S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిజమయిన బంధువులు

సంగీత సముద్రం తీరానికి కూడా దూరంగా నిలబడి, అలల కారణంగా పుట్టే తుంపర తగిలితే ఆహా, సంగీతం అనుకుంటున్న అతి సామాన్యుడిని నేను. కానీ భారతీయ శాస్ర్తియ సంగీతం బతుకులో భాగంగా మారింది. కేవలం వినడంతో కుదరదు. వేలాది గంటల సంగీతాన్ని కంప్యూటర్‌లో పదిలపరిచాను. అందులో కొంత భాగం నా వద్దకు స్పూల్స్, కాసెట్స్, గ్రామఫోన్ డిస్క్‌ల రూపంలో వచ్చింది. వాటిని డిజిటల్ పద్ధతిలోకి మార్చడము నాకు ఒక నిత్యకృత్యంగా మారింది. ఈ పనికి నన్ను ప్రేరేపించిన వారు, సామగ్రి అందించిన వారు నాకు నిజమయిన బంధువులు. నా బంధువులకు నేను రచయితను అన్న సంగతి పట్టదు. సంగీతం సంగతి అసలే పట్టదు. కనుకనే నాకు కూడా అటువంటి బంధువుల పట్ల అభిమానం ఎంతవరకో అంతవరకే ఉంది.
కాసెట్స్ నుంచి సంగీతాన్ని కంప్యూటర్‌లోకి మార్చడం మొదలుపెట్టి చాలాకాలం అయ్యింది. కానీ మొదట్లో, రికార్డింగ్‌ను పాటకు పాటగా వినగొట్టడం మించి, నాణ్యత గురించి పట్టించుకునే తెలివి లేదు. కన్వర్షన్ అంటే డిజిటలైజింగ్ అంటే కంప్యూటర్‌లోకి పాటను మార్చడం బ్రహ్మవిద్య కాదు. చాలామంది ఆ పని చేస్తున్నారు. కానీ, అందులో చాలా మెళకువలు ఉన్నాయి. ఈ సంగతి అందరికీ పట్టదు. ఇవేవీ తెలియని కాలంలోనే అసలు ఆ పని చేయాలని ప్రోద్బలం చేసింది బరోడా వాసి గురుమూర్తి. అతను కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలకు వీరాభిమాని. వ్యాపారం చేస్తాడు. కనుక అతనికి కొంత వెసులుబాటు ఉంది. ప్రతి సంవత్సరం సవాయి గంధర్వ ఉత్సవాలకు, మద్రాసు సంగీత ఉత్సవాలకు తప్పక వెళతాడు. వీలయినన్ని కచేరీలు రికార్డు చేస్తాడు. పక్కన కూచున్నవారు గోల చేయకూడదని వారందరికీ విక్స్ బిళ్లలు పంచిపెడతాను, అన్నాడు. అతను తిక్కమనిషి అని ముందే చెప్పాను గద! కనీసం చెప్పాలని అనుకున్నానేమో? ఒక బస్ కొంటాడట. అందులో మంచి నాణ్యతగల సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తాడట. దాన్ని తీసుకుని మనుషులు లేని అడవులలోనికి వెళ్లి సంగీతం పెట్టి వింటాడట. రాత్రి ఆలస్యమయిన తరువాత ఫోన్ చేసి, నీవు కూడా వస్తావా? అని అడుగుతాడు. మూర్తికి నా పట్ల ఎంతో అభిమానం. బరోడా నుంచి నేరుగా చెన్నై వెళ్లడు. కనీసం తిరుగుదారిలోనయినా నన్ను చూడడానికి అంటూ హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేస్తాడు. ఒకనాడు నాతో గడిపే ఏర్పాటు ఉంటుంది. తనతో కావలసినంత సంగీతం ఉంటుంది. ఒకసారి అతను నాతో ఉన్నంతసేపు అతని హార్డ్‌డిస్క్ నుంచి సంగీతం నా కంప్యూటర్‌లోకి కాపీ జరుగుతూనే ఉంది. మాట్లాడేది కూడా సంగీతం గురించి తప్ప మరొక సంగతి ఉండదు. ప్రతి సంవత్సరం తన వద్దకు చేరిన కొత్త రికార్డింగులు నాతో పంచుకునే గొప్ప మనసుగల మా ఎచ్.ఎమ్.జీ.మూర్తి బతికేది గాలి పీల్చి కాదు, సంగీతం పీల్చి అనవచ్చు.
