S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 18

అందరి మాటలకీ తల ఊపాను.
‘లెటజ్ మీట్ టుమారో...’ అంటూ లేచాడు అభిమన్యు. ‘పద వసూ! నిన్ను దింపుతాను..’ అన్నాడు నన్ను ఉద్దేశించి.
‘నేను వెళ్తాను..’ బిడియంగా అన్నాను.
కాస్త సందు ఇస్తే అభిమన్యు ఎలా దూసుకుపోతాడో తెలుసు కాబట్టి సంతోష్ కల్పించుకున్నాడు. ‘నేను పంపిస్తానులే, అభీ..’ అంటూ.
రిలీఫ్‌గా అనిపించింది నాకు.
‘అయితే సరే!...’ అంటూ వెళ్తూ వెళ్తూ నా దగ్గరకు వచ్చి గట్టిగా హగ్ చేసుకుని, అవాక్కయిన నేను తేరుకునేలోపే, ‘రేపు కలుద్దాం..’ అంటూ వెళ్లిపోయాడు.
‘చంద్రం నువు నా కారు తీసుకువెళ్లి ఈమెని దింపి రా!...’ అన్నాడు సంతోష్.
‘వద్దొద్దు. నేను వెళ్లిపోతాను...’ అంటున్నా వినకుండా నన్ను దింపటానికి వచ్చాడు చంద్రం.
చనువు పెంచుకోవాలన్న సంతోష్ సలహా ప్రభావమేమో కానీ.. చంద్రం ప్రవర్తన కూడా ఇంతకు ముందు కంటే వేరేగా ఉంది. దారి పొడుగునా నాతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు.
కారులో ప్రయాణిస్తున్నంత సేపూ అసహనంగా గడిపిన నేను హాస్టల్‌కి వెళ్తూనే ఎదురుగా కనిపించిన జానకిని చూసి ఆశ్చర్యపోయాను. ఈ హాస్టల్లో నాకు మొదట పరిచయం అయిన వ్యక్తి జానకే! ఆమె నాకు మొదట్లో అడగకుండానే సహాయం చేసింది. కానీ ఈ మధ్య ఆమె ప్రవర్తనలో కాస్త మార్పు కనిపిస్తోంది. ఎందుకో నాతో మొదట్లో ఉన్నంత స్నేహంగా ఇప్పుడు లేదనిపిస్తోంది.
‘ఏమిటి ఈ సమయంలో ఇంట్లో ఉన్నావ్?’ అని అడిగాను.
‘ఏం? ఒకరోజు సెలవు నేను మాత్రం తీసుకోకూడదా..?’ అంది జానకి. ఆ మాట వ్యంగ్యంగా అందో, చిలిపిగా అందో నాకు అర్థం కాలేదు. ‘ఇంతకీ నీ సంగతి ఏమిటి? నీ సినిమా ప్రయత్నం ఎంత వరకు వచ్చింది?’ నా ఆలోచనలను కట్ చేస్తూ అడిగింది.
జానకి సినిమా సంగతులు అడగ్గానే మిగిలిన అనుమానాలన్నీ నా మనసులో నుండి దూరమయ్యాయి. ఉదయం నుండి జరిగిన విషయాలన్నీ వివరించాను. ఒక్కరోజులోనే దగ్గరవ్వాలని చూస్తున్నట్లున్న అభిమన్యు, చంద్రం ప్రవర్తన గురించి కూడా చెప్పాను.
పెద్దగా నవ్వింది జానకి. ‘అప్పుడే ఏమయింది? ఇంకా ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదుర్కోవాలో? సినిమా రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత ఇలాంటివన్నీ మామూలే!..’
మొదటిసారి ఆమె మాటకి అడ్డుపడ్డాను.‘నాకు సినిమాలంటే ఇష్టమే! కాదనను. నటించటం నా యాంబిషన్. అది కూడా కాదనను. అంత మాత్రాన కేరెక్టర్ పణంగా పెట్టి అవి సాధించుకునే నీచ బుద్ధి నాకు లేదు. సినిమాల్లో నటించటం కోసం నాకు ఇష్టంలేని పని ఏదీ నేను చెయ్యను. సినిమాల్లో చేరే వారందరూ అలా చేస్తారని కూడా నేను అనుకోవటంలేదు...’
