S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవశక్తి పెరగాలంటే...

ఫ్రశ్న: మీరు శాకాహారం ప్రాధాన్యత గురించి ఎన్నో అద్భుత విషయాలు చెప్తున్నారు. కూరగాయలతోపాటు పప్పు ధాన్యాల ప్రాధాన్యత గురించి కూడా వివరించగలరు.
-మస్తానయ్య (రామగుండం)
జ: ‘ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య/ ఉండ్రాళ్ల మీదికీ దండు పంపు/ కమ్మని నెయ్యయ్య కడు ముద్దపప్పయ్య/ బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు’ అంటూ వినాయకుడికి ముద్దపప్పుని నైవేద్యంగా పెట్టేది స్థూలకాయం ఆ దేవుడికి తగ్గుతుందనే! అవును. కందిపప్పు తగినంతగా తింటే స్థూలకాయం తగ్గుతుంది.
‘్భజనం దేహి రాజేంద్రా! ఘృతసూప సమన్వితం..’ అనే ప్రసిద్ధ శ్లోకంలో నెయ్యి, పప్పన్నం పెట్టవలసిందిగా రాజును కోరతాడు కవి. పప్పన్నం కుల మతాలకు అతీతమైన ఒక శారీరక అవసరం. ఒక వైద్యపరమైన అంశం కూడా.
మందబుద్ధిగా ఉన్నవాణ్ణి ‘పప్పు సుద్ద’ అంటారు. దానర్థం పప్పు తింటే బుద్ధిమాంద్యం ఏర్పడుతుందని కాదు. అది కదలకుండా వేసిన చోటే ఉంటుందని. కానీ, పప్పన్నం శరీర చలనానికి, చైతన్యానికి, నవజవాలు నింపటానికి కారణం అవుతుంది. పప్పన్నం భోజనంలో ఒక తప్పనిసరి!
‘పప్పన్నం ఎప్పుడు పెడతావు?’ లాంటి పిలుపులు, పలకరింపులూ ఒకప్పుడు ఉండేవి. జొన్నకూడు, చింతతొక్కు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్క ఇవే ప్రధాన ఆహారంగా ఉన్న రోజులు గుర్తున్న వయోవృద్ధులు ఇంకా సజీవంగా ఉన్నారు. పెళ్లిలాంటి సందర్భాల్లోనే పప్పుతో కూడిన షడ్రసోపేతమైన భోజనం తినే అవకాశం ఉండేది.
కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, బఠాణి, చిక్కుడు ఇలా ప్రొటీనన్లు అధికంగా ఉండే ద్రవ్యాలన్నీ ఖరీదైనవే! కాబట్టి, ఆరుగాలం కష్టించినా గంజిలో మెతుకెరుగని పేద ప్రజలకు ప్రొటీన్ల కొరత తీవ్రంగా ఉండేది. అందుకే అంత ఆత్మీయంగా పెళ్లెప్పుడు చేసుకుంటావు అనడగటానికి పప్పన్నం ఎప్పుడు పెడతావని ఆశగా అడిగేవారు. రోజూ పప్పన్నం తినటం అంటే నిత్యకళ్యాణమే!
యావద్భారత దేశంలో తెలుగునాట పప్పన్నానికి ప్రాధాన్యత ఎక్కువ. ‘ఇలా చేస్తే పప్పులో కాలేసినట్టే’ ‘ఇక్కడ నీ పప్పులు ఉడకవు’ ‘పప్పు కూటికి ముందు, వెట్టిమూటకు వెనక’ ‘అప్పు చేసి పప్పు కూడు’ లాంటి తెలుగు జాతీయాలు తెలుగు వారికీ ముద్దపప్పుకూ ఉన్న అనుబంధాన్ని చాటి చెప్తాయి.
