S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్యాసు వల్ల గుండెనొప్పి

ప్ర: ఆ మధ్య గుండెల్లో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లారు చాలా ఖర్చు చేయించాక ‘ఏమీ లేదు. గ్యాస్ ట్రబుల్ అంతే’ అన్నారు. మధ్యతరగతి ప్రజల చేత అంతంత ఖర్చు చేయించి ఏమీ లేదనటం న్యాయమా? నిజంగా గ్యాసు నొప్పి అయితే అలాంటి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
-సీతామహాలక్ష్మి (నవులూరు)
జ: కడుపులో గ్యాసు పెరిగి గుండె మీదకు ఎగదట్టి గుండెనొప్పి రావటం ఒక్కోసారి హార్ట్ ఎటాకేననిపించి చాలా భయాన్ని కలిగిస్తుంది. ఆ భయం నిజంగానే హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తుంటుంది.
కూర్చున్న వాడికి కూర్చున్నట్టుగా గుండెనొప్పి వస్తుంటుంది. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు. అంతలోనే ఈ నొప్పి వచ్చింది.. అంటూంటారు. గుండె పట్టేసినట్లుంటుంది. గుండెల్లో పొడిచినట్టుగా నొప్పి వస్తూంటుంది. గుండె పరిసర ప్రాంతాల్లో మంటగా అనిపిస్తుంది. ఈ మంట, నొప్పి నెమ్మదిగా కడుపు దాకా వ్యాపిస్తాయి.
కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, గ్యాసు బయటకు పోతూ ఉండటం, ఆకలి లేకపోవటం, వాంతి, వికారం ఇవన్నీ అనుబంధంగా ఉండవచ్చు. ఉండాలనే నియమం ఏమీ లేదు.
పొట్ట్భాగంలో గానీ లేదా పేగుల్లో కానీ గ్యాసు పోగయి పైకి ఎగదట్తుంది. దాని ప్రభావం గుండె, ఊపిరితిత్తుల మీద వత్తిడి కలిగిస్తుంది. దానివలన గుండె నొప్పి, తదితర బాధలు కలిగిస్తాయి. మెడులోకి, భుజాల్లోకి, చేతుల్లోకీ, దవడలోకీ నొప్పి పాకినట్టు వస్తుంది. ఊపిరందనట్టు అవుతుంది. భయం వ్యాపిస్తుంది. చెమటలు పోస్తుంటాయి. ఒళ్లంతా తేలిపోతున్నట్టవుతుంది. వాంతి అయితే బావుణ్ణనిపిస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. గ్యాసు నొప్పికీ, గుండె నొప్పిడీ తేడాని చూడంగానే గుర్తుపడటం కష్టంగా ఉంటుంది. అందుకని గ్యాసునొప్పిని కూడా ఎమర్జెన్సీ పరిస్థితిగానే భావించాలి. ఆ సమయంలో ఐసియూలో ఉంచటం లాంటి చికిత్సా జాగ్రత్తలన్నీ హార్ట్ ఎటాక్‌కి సంబంధించినవిగానే ఉంటాయి. ఒక్కోసారి అవి తప్పకపోవచ్చు కూడా!
ఇవన్నీ అలా ఉంచితే, గ్యాసు నొప్పి సాధారణంగా దానికదే ఉన్నట్టుండి వచ్చేది మాత్రం కాదు. దానికి పూర్వరూపాలు చాలా ఉన్నాయి. గ్యాసు నొప్పి రావటానికి అజీర్తి ముఖ్య కారణం బలమైన జీర్ణశక్తి లేకపోవటం ఈ పరిస్థితికి దారితీస్తుంది. కష్టంగా అరిగే ఆహార పదార్థాలు, పుల్లని పదార్థాలు, మసాలాలూ, ఊరుగాయలూ అధికంగా తినేవారికి వాటిని తట్టుకుని అరిగించగల జీర్ణశక్తి ఉంటే ఎలాంటి ఇబ్బందీ రాదు. కానీ జీర్ణశక్తికి మించి కఠిన పదార్థాలు తిన్నప్పుడు అవి కడుపులో ఆమ్లాల్ని కలిగిస్తాయి. కడుపులో పెరిగిన ఆమ్లం గొంతు నుండి కడుపు దాకా ఉండే పేగు మొదటి భాగం అయిన ‘ఈసోఫేగస్’లోకి పైకి చొచ్చుకొస్తుంది.