‘అందరూ అలా ఉంటారని కాదు. ఏ వెన్నుదన్నూ లేని నీలాంటి వారంటే అందరికీ లోకువే! అందుకే ఒక రాయి వేసి చూద్దామనుకుంటారు. రాయి తగల్లేదనుకో పోయేదేమీ లేదు. తగిలితే పంట పండినట్లే కదా!’
‘నేను మాత్రం సినిమా ఛాన్సయినా వదులుకుంటాగానీ ఆత్మాభిమానాన్ని వదులుకోను’
‘చూద్దాం...’ అంటూ వ్యంగ్యంగా నవ్వింది జానకి.
‘ఎందుకు నవ్వుతున్నావ్? నేను అన్న మాటల్లో తప్పేమన్నా ఉందా?’
‘తప్పు, ఒప్పులన్నవి మనిషి మనిషికీ మారతాయి. నాకు ఒప్పు అనిపించింది నీకు తప్పు కావచ్చు. నాలానే నీవు కూడా ఏది తప్పో, ఏది ఒప్పో స్వయంగా నిర్ణయించుకోవాలి. నీకు వచ్చిన అవకాశం నాకు వస్తే, కే.కే. గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నపుడే ఆ ఆఫర్‌ని వాడుకునేదాన్ని’
‘అంతే తప్ప శీలానికి ఏ విలువా లేదా?’
‘ఏం శీలం ఆడదానికేనా? మగవాడికి అవసరం లేదా? రెండు చేతులు లేకుండా చప్పట్లు మోగవు కదా! ఇద్దరు కలిసి ఒక పని చేస్తే ఒకరు చేసింది తప్పు, మరొకరు చేసింది ఒప్పు ఎలా అవుతుంది?’
కొత్త కోణాన్ని ఆవిష్కరించిన జానకి మాటలు మననం చేసుకుంటూ పడుకున్న నాకు తెల్లవార్లు ఆలోచించినా ఆమె మాటల్లో లోపం ఎక్కడ ఉందో అర్థం కాలేదు. చివరకు తెల్లవారుజామున ఒక ఆలోచన వచ్చింది. బహుశా నియమాలు రాసింది మొగవాడు కాబట్టి ఒక స్ర్తి, ఒక పురుషుడూ కలిసి చేసిన తప్పులో నుండి మొగాడ్ని తేలిగ్గా బయటపడేసే నియమాలు సృష్టించుకున్నాడు. అంతమాత్రాన తప్పు తప్పుకాకుండా పోదు. తప్పు నుండి బయటపడటానికి మొగవాడు ఏర్పరచుకున్న నియమాలు ఎలా తప్పో, తప్పు చేయటానికి ప్రోత్సహించేలా జానకి చేస్తున్న వాదన కూడా అంతే తప్పు. నేను ఎప్పటికీ ఆమె అభిప్రాయాలతో ఏకీభవించలేననుకున్న తరువాతే ప్రశాంతంగా నిద్ర పట్టింది.
మనం నిద్రపోలేదని కాలం ఆగదు. నిద్ర పట్టిన రెండు గంటల్లోనే లేవవలసి వచ్చింది. తయారయి షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నాను.
మొదటి రోజు కంటే రెండో రోజు టెన్షన్ తగ్గినట్లు అనిపించింది. సినిమాల్లో నటించే నటీనటులకు శత్రువయినా, మిత్రుడయినా కెమెరానే! అది ఎటువైపు ఉందో, ఎటు నుండి తనను గమనిస్తుందో, ఏ కోణంలో తనను చూపుతుందో అన్న అనుమానం అంతర్లీనంగా సతాయిస్తుంటే రంగస్థలం మీద బాగా పేరున్న నటీనటులు కూడా కెమెరా ముందు నటించడానికి తడబడతారు.
ఎక్కడో ఒకరు ఉంటారు - చుట్టూ పది కెమెరాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తన సహజ ధోరణిలో నటించుకుపోగలవారు. వారే గొప్ప సినిమా నటులవుతారు.
మరొక వైపు యూనిట్‌లోని అందరూ నా బెరకు పోగొట్టటానికి తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు.
ట్రయల్ షూట్ వలన కెమెరా మీద ధ్యాస తగ్గి, నటన మీద పెరిగింది. ఆ పురోగతిని మెరుగుపడిన నా స్క్రీన్ ప్రజన్స్ చెప్పకనే చెప్పింది.
