S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ కుంభమేళా!

అది పల్లె కాదు, పట్టణం కాదు, నగరం అంతకంటే కాదు. అదొక దట్టమైన కీకారణ్యం. అయినప్పటికీ ప్రతీ రెండేళ్లకోసారి అక్కడో మహానగరం వెలుస్తుంది. అది మూడు రోజుల మాత్రమే కనిపించి మాయమయ్యే మహానగరం. ప్రత్యక్షంగా కంటికి కనిపించే మహాత్మ్యం. అదే ‘మేడారం జాతర’.
అచ్చంగా చెప్పాలంటే మేడారం జాతరనేది కోట్లాది మంది అట్టడుగు వర్గాల ప్రజల నిఖార్సైన నమ్మకం. అంతకుమించిన విశ్వాసం. అసలు సిసలైన ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ వేడుక. వారి సంస్కృతికి ప్రతీక. గిరిజనులకు ఇలవేల్పు, గిరిజనేతరులకు ఆరాధ్యదైవం సమ్మక్క-సారలమ్మ. అసలు వీరిద్దరు ఎవరంటే... 13వ శతాబ్దంలో కాకతీయ రాజులపై తిరగబడిన గిరిజన వీర వనితులు. అత్యంత శక్తివంతమైన కాకతీయ సైన్యబలగం ధాటికి నేలకొరిగిన త్యాగమూర్తులు. తమ జాతి విముక్తికోసం ఏకంగా చక్రవర్తులపైనే తిరగుబాటు చేసి ఆసువులు బాసిన సమ్మక్క-సారలమ్మను స్మరించుకుంటూ గిరిజనులు నిర్వహించుకునే వేడుకనే కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. మేడారం వెళ్లడానికి రైలు మార్గం లేదు. విమానాశ్రయం లేదు. ఎవరికైనా, ఎంతటి వారికైనా రోడ్డు మార్గం ఒక్కటే శరణ్యం. అయినా కోట్లాది మంది భక్తులు అష్టకష్టాలతో తండోపతండాలుగా తరలివస్తారు. పోనీ అక్కడేమైనా గుడి ఉందా అదీ లేదు. దేవతల విగ్రహాలైనా ఉన్నాయా అంటే లేనేలేవు. గుడి లేదు, విగ్రహాలు లేవు, సమాధులు లేవు. పోనీ అదేమైనా కోట్లాది మంది భక్తులు కొలిచే వనదేవతలు నేలకొరిగిన పరమ పవిత్ర స్థలమా? అదీనూ కాదు. మరీ అంతమంది భక్తులు ఎందుకు తరలివస్తారంటే అదే మేడారం జాతర ప్రత్యేకత.
ప్రతీ రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమై మూడు రోజులపాటు ఈ జాతర కొనసాగుతుంది. మేడారం జాతర జరిగే స్థలం దట్టమైన దండకారణ్యంలో ఉండటంవల్ల జాతరప్పుడు తప్ప జన సంచారమే ఉండదు. ఊరు వాడ లేకపోవడం వల్ల బస చేసేందుకు సత్రాలు ఉండవు, ఎలాంటి వసతీ సౌకర్యాలు లేకపోయినా ప్రతీ జాతరకు కోట్లాది మంది భక్తులు పిల్లాజెల్లాతో తరలివచ్చి ఎవరికివారే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని మూడు రోజుల పాటు అడవిలోనే చెట్లు, పుట్టల కిందే బసచేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించి దర్శించుకొని వెళ్లడం ఈ జాతర ప్రత్యేకత.
