S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను నా భార్యని ఎందుకు చంపలేదు?

టు,
ది కౌంటీ జడ్జ్
ఫ్రం
స్టేట్ ప్రిజన్
అయ్యా,
నేను ఈ తెల్లవారుఝామున మరణశిక్షని తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం లేదని నాకు తెలుసు. నన్ను ఇంకో గంటలో ఎలక్ట్రిక్ చెయిర్‌లో కూర్చోపెట్టడానికి తీసుకువెళ్తారు. మతాధికారి ఇందాక నాకు దేవుడి గురించి, మరణానంతర జీవితం గురించి చెప్పినవేవీ నేను నమ్మను. నా భార్యని హత్య చేశాననే ఆరోపణతో శిక్షని మీరు ఖరారు చేసేప్పుడు నేను నా భార్యని హత్య చేయలేదని చెప్పాను. మీరది నమ్మలేదు. నిరపరాధిని శిక్షిస్తున్నారు.
నేను నా భార్యని ఎందుకు హత్య చేయలేదో కొన్ని కారణాలని వివరించడానికి ఈ లేఖని రాస్తున్నాను.
నేను నా భార్యని హత్య చేయకపోవడానికి ఓ కారణం, చేస్తే పోలీసులు అది తేలిగ్గా తెలుసుకుంటారని. పట్టుబడకుండా పకడ్బందీగా పథకం వేసి నా భార్యని హత్య చేసే తెలివితేటలు నాలో లేవని నాకు తెలుసు. అందుకని నేను నా భార్యని హత్య చేయలేదు. ఇంతకంటే మంచి కారణం ఇంకేముంటుంది?
నా భార్యని హత్య చేయక పోవడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నా, ఇదే ప్రధాన కారణం. నన్ను వాల్లు పట్టుకుని ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోపెట్టడం నాకిష్టంలేదు. నా తలని గొరిగి, నన్ను ఎలక్ట్రిక్ ఛెయిర్లో కూర్చోపెడితే షాక్ కోసం వేచి చూడటం దుర్భరం. ఐతే నేను నా భార్యని చంపాలని అనుకోవడం మాత్రం నిజం. మా హనీమూన్ నించి తిరిగి వచ్చిన రెండు రోజులకే నాలో ఆ ఆలోచన కలిగింది. కాని అప్పటికే 65వ ప్రిసింక్ట్ (పోలీసుస్టేషన్)కి చెందిన ఓ ఆఫీసర్ నన్ను రహస్యంగా గమనిస్తున్నాడు. అతని పేరు జాన్. ఓ రోజు నేను సెంట్రల్ పార్క్ నించి ఇంటికి తిరిగి వచ్చేసరికి ముందు గదిలో దివాన్ మీద కాళ్లు బారచాపుకుని అతను నాకు కనిపించాడు.
‘లియో! ఇతను జాన్. ఇతని పేరు నేను నీకు నిన్ననే చెప్పాను’ నా భార్య పరిచయం చేస్తూ చెప్పింది.
‘అవును. మీ గురించి తరచు మా ఆవిడ చెప్తుంటే వింటూంటాను జాన్’ నేను చెప్పాను.
జాన్ నాతో కరచాలనం చేసినప్పుడు నా వేళ్లని దాదాపు విరిచేసాడు. అతనివి ఇనప కండరాలని అనిపించింది. ఇంకా ఏ ఎడిటర్ స్వీకరించని డిటెక్టివ్ కథలని నేను రాస్తూంటానని మా ఆవిడ జాన్‌తో చెప్పింది. నా భార్య ఫ్లోరెన్స్ వండిన వంటని ముగ్గురం తిన్నాం. నా చేతివేళ్లతో ఫోర్క్‌ని సరిగ్గా పట్టుకోలేక పోయాను. భోజనానంతరం జాన్ బాగా నిషా వచ్చేంత ఎక్కువగా తాగాడు.
‘లియో! మీ టైప్‌రైటర్ దగ్గరికి వెళ్లి స్వీకరించని ఓ డిటెక్టివ్ కథని టైప్ చేయి’ నిషా వచ్చాక అతను ఎగతాళిగా నవ్వుతూ చెప్పాడు.
నేను తీవ్రంగా జవాబు చెప్తే ఫ్లోరెన్స్ నా మీద కోపంగా అరిచింది.
‘మీ ఇద్దరికీ పరిచయం అరుూ అవగానే పోట్లాట మానండి’
మేం ఆడిన రమీ ఆటలో అతను గెలవడానికి కారణం, నేను రాయబోయే కథ గురించి పరిపరి విధాల నేను ఆలోచిస్తూండటమే. ఆ రాత్రి అతను వెళ్లబోయే ముందు ఎగతాళిగా చెప్పాడు.
