S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాలు: తెల్ల అబద్ధాలు

ప్రశ్న: పాలని నమ్మొచ్చా డాక్టర్‌గారూ! నిజం తెలియజేయండి.
-కంకణాల రామేశం (జాగర్లమూడి)
జవాబు: నిజంగా మనం పాలే కొనుక్కుంటున్నామా? తెల్లనివన్నీ పాలేనా? చంటిబిడ్డలకు ప్రేమమీరా మనం పట్టిస్తున్న పాలలో పాల శాతం ఎంత? మీరడిగిన ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలుండవు. వాణిజ్య సంస్కృతిలోకి మనం వెళ్లిపోయాక నాణ్యమైన జీవితాలు, నాణ్యమైన ఆహార పదార్థాలు, నాణ్యమైన మనుషులు ఇలాంటి మాటలు వింత మాటలుగా ధ్వనించటం మొదలయ్యింది.
ఎవరు ఎక్కువ వాణిజ్య ప్రకటనలిస్తే అదే మంచి బ్రాండ్ అనే మన నమ్మకాన్ని వాణిజ్య కంపెనీలు సొమ్ము చేసుకొంటున్నాయి. వాస్తవం మీద కాక, నమ్మకం మీద నడిచిపోతోందంతా!
ఇవ్వాళ మనకు దొరికే పాలు పాలు కావనీ, నీళ్లు నీళ్లు కావనీ, తేనె తేనె కాదనీ, నూనె నూనె కాదనీ, పసుపు, కారం, అప్పడాలు, వడియాలు సహా ప్రతీదీ కల్తీమయంగా ఉంటోందనీ చాలామంది భయపడ్తున్నారు. అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోండటంతో ఏది కొన్నాలన్నా వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇదంతా జనాభాని తగ్గించే ప్రయత్నం అండీ అన్నాడొకాయన. ‘ఇంతకు మించిన దేశభక్తి ఇంకేముంటుంది? ధైర్యంగా మనం ఒక ఆహార పదార్థాన్ని కొనుక్కో గలిగిన రోజునే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అనేది ఆయన తాత్పర్యం.
ఆధునిక యుగంలో నవ్య నూతన పదార్థాలు కొన్ని మనల్ని నిజంగానే భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. సింథటిక్ పాలు, ప్లాస్టిక్ కోడిగుడ్లు, ప్లాస్టిక్ బియ్యం, వీటితో జీవనాన్ని సాగిస్తోంటే, జనాభాలోంచి ఎవరికి వారే తగ్గిపోయి తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారికి సింథటిక్ పాలు వరప్రసాదమనే చెప్పాలి.
పాలలో మహా కపిలితే కాసిని నీళ్లు తప్ప ఇంకే కలుపుతారు లెమ్మనే అమాయకులెవరైనా ఉంటే వాళ్లకు తప్పనిసరిగా సింథటిక్ పాల గురించి తెలియాలి. అవి పాలు కాదు, పాపాలు! తెల్ల అబద్ధాలు!! తేటతెల్లమైన నిజాలు!!
పాలలో విషాలు ఎలా కలుస్తాయో ఒక కథనం ఇలా ఉంది. పీపాడు నీళ్లలో కొద్దిగా యూరియా కలిపితే నీళ్లన్నీ తెల్లగా పాలలాగే అవుతాయి. ఈ నీళ్లలో కొద్దిగా డిటర్జెంటు పౌడర్ కలిపితే మరింత తెల్లగా అవుతాయి. కాచి, కాఫీపొడి వేసి రెండు గ్లాసుల్లో అటు ఇటు తిరగబోస్తే కావలసినంత నురగ వస్తుంది. మనం గుమ్మాలకు, గోడలకు వేసుకునే తెల్ల పెయింటు కొద్దిగా తెచ్చి ఇందులో కలిపి బాగా చిలికితే ఆ పాలు ఇంకా తెల్లగా చిక్కగా అవుతాయి. మీగడ కట్టాలి కాబట్టి రిఫైన్ ఆయిల్ లేదా చవకబారు పామోలివ్ నూనెని తెచ్చి కలుపుతారు. మరి ఈ దొంగపాలు తోడుకోవాలి కదా.. అందుకని అందులో కాసిన్ని నిజం పాలు కూడా దయతలచి కలుపుతారు. లేదా పురుగులు పట్టి పారేయాల్సిన పాలపిండిని తక్కువ రేటుకు కొని తెచ్చి కలుపుతారు అంతే! ‘రెడీ టు డ్రింక్’ అనదగిన సూయిసైడ్ మిల్క్ తయార్. ఇది చదివితే ఎవరికైనా గుండె ఆగినంత పనౌతుంది. కల్తీదారులకు పిల్లల్లేరా? వాళ్లు ఏ కంపెనీ పాలు తాగి పాపీ చిరాయువులాగా ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాల్సిన విషయాలే!
కంపెనీలు అమ్మే బ్రాండెడ్ పాల మీద నమ్మకం లేక పట్టణాల్లో కొందరు సైకిళ్ల మీద బిందెలు కట్టుకుని ఇంటికి తెచ్చి పోసే పాల మీద ఆధారపడ్తున్నారు. కంపెనీకన్నా మనిషి నమ్మకస్తుడని!