ఆ సాయంత్రం యూనిట్లోని అందరితో ఆ విషయమే చెప్పాడు సంతోష్. ‘ఒక్కరోజులో చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. ఒకే షాట్ నిన్న తీసిన దానికీ, ఈ రోజు తీసిన దానికీ చూడండి ఎంత తేడాగా ఉందో.. అందుకే ఈ ప్రక్రియ మరొకరోజు కొనసాగిద్దాం. అంతిమ నిర్ణయం రేపు తీసుకుందాం’ అన్నాడతను.
అందరూ అంగీకరించారు.
నాకు చాలా ఆనందంగా ఉంది. నా నటనలో మెరుగుదలని అందరూ గుర్తించటంతో వచ్చిన ఆనందం అది. ఆ రోజు సాయంత్రం నేను హాస్టల్‌కి వచ్చేటప్పటికి జానకి లేదు. మిగతా వారు ఎంతమంది ఉన్నా మనసులో మాట చెప్పుకునే చనువూ, స్నేహం జానకితో తప్ప వేరే ఎవరితోనూ లేదు.
ఆమె ఉండి ఉంటే ఆ రోజు జరిగిన విషయాలు కూడా ఆమెతో పంచుకుని ఉండేదాన్ని. నిన్నటి నా దిగులు పంచుకున్న జానకి ఈనాటి సంతోషాన్ని పంచుకోవటానికి లేకపోవటం బాధగా అనిపించింది. ఫోన్ చేస్తే జానకి ఎత్తలేదు.
నిజానికి ఆ సమయంలో ఆమె నా జీవిత పతనానికి నాందీ ప్రస్తావన పాడే ప్రణాళికకి తుది మెరుగులు దిద్దుతుందని నాకు కొన్ని సంవత్సరాల తరువాత కానీ తెలియలేదు.
మూడవరోజు షూటింగ్‌లో నా సహజ ప్రతిభకు ఆత్మవిశ్వాసం తోడయ్యింది. అందరూ అవాక్కయ్యేటట్లు ఉంది నా నటన. ఫైనల్ ప్రొడక్ట్ చూసుకున్న అందరికీ ఆనందం అవధులు దాటింది.
‘ఫెంటాస్టిక్..’ ‘మార్వలెస్..’ ‘అన్ బిలీవబుల్..’ అంటూ పొగుడుతున్న చంద్రం, సంతోష్, అభిమన్యు ముగ్గురినీ ఆపాను నేను. ‘పొగడ్తలు తరువాత, ఇంతకీ నా రోల్ ఫైనలైజ్ అయిందో, లేదో చెప్పండి..’ అని అడిగాను.
వాళ్లు చెప్పబోయే సమాధానం నాకు తెలిసినా వాళ్ల మాటల్లో వినటంలో వేరే ఆనందం ఉంది.
ఏదో చెప్పబోయాడు సంతోష్.
అతన్ని వారించాడు అభిమన్యు. ‘ఇప్పుడే ఏమీ చెప్పవద్దు. రాత్రికి మీ అందరికీ నేను ట్రీట్ ఇస్తాను. దానికి వసు కూడా అటెండ్ అవుతుంది. ట్రీట్ ఎంజాయ్ చెయ్యడం పూర్తి అయిన తర్వాత చెప్పాలి మీ నిర్ణయం...’
‘సారీ అభీ!.. ఇప్పటికే ఆలస్యం అయింది. నీ ట్రీట్ అంటే చాలా లేట్ అవుతుంది. అంత రాత్రి అయితే హాస్టల్లో ఎలౌ చెయ్యరు..’ నెపం హాస్టల్ మీద పెడుతూ చెప్పాను.
‘ఓహ్! వసూ!! ముందు మమ్మల్నందరినీ పరాయివారనుకోవటం మానెయ్. ఎంత పొద్దు పోయినా నిన్ను హాస్టల్ దగ్గర వదిలే పూచీ నాది. వాళ్లు ఎలా ఎలౌ చెయ్యరో చూద్దాం..’ అంటూ అభిమన్యు బలవంతం చేశాడు.
‘ఇంతకీ ట్రీట్ ఎక్కడ?’ నేను సమాధానం చెప్పక ముందే అడిగాడు చంద్రం.