‘కాగితం మీది డిటెక్టివ్‌ని నిజమైన పోలీస్ ఆఫీసర్ ఇట్టే ఓడించగలడు.’
ఆ తర్వాత అతను చాలా రాత్రుళ్లు మా ఇంటికి భోజనానికి వచ్చాడు. నేను రాసిన డిటెక్టివ్ కథలని నేను లేనప్పుడు చదివి వాటి మీద జోక్స్ వేసేవాడు. అందులోని నేరాలని తను ఇట్టే పరిష్కరించగలనని నా భార్యతో చెప్పేవాడు. ఓ రోజు జాన్ నేను కొత్తగా రాసిన కథని చదివి నవ్వుతూండగా నేను ఇంటికి వచ్చాను. ఫ్లోరెన్స్ నా వంక నిరసనగా చూసింది. అతను వెళ్లాక నాతో కోపంగా చెప్పింది.
‘లియో! నువ్వు కథలని రాయడం మాని ఏదైనా మంచి ఉద్యోగం వెదుక్కోవచ్చుగా?’
వాళ్ల నోర్లు ఎలా మూయించాలా అని నేను ఆలోచిస్తూండగా రెండు సంఘటనలు జరిగాయి. నా కథకి రెండు వందల డాలర్లకి చెక్ వచ్చింది. జాన్‌కి తెలిసిన ఓ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మమ్మల్ని చూడటానికి వచ్చాడు. ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతాయని, పురుగులు కుడితేనే మనుషులు మరణిస్తున్నారని, నా లైఫ్‌ని ఇన్సూర్ చేసుకోవాలని చెప్పాడు. జాన్ కూడా నన్నా విషయంలో ప్రోత్సహించాడు. వైద్య పరీక్షల్లో నా భార్య పాసైంది కాని నేను ఫెయిల్ అయ్యాను. దాంతో ఆ డబ్బుతో ఫ్లోరెన్స్ పేరు మీద పదివేల డాలర్లకి ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఏజెంట్ చెప్పినట్లు ఆమెకి ఏదైనా జరిగి నాకా మొత్తం రావచ్చని ఆశించాను.
నా భార్య నేను హత్య చేయకపోవడానికి ఇది మొదటి కారణం. ఫ్లోరెన్స్ గుర్తు తెలీని కారణాలతో మరణిస్తే ఆ పాలసీని కారణంగా చూపించి నన్ను అరెస్ట్ చేస్తారు. ఇది నేను కోర్ట్‌లో చెప్తే మీరు నవ్వారు.
నేను నా భార్యని హత్య చేయకపోవడానికి రెండో కారణం నేనో రాత్రి ఇంటికి వచ్చేసరికి పార్టీ దుస్తుల్లో ఉన్న జాన్, ఫ్లోరిన్లు కొంత తాగి ఉన్నారు. జాన్ పుట్టినరోజు కాబట్టి దాన్ని జరుపుకోవడానికి రెస్ట్‌రెంట్‌కి వెళ్దామని చెప్పారు. ఫ్రెంచ్ ఫాలిస్ అనే రెస్ట్‌రెంట్‌కి వెళ్లాక వాళ్లు ఇద్దరూ మరింత తాగారు. జాన్ ప్రవర్తన మారింది.
‘నువ్వు నంబర్ ఒన్ డిటెక్టివ్‌వి. నేర ప్రపంచంలో రాజువి. ఈ రెండింటిలో నువ్వు ఎవరివి?’ జాన్ నన్ను ఎకసెక్కంగా అడిగాడు.
‘నోర్ముయ్’ నేను అరిచాను.
‘నేను పరిష్కరించలేని ఓ చక్కటి నేరాన్ని నువ్వు ఆలోచించగలవా?’ జాన్ ఛాలెంజ్ చేశాడు.
‘పోట్లాడుకోకండి’ ఫ్లోరెన్స్ చిరుకోపంగా మమ్మల్ని తిట్టింది.
నాకు కోపం ముంచుకు రావడంతో చెప్పాను.
‘ఆలోచించగలను. నువ్వు దాన్ని పరిష్కరించలేవు. నీ సమక్షంలోనే నేనా నేరాన్ని చేసినా నువ్వు కనుక్కోలేవు’ గట్టిగా చెప్పాను.
‘పోట్లాడుకోవద్దన్నానా?’ ఫ్లోరెన్స్ చెప్పింది.
