నవమి పూజా విధానం
Published Saturday, 24 March 2018
శ్రీరాముడు జన్మించిన రోజున మనం శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం. ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. ఈ రోజు ప్రతి హిందువు తమ శక్తికొలదీ సీతారామలక్ష్మణ, హనుమ, భరత శతృఘు్నల విగ్రహాలు కానీ, శ్రీరామ పట్ట్భాషేక పటమునుకానీ పెట్టి పూజించాలి.
పూజామందిరాన్ని కానీ, పీఠాన్ని కానీ శుభ్రం చేసి దానికి పసుపు, కుంకుమలు అద్దాలి. మధ్యలో చందనంతో అష్టదళ పద్మమును వేయాలి. దానిపై నూతన వస్తమ్రును పరిచి బియ్యంతో ‘స్తండిలము’ ఏర్పాటు చేసుకోవాలి. ‘స్తండిలము’ అనగా పీటపై బియ్యం పోసి అర అంగుళం మందంతో నలుచదరంగా ఏర్పాటు చేసుకోవాలి. పీట మధ్యలో కలశాన్ని ఏర్పాటుచేయాలి. కలశాన్ని గంధ పుష్పాక్షింతలతో పూజించి, దాని చుట్టూ అష్ట దిక్పాలకులనూ, నవగ్రహాలను, అధిదేవతాప్రత్యధిదేవతా సహితంగా ఆవాహనము చేసి మండపారాధన చేసుకోవాలి.
పూజా మండపానికి నలువైపులా అరటి పిలకలూ, లేత చెరకుగడలూ కట్టి పూలతోను, మామిడాకులతోనూ అలంకరించాలి. పూజ జరిగే పందిరికి స్తంభాలు, కొబ్బరి ఆకులు, అరటి బోదెలు కట్టి, మామిడితోరణాలతో అలంకరించాలి. తరువాత పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతంగా పూజచేయాలి. రామాష్టోత్తరము, సీతాష్టోత్తరము, ఆంజనేయాష్టోత్తరమూ చదువుతూ తులసీ, మారేడు, తమలపాకులతో పూజించాలి. ‘తులసి’తో శ్రీరామచంద్రుని, ‘మారేడు’తో సీతాదేవిని, ‘తమలపాకుల’తో ఆంజనేయుడ్ని పూజించాలి. తరువాత శ్రీసూక్తము, పురుషసూక్తములను, విష్ణు సహస్తన్రామావళిని పఠించాలి.
నైవేద్యం:
చక్కెర పొంగలి, మామిడి పండ్లు, చెరుకు ముక్కలు, వడపప్పు, పానకముతో నైవేద్యం ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతిని ఇవ్వాలి. ఈ విధంగా పూజచేయడం వల్ల సీతారాముల కరుణా కటాక్షాలు ఇంటిల్లిపాదిపైనా ఉంటాయనేది తరతరాలుగా హిందువుల విశ్వాసం.
*