర్వకంగా కొత్త విషయాలు కనుగొనడం గురించి చెప్పినట్టున్నాడు. పుస్తకాల పండుగ అన్న శీర్షికకు, పాయింకరేకు సంబంధం లేదు. అతను చెప్పిన విషయానికి అంతకన్నా సంబంధం లేదు. కానీ నాకు ఎందుకో పాయింకరే గుర్తుకు వచ్చాడు. అతని పేరు నేను మొట్టమొదట ఒక లెక్కల ప్రొఫెసర్‌గారి నోట విన్నాను. అంతకు ముందు కేవలం కాగితం మీద చదివాను. ఆ పేరు చివరలో ఉండే నాలుగు అక్షరాలను మనం ఎవరమయినా కేర్ అని పలుకుతాము. ప్రొఫెసర్ గారు పాయింకరే అన్నారు. ఆ ప్రొఫెసర్‌గారు మరాఠీ మనిషి. మరాఠీ వారు తమ పేరుతోబాటు ఊరు పేరు పెట్టుకుంటారు. ఒకరు దడేగావ్ అయితే దడేగావ్‌కర్ అని పెట్టుకుంటారు. ఇక మరాఠీ వారి చాలా ఇంటిపేర్లు కాటే, దామ్లేలాగ ఏకారంతో అంతమవుతాయి. కనుక ఆ ప్రొఫెసర్‌గారు పాయింకరే పేరును అలా పలికారేమో అనిపించింది. తరువాత పరీక్షించి చూస్తే నిజంగానే అతని పేరు పాయింకరే అని పాయింకేర్ కాదని తెలిసింది.
ఈ సంగతికి, తరువాతి విషయాలకు సంబంధం లేదని మనవి.
ఇష్టమయిన విషయాలలో మొట్టమొదలు పుస్తకాలు ఉంటాయని ఎప్పుడో చెప్పేశాను. హైదరాబాద్ వచ్చిన తరువాత అక్కడి వీధులలో కొన్నిచోట్ల ఆదివారంనాడు మూసిన అంగళ్ల ముందు ఫుట్‌పాత్‌ల మీద పాత పుస్తకాలు అమ్ముతారు అని తెలిసింది. హాస్టల్‌లో తిండి ఎలాగూ నచ్చదు కాబట్టి ఆదివారాలు బయలుదేరి అబిడ్స్, కోఠి లాంటి చోట్ల పుస్తకాలు వెతకడం, అక్కడే ఏదో హోటేల్‌లో తినడం అలవాటయింది. ఆ రకంగా ఎన్నో పుస్తకాలు కొన్నాను. అందులో కొన్ని నిజంగా అరుదయినవి కూడా ఉండేవి. వాటన్నిటినీ పోగొట్టుకున్నాను. అది వేరే సంగతి. సికిందరాబాద్‌లో కూడా ముఖ్యంగా కింగ్స్‌వేలో రోడ్డు పక్కన పుస్తకాలు దొరికేవి. అక్కడ కూడా చాలా పుస్తకాలుల కొన్నాను. చివరకు ఆ అంగళ్లను నడిపించే వారితో దోస్తీ చేసేదాకా పరిస్థితి పోయింది. అబిడ్స్‌లో ఆనంద్‌భవన్ హోటల్ ఎదురుగా జోళ్ల దుకాణం అరుగు మీద ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన పుస్తకాల గురించి బాగా తెలిసిన మనిషి. నాలాంటి వాడు దొరికితే చర్చ మొదలుపెట్టేవాడు. ఒక పుస్తకం చేతికి తీసుకుంటే, అటువంటి మరొక పుస్తకాన్ని అందించేవాడు. ఇప్పుడు అతని ఇద్దరు కొడుకులు అదే వ్యాపారంలో ఉన్నారు. సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే వాళ్లు ఈ మధ్యన పెద్దపెద్ద అంగళ్లు కూడా పెట్టుకున్నారు. వాళ్లందరితో నా పరిచయం సాగుతున్నది. కానీ పాత పుస్తకాలు కొనడం తగ్గింది అనాలి.