‘ఎక్కడో ఎందుకు? మా ఫార్మ్ హౌస్‌లో పెట్టుకుందాం..’ అన్నాడు అభిమన్యు. అతనిది బాగా డబ్బున్న కుటుంబం. వాళ్లకి చాలా గెస్ట్‌హౌస్‌లూ, ఫార్మ్‌హౌస్‌లూ ఉన్నాయంట.
అందరం అతని ఫార్మ్ హౌస్‌కి చేరుకున్నాం.
సరదా మాటలూ, ఛలోక్తుల మధ్య కాలం దొర్లిపోతోంది. చూస్తుండగానే సమయం రాత్రి పది దాటిపోయింది. అభిమన్యు తెప్పించిన పదార్థాలు తినటం పూర్తయ్యేటప్పటికి మరో గంట గడిచిపోయింది.
‘వాటెబౌట్ ఏ స్మాల్ డ్రింక్?’ అందరినీ అడిగాడు అభిమన్యు.
ఒక్క క్షణం నిశ్శబ్దం రాజ్యం చేసింది అక్కడ. ఆ నిశ్శబ్దం నేను ఉండబట్టే అని నాకు అర్థం అయింది.
‘ఇప్పుడవేమీ వద్దులే..’ అన్నాడు సంతోష్.
‘అవునవును. ఇప్పుడు వద్దులే...’ అన్నాడు చంద్రం.
‘సరే! కనీసం కూల్‌డ్రింక్ తాగటానికి ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదనుకుంటాను. తెస్తానుండండి..’ అంటూ లోపలకు వెళ్లాడు అభిమన్యు.
నా మూలంగా వాళ్లు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన నేను ‘ఇక నేను వెళ్తాను..’ అంటూ లేచాను.
‘కూల్‌డ్రింక్ తాగి వెళ్దువు...’ అన్నారు అందరూ.
నా పని నిస్సహాయంగా అయిపోయింది. ‘సరే! ఇప్పుడే

వస్తాను..’ అంటూ ఈలోపు టాయిలెట్‌కి వెళ్లి వద్దామని అటుకేసి నడిచాను.
దారిలో నేల మీద పడి ఉన్న ఒక టాబ్లెట్ల స్ట్రిప్ కనిపించింది. పైకి తీసి చూశాను. దాని మీద ‘రాఫ్నాల్’ అని రాసి ఉంది. దానిలో ఏ టాబ్లెట్లూ లేవు. వాటిని దేనికి వాడతారో నాకు తెలియదు. దాన్ని డస్ట్‌బిన్‌లో పడేసి నేను టాయిలెట్లోకి నడిచాను.
పని ముగించుకుని బయటకు వచ్చిన నాకు ఇంకా అభిమన్యు కనిపించలేదు. చంద్రం, సంతోష్ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి మధ్య టేబుల్ మీద నాలుగు కూల్‌డ్రింక్ గ్లాసులు పెట్టి ఉన్నాయి.
‘అభిమన్యు ఏడి?’ అని అడిగాను.
‘ఫ్రెష్ అయి వస్తానని వెళ్లాడు..’ చెప్పాడు చంద్రం.
తర్వాత ఆ కూల్‌డ్రింక్ తాగితే వెళ్లిపోవచ్చన్న భావనతో ముందుగా నేనే కూల్‌డ్రింక్ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాను. ఎందుకో మనసు గాభరాగా ఉంది. ఎప్పుడెప్పుడు అక్కడ నుండి బయటపడతానా అని ఉంది. నేను అక్కడ నుండి బయటపడటానికి నా చేతిలోని గ్లాస్ అడ్డం అన్నట్లు, ఎత్తి గటగటా తాగాను.
నా ఆత్రుత అర్థమైనట్లు సంతోష్ నవ్వుతూ ‘చూడు చంద్రం. వసుంధరకి ఇంటికి వెళ్లటానికి ఎంత ఆత్రంగా ఉందో..!’ అంటూ తను కూడా ఒక గ్లాసు తీసుకుని సిప్ చేశాడు.
చంద్రం కూడా తన గ్లాస్ తీసుకున్నాడు.
నాకు ఏదో మార్పు అనుభవంలోకి వస్తోంది. అది నా శరీరంలోనా, బయట వాతావరణంలోనా అన్నది నాకు అర్థం కావటంలేదు.
‘వెళ్లి వస్తాను..’ అంటూ బయటకు నడవబోయాను.
