S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంటో తీరు

మంటో బతుకు కూడా అదుపు లేకుండానే జరిగింది. అతను తెగ తాగేవాడంటారు. ఒక వ్యాసంలో అతనే రోజుకు ఒక సీసా మాత్రమే తాగానని రాసుకున్నాడు. ఒక కథలో మాత్రం ఒకేనాడు పదిహేను కాయలు లాగించినట్టు కూడా రాస్తాడు. బతుకు, రచనలు అతడిని భయపెట్టిన జాడలు కనిపించవు. ‘అవలక్షణాలు, అనారోగ్యాలు, అపభ్రంశాలు అన్నీ కలగలిసి ఉన్న నా పాత్రలను నేను నావిగా అంగీకరిస్తున్నాను’ అంటాడు మంటో. అతను 42 సంవత్సరాల వయసులోనే వెళిపోయాడు. అయినా, ఇవాళటి వరకూ అందరినీ తన గురించి ఆలోచించే రకంగా రచనలను వదిలి వెళ్లాడు. చదువుకున్నది అంతంతే అయినా, ఇంగ్లీష్ మీద వల్లమాలిన అభిమానం చూపించాడు. ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాన్ని కూడా అంత అభిమానంగానూ చదివాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే, రైల్వేస్టేషన్‌లో బుక్‌స్టాల్ నుంచి పుస్తకాలను దొంగిలించాడు కూడా! విక్టర్ హ్యూగో, ఆస్కర్ వైల్డ్, ఆంటన్ చెఖోవ్ రచనలను అనువదించాడు కూడా. ఆ తరువాత అతనికి వాళ్లలాగ తాను కూడా రాయవచ్చును అనిపించినట్టు ఉంది. ఇక ఆగకుండా 24 సంవత్సరాలపాటు 22 కథా సంకలనాలు, 5 రేడియో నాటకాల సంకలనాలు, 3 వ్యాస సంకలనాలు ప్రచురించాడు. బొమ్మలు కూడా గీశాడు. ఒక నవల రాశాడు. ఏడు, ఎనిమిది సినిమాలకు కథ, మాటలు రాశాడు. అంత తక్కువ కాలంలో అన్ని రచనలు చేశాడంటే, అతనికి అడుగడుగునా కథావస్తువు కనిపించి ఉంటుంది. సమాజంలో అంతటా కుళ్లు ఉండనే ఉన్నది. దాన్ని గురించి అంత విస్తృతంగానూ, వివరంగానూ రాయగలగడం అసలు గొప్ప! ఆ పని చేశాడు గనుకనే, మంటో రచనలను వదలకుండా చదువుతున్నారు. వాటి గురించి చర్చిస్తున్నారు.
అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో అర్థమనస్కంగా చదువుకుంటున్న రోజుల్లోనే మంటో ప్రోగ్రసివ్ రైటర్స్ అసోసియేషన్‌లో చేరాడు. భారతీయ సాహిత్యమంతా రాజుల బూజు పద్ధతిలో సాగుతున్నదని దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని సంఘం వారు ప్రచారం చేస్తున్న భావనలకు మంటో తానూ భుజం కలిపాడు. అందరి పంథాలోనే తానూ రచనలు చేశాడు. అయినా, స్వంత ఆలోచనలు గల సాదత్ త్వరలోనే సంగతి అర్థం చేసుకున్నాడు. ‘బూ’ అంటే వాసన అని అర్థం. ఈ పేరుతో మంటో ఒక విచిత్రమయిన కథ రాశాడు. అది అతని అసలయిన రచనా క్రమానికి శంఖుస్థాపన రాయిగా గుర్తించదగిన కథ. ఈ కథ చదవని వారికి ఇప్పుడయినా గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. కథలో ఇద్దరే మనుషులు. రణ్‌ధీర్ అన్న ఒక ధనిక యువకుడు. మరొక నిమ్న వర్గపు అమ్మాయి. నిజానికి వారు మాట్లాడుకోరు. ఒక వర్షపు రాత్రి ఆ అమ్మాయి రణ్‌ధీర్ ఇంట్లో ఆశ్రయం తీసుకోవలసి వస్తుంది. పరిస్థితులు వాళ్లు