S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషి

నేను చాలా మందిని ఇరకాటంలో పెట్టి ‘నీవు ఎవరు?’ అని ప్రశ్న అడిగాను. అలా చాలాకాలం పాటు చాలా సందర్భాలలో ఈ ప్రయోగం కొనసాగించాను. అందరూ ఇంచుమించు తేడా లేకుండా ‘మనిషిని!’ అని జవాబు చెప్పారు!
ప్రపంచంలో ఇన్ని రకాల జీవులు ఉండగా మనిషి ప్రత్యేకంగా ‘మనిషి’గా నిలవడానికి వీలు కలిగించిన పరిస్థితులు ఏమిటి? ఈ ప్రశ్నకు పరిశోధకులతోబాటు అందరూ ఒక సమాధానం చెప్పడం నేర్చుకున్నారు.
‘మిగతా జాతుల నుంచి మనలను వేరుచేసి చూసేది మన మెదడు. మన కండరాలు లేదా ఎముకల బలం వల్ల మనం నిటారుగా నిలవలేదు. మెదడు వల్ల నిలిచాము’ అంటారు పాస్కో టి.రాకిక్. 21వ శతాబ్ది వైద్యరంగం ముందు నిలిచిన గొప్ప సమస్యలు అనే ఒక సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు.
‘నాలుక లేకుంటే మెదడుకు విలువే లేదు’ అని ఫ్రెంచ్ సామెత ఒకటి ఉంది.
నాలుక ఉన్నంత మాత్రాన, మెదడు ఉపయోగం తెలిసినంత మాత్రాన మనిషి నిజంగా మిగతా జీవులకన్నా గొప్ప స్థితిలో ఉన్నట్లు భావించవచ్చునా?
‘ఎంత గొప్ప పనితనం నుంచి పుట్టిన సృష్టి ఈ మనిషి? ఎంత గౌరవంగా ఉంటారు వీరు? ఎన్ని పనులు చేతనవును వీరికి! ఆ రూపం, కదలికలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి? మనుషులు దేవతలలాగ ప్రవర్తిస్తారు కదా? ప్రపంచానికే అందాలు అద్దుతారే? జంతువులన్నింటిలోనూ ఆదర్శప్రాయులే! అయినా, నాకు ఈ దుమ్ము సారానికి అర్థం ఏమిటో అర్థం పట్టదు’ అంటుంది షేక్స్‌పియర్ నాటకం ‘హామ్లెట్’లోని ఒక పాత్ర. ఈ అనంత విశ్వంలో ఇది ఒక దుమ్ముకణం మాత్రమేనట. నేను మరొకచోట మనిషిని రసాయనాల కుప్ప అని వర్ణించాను.
అయితే మనిషి అంటే ఏమిటి? అని ప్రశ్నించే ఆలోచన పుట్టింది! కనుక మెదడు మాటలకు విలువ ఉంది. అవగాహనకు అర్థం ఉంది. అవగాహన కొరకు వెదికే స్వభావం ఉంది. అందువల్ల సైన్స్ అనే సమాచారం, తత్వం ఒకచోట చేరాయి.
ఏదో తెలుసుకోవాలని ఆరాటం. తెలుసుకున్నందుకు ఒక ఆనందం. అందులో ఒక ఆటవిడుపు పద్ధతి. ఆ ఆటకు కొన్ని నియమాలు. ఉదాహరణకు పాపులర్ సైన్స్ లేదా జన విజ్ఞానం రాస్తుంటే చెప్పిన విషయాలు చదివే వారికి లేదా వినే వారికి చేతనయినంత సులభంగా అర్థం కావాలని ఒక నిర్ణయం. అంటే భాష సులభంగా ఉండాలి. వాక్య నిర్మాణం సులభంగా ఉండాలి. భాష, విషయం రెండూ శాస్ర్తియంగా ఉండాలి. వాటిలో అంతరార్థాలు, గూడార్థాలు ఉండకూడదు. ఇన్ని నియమాల మధ్యన చెపుతూ ఉంటే అందులో సొల్లు మాటలు పొల్లు మాటలు కూడా ఉండకూడదు.
