S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం - 20

‘అడిగి చూడు...’
‘రాత్రి సెకండ్‌షో సినిమాకి వెళ్లి వద్దామా?’ చిలిపిగా అడిగాను.
అతను ఏమీ మాట్లాడలేదు.
‘నెక్లెస్ రోడ్డు మీద షికారుకు వెళ్లి ఐస్‌క్రీమ్ తిని వద్దామా?’
అతనికి కోపం వచ్చినట్లు మొహం ఎర్రబడింది. ‘చూడు వసూ!... ఎవరూ పర్ఫెక్ట్ మనుషులు ఉండరు. ఎవరికి ఉండే లోపాలు వారికి ఉంటాయి. డబ్బు ఉన్నవాడికి దాన్ని ఖర్చు పెట్టే సమయం ఉండదు. ఖాళీగా కూర్చునే వాడి దగ్గర డబ్బు ఉండదు. అలాగే నిన్ను తీసుకుని బయటకు వెళ్లలేకపోవటం నా బలహీనత. అలా జరిగిన మరుక్షణం మీడియా నన్ను పాతర వేస్తుంది. నా రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. నువ్వంటే నాకిష్టమే! కాదనను. కానీ నా రాజకీయ భవిష్యత్తు అంతకంటే ఇష్టం. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను...’
‘నాకు తెలుసు. నేను తమాషాకి అన్నాను’ అని నేను ఒప్పుకోవటంతో ఆ చర్చ అప్పటికి ముగిసింది.
ఏడు నెలలు గడిచాయి.
పేపర్ చూస్తున్న నన్ను ఒక వార్త ఆకర్షించింది.
అభిమన్యు హీరోగా, సంతోష్ దర్శకత్వంలో నిర్మింపబడిన చిత్రం ‘వసంతం’ పదవ తారీకున విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంది. ఈ సినిమాతో పరిమళ అనే అమ్మాయి హీరోయిన్‌గానూ, చంద్రం అనే మరొక నటుడు ఇంకొక ముఖ్య పాత్రలోనూ పరిచయమవుతున్నారు...
ఆ వార్త చదువుతూనే పేపర్ విసిరికొట్టాను.
మానిపోతున్న గాయాన్ని ఎవరో పనికట్టుకుని రేపినట్లయింది.
ఒక పక్క నేను ఏదో తప్పు చేసినట్లు ఇలా ఇంటి నుండి బయటకు రాకుండా మగ్గిపోతుంటే.. తప్పు చేసిన ముగ్గురూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ పైకి ఎదుగుతున్నారన్న ఆలోచన నాకు ప్రశాంతత లేకుండా చేసింది.
ఆ రోజు నా దగ్గరకు వచ్చిన అశోక్‌కి చెప్పకుండానే అర్థం అయింది - నా మనసు బాగోలేదని. ‘ఏమయింది? మళ్లీ ఏం గుర్తు వచ్చింది?’ అడిగాడతను.
పేపర్ తీసి నేను చదివిన వార్త చూపించాను. ‘ఆ స్థానంలో నేను ఉండవలసింది..’ హీరోయిన్ పరిమళ ఫొటో వైపు చూపిస్తూ చెప్పాను.
‘అదే నీ కోరికయితే చెప్పు. నిన్ను హీరోయిన్‌గా పెట్టి నేనే సినిమా తీస్తాను..’
‘వద్దు. ఇప్పుడు నాకు ఆ కోరిక లేదు. కానీ.. నేను ఒకటి అడుగుతాను. కాదనకుండా చేస్తారా?’ ముక్కుపుటలు ఎగసి పడుతుంటే అడిగాను.
‘అడుగు...’
‘నేను వారి ముగ్గురి మీదా ప్రతీకారం తీర్చుకోవాలి. వారిని జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలి... అందుకు సహాయం చేస్తారా?’
‘పగలూ, ప్రతీకారాలూ మనకెందుకు? నా సలహా అడిగితే జరిగిపోయిన విషయాలను వదిలెయ్యమంటాను. కాదూ, నీకు ప్రతీకారమే ముఖ్యం అనుకుంటే అలాగే చేద్దాం...’