నాకు రకరకాల రూపాలలో సంగీతం దానం చేసినవారు కొందరయితే, దాన్ని పదుగురితో పంచుకునే అవకాశం కలిగించిన వారు మరికొందరు. సంగీత ప్రియ అనే ఇంటర్‌నెట్ గ్రూప్ వారు నాకు 2011కు గాను రసికప్రియ అనే అంతర్జాతీయ అవార్డు ఇచ్చారు. ఆ బృందంలోని వారంతా మంచి మిత్రులయ్యారు. చెన్నై వెళ్లినప్పుడంతా, ప్రేమతో కలుస్తారు. కబుర్లు కలబోసుకుంటారు. ఆ గుంపులోని ఒకరిద్దరు నాకు మరింత చేరువయ్యారు. ఎస్.ఎల్.నరసింహన్ అనే యువకుని గురించి మద్రాస్‌లోనే కాదు, కర్నాటక సంగీతాభిమానులు అందరికీ తెలుసు. ఎస్సెల్ అన్నది అతని పొట్టిపేరు. అతను నాకు యింటి మనిషిగా మారిపోయాడు. అతని నాన్న పేరు నా పేరు గోపాల్, అమ్మ పేరు, మాయావిడ పేరు విజయ. అతని చెల్లెలి పేరు, నా కూతురు పేరు స్వాతి. ఎస్సెల్ ఫోన్ చేసినప్పుడు ‘అమ్మను పిలవండి’ అని మాయావిడతో మాట్లాడతాడు. అతని దగ్గర బోలెడంత సంగీతం ఉంది. పెళ్లి కూడా లేకుండా, కేవలం సంగీతంతోనే జీవనం సాగిస్తున్నాడు ఆ అబ్బాయి. మద్రాసులో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. కచేరీలను చాలా ప్రొఫెషనల్‌గా రికార్డింగ్ చేయించడానికి గొప్ప విద్వాంసులంతా అతడిని పిలుస్తారు.
ఎస్సెల్ నాకు మంచి టేప్‌డెక్ పంపించాడు. డబ్బులెందుకయ్యా? సంగీత సేవ చేస్తున్నావు. దాన్ని వాడి, మాకందరికీ మంచి సంగీతం అందించు, అన్నాడు. రికార్డింగుల నాణ్యత పెంచడానికి అవసరమయే మరొక పరికరాన్ని కూడా అమెరికా నుంచి తెప్పించి నాకు యిచ్చాడతను. నాకంటే, నీ వద్దనే ఎక్కువ సంగీతం ఉంది, అంటాడు అతను. ప్రపంచమంతా అతడిని గొప్పవాడు అంటుంది. అతను నన్ను మెచ్చుకుంటాడు. సంగీత కళానిధి సంజయ్ సుబ్రమణ్యన్ అతనికి బాల్యమిత్రుడు. అతను వెతికి అరుదయిన పాటలు సేకరించి, నేర్చుకుని పాడతాడు. అతను అడిగిన పాట తన దగ్గర లేదంటే మా ఎస్సెల్ నన్ను అడుగుతాడు. చాలాసార్లు నేను యిచ్చాను! అది ఆనందం. శ్రీరంగం గోపాలరత్నం, ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్య శర్మ, మరి కొందరు గాయకులు, వాద్యకారుల సంగీతం వారికి అందలేదు. నేను సేకరించగలిగిన రికార్డింగ్‌లో వీరివి చాలా ఉన్నాయి. అందుకని వారికి నా మీద మరింత ప్రేమ!