‘ఈ టేబిల్ దగ్గర ఎవరైనా నన్ను పిలుస్తున్నారా?’ వెయిటర్ వచ్చి అడిగాడు.
అతను నా కేకలని విన్నాడని గ్రహించాక నేను అంత గట్టిగా మాట్లాడి ఉండకూడదని నాకు అనిపించింది.
జాన్ పోలీస్ డిటెక్టివ్. నా భార్య ప్రమాదవశాత్తు మరణిస్తే, అందుకు సాక్షులు, నాకు సరైన ఎలిబీ లేకపోతే ఫ్రెంచ్ ఫాలిస్‌లో నేను చెప్పిన ఆ మాటలని అతను గుర్తుంచుకుని నా మీద నేరారోపణ చేస్తాడని నాకు తెలుసు. ఇన్సూరెన్స్ మొత్తం కారణంగా అతని మాటలని ఏ జడ్జైనా తేలిగ్గా నమ్ముతాడు. నేను నా భార్యని చంపకపోవడానికి అది రెండో కారణం.
ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కాని అవన్నీ నేను మీకు చెప్పడంలేదు.
క్రమంగా నా కథలని పెద్ద పత్రికలు కూడా తీసుకోవడం ఆరంభమైంది. ఓ రోజు నేను సెంట్రల్ పార్క్‌లో నడుస్తూంటే కన్‌ఫెషన్ మేగజైన్‌కి రాసే ఓ రచయిత్రి నాకు తారసపడింది. ఆమె తన కుక్కని వాకింగ్‌కి తీసుకువచ్చింది. మా పెళ్లయ్యాక నేను ఆమెని కలవలేదు. దాంతో ఆమెని ఓ రెస్ట్‌రెంట్‌కి డ్రింక్స్‌కి ఆహ్వానించాను. త్వరలోనే నేను ఆమెకి నా భార్య గురించి, జాన్ గురించి, నా కథల మీద అతనికి చిన్నచూపు గురించి, దాన్ని నా భార్య నమ్మడం గురించి చెప్పాను. ఆమె తన సానుభూతిని తెలియజేసింది.
‘ఓ కల్పిత కథని నిజంగా జరిగినట్లుగా రాయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఓ కథలో మీరు ఓ హత్య చేయడం గురించి రాస్తారు. చివరికి హంతకుడు పట్టుబడి తీరాలి. అతన్ని ఎలక్ట్రిక్ ఛెయిర్లో కూర్చోపెట్టి కథని ముగించాలి. అది అంత ఆహ్లాదమైంది కాకపోయినా అందులో నాటకీయత ఉంటుంది’ రచయిత్రి చెప్పింది.
‘అది ఆరోగ్యకరమైన నాటకీయత కాదు. నిజ జీవితంలో ఎడిటర్‌కన్నా పోలీస్ అధికారులు తెలివిహీనులుగా రాయాలి. తన భార్యని చంపి తప్పించుకునే వాడిని గురించి కూడా రాయాల్సి ఉంటుంది.’
‘కొంపతీసి మీరు మీ భార్యని హత్య చేయాలని అనుకుంటున్నారా?’ ఆమె గట్టిగా అడిగింది.
ఆ మాటలని వెయిటర్, పక్క టేబిల్స్‌లోని కొందరు విన్నారు. నేను ఫ్లోరెన్స్‌ని హత్యచేస్తే వాళ్లు కోర్ట్‌లో నా మీద వ్యతిరేక సాక్ష్యం చెప్తారని నాకు తక్షణం స్ఫురించింది. నా భార్యని హత్య చేయకపోవడానికి ఇదో కారణం.
మిస్టర్ జడ్జ్. ఈ కారణాల వల్ల నేను నా భార్యని హత్య చేయడం మూర్ఖత్వమే అవుతుంది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన తుపాకీ బాయ్‌నెట్‌ని కొన్నాక, నేను సెకండ్ ఎవెన్యూలో కన్‌ఫెషన్ మేగజైన్ రచయిత్రిని కలిసినప్పుడు ఓ పురాతన వస్తువుల దుకాణం కిటికీలోంచి ఆ బాయ్‌నెట్ కనిపించింది. ఐదు డాలర్లు చవక అనిపించడంతో దాన్ని కొని ఇంటికి తెచ్చాను. అప్పుడు జాన్ ఇంట్లోనే ఉన్నాడు. చిత్రంగా కనిపించే దాన్ని చుట్టిన రేపర్ని చూసి ఇదేమిటని అడిగాడు. నాకు చెప్పడం ఇష్టం లేకపోయింది. ఫ్లోరెన్స్ కూడా అడగడంతో వారి ముందు దాన్ని విప్పాను.