ఇక హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జనవరి నుమాయిష్ జరుగుతుంది. అంటే ఎగ్జిబిషన్ అని అర్థం. అది పారిశ్రామిక ప్రదర్శన. అందులో పుస్తకాలు ఉండేవని నాకు తోచడంలేదు. కానీ నగరంలో ఏటా ఒకసారి పుస్తకాల ప్రదర్శన కూడా జరుగుతుందని తెలిసింది. వారం రోజులపాటు దేశంలోని నలుమూలల నుంచి పుస్తకాలు అమ్మేవారు వచ్చి ప్రదర్శనలో పాల్గొంటారు. అయితే ఈ ప్రదర్శనకు ఒక స్వంత చిరునామా లేదు. అది కొన్ని రోజులు నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో జరిగింది. కొంతకాలం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ స్కూల్ ఆవరణలో కూడా జరిగింది. ఈ మధ్యన ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్నది.
పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగినా మరి చెదపురుగుల వంటి మనుషులంతా చేరుకుంటారు. కొంతమంది వాటిని తింటారు. మరి కొంతమంది పుస్తకాలను దాచకుంటారు. ఈ రెండవ కోవలోకి నేను కూడా వస్తాను. జేబు సౌకర్యాన్నిబట్టి, పుస్తక ప్రదర్శనలలో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొనడం అలవాటుగా మారింది. చాలామంది పుస్తక ప్రియులు ఆ సమయానికి గాను కొన్ని డబ్బులు పక్కన పెడతారని కూడా అర్థమయింది. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అని జరిగే ఈ సంత రానురాను బాగా పెరిగింది. అందులో నా ప్రమేయం కూడా పెరిగింది.
ఒక సంవత్సరం పుస్తకాల ప్రదర్శనలో తిరుగుతూ ఉంటే, ఎవరో రాక్ మీద ఉన్న ఒక పుస్తకాన్ని నాకు చూపించారు. అది నేను రాసిన పుస్తకం. అప్పట్లో ఒకటి, రెండు ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే నా పుస్తకాలు వచ్చాయి. ఆ సంస్థల వారికి ప్రదర్శనలో స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్‌లో నా పుస్తకాలు వచ్చాయి. అది నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ తరువాత వరుసగా చాలా స్టాల్స్‌లో నా పుస్తకాలు కనిపించడం మొదలయింది. ఇక ఈ సంవత్సరం ఒకరు ఎవరో వచ్చి బుక్‌ఫెయిర్‌లో ఎటు చూసినా నీ పుస్తకాలు కనిపిస్తున్నాయి అన్నారు. నిజం చెప్పాలి గాని, నాకు చెట్టు ఎక్కినంత సంతోషం అయింది. చెట్టు ఎక్కితే ఎందుకు సంతోషం అన్న విషయాన్ని నేను ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను. కాదంటే కొండ ఎక్కినంత సంతోషం అయింది. మొత్తానికి సంతోషం అయింది.
ఒకసారి పుస్తకాల ప్రదర్శనలో తిరుగుతూ ఉండగా, ఒక స్టాల్‌లో వచ్చిన వారు అందరికీ ఒక పత్రిక ప్రతిని ఉచితంగా ఇవ్వడం కనిపించింది. నేనూ తీసుకున్నాను. ఆ ఇచ్చిన అమ్మాయి నాకు తెలిసిన ముఖంలా కనిపించింది. పత్రిక పేరు కంప్యూటర్ విజ్ఞానం. అది మాసపత్రిక. దాన్ని నడుపుతున్న శ్రీనివాస్ త్వరలోనే మిత్రుడయ్యాడు. వాళ్ల ఆవిడ ఉమ నాకు అంతకు ముందే తెలిసిన అమ్మాయి. శ్రీనివాస్ రామారావుగారలతో పరిచయం అయిన తరువాత హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు కేవలం సందర్శకుడుగా వెళ్లే పద్ధతి మారింది. నేను కూడా ప్రదర్శకుడిని లేదా పుస్తక విక్రేతను అయ్యాను. కంప్యూటర్ విజ్ఞానం పత్రికలో చాలాకాలం రాశాను. వాళ్లు మిత్రులు కనుక నేను కూడా నిర్వాహకుడిలాగే పని చేశాను. ఒకానొకనాడు మిగతా వాళ్లు వచ్చేదాకా నేను ఒక్కడినే స్టాల్ నడపడం జ్ఞాపకం ఉంది. సందర్శకులు చాలామంది నన్ను స్టాల్ లోపల చూచి ఆశ్చర్యపోయేవారు. బోలెడన్ని వార్షిక చందాలు నేను సేకరించడం గుర్తు ఉంది. అన్యాయంగా ఆ పత్రిక ఆగిపోయింది.