సులభంగా చెప్పడం సులభం కాదని అర్థం అయి ఉంటుంది. ‘అథాతో ఆత్మ జిజ్ఞాస’ అని ఇక్కడ మన ప్రయత్నం. అంటే మన గురించి మనం ఆలోచించాలి, చర్చించాలి, తెలుసుకోవాలి. ఈ మనం అంటే ఎవరు? రాసిన నేను, చదువుతున్న మీరు ఇద్దరు కలిస్తే మనం అవుతామా? మొత్తం మీద ఈ అక్షరాలను చాలామంది చదువుతారు కదా! వాళ్లందరు కూడా మనలాంటి మనుషులే, అందునా చదవాలని కుతూహలంగల తెలివిగల మనుషులు కూడా. ఆత్మ అన్నప్పుడు నేను ఒక్కడినే అందులో ఉండాలి. ఎవరు ఈ నేను? నా శరీరమా? నా ఆలోచనలా? కానీ మనిషి పద్ధతి చూస్తే అందరూ కలిసినా సరే ఆత్మ అనే పద్ధతి కనిపించే అవకాశం ఉన్నట్టుంది. మొత్తానికి అందరూ బాగుండాలి అన్నది మనిషి కోరిక. అంటే తనకొక్కడికే కాకుండా అందరికీ తెలివి, ఆనందం, సౌకర్యం అన్నీ అందాలని మనిషి ఆలోచన.
మళ్లీ మళ్లీ మనిషి అంటున్నాము. మీరు ఈ అక్షరాలు చదువుతున్నారంటే తప్పకుండా మనిషి అయి ఉంటారు. నా ఈ మాటల తీరును సహించగలుగుతారు. తెలిసి తెలియక నేను మిమ్మల్ని మీరు ఎవరు అని అడిగితే బహుశా మీరు మీ స్వంత పేరు, ఇంటి పేరు, ఊరు, తల్లిదండ్రుల వివరాలు, చేస్తున్న పనిలాంటివన్నీ చెప్పరు అనే నా నమ్మకం. అడిగిన తీరును బట్టి మీరు కూడా ‘నేను మనిషిని’ అనడానికి సందేహించరు. ఇలా జవాబు చెప్పిన వారందరికీ మనిషి అంటే ఏమిటో తెలుసునా? అందరూ తెలుసు అనే అనుకుంటారు. మనిషి గురించి ఒక ఉపన్యాసం కూడా మొదలుపెట్టే అవకాశం అందరికీ లేకున్నా నా వంటి మాటల మనుషులకు తప్పకుండా ఉంటుంది. ఇంతకూ మీరు ఏమి అనుకుంటున్నారు? మనిషి అంటే ఏమిటి?’
ఒకటి, రెండు ప్రశ్నలు గమనిస్తే మనకు జవాబు గురించి కొంచెం ఆలోచన రావచ్చు. మెదడు సంగతి ఇదివరకే చెప్పుకున్నాము. వానపాముకు కూడా మెదడు ఉందని పరిశోధకులు చెపుతున్నారు. వానపాము నిద్రపోతుందా? చేపలు పెద్ద గుంపుగా ఒకే వేగంతో ఒకవేపు వెళ్లిపోతూ ఉంటాయి. అవి ఉన్నట్టుండి ఒక్కసారిగా మిలటరీ పెరేడ్‌లో ఉన్న సైనికులవలె వెనక్కు తిరిగి అంతే వేగంతో మళ్లీ పోవడం మొదలుపెడతాయి. ఈ సంగతి తెలుసా? ఇటువంటి వీడియోలు తీసి ప్రపంచానికి చూపించిన వారిని మనిషి అంటే సరిపోతుందా? వాళ్లు మామూలు మనుషులకన్నా కొంత ఎక్కువ కదా? ఆ సంగతి వాళ్లకు తెలుసా? వాళ్లు ఆ పని ఎందుకు చేయాలనుకున్నారు? ఇది మొదటి ప్రశ్న. ఇక మనుషులు చాలా పనులు చేస్తారు. ఆ పనుల్లో అన్నింటినీ అందరూ చేస్తారని తెలుసు. అయినా మనుషులు కొన్ని పనులను ఎవరికీ కనిపించకుండా రహస్యంగా చేస్తారు. ఏమిటి ఇందులోని రహస్యం? ఈ రహస్యం ఎందుకు? ఎవరికి వారే కితకితలు పెట్టుకోవడం కుదరదని చాలాచోట్ల చెపుతుంటారు. ఎందుకు అని అడిగిన వాళ్లు కొందరు ఉండొచ్చుగానీ, జవాబు తెలిసిన వాళ్లు తక్కువ. పిల్లి నాలుకతో ఒళ్లంతా తుడుచుకుంటుంది. ముందు కాళ్లకు తడి అంటించుకుని ముఖం తుడుచుకుంటుంది. అంటే మనం స్నానం చేయడం గొప్ప ఆశ్చర్యం కాదన్నమాట. అయితే మన ఆవులింతలు, గోకుడు, ఎక్కిళ్లు మిగతా జంతువులతో ఉన్నాయా?