మొదటిసారి అశోక్‌ని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.
‘కానీ! ఒక విషయం..’ తన్మయత్వం నుండి తేరుకుంటూ అన్నాడు అశోక్. ‘ఇప్పుడు వారందరూ వానపాముల్లాంటి వాళ్లు. నేను ఒక పట్టుబడితే ఆనవాళ్లు లేకుండా అణగిపోతారు. అలా చేయటం వలన నీకు తృప్తి దొరుకుతుందనుకోను...’
‘మరి...’ అతని ఉద్దేశం అర్థంకాక అడిగాను.
‘వాళ్లని ఎదగనివ్వు. ఎంత ఎదుగుతారో అంత ఎదగనివ్వు. మొదటి నుండి బాధల్లో ఉన్నవాడికి ఆ బాధ అలవాటవుతుంది. అదే కొన్నాళ్లు సుఖం మరిగాక అవే కష్టాలు అతను తట్టుకోలేడు. అందుకే!... తొందరపడకు. సమయం రానియ్. ప్రతీకారం ఇంత బాగుంటుందా అని నీ చేత అనిపిస్తాను...’ అన్నాడు అశోక్.
ఆ మాటలు నాకు బాగా నచ్చాయి. ఆ రోజు నుండి ఒక వ్యాపకం ఏర్పడింది - ఆ ముగ్గురి మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా... అని ప్రణాళికలు వెయ్యటం.
* * *
ఇప్పుడు రెగ్యులర్‌గా నాలుగు రకాల దినపత్రికలు ఫాలో అవుతున్నాను. సంతోష్, చంద్రం, అభిమన్యులకు సంబంధించి ఏ వార్త వచ్చినా జాగ్రత్తగా కట్ చేసి దాచుకుంటున్నాను.
దినపత్రికలు చదివే ఉద్దేశం మరోటి అయినా నెమ్మది నెమ్మదిగా రాజకీయ వార్తలు కూడా చదవటం మొదలుపెట్టాను. వాటిలో అశోక్ గురించిన వార్తలు ఉంటాయిగా! అది కూడా ఒక కారణం వాటి మీద అంత ఇంటరెస్ట్ చూపించటానికి.
వసంతం సినిమా అనుకున్నట్లే ఏ ఇబ్బందులూ లేకుండా రిలీజ్ అయింది. సినిమా తీసిన వారు కూడా ఊహించనంత సూపర్ హిట్ అయింది.
సినీ రంగంలో విజయానికి మించిన ఐడెంటిటీ మరేదీ ఉండదు. ఒక్క హిట్ పడిందంటే అన్ని లోపాలూ కొట్టుకుపోతాయి. ఆ సినిమాలో పాలుపంచుకున్న అందరికీ అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక ప్రొడ్యూసర్ సుబ్బరాజు ఆనందానికయితే హద్దే లేదట. ‘తరువాత సినిమా వసంతరావ్ డైరెక్షన్లోనే..’ అంటూ పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చాను. అవును! ఇప్పుడు అతని దగ్గర భారీ సినిమా తీయటానికి సరిపోయే డబ్బులు ఉన్నాయి.
‘అదృష్టం ఎప్పుడూ తలుపు తట్టదురా!... వచ్చిన డబ్బులు తీసుకుని మీ ఊరు వెళ్లు...’ అని వసంతరావ్ చెప్పిన మాటలు సుబ్బరాజు వినలేదనీ, అతని పోరు పడలేక ఒక పెద్ద సినిమా వసంతరావ్ ప్లాన్ చేస్తున్నాడనీ గాసిప్ కాలమ్స్ ద్వారా తెలుసుకున్నాను.
అభిమన్యు కంటే ఆ సినిమా వలన చంద్రానికి బాగా పేరు వచ్చింది. అతనిలో మంచి స్పార్క్ ఉందని అందరూ గుర్తించారు. అతనికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయనీ, సంతోష్ నైపుణ్యం అందరికీ తెలియటంతో అతనికి కూడా సినిమా ఆఫర్లు బానే వచ్చాయనీ చదివాను.