‘దీనె్నందుకు కొన్నారు?’ ఫ్లోరెన్స్ ఆశ్చర్యంగా అడిగింది.
‘అలంకరణగా. ఎవర్నైనా చంపాలంటే ఇది ఉపయోగిస్తుందని కూడా’ చెప్పాను.
వాళ్లు నా వంక వింతగా చూడటంతో మళ్లీ చెప్పాను.
‘కథలో. ఓ కథలో హంతకుడు మాజీ సైనికుడు. దీన్ని అతను ఆయుధంగా ఉపయోగిస్తాడు’
‘్భజనం చల్లారేలోగా తిందాం లియో. ఆలస్యంగా వచ్చావు. ఎవర్నైనా కలిసావా?’ ఫ్లోరెన్స్ అడిగింది.
నాకు చెప్పడం ఇష్టంలేక చెప్పలేదు. బాయ్‌నెట్‌ని డ్రాయర్లో ఉంచి భోజనం అయ్యాక నా చిన్న గదిలోకి వెళ్లి రాసుకోసాగాను.
నేను నా భార్యని చంపకపోవడానికి ఇది నాలుగో కారణం. దాన్ని అమ్మిన వ్యక్తి, దాన్ని చూసిన జాన్ నేను బాయ్‌నెట్‌ని కొన్నానని సాక్ష్యం చెప్తారు. డిస్ట్రిక్ట్ అటార్నీ నేను ముందుగా ఆలోచించే దాన్ని కొన్నానని వాదిస్తాడు. దాంతో మరణశిక్ష తప్పదు.
అన్నిటికన్నా పెద్ద కారణం ఇది. ఎవర్నైనా చంపితే అందుకు ఓ కారణం ఉండి తీరుతుంది. నాకు ఇన్ని కారణాలు ఉన్నాక ఆమెని ఎలా హత్య చేస్తాను? ముఖ్యంగా ఇంకో కొత్త కారణం కలిసాక. ఓ రోజు ఆ రచయిత్రితో ఆమె ఇచ్చిన రైని తాగుతూ మత్తులో నేను ఫ్లోరెన్స్‌ని చేసుకోవడం ఎంత పొరపాటో చెప్పాను. నా వృత్తి మీద ఆసక్తి చూపించదు. జాన్‌కి భోజనం వండి పెట్టడంలో ఆసక్తి, నేనో చెత్త రచయిత అని జాన్ చెప్పడం గురించి చెప్పాను.
ఆమె అపార్ట్‌మెంట్ నించి నేను ఇంటికి వెళ్లాక ఫ్లోరెన్స్‌తో చెప్పాను.
‘ఇక నీకు నాకు రాంరాం. మనం విడిపోదాం’
‘లియో! జాన్, నేను ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నాం. అతను నీకో ఉద్యోగాన్ని చూసాడు’
‘జాన్ మంచి పోలీస్ ఆఫీసరై ఉండచ్చు కాని మంచి సాహితీ విమర్శకుడు మాత్రం కాదు. నా కథలని అతను ఎద్దేవా చేయడంతో విసిగిపోయాను. నువ్వు, జాన్ కలిసి నా జీవితాన్ని మలచాలని అనుకోవడంతో కూడా విసిగిపోయాను. అతను చెప్పిందే వేదం అని నువ్వు అనడం కూడా నాకు నచ్చడం లేదు. కాబట్టి విడాకులు ఇవ్వు’ కోరాను.
ఇద్దరూ నా వంక తెల్లబోయి చూస్తూంటే జాన్ మీద అరిచాను.
‘దీనంతటికీ కారణం నువ్వే జాన్. నువ్వు మా జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. ఓ అమ్మాయి పెళ్లయ్యాక ఆమె తన భర్తకి విధేయతగా ఉండాలని నీకు తెలీదా?’
వాళ్లు ఉలిక్కిపడి నా వంక నిశ్చలంగా చూస్తూండిపోయారు.
‘అంతేకాక నాకో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. రచయితగా నన్ను గౌరవిస్తుంది. మా ఇంటికి జాన్ లాంటి తెలివితక్కువ పోలీస్ ఆఫీసర్ని ఆహ్వానించదు’
ఫ్లోరెన్స్ ఏడుస్తూంటే జాన్ ఓదార్పుగా ఆమె భుజం మీద తట్టాడు. వెంటనే ఆమె అతన్ని బయటకి నడవమని అరిచింది. జాన్ తెల్లబోయి అవమానంతో వెళ్లిపోయాడు. తలుపు వేసి వచ్చాక ఫ్లోరెన్స్ నా పక్కన కూర్చుని చెప్పింది.
