కాశీ అను వారణాసి
Published Saturday, 28 November 2015పెళ్ళిళ్ళలో ఒక తంతు జరుగుతుంది. స్నాతకం అని ఒక కార్యక్రమాన్ని జరిపి, బ్రహ్మచారికి గోచీ పెట్టి ధోవతీ కట్టిస్తారు. దారి బత్తెం, పుస్తకాలు, గొడుగు పుచ్చుకుని అతను ఇక కాశీకి వెళతానని బయలుదేరతాడు. కాబోయే బావమరిది అడ్డం వచ్చి మా ఇంటి అల్లుడివి కావయ్యా అని అడుక్కుని పెళ్లిపీటల మీదకు తీసుకుపోతాడు. స్నాతకానికి, పెళ్లికి సంబంధం లేదు. యూనివర్సిటీల్లో జరిగే పట్టా ప్రదాన ఉత్సవాన్ని స్నాతకం అంటారు. మాస్టర్ చదువును స్నాతకోత్తరం అంటారు. మొదటి స్థాయి చదువును బ్యాచిలర్స్ అంటే, బ్రహ్మచారి స్థాయి అంటారు. అది జరిగిన తరువాత విద్యార్థికి గుర్తింపు, ముందు దారి దొరుకుతుంది. పాత కాలంలో పై చదువు అంటే, కాశీ వెళ్లడమే. కాదంటే నలందా. అప్పుడు మరొక చోటు ఆ కాలంలో జరిగిన క్రమాన్ని ఇప్పటి పెళ్లిళ్లలో సరదాగా నాటకంగా ఆడుతున్నారని ఆ పనులు చేయిస్తున్న పురోహితులకు కూడా అర్థమయి ఉండదు. అందుకే, వారణాసిలో మా పర్యటన యూనివర్సిటీతో మొదలయింది.
ఉస్మానియా, వేంకటేశ్వర, కాకతీయ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలను చూచిన వాళ్లకు యూనివర్సిటీలన్నీ ఇట్లాగే విశాలమయిన ప్రదేశంలో ఉంటాయి అనిపిస్తుంది. కానీ, వీటిలోని ఒక కాలేజీ ఉన్నంత ప్రదేశంలోనే ప్రస్తుతం, గతంలో కూడా మొత్తం యూనివర్సిటీలను పెట్టుకున్నారు. బనారస్ యూనివర్సిటీ ఆవరణ పెద్దది. గతంలో ఎట్లుండేదోకాని, ఇప్పుడు దగ్గర దగ్గరగానే చక్కని భవనాలు వచ్చాయి. స్కూల్స్ పద్ధతిలో ఒక్కొక్క సబ్జెక్ట్‌కు సంబంధించిన విభాగాలు ఒక చోట అందంగా అమర్చబడి ఉన్నాయి. వాతావరణం బాగుంటే, చదువు సంతోషంగా జరుగుతుందని, పెద్దలంతా పాతకాలం నుంచి పచ్చని ప్రకృతి మధ్యన విద్యాభ్యాసం జరిపించారు. ఇక్కడ యూనివర్సిటీలో కూడా చక్కగా చెట్లు పెంచిన తీరు చాలా బాగుంటుంది. ఈ యూనివర్సిటీ పుట్టుక గురించి ఒక కథ విన్నాను. పుస్తకాలలో ఆ కథ నాకింకా ఎదురుకాలేదు. ఆ రకం పుస్తకాలు బహుశా నాకు అందలేదు. మదనమోహన మాలవీయాగారు అసలు సిసలయిన బ్రాహ్మణుడు. ఆయన బహుశా మోతీలాల్ నెహ్రూగారి ఇంట్లో అనుకుంటాను, తద్దినానికి భోక్తగా విచ్చేశారు. శ్రాద్ధంలో ఒక పద్ధతి ఉంది. భోజనాలు జరిగిన తరువాత యజమాని ఆ భోక్తలను పద్ధతిగా సంతృప్తులయినారా అని అడుగుతాడు. భోక్తలు అవును అంటే అప్పుడు ఇంటి వారు వచ్చిన బంధువులతో సహా ఇష్టపంక్తిగా భోజనాలు చేస్తారు. మిగిలిన పదార్థాలను అట్లా పంచుకు తినమని భోక్తల చేత పద్ధతిగా చెప్పిస్తారు కూడా! సంతృప్తి గురించి అడిగితే, మదనమోహన పండితుడు ఆకాశం చూస్తూ కూచున్నాడట! ఆయన సంతృప్తి చెందనిదే, కార్యక్రమం ముగిసే వీలులేదు. ఏం కావాలని అడిగితే, మన పిల్లల పెద్ద చదవులకు చక్కని విశ్వవిద్యాలయం మీలాంటి వారు పూనుకుంటే, ఏర్పడుతుంది అన్నారట. ఇంకేముంది, యూనివర్సిటీ పుట్టింది! దానికి పెట్టిన పేరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం.