నేను మాత్రం ప్రస్తుతానికి అశోక్ సూచించినట్లు వారి ఎదుగుదలను చూడటంతోనే సరిపెట్టుకుంటున్నాను తప్ప అడ్డుకోవటానికి ప్రయత్నించటం లేదు.
ఒక రోజు జానకి నుండి ఫోన్ వచ్చింది. ‘ఈ సమయంలో చేసిందేమిటా...’ అనుకుంటూ ఎత్తాను.
‘వసూ!... నేను పోలీసుస్టేషన్‌లో ఉన్నాను’ గాబరాగా చెప్పింది.
‘ఏమయింది? ’ అంతకంటే కంగారుగా అడిగాను నేను.
‘కంగారు పడేదేమీ లేదు. మామూలుగా జరిగేదే! అప్పుడప్పుడూ పోలీసులు వాళ్ల ఉనికి నిరూపించుకోవాలంటే ఇలాంటివి ఏదో ఒకటి చెయ్యాలిలే!...’ అంది.
‘సమయానికి అశోక్‌గారు కూడా ఊళ్లో లేరు. ఆయన అమెరికా టూర్ వెళ్లారు. ననే్నం చెయ్యమంటావ్?’
‘ఈ చిన్న పనికి అశోక్‌గారు అవసరం లేదు. ఆయన పి.ఏ.కి ఫోన్ చేసి చెప్పు. మిగిలినదంతా అతను చూసుకుంటాడు...’ అంది జానకి.
వెంటనే అశోక్ పి.ఏ.కి ఫోన్ చేశాను.
అతను మరి ఏం చేశాడో కానీ గంట తరువాత నా దగ్గరకు వచ్చింది జానకి. వడలిపోయినట్లు వచ్చిన ఆమెను చూస్తే నా కంట నీరు ఆగలేదు. ‘ఇలా ఎన్నాళ్లు గడుపుతావ్? నువు సరే అంటే... అశోక్‌గారికి చెప్పి ఏదో ఒక ఏర్పాటు చేయిస్తా... ఈ పని మానెయ్యి’ అన్నాను.
‘ఇంకొన్నాళ్లు పోతే ఎలాగూ తప్పదులే!...’ అంది జానకి.
‘అయినా ఇలా పోలీసులు పట్టుకుంటుంటే...’
‘ఎప్పుడూ ఎందుకు జరుగుతుంది? ఈసారి నాతోపాటు ఉంది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు. వాళ్ల నాన్న మీద కోపంతో అనుకుంటా... అతన్నీ, అతనితోపాటు నన్నూ పోలీసులకు పట్టించారు. మరి వాళ్ల నాన్నతో ఏమి అగ్రిమెంట్ కుదిరిందో కానీ, అరగంటలోపే అతన్ని వదిలేశారు. నన్ను మాత్రం వదల్లేదు. నువు కల్పించుకోవటంతో చివరకు తప్పక నన్ను కూడా వదిలారు’
‘ఎవరు నీతో ఉంది?’
చెప్పింది జానకి.
‘అవునా!...’ ఆశ్చర్యపోయాను నేను.
‘అంత ఆశ్చర్యపోకు. సాక్షాత్తూ సి.ఎం కొడుకు కూడా నా దగ్గరకు అప్పుడప్పుడూ వస్తుంటాడు. తెలుసా?’ గర్వంగా చెప్పింది జానకి.
మొదటిసారి నాకు జానకి మీద అనుమానం వచ్చింది. ఇప్పటివరకూ ఆమె ఈ పని తనకు ఇష్టం లేకుండా, పరిస్థితుల ప్రభావంతో చేస్తుందేమో అనుకున్నాను. కానీ.. చూస్తుంటే ఈ పనులన్నిటినీ జానకి ఎంజాయ్ చేస్తుందేమో అనిపిస్తోంది. అందుకే నిట్టూర్చి ఊరుకున్నాను. అంతకంటే చేయగలిగింది కూడా ఏమీ కనపడలేదు.