‘ఒక్కదానివే ఎలా వెళ్తావ్?’ తను లేస్తూ అన్నాడు చంద్రం. అతడి మొహం సాగినట్లు వికృతంగా కనిపిస్తోంది నాకు. తల పక్కకి తిప్పి సంతోష్ వైపు చూశాను. అతను కూడా అలానే మసక మసగ్గా కనిపిస్తున్నాడు. చంద్రం మాటలు ముగించి నా వైపు నడుస్తున్నాడు.
నాకు నా శరీరం మీదే కాదు సమస్త ఇంద్రియాల మీద కంట్రోల్ తప్పినట్లు అనిపిస్తోంది. ఎవరో నా కోసం తరుముకు వస్తున్నట్లుంది. అతి ప్రయత్నం మీద గేటు తీసుకుని బయటకు నడిచాననుకున్నాను. ఇంతకీ నేను నడుస్తోంది ఎటో కూడా అర్థం కావటంలేదు.
నా అంతరంగం ప్రమాదాన్ని సూచిస్తోంది. కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాను.
వెనుక నుండి తరుముతున్న వ్యక్తులకు అందకూడదన్నట్లు ఇంకా ముందుకే నడుస్తున్నాను. అడుగులు తడబడుతూనే తోచిన దిక్కుకు నడిచిన నన్ను రాసుకుంటూ ఒక కారు సర్రున దూసుకుపోయింది. ఆ అదురుకు గిర్రున తిరిగి కింద పడ్డాను.
ఎంత ప్రయత్నించినా లేవలేక పోతున్నాను. ఎవరో నా దగ్గరకు వస్తున్నారు. నన్ను లేపటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరతను? ఆ మనిషి మొహం కాసేపు చంద్రంలా, కాసేపు సంతోష్‌లా, కాసేపు అభిమన్యులా అనిపిస్తోంది.
ఆ వ్యక్తి నా మీదకు వంగాడు. ఎవరతను? ఏమి చెయ్యబోతున్నాడు? తల పగిలిపోబోతున్నట్లు ఉంది. నేను పెద్దగా అరవబోయాను.
అరుపు బయటకు వచ్చేలోపే స్పృహ కోల్పోయాను.
* * *
నిద్రా, మెలకువా కాని స్థితిలో ఎంతసేపు ఉన్నానో తెలియదు.
ఏదో జరుగుతోంది. ప్రతిఘటించాలని అనిపిస్తున్నా శరీరం సహకరించటం లేదు. నా శరీరం మీద తేళ్లూ, జెర్రులూ పాకుతున్నట్లు ఎవరివో చేతులు కదులుతున్నాయి.
నా అశక్తతకు నాకే అసహ్యం వేస్తోంది.
అసహాయతతో కూడిన అలజడి మరీ ఎక్కువ కావటంతో నాకు స్పృహ మళ్లీ తప్పింది.
* * *
మళ్లీ మెలకువ వచ్చేటప్పటికి నాలో వివేచన ఇంకాస్త ఎక్కువయింది.
నేను ఉన్నది ఒక విశాలమయిన గదిలోని బెడ్ మీద అని అర్థం అయింది. మంచం మీద నుండి కిందకి దిగాలని ప్రయత్నించాను కానీ.. విపరీతమయిన నొప్పులతో శరీరం సహకరించలేదు.
ఆ కాస్త ప్రయత్నానికి అవసరమయిన శ్రమని కూడా తట్టుకోలేనట్లు మళ్లీ మత్తులో కూరుకుపోయాను.
గడియారంలో లోలకం ఊగినట్లు నా శరీరం మత్తుకూ, మెలకువకూ మధ్య ఊగుతోంది.
ఈసారి మెలకువ వచ్చినపుడు గదిలో పడుతున్న వెలుతురు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించింది. ఆ వెలుతురు నా కళ్లలో సూదులు పెట్టి పొడుస్తున్నట్లు బాధిస్తోంది. అయినా అతి ప్రయత్నం మీద మంచం దిగి తూలుతున్న శరీరంతో అటూ ఇటూ చూసిన నాకు మంచం పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కనిపించింది.
దాని దగ్గరకు నడిచి దానిలో నా ప్రతిబింబం చూసుకున్నాను.
ఎదురుగా కనిపిస్తున్నది నేనే అని అర్థం కావటానికి చాలాసేపు పట్టింది.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002