నిజానికి మేము యూనివర్సిటీకన్నా ముందే విశ్వనాథ మందిరం చూచినట్టున్నాము. రాజకీయాలు, దుర్మార్గాల కారణంగా ఈ మధ్యనే పెద్ద గుడికి వెళ్లాలంటే పెద్ద జైలుకు వెళ్లినదానికంటే అన్యాయంగా ఉంటున్నది. ఫోన్‌లు ఉండకూడదు. నాలుగుసార్లు జేబులు తడిమి చూస్తారు. అయోధ్యలో లాగే మనుషులు బోనులో కదులుతూ ముందుకు సాగాలి. పైగా, విశ్వనాథ ఆలయం ఉన్నచోటు విచిత్రంగా ఉంటుంది. శ్రీరంగంలోని ఏడు ప్రాకారాలు, తిరుమలలోని మూడు ప్రాకారాలు మిగతా గుడులను ఊహించుకుని కాశీ విశ్వనాథుని చూడమోతే ఆయనకన్నా ముందు ఆశ్చర్యం ఎదురవుతుంది. ఇవన్నీ సందులూ గొందులూ! వాటిలో ఇళ్లు, మనుషులు, అంగళ్లు, పట్టుచీరలు, ఆ మధ్యలో అమ్మవారు, అయ్యవారు. స్వామి వారికి పత్రం, పుష్పం, ఫలం, తోయం తప్ప మరోటి ఇవ్వలేము. ఆ పూలు, నీళ్లు అమ్మే మనుషులు ‘అయిదు రూపాయలు’ అని అరుస్తూ ఉంటే, అయోధ్యలో లాగే ఆశ్చర్యం మరోసారి ఎదురయింది. కాశీకి కూడా తెలుగువాళ్లు ఎక్కువగా వస్తారన్నమాట! కొంచెంపాటిగా తోసుకుంటూ లోపలికి వెళితే, ఒక చిన్న అంతరాళంలో చాలా చిన్న విశ్వనాథులు అడుగున కనిపించారు. సందుల్లో అన్నపూర్ణమ్మను వెతుకుతూ వెళితే, అక్కడ ముత్తయిదువులు చుట్టూ కూచుని ఆనందంగా కుంకుమార్చన చేస్తున్నారు.
వారణాసిలో సంకటమోచన హనుమాన్ మందిరం ఉంది. చూడండి అని చెప్పారు. కనుక బయలుదేరాము. హనుమంతుడికన్నా మధ్యలో ఎదురయిన పెరుగు, లస్సీ గురించి ముందు చెప్పుకోవాలి. మన ప్రాంతంలో వేడి, చలి అంతంత వరకే ఉంటాయి. ఎండలు మండుతున్నా, అందరూ టీ, కాఫీలు తాగడమే ఇష్టపడతారు. మన దగ్గర పాలులేవని కాదు. పాలు తాగే అలవాటు, పెరుగు తినే అలవాటు మాత్రం లేవు. కాశీలో అంగళ్లలో మట్టి మూకుళ్లలో పెట్టి ఉంచిన పెరుగు గట్టి ఆకర్షణగా కనిపించింది. ఇరవయి రూపాయలకు చట్టి నిండా పెరుగు వేసి, అంత వెడల్పు మీగడ తరక వేసి ఇస్తున్నాడు. ఆచారానికి ఆచారం, సుఖానికి సుఖం. మా వాళ్లందరూ విజృంభించి లాగించడం మొదలుపెట్టారు. కొట్టుపెట్టుకున్నాయన లస్సీ గురించి చెప్పాడు. అదే పెరుగుతో అంతకన్నా రుచిగల లస్సీ అదే ధరలో ఇచ్చాడు. మళ్లీ రౌండ్లు మొదలయ్యాయి. ఆ పూట తిండి అడగలేదు! మరి తిన్న పెరుగు అరగలేదు!
హనుమాన్ మందిరం చేరాము. అది ఇటీవల కట్టినట్టు కనిపించింది. పెద్ద ఆవరణ కూడా ఉంది. అయినా కారు మాత్రం దూరంగా పెట్టవలసి వచ్చింది. అక్కడ రక్షణ ఇబ్బంది సిబ్బంది అంతగా లేదు. జనం మాత్రం తొడతొక్కిడిగా ఉన్నారు. బహుశా మంగళవారమేమో! అన్నింటికన్నా ఆశ్చర్యం గుడి ఆవరణలోనే గుడి యాజమాన్యం వాళ్లే నడుపుతున్న మిఠాయి అంగడి. వచ్చినవాళ్లంతా పావుకిలో మొదలు పలు కిలోల దాకా అట్టపెట్టెలు మొదలు, బుట్టల దాకా మిఠాయిలు పట్టుకుపోతున్నారు. అవి హనుమయ్యకు చూపించడం ఆ తర్వాత హాయిగా తినడం. మిఠాయి అంగడిలో కనీసం పది మంది పనివాళ్లు సుడిపడుతూ, పెట్టెలు, బుట్టలూ అందిస్తున్నారు. నాకీ వ్యవహారం నచ్చింది. అయోధ్యలోలాగే, వారణాసిలో కూడా బోలెడంత మంది చుట్టాలున్నారు. అంటే హనుమయ్యలు ఉన్నారు. అంటే కోతులూ ఉన్నాయి. మావాడు ఒకడు చేతిలోని మిఠాయి పొట్లాన్ని ఒక కోతిగారి ముందు ఉంచాడు. బంధువులను గౌరవించాలి కదా! ఆ కోతి మా అమాయకుడి వేపు చూచిన చూపు నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ‘పోవోయ్, మా మిఠాయి మాకేం పెడతావు?’ అని ఆ కోతి అన్నట్టు వినిపించింది! అది మిఠాయి ముట్టుకోలేదు. అరటి పండు ఇస్తే మాత్రం, అందుకున్నది.