సంవత్సరాలు గడిచాయి. అశోక్ రాజకీయాల్లో ఎదుగుతున్నాడు. ఒక మంచి నాయకుడిగా అతని పేరు మారుమోగుతోంది. సహజంగానే అతనికి అంత పేరు రావటం ముఖ్యమంత్రికి ఇష్టంలేదు. ఏదో విధంగా అశోక్‌ని అణగదొక్కాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు.
మరొకవైపు జనరల్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి.
అశోక్ మరలా ఎన్నికల్లో నిలబడతారన్న విషయం మీద ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు.
అతను అప్పుడే తన ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు.
అయితే ఆపద అనుకోని కోణం నుండి వచ్చింది. అశోక్ నియోజకవర్గం రిజర్వ్‌డ్ కేటగిరీలోకి మారింది. ఇప్పుడు అతను తన నియోజకవర్గం నుండి పోటీ చేయటానికి వీలులేని పరిస్థితి.
అశోక్ పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లి తన సమస్య వివరించాడు. నియోజకవర్గం మార్చమని అభ్యర్థించాడు. వాళ్లు చూస్తామన్నారు తప్ప గ్యారంటీ ఇవ్వలేదు. మరొకవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ తన పని జరగకుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటాడని అశోక్ నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు.
తన సహచరులతో సమావేశమయ్యాడు అశోక్. అందరూ కలిసి ఏం చెయ్యాలో ఆలోచించసాగారు. అతనే కాదు, అతని కుటుంబం నుండి ఎవరూ పోటీ చెయ్యటానికి వీలులేని పరిస్థితి. అలా అని అంత కష్టపడి బేస్ ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గాన్ని ఎలా వదులుకోగలడు?
ఇంతలో అతనికి నా కులం సంగతి గుర్తుకు వచ్చింది. ఎన్నికల్లో నేను నిలబడటానికి అభ్యంతరం ఏమీ ఉండదు. నాదీ రిజర్వ్‌డ్ కులమే!
వెంటనే అతను తన ప్రతిపాదన నా ముందు ఉంచాడు. నేను ఒప్పుకోలేదు. ‘ఏ మాత్రం అనుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి నేను ఏం చేస్తాను?’ అని నా వ్యతిరేకత తెలియజేశాను. అయితే అశోక్ నెమ్మదిగా నాకు నచ్చజెప్పాడు. ‘నేను ఉన్నాను కదా!... అన్ని వ్యవహారాలూ నేను చూసుకుంటాను. మరో ఐదేళ్లలో ఈ నియోజకవర్గం తిరిగి జనరల్ కేటగిరీలోకి వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఉంటే చాలు. ఈ సీటు వేరే ఎవరి చేతుల్లోకో వెళ్తే... తిరిగి నాకు దొరుకుతుందన్న గ్యారంటీ ఏముంది?...’ అన్నాడు.
నాకు కూడా అతని వాదన సబబే అనిపించింది. కానీ ఒకటే అనుమానం వేధిస్తోంది - ‘నేను ఈ పనులన్నీ చేయగలనా...’ అని.
అశోక్ మాత్రమే కాదు అప్పటివరకు అతనికి సపోర్ట్‌గా ఉన్న నియోజకవర్గ ప్రముఖులు కూడా తమ సహాయ సహకారాలు నాకే అందిస్తామని వాగ్దానం చేశారు.
నాకు ఇష్టంలేకపోయినా అంగీకరించక తప్పలేదు.
‘చాలు. నువ్వు ఒప్పుకుంటే చాలు. పార్టీ దగ్గర నుండి నీకు సీటు తెచ్చే బాధ్యత నాది...’ అన్నాడు అశోక్. అతను ఏమి మాయ చేశాడోకానీ.. పార్టీ పెద్దలు నాకే టికెట్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు.
‘ఇక రేపటి నుండి నువు ఇంట్లో కూర్చుంటే కుదరదు. నాతోపాటు నియోజకవర్గం అంతా పర్యటించాలి...’ అన్నాడు అశోక్. చెప్పటమే కాదు, ఆ రోజు నుండి నన్ను ప్రతి పనిలో తనతోపాటు తిప్పుతున్నాడు. ఇప్పుడు నేను అతని పార్టీకి చెందిన కాబోయే అభ్యర్థిని కాబట్టి.. మేమిద్దరం కలిసి తిరిగినా ఎవరూ అభ్యంతరం పెట్టటానికి ఏమీ ఉండదు.