‘సమ్మక్క, సారలమ్మ జాతర అంటే ఇదొక ఎన్‌కౌంటర్‌లాంటి ఘటనే. కాకతీయుల సైన్యానికి, గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధంలో గిరిజన వీర వనితలైన సమ్మక్క, సారలమ్మ అసువులు బాసారు. తమ జాతి కోసం చివరిదాకా పోరాడి ప్రాణాలు అర్పించిన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ గిరిజనులు నిర్వహించుకునే వేడుక మేడారం జాతర’’ అని కాకతీయుల చరిత్ర, వారి హయాంలోని శిల్ప కళా నైపుణ్యంపై పరిశోధన చేసిన చరిత్రకారుడు దివంగత దెందుకూరి సోమేశ్వరశర్మ అభివర్ణించారు. మేడారం జాతరంటే, ఒక చారిత్రక ఘట్టానికి ఆనవాలు. ఏడెనిమిది వందల ఏళ్ల కింద జరిగిన యుద్ధంలో అసువులుబాసిన తమ వారిని స్మరించుకునే ఘట్టమే కాలక్రమేణా మేడారం జాతరగా ప్రసిద్ధిగాంచింది.
ఈ ఆదివాసీ వీర వనితల చరిత్ర ఎక్కడా చరిత్ర పుటల్లో కనిపించదు. చరిత్ర పుటల్లోకి ఎక్కకపోయినప్పటికి, సమ్మక్క, సారలమ్మ వీరోచిత పోరాటాన్ని స్మరించుకోవడం తమ విధిగా, తరతరాల వారసత్వ సంపదగా గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఎవరీ సమ్మక్క, సారలమ్మలు. వీరిద్దరు తల్లి కూతుళ్లా, అక్కా చెల్లెండ్లా, సవతులా అనేది ఇంతవరకు ఏ చరిత్రకారుడు తేల్చి చెప్పలేదు. ఈ విషయంలో రకరకాల కథనాలు, వాదనలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క, సారలమ్మలు వరసకు ఏమవుతారనే విషయాన్ని పక్కన పెట్టి వీరి పట్ల అచంచలమైన భక్త్భివాలను చాటుకునే అసంఖ్యాకమైన భక్త జనకోటి వీరి సంపద. సమ్మక్క, సారలమ్మలు వీరమరణం పొందిన స్థలానే్న వీరికి ప్రతీకగా పవిత్రంగా భావించి, అక్కడీ దేవతలను కొలుస్తున్నారా? అంటే, అదీ లేదు. కాకతీయ సేనలతో జరిగిన యుద్ధంలో వీరు వీర మరణం పొందిన స్థలం, ప్రస్తుతం జాతర జరిగే మేడారానికి సమీపంలోని బయ్యక్కపేటగా మేడారం జాతరకు పుజారులుగా వ్యవహరిస్తున్న వారి వంశస్థులు చెబుతారు. వన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రతీకగా రెండు గద్దెలపై ఉండే రెండు దిమ్మలనే దేవతలుగా భావించి భక్తులు పూజించడం ఇక్కడ మరో విశిష్ఠత. హిందూ సాంప్రదాయం ప్రకారం మద్యం, మాంసం, అంటు, ముట్టు దరి చేరకుండా దేవాలయాల్లో పవిత్రను పాటిస్తారు. కానీ వీటన్నింటికి పూర్తి భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు మేడారం జాతరలో కనిపిస్తాయి. గుక్కెడు సారా, మాంసం ముద్ద గొంతు దిగకపోతే సమ్మక్క, సారలమ్మలు మెచ్చరని భక్తుల విశ్వాసం. అందుకే మేడారం జాతర సందర్భంగా ప్రత్యేకంగా మద్యం షాపులకు ప్రభుత్వం తాత్కాలిక లైసెన్స్‌లు ఇస్తుంది. లక్షలాది కోళ్లు, మేకపోతులు, గొర్రె పొట్టేళ్లు జాతరలో బలి ఇస్తారు. ఇక్కడ మద్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, ఒక ఉదంతాన్ని చెప్పుకుంటారు. రాష్ట్రంలో మద్య నిషేధం కొనసాగిన సమయంలో మేడారం జాతర వచ్చింది. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెలకు తీసుకు రావడానికి పూజారులు వెళ్లారు. లక్షలాదిమంది భక్తులు దేవతలు ఆగమనం కోసం ఎదురు చూస్తున్నా, ఎంతకూ దేవతలు రాకపోవడంతో భక్తుల్లో ఆందోళన, అలజడి తలెత్తింది. దేవతల ఆగమనానికి కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలకడం అనవాయితీ. జాతరలో ఏదో లోటు జరగటం వల్ల చిలుకలగుట్ట నుంచి బయటికి వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చేందుకు దేవతలు నిరాకరిస్తున్నారని కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందింది. అప్పటికప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలను సంప్రందించి, మద్యాన్ని సాకా పెట్టాకే దేవతలు కొండ దిగినట్టు అప్పటి ఉదంతాన్ని భక్తులు గుర్తు చేస్తుంటారు. ఎన్నో విశిష్టతలు కలిగిన మేడారం జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివస్తారు. దీంతో ఇటీవల ఈ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్రంపై వత్తిడి పెరిగింది.
ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమినాడు మేడారం జాతర ఆరంభమై నాలుగు రోజుల పాటు జరుగుతోంది. గిరిజనేతరులకు ఇది మూడు రోజుల వేడుకే అయినా, గిరిజనులకు మాత్రం ఇది నెల రోజుల పండుగ. ప్రతి ఏటా కాకుండా, రెండేళ్లకోసారి జరగడమేంటనే ప్రశ్న కూడా తలెత్తకపోదు. కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా పరిగణించే సాంప్రదాయం ఉందని చెబుతారు. ఈ కారణంగానే మేడారం జాతర రెండేళ్లకోసారి జరగుతోందంటారు. ఆరు రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది భక్తుల ఇంట సమ్మక్క, సారలమ్మలు ఇలవేల్పులుగా పూజలందుకుంటున్నారు.
ఇదీ నేపథ్యం...
కాకతీయుల సామ్రాజ్యంలో భాగమైన మేడారం ప్రాంతంలో వరుసగా వచ్చిన కరువు కాటకాల వల్ల ప్రజలకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ప్రాంత గిరిజనులు ప్రభువులకు కప్పం చెల్లించలేదన్న ఆగ్రహంతో కాకతీయ చక్రవర్తుల ఏలుబడిలోని మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. ఈ ప్రాంతానికి సామంత రాజైన పగిడిద్దరాజు విధిలేని పరిస్థితుల్లో కాకతీయులతో యుద్ధానికి తలపడక తప్పలేదు. కాకతీయుల సేనల పరాక్రమ, పోరాట పటిమ, ఆయుధ సంపత్తి ముందు పగిడిద్దరాజు, ఆయన కుమారుడు గోవిందరాజు తట్టుకోలేకపోయారు. తన భర్త పగిడిద్దరాజు ఓటమి అంచున ఉన్నారన్న సమాచారం అందడంతో భార్య సమ్మక్క, కూతురు సారలమ్మలు యుద్ధ రంగంలోకి దూకారు. వీరిద్దరు అపరకాళికల్లా మారి కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడి యుద్ధ భూమిలో అసువులు బాసారు. దీంతో తమకోసం ప్రాణాలు ఆర్పించిన త్యాగమూర్తులైన వీర వనితలు సమ్మక్క-సారలమ్మలను దేవతలుగా భావిస్తూ ఆనాదిగా గిరిజనులు ఆరాధిస్తూ వస్తున్నారు. యుద్ధం జరిగిన మేడారం ప్రాంతంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలను ప్రతిష్ఠించి ప్రతి రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు జాతర జరుపుకొంటుండగా భక్తుల సంఖ్య ఏటేటా పెరిగిపోవడం వల్ల ప్రభుత్వం దీనిని నాలుగు రోజులకు పొడిగించింది. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా దక్షిణ భారత కుంభమేళాగా మేడారం పేరుగాంచింది.