మావాళ్లు తిని కుడవడానికి తీర్థం వెళ్లాలి అంటారు. అంటే, యాత్రకు బయలుదేరిన వాళ్లు ఆచారాలు, మడులు పట్టించుకోకుండా దొరికినచోట తినవచ్చునని నా వ్యాఖ్యానం. నేను ఎడ్డెంతెడ్డెం మనిషినని మావాళ్ల వ్యాఖ్యానం. మొత్తానికి పట్టుపట్టి ఆ పూట భోజనం హోటేల్‌లో జరగకుంటే కుదరదని హఠం చేశాను. తప్పక ఒప్పుకున్నారు మా గుంపువాళ్లు. ఆ ఊళ్లో మన దగ్గరలాగ ప్లేటు భోజనాలు పెట్టే హోటేళ్లు ఉన్నట్టు లేదు. లేనట్టు ఉంది. వెతికి వెతికి ఒక అన్నపూర్ణ మందిరం పట్టుకున్నాము. అక్కడ వేడివేడి రొట్టెలతో భోజనం దొరుకుతుంది. కానీ, మడి వదలని మామగారు ఒకాయన మా మధ్యన ఉన్నారు. పాపం ఆయనకు ఆ పూట పళ్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. పెరుగు కడుపులో ఉంది కనుక, ఆయన సరేనన్నారు. భోజనం బాగుంది. అయితే, అన్నం ఒక చిన్న గినె్నలో చివరలో మాత్రం పెట్టడం మా గుంపులో కొందరికి నచ్చలేదు. అన్నింటికన్నా మించి, ఆ హోటేల్ మెనూలోని కొన్ని లైన్లు నాకు బాగా గుర్తున్నాయి. ఒక్కో రకం భోజనంలో ఉండే పదార్థాలను వివరిస్తూ, లిస్ట్‌లో నాప్‌కిన్, ప్లాస్టిక్ స్పూన్ లాంటివి కూడా రాసి ఉన్నాయి. సూపర్‌వైజర్‌ని పిలిచి ఇవన్నీ కూడా తినే రకమా అని అడిగాను. అతను బిత్తరపోయాడు. ఆ తరువాత అర్థం చేసుకున్నాడు. చుట్టూ ఉండే హోటేల్ గదులలో నుంచి భోజనాలకు ఆర్డర్లు వస్తాయని, ఆ క్యారియర్ భోజనంతో ఈ వస్తువులను కూడా ఇస్తామని వినయంగానే చెప్పాడు.! మొత్తానికి కొంత షాపింగ్ కూడా చేసిన తరువాత మరో ఆలోచన వచ్చింది. విమానం బయలుదేరే సమయం కొన్ని గంటల తరువాత కనుక, మళ్లీ బౌద్ధం గుర్తుకు వచ్చింది. సారనాథ స్తూపం చూడడానికి బయలుదేరాము.
గయలో బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. మాకు మాత్రం కానట్టుంది. ఈ ఎండలో పడి అంత దూరం వెళ్లాలా? అని అనుమానాలు మొదలయ్యాయి. మరే పనిలేదు కనుక, ఫరవాలేదని బయలుదేరాము. సందులు, గొందులలో ప్రయాణం సాగింది. సారనాథ స్తూపం కనిపించింది. ఆ పక్కనే మరేవో గుళ్లు కూడా ఉన్నట్టున్నాయి. ఎండయినా భరిస్తూ అంతటా తిరిగాము. అక్కడ ఒక విచిత్రమయిన చేనేత సంస్థ ఉన్నది. దాన్ని వ్యాపారులు కాక, మరెవరో నిర్వహిస్తున్నారు. అక్కడికిపోతే, నిజంగానే చవకగా బనారస్ పట్టుచీరలు అమ్ముతున్నారు. మా వాళ్లు కొంతమంది కొన్నారు కూడా.
మొత్తానికి సాయంత్రం దగ్గరపడింది. బసకు వచ్చి అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరాము. ఇది కాశీయాత్రా చరిత్ర! ఏనుగుల వీరాసామయ్యగారు రాసినది మాత్రం కాదు. ఎవరి కాశీయాత్ర చరిత్ర వారికి ఉంటుంది. ఎవరి అనుభవం వారికి ఉంటుంది. కొందరికి మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది. భవదీయునికి ఆ అవకాశం దొరికింది. అదీ సంగతి.