నాకు కూడా ఇది బానే ఉంది. నేను ఎంతగానో ప్రేమిస్తున్న అశోక్‌కి ఇంత దగ్గరగా మసలగలగటం ఎంతో ఆనందాన్నిస్తోంది. మరోపక్క అట్టడుగు వర్గపు బాధలు బాగా తెలిసినదాన్ని కాబట్టి వారికి ఏదైనా మేలు చెయ్యగల అవకాశం ఎక్కడ ఉందా అని ఎప్పుడూ వెతుకుతూ ఉండేదాన్ని.
అతనితో కలిసి నియోజకవర్గంలో తిరుగుతున్న కొద్దీ అశోక్ అక్కడి ప్రజలతో ఎలా మమేకమయ్యాడో తెలుస్తోంది. ఏ మారుమూల ఊరికి వెళ్లినా అతని అనుచర వర్గం ఉంది. ప్రతి ఊరికీ అతను ఏదో ఒక మేలు చేశాడు. అయితే అవన్నీ అగ్ర కులాలకు పనికివచ్చే పనులే! నిమ్న కులాల వారు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు కాబట్టి వారికి మరేమీ చేయనవసరం లేదన్నది అతని వాదన.
నేను అతని మాటకు ఎదురు చెప్పలేదు. కానీ నేను గెలిస్తే మాత్రం అగ్రకులాల్తో పాటు నిమ్న కులాలకు కూడా మేలు జరిగే పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నాను. అతను పయనించిన మార్గంలోనే ముందుకు వెళ్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యే మార్గాలు వెతకసాగాను.
నేను ఆ ఎన్నికల హడావిడిలో వుండగా ఒకరోజు జానకి వచ్చింది. నేను చెప్తున్న మాటలు వినిపించుకోకుండా, ‘ఆ ఎన్నికల గొడవ పక్కనపెట్టు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈసారి హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. నువు తప్పక రావాలి...’ ఆహ్వానించింది.
‘నీకూ, అవార్డ్స్‌కీ ఏమిటి సంబంధం?’ ఆశ్చర్యంగా అడిగాను.
నవ్వింది జానకి. ‘ఆ ఫంక్షన్లో నేను ఒక డాన్స్ ఐటెమ్ చేస్తున్నాను’
కాదనలేకపోయాను. ఆ రోజు ఏదో పని ఉండటంతో అశోక్‌కి రావటం కుదరలేదు. అందుకే ఒంటరిగా వెళ్లవలసి వచ్చింది.
ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడి అవార్డు చంద్రానికి వచ్చింది. అందరూ చంద్రాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. తక్కువ సమయంలో ఇంతగా ఎదిగిన చంద్రం గొప్పదనాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
స్టేజ్ ముందు కూర్చున్న నన్ను చంద్రం గమనించే అవకాశం లేదు. ఒకవేళ చూసినా గుర్తు పడతాడనుకోను. నాలో మాత్రం ఏదో అసంతృప్తి వెల్లువలా పొంగింది. ఫంక్షన్ పూర్తి అయ్యేవరకూ కూర్చోలేక వచ్చేశాను.
మరుసటిరోజు నన్ను చూసిన అశోక్ నాలోని మార్పును వెంటనే పసిగట్టాడు.‘ఏం జరిగింది? మళ్లీ మీ పాత స్నేహితులు కనపడ్డారా?’ అని అడిగాడు.
‘వాళ్లు నాకు స్నేహితులు ఎలా అవుతారు?’ చీదరగా చూస్తూ అన్నాను.
‘పోనీ.. పాత శత్రువులు’
‘అవును’
‘వెంటనే నువు అప్‌సెట్ అయ్యావు’
‘వాళ్లు అలా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ సౌఖ్యాలు ఎంజాయ్ చేస్తుండటం నన్ను బాధిస్తోంది. వాళ్లని ఏదో ఒకటి చెయ్యందే నా మనసు ప్రశాంతంగా ఉండదు...’

- మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002