సంగీత ప్రియ వారికి ఒక వెబ్‌సైట్ ఉంది. అందులో అంతులేని సంగీతం ఉంది. ఆ సంగీతాన్ని అందజేసిన వారిలో ఆరుగురు ముఖ్యులు. ఆ ఆరుగురిలో విజయగోపాల్ ఒకడు. వాడే గోపాలం అన్న సంగతి చాలామందికి పట్టదు. హైదరాబాద్‌లో అనామకుడుగా బతుకుతున్న ఒక వ్యక్తి సంగీతం గురించి ఇంత చేశాడన్న సంగతి బహుశ ఎవరికీ తెలియదు. తెలిసినా పట్టించుకోరు. అయినా ఇదంతా నేను నా ఆనందం కొరకు చేస్తున్నాను గానీ, ఎవరో ఏదో యిస్తారని కాదుగదా! ఈ సేకరించిన సంగీత, సాహిత్యాలు నా తరువాత ఏమవుతాయని ఒక ప్రశ్న ఈ మధ్యన కలవరపెడుతున్నది. నా పిల్లలు దాన్ని కాపాడతారు గానీ, అంతకన్నా ఎక్కువ చేయలేరు. సంస్థాపరంగా దాన్నంతా భద్రపరిచి ప్రపంచానికి అందించాలని ప్రయత్నాలు చేశాను. కానీ కుదరలేదు.
సంగీత ప్రియలో నేను 600కు పైగా కచేరీలు, అరుదయినవి అందించాను. ఆ కృషిని గమనించిన కొందరు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలుపెట్టారు. బెంగుళూరులోని రాజాంగ శివకుమార్ చాలా కాలంగా ఆ నగరంలో జరుగుతున్న కచేరీలు రికార్డు చేశారు. వాటిలో కొన్నింటిని డిజిటైజ్ కూడా చేశారు. కానీ, ఉన్న మొత్తం సంగీతాన్ని మార్చాలంటే నా వంటి పిచ్చివాడయితే గాని కుదరదని తోచినట్టుంది. నాకు ఆయన 500కు పైగా కాసెట్స్ దానం చేశాడు. వాటిని నా వద్దకు తెప్పించడానికి మిత్రులు సాయం చేశారు. ఇద పద్ధతిలో కాంచీపురంలో ఉండే మహాలింగం గారు రేడియో రికార్డింగ్స్ వందల సంఖ్యలో నాకు ఇచ్చారు. బాంబే నుంచి, మరెన్నో చోట్ల నుంచి కొందరు నాకు రికార్డింగ్స్ పంపించారు. వారంతా నేటికీ మిత్రులుగా కొనసాగుతున్నారు.
అమెరికాలో ఉండే కృష్ణ బాలాంత్రపు నాకు యిచ్చిన సంగీత భిక్ష, అరుదయినది. అతను కూడా మిత్రుడుగా కొనసాగుతున్నాడు. అందరూ అడిగినా, అడగకున్నా ఇచ్చినవారే. మనవాళ్లు మాత్రం ఇవ్వరు. ఎంతమందిని అడిగి భంగపడ్డానో! కొమాండూరి శేషాద్రిగారు మాత్రం అట్లా కాదు. ఆయన, ఆయన పిల్లలు, నాకు నిజమయిన బంధువులుగా మారారు. శేషాద్రిగారు ఒకసారి బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో బోలెడు కాసెట్స్ బయట పడేస్తున్నారు. చూస్తే అవన్నీ బెంగుళూరులో ఈ దశకంలో జరిగిన కచేరీల రికార్డింగులు. ఆయన శ్రమ అనుకోకుండా వాటన్నింటిని నిజంగా మోసుకువచ్చి నాకు అప్పగించారు. అదే రకంగా విజయవాడలోని కుటుంబరావు గారిని పరిచయం చేశారు. ఈ రావుగారు మా అందరికంటే సంగీతం పిచ్చిగల మనిషి. కలకాలంగా బెజవాడలో కచేరీలు రికార్డు చేశారు. వాటిని సీడీలుగా మార్చి కేవలం సీడీ ధర మాత్రం తీసుకుని ఇచ్చారు. ఒకటా, రెండా? కనీసం 150 సీడీలు. సంగీతం నాకిస్తే, నేను ప్రపంచానికి ఇస్తాను. కానీ, ఈ విషయం అర్థం చేసుకోకుండా నాకు తమ సేకరణలను ఇవ్వడానికి మొరాయించిన వారి గురించి మరో వ్యాసం రాయగలను. కానీ రాయను.

కె. బి. గోపాలం