‘లియో, నువ్వంటే నాకెంతో ప్రేమ. ఆమెని మర్చిపో. మనం మన జీవితాన్ని సరిదిద్దుకుందాం.’
మేం డ్రాయింగ్ రూంలో కూర్చున్నాం. నా చేతిలో ఆల్కహాల్ గ్లాస్ ఉంది. పక్కనే డ్రాయర్లో బాయ్‌నెట్ కనిపించింది. తాగినా నా మనసు చక్కగా పని చేసింది. పక్క సొరుగులో ఇన్సూరెన్స్ పాలసీ కనిపించింది. మా పెళ్లైన కొత్తల్లో ఏడాది క్రితం ఫ్లోరెన్స్ వేలాడదీసిన క్రూసిఫిక్స్ కూడా గోడ మీద కనిపించింది. ఆమె భక్తురాలు. జాన్, ఆమె కలిసి ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్తారు.
‘జాన్ ఇక మనింటికి రాడు’ ఆమె చెప్పింది.
కొద్ది క్షణాల్లో తాగిన మద్యం నా తలకెక్కింది. ఆ రచయిత్రితో జీవితం నా వృత్తికి, నాకు మేలు చేస్తుందని చెప్పాను. అకస్మాత్తుగా నాకు స్పృహ తప్పింది. తిరిగి మెలకువ వచ్చేసరికి ఫ్లోరెన్స్ నా పక్కన నేల మీద పడి కనిపించింది. ఆ బాయ్‌నెట్ ఆమెలోంచి కింద చెక్క నేలలోకి దిగింది. వెంటనే నేను పోలీసులకి ఫోన్ చేశాను.
ఇంకో కొద్ది నిమిషాల్లో నేను ఎలక్ట్రిక్ ఛెయిర్లో కూర్చోబోతున్నాను. కాని నేను నా భార్యని చంపలేదు. చంపి ఉంటే నేను గొప్ప మూర్ఖుడ్ని. అందరికీ అదే చెప్పాను. విన్న అంతా నవ్వారు. నేను ఆమెని చంపక పోవడానికి కారణం ఇన్సూరెన్స్ పాలసీ అని, అది నన్ను మొదటి అనుమానితుడ్నిగా చేస్తుందని, ఫ్రెంచ్ ఫాలిస్లో నేను అరిచిన మాటలు, బాయ్‌నెట్ కొనడం... వీరంతా నేను ఊహించినట్లుగానే కోర్టుకి వచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. విడాకులు ఇవ్వను అన్నందుకు నేను నా భార్యని చంపానని జాన్ చెప్పాడు.
నిజానికి నా భార్యని ఎవరు చంపారో చెప్తే నన్నింకా మూర్ఖుడిలా చూస్తారు. సరైన కారణంగల, ఎలిబీ లేని మరొకరు ఉన్నారు. నాకు బంధువులు లేరు. నాకు మరణశిక్ష పడ్డాక ఆ పదివేల డాలర్లు పొందడానికి నా వైపు ఎవరూ రారు. ఫ్లోరెన్స్ బంధువ ఒకడు దానికి వారసుడు అవుతాడు. ఆవిడకి జీవించి ఉన్న ఏకైక బంధువు ఉన్నాడు - ఆమె సోదరుడు. హత్య జరిగిన రాత్రి అతను సెంట్రల్ పార్క్‌లో నడుస్తూ తన సోదరి వైవాహిక జీవితాన్ని భగ్నం చేసినందుకు బాధపడ్డానని కోర్ట్‌కి చెప్పాడు. ఓ తెలివైన డిటెక్టివ్ ఇలా చేస్తాడా? నా మాటని మీరు నమ్మలేదు.
ఫ్లోరెన్స్‌ని హత్య చేయకపోవడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి. కాని ఫ్లోరెన్స్ సోదరుడు జాన్‌కి ఈ కేసుని పరిష్కరించినందుకు ప్రమోషన్ వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ నించి పదివేల డాలర్లు కూడా.
డియర్ జడ్జ్. నేను నిజం చెప్పాను. జీవితాంతం మీరు ఓ అమాయకుడికి మరణశిక్ష విధించానని బాధపడి తీరాలి. కోర్ట్‌లో జాన్‌ని చూసినప్పుడల్లా అతన్ని వదిలి నన్ను శిక్షించినందుకు మీ అంతరాత్మ మిమ్మల్ని పొడుస్తుందని భావిస్తూ,
నిరపరాధి లియో

(ఆర్థర్ లాసన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి