మ్రోయు తుమ్మెద
Published Saturday, 20 January 2018హాంటింగ్ మెలొడీస్ అని నాకొక పద్ధతి ఉన్నది. కొన్ని పాటలు వద్దన్నా నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. వాటిలో మొదటిది అక్క మహాదేవి రచించిన ఒక కన్నడ వచనం. తెలుగులో కూడా వచనాలు ఉన్నాయి. వాటిని పాడాలని ఎవరికీ తోచినట్టు లేదు. పెద్దలు గమనింతురు గాక.
బస్సులో కామారెడ్డి నుంచి లేదా నిజామాబాద్ నుంచి తిరిగి వస్తున్నాను. బాగా నిద్రపోయాను. కల వస్తున్నది. నేను మరీమరీ అభిమానించిన కవిసామ్రాట్ విశ్వనాథ నవల ‘మ్రోయు తుమ్మెద’ నాకు కలగా వస్తున్నది. భ్రమరవాసిని తల్లి తెల్లని దుస్తులలో గాలిలో తేలుతూ నాదాన్ని పలికిస్తూ బస్సు పక్కన వచ్చి నిలిచింది. నా నుదిటిని తాకింది. నన్ను చూడవా అన్నది. నాకు చటుక్కున మెలుకవ వచ్చింది. ఆశ్చర్యం ఏమంటే నవలలో బహుశా ఇటువంటి సంఘటన జరిగిన చోటనే నేనున్న బస్సు ఆగి ఉన్నది. అది శామీర్‌పేట చెరువు గట్టు. భ్రమరవాసిని తల్లి మరొక పేరు మ్రోయు తుమ్మెద. ఆమె మెదడులో చేరి నాదం పుట్టిస్తూ ఉంటుంది. ఆ మనిషికి వద్దన్నా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఏ జన్మలో చేసిన పుణ్యమో అనాలని నాకు ఇక్కడ అనిపిస్తున్నది. కానీ పునర్జన్మలు, పాత వాసనలు నా పద్ధతి కాదు. నా పెద్దలు చేసిన పుణ్యం అయి ఉంటుంది. దానికి పుణ్యం అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మా తాతలు పండితులు నిజమే. కానీ ఎవరికీ సంగీతంలో అభినివేశం ఉన్న ఆధారం కనిపించలేదు. నాకు మాత్రం శాస్ర్తియ సంగీతం అన్న చీమ మరీ గట్టిగా కుట్టింది. గాయం పడిందేమో. రక్తం కారిందేమో.
నా కొడుకు అప్పటికి మరీ చిన్నవాడు. డైనింగ్ టేబుల్ ఎత్తు కూడా లేడు. ఒక రాత్రి నేను అన్నం తింటున్నాను. అప్పటికి రాత్రి కూడా అన్నం తింటున్నానా? అనుమానమే. నేను రాత్రిళ్లు రొట్టె తింటాను. అది ముఖ్యం కాదు కానీ, మా వాడు వచ్చి సంగీతం పెట్టకుండా తిండి తింటున్నావు ఎందుకు? అని నన్ను అడిగాడు. అది మాత్రం బాగా గుర్తు ఉంది. అంటే విషయం మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఈ మధ్యన మళ్లీ తుమ్మెద మోత మెదడులో తిరుగుతున్నట్టు ఉన్నది. మళ్లీ సంగీతం వినాలని అనిపిస్తున్నది.
హాంటింగ్ మెలొడీస్ అని నాకొక పద్ధతి ఉన్నది. కొన్ని పాటలు వద్దన్నా నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. వాటిలో మొదటిది అక్క మహాదేవి రచించిన ఒక కన్నడ వచనం. తెలుగులో కూడా వచనాలు ఉన్నాయి. వాటిని పాడాలని ఎవరికీ తోచినట్టు లేదు. పెద్దలు గమనింతురు గాక. కన్నడలో వచన సాహిత్యాన్ని పాడే పద్ధతి చాలా రోజుల కిందే మొదలయినట్టుంది. నేను విద్యార్థిగా ఉండగానే నాన్న నా కోసం కనీసం మా కోసం కొన్న రేడియో కారణంగా ఒక రాత్రి నేనొక పాట విన్నాను. పాడిన మహానుభావుని పేరు మల్లిఖార్జున్ మణ్‌సూర్. ఆయన చాలా గొప్ప గాయకుడని నాకు తరువాత కానీ అర్థం కాలేదు. అక్క కేళవ్వ అని ఒక పాట. అక్కా వినవమ్మా అని అర్థం. కలలో తాను చెన్నమల్లికార్జునుని చూచానని అక్క మహాదేవి తన అక్కకు చెపుతుంది. నేను రేడియోలో ఈ పాట విన్నాను. అది నా తలలో అదే పనిగా నినదించింది. ఆ కాలంలో ఆ మాట మళ్లీ వినిపించే అవకాశం నాకు ఏ రకంగానూ లేదు. కన్నడ దేశం వెళ్లి పాట కోసం వెతికేంత వెసులుబాటు నాకు అంతకన్నా లేదు. పెరిగి పెద్దవాడిని అయ్యాను. తుమ్మెద తల్లి దయ కలిగినప్పుడల్లా ఈ పాటను నాకు గుర్తుచేస్తూ ఉండేది. పాట మాత్రం నాకు మళ్లీ వినిపించలేదు. ఒకసారి కర్నాటక వెళ్లే అవకాశం దొరికింది. అక్కడ క్యాసెట్ దుకాణంలో గుర్తున్న వరకు పాట వినిపించి నాకు దొరుకుతుందా అని అడిగాను. ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు. కానీ సంగీత ప్రధానమయిన ఒక కన్నడ సినిమా హంసగీతె పాటల క్యాసెట్ తెచ్చుకున్నాను.
ఇంటర్‌నెట్ అని ఒకటి వచ్చింది. భ్రమరవాసిని తల్లి నన్ను వదలలేదు. నేను నెట్‌లో ఈ పాట కోసం వెతకడం మొదలు పెట్టాను. పర్రీకర్ అని నాకన్నా సంగీతం చాదస్తం ఉన్న ఒక మహానుభావుడు ఏకంగా ఒక వెబ్‌సైట్ పెట్టాడు. వెసులుబాటు గలవాడు కనుక వీలయినన్ని పాటలను వినడానికి అక్కడ ఏర్పాట్లు చేశాడు. సంగీతం తెలిసిన వాడు కాబట్టి చక్కని వ్యాఖ్యానాలు చదివే ఏర్పాటు కూడా చేశాడు. నిజం చెప్పాలి. నేను ఆయన సైట్‌లో నుంచి అక్క కేళవ్వ పాటను దొంగిలించాను. దాన్ని ఎం.పి.త్రీగా మార్చాను. రాబ్ పీటర్ టు పే పాల్ అన్నట్టు పాటను నేను పదుగురితో పంచుకున్నాను. ఎంతోమంది విన్నారు. నాకు కలిగిన సంతోషం పాట వినడంతో ముగియలేదు. దాన్ని పంచుకోవడంతో మరింత ముందుకు సాగింది. దండపాణి దేసిగర్ పాడిన తున్‌బమ్ నేర్‌గయిల్ అనే మరొక పాటను కూడా ఇలాగే వేటాడి పట్టుకుని పంచుకున్నాను.
భ్రమరవాసిని దయ తలిస్తే పరిస్థితి నిజంగా విచిత్రంగా ఉంటుంది. పత్రికల వారు నాకు సమీక్షలు రాయడానికని పుస్తకాలను పంపుతుంటారు. కన్నడ వచన సాహిత్యం గురించి తెలుగులో వచ్చిన ఒక పుస్తకం చదివే వీలు దొరికింది. వచన సాహిత్యం గురించి ఎంతో తెలిసింది. ఆ పుస్తకంలో అక్క కేళవ్వ పాట గురించి రాశారు కూడా. కానీ రికార్డులోని పాటకు, అక్కడి పాటకు కొంత తేడా వున్నట్టు నాకు అక్కడి తెలుగు రూపం చూస్తే తెలిసింది. నాకు కన్నడం కొంత అర్థమవుతుంది. వచన సాహిత్యంలో నిజానికి పెద్దపెద్ద మాటలు ఉండవు. ఆ వచనాలు రాసిన శివభక్తులు చాలా మామూలు మనుషులు. మంచినీళ్ల కావడి మోసే ఒకాయన కూడా గొప్ప వచన సాహిత్యాన్ని సృష్టించి మహామహులలో లెక్కింపు పొందుతున్నాడంటే గమనించవచ్చు.
మీరు చదువుతున్న లోకాభిరామం అన్న కాలమ్‌కు మాతృక ఇంటర్‌నెట్‌లో ఉంది. నేను లోకాభిరామం అని పేరుగల ఒక బ్లాగ్‌ను నడుపుతున్నాను. ఇప్పటికి అందులో వెయ్యి పైగా పోస్టులు చేశాను. వచ్చి చూచిన వారి సంఖ్య నాలుగు లక్షల ఇరవయ్యేడు వేలు దాటింది. చాలాకాలం క్రితమే అక్కడ నేను అక్క కేళవ్వ గురించి రాశాను. ఆ పాట వినే వీలు కూడా కలిగించాను. అందుకు అవసరమయిన పద్ధతులు నేర్చుకున్నాను. అలా అరుదయిన సంగీతాన్ని శ్రవణం అనే పేరుతో అక్కడ వినిపిస్తూనే ఉన్నాను.