ఈ వనితలు.. దేవతా స్వరూపాలు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వీర వనితలకు సంబంధించి అనేక పురాణ గాథలున్నాయి. వీటిలో దండకారణ్యంలోని మేడారం నుండి కోయ దొరలు ఒకరోజు దట్టమైన అడవుల్లోకి వేటకు వెళ్లగా పెద్ద పులుల ఒక పసిపాపకు కాపలాగా చుట్టూ కూర్చున్నాయి. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన కోయ దొరలు పులుల మధ్యలో ఉన్న ఆ పసిపాపను మేళ తాళాలతో పల్లకిలో తమ గూడేనికి తీసుకెళ్లి పెంచుకున్నారు. ఆ పసిపాప మేడారానికి వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లింది. అడవిలోని విషసర్పాలు, క్రూర మృగాల గుంపుమధ్యలో గద్దెపై పసిపాప ఉండటం వల్ల సాక్షాత్తు కొండ దేవరనే పసిపాప రూపంలో అవతరించిందని కోయ దొరలు భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క అని నామకరణం చేశారు. పులులు, సింహాలు, జంతువులపై స్వారీ చేయడం, దీర్ఘరోగాలను నయం చేయటం, వృద్ధులు, అనాధలకు సహాయ పడటం, సంతానం ప్రాప్తికి అనుగ్రహించడం వంటి అతీతమైన మహిమల వల్ల సమ్మక్క కీర్తి నలుదిశలా వ్యాపించింది. అనంతరం దండకారణ్యం ప్రాంత రాజ్యాన్ని పరిపాలించే కోయ చక్రవర్తి మేడరాజు మేనల్లుడు పగిడిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఆడ శిశువులతో పాటు జంపన్న అనే మగ శిశువు కూడా జన్మించారు.
యుద్దం ఎలా జరిగింది?
దండకారణ్యం ప్రాంతంలోని గిరిజన రాజ్యమైన మేడారం పరగణాను కోయ రాజులు పాలించేవారు. వీరు కాకతీయులకు సామంత రాజులుగా ఉండేవారు. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాధికారాన్ని చేపట్టిన నాటికే కరీంనగర్‌ను రాజధానిగా చేసుకుని కోయ చక్రవర్తి మేడరాజు పాలించేవాడు. కాకతీయ సామంతరాజుల గిరిజనగూడెం మేడారం పగిడిద్దరాజు స్వాధీనంగా వచ్చింది. ఇతని పరిపాలనా కాలంలో వరుసగా నాలుగేళ్లపాటు అనావృష్టి సంభవించి పంటలు పండక కరువు కాటకాలతో విలయతాండవం చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కప్పం చెల్లించలేని స్థితికి చేరారు. దీంతో కాకతీయులకు కప్పం చెల్లించడానికి పగిడిద్దరాజు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రతాపరుద్రుడు గిరిజన చక్రవర్తి పగిడిద్దరాజును అణిచివేయాలని ప్రధాన సైన్యాధిపతి యుగంధరుడి సారధ్యంలో సైన్యాన్ని పంపారు. సంపెంగ వాగు వద్ద గిరిజన సేనలకు, కాకతీయ సేనలకు మధ్య భీకరపోరాటం జరిగింది. యుద్ధ నిపుణతగల కాకతీయ సైన్యం ధాటికి కోయ సేనలు చెల్లాచెదురయ్యాయి. యుద్ధంలో పగిడిద్ద రాజుతోపాటు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు వీర మరణం పొందారు. మేడారంలోకి కాకతీయ సేనలు ప్రవేశించకుండా కాపలాగా ఉన్న పగిడిద్ద రాజు కుమారుడైన జంపన్న పరాజయాన్ని సహించలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండే సంపెంగ వాగు జంపన్న వాగుగా వాడుకలోకి వచ్చింది. ఈ తరుణంలో సమ్మక్క స్వయంగా కాకతీయ సేనలతో యుధ్దానికి తలపడి పరాశక్తి అవతారమైన సమ్మక్క అపరకాళికలా విజృంభించి కాకతీయ సేనలను అంతం చేయడం ఆరంభించింది. సమ్మక్క