ఇలా నేను ఎన్నయినా ప్రశ్నలు అడుగుతూ వెళ్లగలను. మీరు ఇప్పటివరకు అంటే చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని చొక్కాలు వేసుకున్నారు? గుర్తుంచుకునే ప్రయత్నం చేశారా? ఎన్ని కంచాలలో అన్నం తిన్నారు? ఇలాంటి ప్రశ్నలు మొదలుపెడితే మీరు చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసే అవకాశం నిండుగా ఉంది. ఇంతకూ సామాన్య మానవుడు అంటే ఎవరో తెలుసా? మీరు సామాన్య మానవులా? లేక ప్రత్యేకత గలవారా? మీ నడవడిని చూచి మీ స్వభావాన్ని తెలుసుకోవడం వీలవుతుందా? అన్నట్టు మనుషులలో చెడ్డతనం, క్రూరత్వం ఎందుకుంటాయి? మనకు మరొకరి ఆలోచనలు తెలిసినట్టు భావిస్తాం కదా? అందులో నిజం ఉందా?
ప్రశ్నలు అడగడం సులభం. కొంచెం కష్టపడితే జవాబులు దొరుకుతాయి. మీరు స్వయంగా ఇంతకు ముందు ఈ ప్రపంచంలో కనిపించిన ఏ సంగతి గురించి అయినా ఇలాంటి ప్రశ్నలు అడిగారా? అంత తీరిక ఎక్కడిది అని నిట్టూర్పు విడుస్తారా? మనుషులలో మంచివాళ్లు ఉన్నారు, అలాగే చెడ్డవాళ్లు కూడా ఉన్నారు. ఎవరినీ మంచి, చెడఒ్డ అని విభజించి చెప్పడానికి మాత్రం లేదు. మనకు చెడ్డవాడుగా తోచిన మనిషి మరొకచోట చాలా మంచితనం ప్రదర్శించి ఉండవచ్చు.
ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే మన సంగతి ఏమిటి అన్న ప్రశ్న పెద్దదిగా ఎదురుగా నిలబడుతుంది. మరమనిషిని తయారుచేశారు. దానికి నేను అన్న భావాన్ని కల్పించగలిగారా? మనకు ఈ భావం ఎప్పుడు, ఎక్కడ మొదలవుతుంది? ఎవరికి వారే నేను అనుకుంటాంగానీ ఎదుట మరొకరు లేనిదే మనము అనే నేను అనే మీరు లేరని అర్థం చెప్పుకోవాలి కదా? మనమంతా పెద్ద గుంపులో ఎవరికి వాళ్లం ప్రత్యేకంగా గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాము. పెద్ద గుంపులో నీవు ఒకడివి అంటే ఎవరికీ నచ్చదు. సామాన్య మానవుడు అన్న వ్యక్తి కాగడా పెట్టి వెతికినా కనిపించడు.
మన గురించి మనం తెలుసుకోవాలి. తరువాత మిగతా సంగతులు వస్తే వస్తాయి. అవసరం లేదు అనుకుంటే ఉండిపోతాయి. నేను జంతుశాస్త్రం చదువుకుని తరువాత మనిషి జెనెటిక్స్ గురించి పరిశోధించాను. మనిషి గురించి ఆలోచించడం అర్థం చేసుకోవడం అవసరమని నాకు తోచింది. ఆ సంగతి మీ ముందు చెప్పే వెసులుబాటు నాకు పత్రిక వారు కలుగజేశారు. ఇంకేముంది. బుర్రలు తినడమే. ఊ కథ ఇంతటితో ఆగదు. మరింత ముందుకు సాగుతుంది. మీకు కనీసం అవును గదా అనిపించినా నాకు చాలు. నేను చెప్పే సంగతులన్నీ అందరికీ నచ్చాలని ఎక్కడా లేదు. అయినా చెప్పడం నా ని. తరువాత మీ దయ.

-కె. బి. గోపాలం