భౌతికంగా కలిసే వరకూ దారి తీస్తాయి. వర్షంలో తడిచి లోపలికి వచ్చిన అమ్మాయి వణుకుతూ ఉంటుంది. మరే భావమూ లేకుండా, కేవలం జాలితో అబ్బాయి ఆమెకు పొడి బట్టలు ఇస్తాడు. అమ్మాయి వణుకుతూ తడి బట్టలను విప్పుకోవడంలో తడబడుతుంది. యువకుడు సాయం చేయడానికి వెళతాడు. అక్కడ మంటో కథను నడిపించిన తీరు మరొకరికి చేతగానిదిగా కనపడుతుంది. మొత్తానికి రణ్‌ధీర్‌కు ఆ అమ్మాయి వాసన మనసులో మిగిలిపోతుంది. ఆ వాసన బాగుంటుంది, బాగుండదు. అది ఆమె బాహు మూలాల్లో, తల వెంట్రుకల్లో, ఎదలో, ఒళ్లంతా గుప్పుమన్నదని అతను అనుభవం చెపుతాడు. జరిగినదంతా ఒళ్లు తెలియని తమకంలో జరిగింది. తెలివిలోకి వచ్చిన తరువాత కూడా, ఆ వాసన అతగాణ్ణి వదలదు. అది అతనికి వర్షాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ రాత్రి అందిన అనుభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ చివరకు వస్తుంది. రణ్‌ధర్ ఒక గొప్ప ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె అన్ని రకాలా అతనికి తగిన జోడు. అయినా, అందరినీ ఆకర్షించిన ఆ నవ వధువు నాయకునిలోని మగటిని మాత్రం ఆకర్షించలేక పోతుంది.
ఉర్దూ కథా సాహిత్యంలో సాదత్ హసన్ మంటో స్థానం గురించి వర్ణించడం సులభం కాదు. మంటోతో సమానంగా ప్రభావం చూపిన రచయితలు మరెవరూ కనిపించరు. సాహిత్యంలో అతని తిరుగుబాటు పద్ధతి మరెవరికీ చేతకాలేదు. అతను రాసిన భాష, అతని పేరు తప్ప అతడిని ఒక మతానికి పరిమితం చేయడానికి ఆధారాలు కనిపించవు. నిజానికి ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదు. అది సైనికుల అవసరాల కోసం పుట్టిన ఆధునిక భాష. అందులో అభివ్యక్తి అందుకే సులభంగా వీలయింది! ఆ భాషను వాడుకుని మంటో అన్ని మతాలలోని నమ్మకాలను కడిగే ప్రయత్నం చేశాడు. అతనికి మతమంటూ ఉంటే అది మానత్వం మాత్రమే. బడుగు మనుషులు అతనికి దగ్గరి వాళ్లు, బాధలు అతను ఎత్తిచూపిన సత్యాలు. మంటో దేశ విభజనను ఒక మతం దృష్టి నుంచి చూడలేదు. ఒక భాష దృష్టి నుంచి అంతకన్నా చూడలేదు. కేవలం విభజనను ఒక బాధాకర సంఘటనగా మాత్రమే చిత్రించాడు. అప్పుడు జరిగిన దుండగాలు, రక్తపాతాలు, మానభంగాలు, నగరాల నాశనాలు, అతడిని భూకంపంలా కదిలించాయి. అదే కాలంలో అప్పటి పరిస్థితులను గురించి కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేదీ, అహ్మద్ నదీమ్ ఖాస్మీ, ఇస్మత్ చుగ్తాయి లాంటి వాళ్లు చాలా రచనలు చేశారు. అయినా, అప్పటి పరిస్థితులు మంటో రచనలలో కనిపించినంత స్ఫుటంగా మరెవరి రచనల్లోనూ రాలేదు. మతం పేరిట మనుషులను విడదీయటం మంటోకు నచ్చలేదు. సంస్కృతిని, నాగరికతను, కలలను, మాట, ఆట పాటలను పంచుకోవడం కుదరదన్నది అతని వాదన. ఆ విషయాలనే తన పద్ధతిలో చెప్పాడు. ‘టోబా టేక్‌సింగ్’ అన్న కథను ఇవాళట వరకు ప్రపంచం మరవలేకపోతున్నది.