చేతుల్లో పరాభవం తప్పదని గ్రహించిన కాకతీయ సైనికుల్లో ఒకడు దొంగచాటుగా వెనుక నుంచి సమ్మక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే సమ్మక్క యుద్ధ్భూమి నుండి వైదొలిగి మేడారానికి ఈశాన్యం వైపుగల చిలుకల గుట్ట వైపు వెళ్లింది. కొందరు కోయ సైనికులు ఆమెను అనుసరించినప్పటికీ, కొండ మలుపుల్లో అదృశ్యమైపోయింది. ఎంతకు ఆమె జాడ తెలియరాలేదు. అయితే గుట్టమీదగల నాగవృక్షం సమీపంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ గల భరిణ వారికి కనిపించింది. అదే సమ్మక్క గుర్తుగా భావించి కోయదొరలు నిద్రాహారాలు మాని సమ్మక్క తిరిగి వస్తుందనే ఆశతో వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అప్పటి నుండి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతిరెండేళ్లకోసారి కుంకుమ భరిణె లభించిన ప్రాంతంలోనే ముతె్తైదువుల పండుగ జరుపుకునేవారు. మొట్టమొదటగా బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా నర్సయ్య అనే గిరిజనుడు జాతరకు శ్రీకారం చుట్టారు.
గిరిజన సంస్కృతి మేళవింపు
మేడారం జాతరలోని గద్దెల వద్దకు దేవతామూర్తులను తీసుకురావడం అంటే వారి కుంకుమ భరిణెను గిరిజన సాంప్రదాయంతో వడ్డెరల (పూజారులు) సహాయంతో గద్దెలపైకి తీసుకురావడమే. కుంకుమ భరిణెలోని బండారిగా పిలుచుకునే పసుపు, బంగారంగా పిలువబడే బెల్లం, కుంకుమలు గద్దెకు చేరుకోవడంతోనే మేడారం జాతర ప్రారంభమైనట్టు. జాతరలో తొలుత జంపన్న వాగులో స్నానం ఆచరించి మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్దకు వెళ్లడం అనవాయితీ. దేవతల కుంకుమ భరిణెలను తీసుకొచ్చే పూజారులకు ఎదురేగే మహిళా భక్తులు శివసత్తులతో ఊగిపోతుంటారు. దేవతలు గద్దెకు వచ్చే దారిలో భక్తులు అడ్డంగా పడుకుంటే కుంకుమ భరిణెలో ఊరేగి వస్తున్న పూజారులు వారిపై నడుచుకుంటూ వెళ్తుంటారు. భక్తులపై నుండి దేవతలను తోడుకెళ్తున్న పూజారులు వెళ్తే, తమ జన్మ సార్ధకమైనట్టుగా అనుభూతిని పొందుతారు. దేవతలకు ఎదురేగి కోళ్లను ఎగురవేస్తూ, అవి కింద పడకముందే ఒకే వేటుకు తల తెగే విధంగా బలి ఇవ్వడం ఇక్కడ ఆచారం. దీనిని ఎదురుకోళ్లు అంటారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతారు. కొందరు మగవాళ్లే ఆడవాళ్ల వేషాధారణతో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు తీర్చే ఆచారం కూడా ఇక్కడుంది. వీరిని ఆచారవంతులుగా పిలుస్తారు. దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు హుండిలో వేసినట్టుగా ఇక్కడ డబ్బు, నగలను కానుకలుగా కాకుండా, ఎక్కువగా పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు, బెల్లాన్ని కానుకలు సమర్పిస్తారు. కొందరు సమ్మక్క సారలమ్మలకు కోడెలను కానుకలుగా సమర్పించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కోసం వరాలు పడుతుంటారు. తల్లి దీవెన వల్ల సంతానం కలిగిన వారు తమ పిల్లలనే త్రాసులో కూర్చోబెట్టి వారికి నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) తులాభారంగా సమర్పిస్తారు.

-వెల్జాల చంద్రశేఖర్