సంవత్సరం మలుపులో వెనుకకు తిరిగి బతుకును బేరీజు వేసుకోవాలని రాశాను కదా! ఇదిగో ఈ బ్లాగ్ విషయంలో కూడా ఒకసారి పరీక్షిస్తే పాట వినడానికి నేను చేసిన ఏర్పాట్లు పని చేయడం లేదని అర్థమయింది. 2010లో అంటే ఏడేళ్ల క్రితం పెట్టిన ఏర్పాట్లు కొన్ని మాత్రమే పని చేయడం లేదు. మిగతావి చాలామటుకు పని చేస్తూనే ఉన్నాయి. ఇంకేముంది? వాటిని సమీక్షించడం, సవరించడం అన్న కార్యక్రమం మొదలుపెట్టాను. అక్క కేళవ్వ పాటను మరొకసారి అందరి ముందుకు తెచ్చే అవకాశం దొరికింది. అక్క మహాదేవికి కలలో బియ్యం, వక్కలు, కొబ్బరికాయ కనిపించాయట. గొరవని జడలు చిన్నవిగా ఉన్నవట. దంతాలు అందంగా ఉన్నాయట. ఇంతా చేస్తే అతనేమో పారిపోయాడట. అక్క మహాదేవి, ఆండాళ్ తల్లిలాగే మనసులోనే మల్లిఖార్జునుని పెళ్లాడిన ఘనురాలు. మళ్లీ తుమ్మెద రొద మెదడులో మొదలయింది. పాత పాటలన్నీ గింగిరాలు తిరుగుతున్నాయి.
రుత్, హై జవాన్, అని చరణంలో వచ్చే ఒక మాట మాత్రమే మెదడులో సుడులు తిరిగి నాకు పిచ్చెత్తించింది. పాట వరుస గుర్తుకు వస్తున్నది. బాగేశ్వరీ రాగం తెలుస్తున్నది. మరింత ముందుకు పాడితే అనార్కలీలోని జాగో దర్‌దే ఇష్క్ గుర్తుకు వస్తున్నది. కానీ రెండు వేరువేరు పాటలు. మొదటిది యుగళ గీతం. రుత్, హై అన్న మాట కూడా సూటిగా గుర్తుకు రావడం లేదు. ఎంత వెతికినా పాట తెలియడం లేదు. చివరికి ఒకనాడు ఉదయాన చటుక్కున రుత్, హై జవాన్ అన్న మాటలు తోచినయి. వెంటనే కాదు గానీ, ఆ వరుసలో మరొక చరణంలో ఝామేంగే ఆజ్ అని మాటలు వస్తాయి. ఈ రెండు మాటలు వరుసగా రావు. అయినా సరే, గూగులమ్మ సాయంతో పాట వెతికి పట్టగలిగాను. ఝనక్ ఝనక్ పాయల్ బాజే అన్న శాంతారాం సినిమాలో పాట అది. నైన్ సో నైన్ నాహీ మిలావో అని మొదలవుతుంది. నాకు ఇది ఎవరు చెప్పాలి? కనుకనే నాకు ఇంటర్‌నెట్ అంటే చాలా ఇష్టం. పాట విన్నాను. సంధ్య, ఆమెతోబాటు మరొక నర్తకుడు మైసూర్‌లోని బృందావన్ గార్డెన్స్‌లో నాట్యం ఆడతారు. దిక్కుమాలిన ప్రపంచ జ్ఞానం! ఆ నర్తకుడు గోపీకృష్ణ అని ఎందుకో అనిపించింది. వెంటనే మళ్లీ గూగుల్‌లో వెతుకులాట. నా మాటలు నిజమేనని రుజువయింది. మొత్తం పాట దొరికింది. ఎన్నిసార్లు విన్నానో గుర్తులేదు. అది మరి ఇక మెదడులో నినదించక ఏమవుతుంది? ఇంతా చేస్తే అది బాగేశ్వరి కాదట. మల్‌గుంజీ అని మరొక రాగం ఉందట. ఈ పాట ఆ రాగంలో ఉందట. నాకు సంగీతం అంత లోతుగా తెలిస్తే ఎంత బాగుండునో!