చేతి మీద యాసిడ్ పడితే నిప్పు పడినట్లే కాలిపోతుంది కదా! కానీ, కడుపులో పెరిగిన ఈ ఆసిడ్ అంత శక్తిమంతమైనది కానప్పటికీ సున్నితమైన అవయవం కాబట్టి ఈ యాసిడ్ వలన ఆ భాగం అంతా మంట పుడ్తుంది. ఈసోఫేగస్ అనేది గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఉండే అవయవం కాబట్టి అక్కడ ఏర్పడే మంట గుండెలో మంటగానే అనిపిస్తుంది. దీనే్న ‘హార్ట్ బర్న్’ అంటారు. దీన్ని అశ్రద్ధ చేయటం వలన అది గుండెనొప్పికి దారితీస్తుంది.
శరీరానికి సరిపడని ఆహార పదార్థాలు తిన్నప్పుడు పొట్టలో గడబిడ మొదలౌతుంది. కడుపు అప్‌సెట్ అయ్యిందంటారు దీనే్న. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నప్పుడు కడుపు మరింత అప్‌సెట్ అయి కడుపులో అదనంగా గ్యాసు ఏర్పడుతుంది. ఈ గ్యాసు గుండెనొప్పి రావటానికి కారణం అవుతుంది.
జీర్ణశక్తి అనేది జఠరాగ్ని బలం మీద ఆధారపడి ఉంటుంది. జఠరాగ్ని అంటే కట్టెపుల్లలు వెలిగిస్తే మండే అగ్ని కాదు. అది కొన్ని ఎంజైములు, ఇతర రసాయనాల సమ్మేళనం. అవి సమస్థితిలో ఉన్నపుడు జీర్ణశక్తి బలంగా ఉంటుంది. అవి పెరిగినా తగ్గినా జీర్ణశక్తి విషమిస్తుంది. ఈ విషమించటం అనేదే గ్యాసు గుండెనొప్పికి దారి తీస్తుంది.
విషదోషాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడి ఈ పరిస్థితి రావచ్చు. అతిగా కూల్‌డ్రింక్స్, ఏరియేటెడ్ పానీయాలు తాగేవాళ్లకు తప్పనిసరిగా కడుపులో గ్యాసు ఉత్పత్తి పెరుగుతుంది. అది గ్యాసు గుండెనొప్పికి దారి తీస్తుంది. వీటి వలన జ్వరం, వికారం, వాంతి, నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాల్లాంటి లక్షణాలు కూడా కలగవచ్చు. రంగులు, కృత్రిమ తీపి పదార్థాలు, కృత్రిమ సుగంధ ద్రవ్యాలు కూడా ఈ పరిస్థితిని తేవచ్చు. నిల్వ వుండేందుకు కలిపే యాసిడ్లు కూడా చెడు చేస్తాయి.
పర్వతాలు ఫలహారం చేయగలంత ఆకలి ఉన్నవాడు ఎక్కడ ఏది తిన్నా శరీరం దాన్ని హరాయించుకుంటుంది. ఏమీ కాదు. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికే ఇబ్బందులు వస్తాయి.
ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలనేది నిజమే గానీ, ఒక్కోసారి అతిగా పీచు పదార్థాలు తిన్నప్పుడు కడుపులో గ్యాసు ఉత్పత్తి పెరుగుతుంది. ఆహారంలో పీచు కూడా త్వరగా అరిగిపోయేదిగా ఉండాలి. అరగకపోతే అది పేగుల్లోపల ఎక్కువసేపు నిలబడిపోతుంది. దాని చుట్టూ బాక్టీరియా చేరి జరిపే రసాయన చర్యల వలన గ్యాసు పుడుతుంది. పీచు మాత్రమే కాదు, ఏ ఆహార పదార్థం జీర్ణం కాకుండా మిగిలిపోయినా లేక ఆలస్యంగా జీర్ణం అవుతున్నా అది కడుపులో గ్యాసు పుట్టడానికి కారణం అవుతుంది. యాసిడ్ కలిసి పేగుల్లో మిగిలిన పక్వాపక్వ ఆహారం పులిసిపోతుంది. అందులోంచి గ్యాసు పుట్టి ఇన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.