మంటో కథలన్నీ ఇంటర్‌నెట్‌లో దొరుకుతున్నాయంటే, అతని ప్రభావం గురించి, అది నేటి వరకూ కొనసాగుతున్న తీరు గురించి అర్థమవుతుంది. మంటో మాత్రం ఈ ప్రభావాలను గురించి ఆలోచించనే లేదు. తాను నమ్మిన విషయం గురించి దేవునితోనయినా తలపడేందుకు సిద్ధమేనన్నాడు. ‘లక్ష మంది ముస్లింలు, లక్ష మంది హిందువులు ఆ సమయంలో హతులయ్యారు అనకండి. రెండు లక్షల మంది మానవులు పోయారు అనండి’ అంటాడు అతను ఒకచోట. దేశం విడిపోయినప్పుడు అంత మంది చావవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అందునా, ఏ సంబంధం లేని అమాయకులు చావడం అంతకన్నా అర్థంకాదు. ఒక మతం వారిని చంపిన మరొక మతం వారు ఆ మతానే్న చంపిన భావంతో సంబరం చేసుకున్నారేమో! కానీ, మతాన్ని తుపాకులతో చంపడం వీలయ్యే పనికాదు అని కూడా మంటో అంటాడు.
అతని కథలో అప్పట్లో చాలామందికి అర్థం కాలేదన్న అనుమానం పుడుతుంది. ప్రభుత్వం వారు మాత్రం బూతులు అంటూ ప్రతిబంధకాలు వేశారు. అటు రచయితకు, ఇటు పాఠకునికి అనవసరంగా కాలయాపన అన్నారు. కోర్టు కేసులు చాలాకాలం నడిచాయి. ఇస్మత్ కూడా లాహోర్ వెళ్లి మంటోతోబాటు అక్కడే తన కేసు గెలిచింది. మంటోకు పెద్ద జుర్మానా వేశారు. జుర్మ్ అంటే నేరం. నేను నేరం చేయలేదంటూ మంటో మళ్లీ కోర్టుకెక్కాడు. ఆ కేసు నిర్ణయించవలసిన జడ్జ్ మంటో మతానికి చెందినవాడే. సముద్రంగా చేరిన రక్తంలో నుంచి పశ్చాత్తాపం అనే ముత్యాలు కనీసం బయటికి రావాలన్నాడు మంటో. ఆ మాట ప్రజలకు పట్టలేదు. మొత్తానికి జడ్జ్ కేసును కొట్టివేశాడు. లేకుంటే, ఒక గడ్డం వాడు నాకు శిక్ష వేశాడని మంటో ఒక కథ రాస్తాడు అంటూ, ఆ జడ్జ్ చమత్కరించాడు.
1955లో మంటో మరణించాడు. అంతకు కొంతకాలం ముందే అతను ‘పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లు తనను మెచ్చి తన శవపేటిక మీద ఒక మెడల్ పెడతారంటూ, అది తనకు అవమానంగా నిలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వం అంతపనీ చేసింది! మంటో శతజయంతి సంవత్సరంలో అతనికి ‘నిషాన్ -ఎ- ఇమ్‌తియాజ్’ అనే బిరుదుతో పతకాన్ని ఇవ్వనే ఇచ్చింది.
మంటో భారతీయుడు కాడంటే అన్యాయం. అతన పాకిస్తానీ అన్నా అన్యాయమే. మంటోకు ఒక దేశం లేదు. ఒక మతం లేదు. మానవత్వమే అతని మతం. మంచి అన్నదే అతని తీరు.

-కె. బి. గోపాలం