పుస్తక ప్రదర్శనలో ప్రచురణకర్తలే కాక, రచయితలు కూడా స్వంతంగా స్టాల్స్ పెట్టుకునే పద్ధతి మొదలయింది. ఎవరికి వారు పుస్తకాలు అచ్చు వేసుకునే పద్ధతి కూడా బాగా పెరిగింది. ఈ రెండు కలిసి పుస్తక ప్రదర్శనలో ఒక కొత్త వాతావరణం మొదలయింది. మొదటి నుంచి ప్రదర్శనకు వెళితే నాలాగే చూడవచ్చిన మిత్రులు కొంతమంది కలిసేవారు. వారిలో కొంతమంది రచయితలు కూడా ఉండేవారు. ఇక ప్రచురణకర్తలలో కూడా పరిచయాలు పెరిగాయి. ప్రదర్శనలో స్టాల్స్ పెట్టే సంస్థల వారంతా ప్రచురణకర్తలు కానవసరం లేదు.
ఆ మధ్యన ఒకసారి ప్రదర్శనలో పరిచయంగల వాళ్లతో మాట్లాడుతూ ఉంటే, వారి మధ్యలో ఒక ప్రచురణ కర్త కూడా ఉండడం తెలిసింది. పాలకోడేటి పనిగట్టుకుని ఆ యువకునితో నాకు పరిచయం చేశాడు. అతనే సూరిబాబు అనే సూర్యనారాయణ. ఆయన ఆసక్తి ప్రకారం కొన్ని రకాల పుస్తకాలు ప్రచురిస్తాడు. అతనితో నేస్తం పెరిగింది. 2016 సంవత్సరంలో నా పుస్తకాలు పది అతని సంస్థ నుంచి బయటకు వచ్చాయి. ఇక ఆ సంవత్సరం పుస్తక ప్రదర్శనలో నేను పాల్గొన్న పద్ధతి పూర్తిగా కొత్తగా ఉంది. సూరిబాబు స్టాల్‌లో ఒకపక్కన బల్ల మీద నా పుస్తకాలు మాత్రమే పరిచి ఉంచి, పక్కనే గర్వంగా కూచుని వచ్చిన వాళ్లతో వాటి గురించి చెప్పసాగాను. నన్ను రకరకాల కారణాలుగా చాలామంది గుర్తిస్తారు అని తెలిసింది. పుస్తకాల వెనుక నేను వేసుకున్న బొమ్మ కారణంగా నన్ను గుర్తించిన వారు కొందరు ఉన్నారు. ఇక మొదటి నుంచి నన్ను ఎరిగిన వారు నా పుస్తకాలను మరింత ఆసక్తిగా చూడసాగారు.
ప్రదర్శనలో మంచి పుస్తకం, విశాలాంధ్ర, నవచేతన లాంటి సంస్థల స్టాల్స్‌లో కూడా నా పుస్తకాలు ఉండడంలో కొత్త ఏమీ లేదు. చాలామంది నన్ను గుర్తించారు, అభినందించారు. ఈసారి ఆనందం చెట్టెక్కింది లేదా గుట్ట ఎక్కింది అంటే సరిపోదు. ఆ ఆనందానికి నిర్వచనం లేదు. నాకు ఒక కొత్త ఉత్సాహం పుట్టింది. రాయాలి అన్న భావన బాగా బలపడింది. రాస్తూనే ఉన్నాను. అయితే కొన్ని కారణాలవల్ల 2017 సంవత్సరంలో మరీ ఎక్కువగా పుస్తకాలు వేయలేదు. అంటే రాయలేదు అని కాదు. గడచిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి తక్కువగా వచ్చాయి అని మాత్రమే అర్థం. అందుకు కొన్ని కారణాలు నేనే ఊహించుకున్నాను. నిజానికి ప్రస్తుతం కంప్యూటర్‌లో పదికి పైగా అచ్చుకు సిద్ధంగా పుస్తకాలు ఉన్నాయి. కొత్త పుస్తకాలు తయారుఅవుతనే ఉన్నాయి. వచ్చేసారి ప్రదర్శనలో అంటే 2018 చివరలో పరిస్థితి గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు.
పుస్తకాలు రాయడం, అచ్చు వేయడంతోబాటు అమ్మడం కూడా ఒక పండుగలలాగే నాకు కనబడుతున్నది.
*

-కె. బి. గోపాలం