నలుగురు స్నేహితులు హోటల్‌కు వెళ్లి ఒక ముంతడు బిర్యానీ తీసుకుని నలుగురూ పంచుకు తిన్నారు. తిన్నాక, ఆ నలుగురిలో ఒకడికి కళ్లు తిరిగితే, ఒకడికి వాంతులై నీరసించిపోతే, ఒకడు స్పృహ తప్పిపడిపోతే, నాలుగో వాడు మిగిలిన ముగ్గుర్నీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఒకే ఆహార పదార్థం ఇలా నలుగురి మీద నాలుగు రకాల ప్రభావాలు ఎలా చూపించింది? ఇదంతా వాళ్లవాళ్ల జీర్ణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లలో బాగా బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవాడు స్పృహ తప్పిపోయాడు. మనం ఇందాక అనుకున్నట్టు పర్వతాలు ఫలహారం చేయగలవాడు తక్కిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
పేగులలో ఏర్పడే వాపు, పేగుపూత, షుగరు వ్యాధి కూడా ఈ పరిస్థితి రావటానికి కారణాలే. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు కూడా గుండెనొప్పికి కారణం కావచ్చు. చలి, జ్వరం, కడుపులోనొప్పి, విరేచనం రంగు తక్కువగా అవటం, వాంతి, వికారాలు ఈ వ్యాధిలో అనుబంధంగా ఉంటాయి.
గుండెలో నొప్పిగా ఉన్నప్పుడు బయట నుంచి చూసి ఇది గ్యాసు నొప్పి అయ్యుంటుందనుకోవటం ప్రమాదకరం. ఇసిజి లాంటి గుండె పరీక్షలు చేసి, హార్ట్ అటాక్ కాదని నిర్ధారించటం మనకే మంచిది. డాక్టర్‌గారికి ఆ అవకాశం రోగి ఇవ్వాలి. చాలామంది మామూలు గ్యాసు ట్రబులేనని, డాక్టర్లు అనవసరంగా భయపెడ్తున్నారనీ అనుకొంటారు. హార్ట్ ఎటాక్ కాదని నిర్ధారించటం కూడా అవసరమే కదా!
వైద్య సహకారం అందేవరకూ రోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
భయపడకుండా స్థిరంగా ఉండి వైద్యుడితో మాట్లాడటం మొదటగా చేయవలసిన విధి. రోగి బంధువులు రోగిని కంగారు పెట్టకుండా త్వరగా ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేయాలి. ఎంత త్వరగా చికిత్స మొదలైతే అంత ప్రాణాపాయం తప్పుతుంది.
గుండెనొప్పి రాగానే గోరువెచ్చటి నీళ్లు తాగండి. గ్యాసుని తగ్గించుకునేందుకు ఇది తోడ్పడుతుంది. పులవని పలుచని మజ్జిగ లేదా మజ్జిగ మీద తేట సహాయపడుతుంది. అతి చల్లగా ఉన్నవి ఆ సమయంలో తాగకండి. గ్యాసు ఎక్కించిన కూల్‌డ్రింక్‌లు, సోడాలు తాగకూడదు. ధనియాల నీళ్లుగానీ, జీలకర్ర నీళ్లు గానీ గోరువెచ్చగా తాగితే గ్యాసు త్వరగా తగ్గుతుంది. కాఫీ టీలు కూడా ఆ సమయంలో తాగకండి.
కాసేపు అటూ ఇటూ నడిస్తే గ్యాసు సర్దుకుంటుంది. అపాన వాయువులు వెడుతుంటే ఆపుకోవటానికి ప్రయత్నించకుండా వాటిని వెళ్లనివ్వండి. యంటాసిడ్స్, తినే సోడా ఉప్పు లాంటివి కూడా కొంత సహకరిస్తాయి. గ్యాసు వంటింట్లో పుష్కలంగా ఉండాలే గానీ, కడుపులో ఉండకూడదు. మందులు మందుల షాపుల్లో ఉండాలేగానీ, అవన్నీ మన కడుపులో ఉండకూడదు. తరచూ గ్యాసు గుండెనొప్పి వస్తున్న వాళ్లు జీర్ణశక్తిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. అయిన దానికీ కాని దానికీ అనవసరంగా మందులు మింగే అలవాటు మానుకోవాలి. జంక్‌ఫుడ్స్, వేగాహారాల మీద వ్యామోహం వదులుకోవాలి. రంగు రసాయనాలు, కృత్రిమ సుగంధాలు కలిపినవి తినకండి. జీర్ణశక్తిని ఇవన్నీ చంపేవేనని గుర్తించాలి.

- డా. జి.వి.పూర్ణచందు 94401 72642