ఈ బిందెల పాలవాళ్లు మధ్యాహ్నం 2 గంటల క్కూడా తెచ్చి పచ్చి
పాలు పోస్తున్నారు. ఇంట్లో పాలను కాయటం ఒక గంట ఆలస్యం అయితే అవి విరిగిపోతాయి కదా. ఈ బిందెల పాలు మధ్యాహ్నం దాకా ఎలా నిల్వ వుంటున్నాయి? నిల్వ వుండేలా ఏమైనా కలుపుతున్నారా? అవి మనకు అపకారం చేస్తాయా? ఈ ప్రశ్నలు అడిగేవారు గాని, వాటికి సమాధానం చెప్పేవారుగానీ తక్కువే!
వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమనూ చేజేతులా చంపుకున్న తెలుగు నేల మీద పాల కల్తీలకు అవకాశం ఎక్కువ. సహజంగా పితికిన పాలను పితికినట్టు కొనుక్కునే అదృష్టం పట్టణాల్లో అస్సల్లేదు. పల్లెల్లో కూడా మంచి పాల అందుబాటు తగ్గిపోతోంది. పాడి పరిశ్రమకు పెట్టింది పేరనదగిన పంజాబ్, యూపీ లాంటి రాష్ట్రాల్లోనే సింథటిక్ పాల జోరు ఎక్కువగా ఉన్నదంటే, మన నేల మీద ఇంకెంత స్థాయిలో జరుగుతున్నాయో తెలీదు. కీటక నాశినిగా పనిచేసే ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సయిడ్ కూడా పాల కల్తీలో ఒక భాగంగా ఉన్నదని తెలుస్తోంది. మధ్యాహ్నానికి పాలు విరగటం లేదంటే కారణం ఇదే కావచ్చు.
పంజాబ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వారు 1353 పాల నమూనాలు సేకరించి పరీక్షిస్తే, వాటిలో 495 నమూనాలు పరమ భయంకర కర్తీలు కలిసినవిగా కనుగొన్నారు. పంజాబ్‌లో 36.5% కల్తీ పాలు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. లూజు పాలలోనే కాదు, ప్యాకెట్టు పాలలో కూడా ఈ కల్తీ జరుగుతున్నట్టు వెల్లడయ్యింది. యూరియా ఫార్మాలిన్‌తోపాటు విదేశీ కొవ్వు, పాలపిండి, డిటర్జెంటు, కార్బోనేట్, బైకార్బోనేట్, మాల్టోడెక్స్‌ట్రిన్, కొంచెం పంచదార కలిపి ఈ సింథటిక్ పాలను తయారుచేస్తున్నట్టు పంజాబ్ ఆహార నిఘా సంస్థ తెలిపింది.
వెన్న, నెయ్యి, ఐస్‌క్రీమ్‌లు కూడా ఈ కల్తీ పాలలోంచే పుడుతున్నాయి. ఈ విషపు పాలతోనే ఐస్‌క్రీం తయారుచేస్తున్నారు. ఐస్‌క్రీముల్లో రంగులు, ఫ్లేవర్లు కలిసి ఉంటాయి కాబట్టి విషాలను ఎవరూ గమనించలేరు. ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో 982 ఐస్‌క్రీమ్ నమూనాల్లో 384 నమూనాలు సింథటిక్ పాలతో తయారైనవేనని తేలింది. అయినా మనం వాటి మీద వ్యామోహం పడటం, మన ప్రియమైన చిన్నారులకు వాటిని కొనిపెట్టడం అవసరమా?
కల్తీదారులకు జీవితఖైదు లాంటి కఠినశిక్షలు అమలు చేయాలని 2016లో సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వాలకు సూచించింది. దాని అమలు మన పాఠకుల పరిధిలోనో వైద్యుల పరిధిలోనో ఉన్న విషయం కాదు.
గడ్డితిని పాలివ్వాల్సిన జంతువులకు ప్రమాదకరమైన మేతను పెట్టి, ఎక్కువ పాలను పిండటానికి వాటికి రసాయనాలతో కూడిన ఇంజెక్షన్లనిస్తున్నారు. అవి పాలు కావు పాపాలు. వాటిని తాగి పెరిగే పసిబిడ్డల పరిస్థితి ఏమిటి?
సమస్య సరే! పరిష్కారం ఏమిటి? వ్యక్తులుగా మనం పాలను స్వంతంగా సృష్టించుకోలేం కాబట్టి, వ్యామోహాలు వదిలి వాణిజ్య ప్రకటనలకు మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే పరిష్కారం. కల్తీ అవకాశం ఉందనిపించిన పాలను వదిలేయండి. ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పాల విరుగుడుతో చేసే స్వీట్లు, పన్నీర్ (జున్ను) లాంటి నాగరిక ఆహార పదార్థాలకు సాధ్యమైనంత ‘నో’ చెప్పండి.
సాంస్కృతిక వారసత్వాన్ని వదిలేసి, అమెరికీకరణం పట్ల మనం మోజు పెంచుకోవటం వలన కల్తీదారులు రెచ్చిపోతున్నారు. వాళ్ల మీద అదుపు లేకపోవటం అనేది మనం చూస్తున్న విషయమే. అందుకని అదుపుని మనల్ని మనమే చేసుకోవాలని అబద్ధాలపాల కథ మనకు నీతి చెప్తోంది.

- డా. జి.వి.పూర్ణచందు 94401 72642