ప్రొటీన్ల కొరత వలన లివర్ దెబ్బ తింటుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. శరీరానికి అవసరమైన ఆల్బుమిన్ లాంటి జీవ ప్రొటీన్లను లివర్ తయారుచేస్తుంది. ప్రొటీన్లు శరీరానికి తగినంత అందకపోతే లివర్ మీద వత్తిడి పెరుగుతుంది. జీవన క్రియల నిర్వహణలో లివర్ తన సమర్థతను కోల్పోతుంది. లివర్ కణాల్లో కొవ్వు ఎక్కువగా చేరిపోతుంది. దీనే్న ‘్ఫటీ లివర్’ లేదా ‘స్టియటోసిస్’ అంటారు. వీటన్నింటికీ ఒక్కటే సమాధానం.. పప్పు! పప్పు! పప్పు!
కందులు, పెసల్లాంటి పప్పులు కేన్సర్ వ్యాధి నిరోధకంగా పని చేస్తాయి. ప్రతిరోజూ పప్పు తప్పనిసరిగా తినేవారికి మహిళల్లో రొమ్ము కేన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ కేన్సర్ ముప్పు తగ్గుతుందని ఈ కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి.
ప్రపంచ దేశీయులందరికీ ఎవరి సంప్రదాయ వంటకాలు వారికి ఉన్నాయి. కానీ ముద్దపప్పును మించిన వంటకం ఇంకొకటి లేదు. దాన్ని ‘లైఫ్ సేవింగ్ డిష్’ (ఎల్‌ఎస్‌డీ) అని రచయిత సిమోన్ మజుందార్ పిలిచారు.
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో పచ్చ కందిపప్పు, తెల్ల కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇలా కందిపప్పులో చాలా రకాల గురించి వివరించారు. తెల్ల కందిపప్పు ఆరోగ్యానికి మంచిది కాదనీ, పచ్చ కందిపప్పు చలవ నిస్తుందనీ, ఎర్ర కందిపప్పు వేడి చేస్తుందని చెప్తారు. తెల్ల కందిపప్పునకు పసుపు రంగు వేసి అమ్ముతున్న మోసాలు ఇప్పుడు పెరిగాయి. పచ్చ కందిపప్పు కడుగుతున్న కొద్దీ పచ్చనీళ్లొస్తున్నాయని గృహిణుల ఆరోపణ. దగాకోరులపైన దళారులపైన అదుపులేని ప్రభుత్వ వ్యవస్థ కారణంగా ఇలాంటివి జరుగుతాయి. కడుక్కొని తుడుచుకోవటం తప్ప మనం చెయ్యగలిగిందేమీ లేదు.
పెసలూ, మినుములకన్నా కందులు తేలికగా అరుగుతాయి. తింటే, ఉబ్బరం కలుగదు. దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. పప్పుగా వండుకోవటానికి శనగ, పెసరకన్నా అనువుగా ఉంటాయి. నీళ్ల విరేచనాల వ్యాధిలోనూ, కలరా లాంటి వ్యాధుల్లోనూ, జీర్ణకోశ వ్యాధులన్నింటిలోనూ కందిపప్పుని తినవచ్చు. ప్రతీరోజూ భోజనంలో పప్పుని తప్పనిసరిగా తినండి. ఏది ఉన్నా లేకపోయినా ముద్దపప్పు ఒక్కటీ భోజనావసరం తీరుస్తుంది. శరీర పోషకాల అవసరాలు కూడా తీరుస్తుంది. కూరగాయలు, పప్పు గలిపిన కలగూర వంటకాలు కూడా మేలు చేసేవే. కందిసున్ని కష్టంగా అరుగుతుంది కానీ, దండిగా ఉంటుంది. కంది, పెసర వంటకాలను కొద్దిగా నెయ్యితో తినటమే రుచికరం. ఆరోగ్యకరం. పప్పు వలన కలిగే దోషాలకు కమ్మని నెయ్యి విరుగుడుగా పని చేస్తుంది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com