S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కనిపించవు!

చిన్నప్పుడు పల్లెలో యింటి ముందర పండుకుంటే ఆకాశంలో నక్షత్రాలు జొన్నలు ఆరబోసినట్టు సందులేకుండ కనబడేవి. పొగడ చెట్టు కింద పండుకుంటే పూలు మన మీద చుట్టూ రాలి పడతయి. అట్లనే ఈ చుక్కలు గూడ రాలి పడితే ఎంత బాగుండును అనిపించేది. ఎనె్నల కుప్పలు అని ఒక ఆట ఆడేవాళ్లము. వెనె్నల ఎట్లుంటుందో చూచి ఎంత కాలమయిందో. బతుకు పేరున పట్నం చేరిన తరువాత చుక్కలు కనిపించకుండ అయినయి. పల్లెకు పొయ్యినా అక్కడ గూడ కరెంటు దీపాలు వచ్చినయి గనుక చుక్కలు కనిపించవు. నాకు మరెవరి యింట్లోనో పడుకోవడం ఏ మాత్రం యిష్టం ఉండదు. అయినా కొన్ని సందర్భాలలో అది తప్పలేదు. అక్కడ ఏదో కార్యక్రమం ఉన్నందుకు దశాబ్దాల క్రితం ఒకటి రెండుసార్లు పల్లెల్లో ఉండవలసిన అవసరం ఏర్పడింది. అక్కడ మిద్దె మీద పండుకునే అవకాశము దొరికింది. అది చిక్కని నల్లమల అడవుల ప్రాంతము. నాగరికత అంతగా బలవని ప్రాంతము. ఆహో! మళ్లా ఒకసారి నా జొన్నలు ఆరబోసిన సీను, పొగడ పువ్వుల జ్ఞాపకాలు ముసురుకున్నయి. నిజం చెప్పాలె. ఆ తరువాత ఆ ప్రాంతపు ఊళ్లకు వెళ్లవలసిన అవసరము, అవకాశము కలిగినప్పుడల్లా కేవలము నక్షత్రాల కొరకు వెళ్లిన. వైశాఖ మాసం అంటే ఎండకాలము మొదట్లో వస్తుంది. వెనె్నల ఎంత బాగుంటుంది, అంటే, ప్రతి నిత్యము నిద్ర మిద్దె మీదనే! అసలు పల్లెలో ఉన్నంతకాలం ఏనాడూ తలుపులు బిడాయించుకుని గదిలో పడుకున్నది లేదు. వాన గనుక వస్తే వరండాలో, లేదంటే అంగణములోనే అందరము పడుకునే వాళ్లము.
ఇంతకు ఈ సంగతులు ఎందుకు మనసులో మెదలాడినయి? దినమంత ట్యాబ్‌లో, ఫోన్‌లో, ఇక చాలదన్నట్టు కంప్యూటర్‌లో చదువుతూ కూర్చోవడమే పనిగద! ఒకచోట చదువుతుంటే ఒక వార్త కనిపించింది. ‘పాలపుంత గెలాక్సీ ఇంక కనిపించదు’ అంటున్నది ఆ వార్త. పాల పుంత, గెలాక్సీ అనే మాటలు తెలియనివారు ఉండవచ్చునంటే ఎవరూ బాధపడగూడు. నాగరికతకు భయపడి దాగుండిపోయిన నక్షత్రాలు పల్లెలలో కూడ కనబడుట లేదు. మరి నాగరికత పల్లెలకు కూడ రావాలె గదూ! వచ్చింది! మినరల్ వాటర్, కరెంట్ దీపం లేని పల్లెలు లేవని కూడా ఎవరో అంటే విన్నాను. కరెంటు దీపాలు వస్తే ఇగ నక్షత్రాలు కనబడవు. అవి కనిపించిన కాలంలో అంతరిక్షంలో అంటే ఆకాశంలో చుక్కలు ఒక ప్రాంతంలో మరింత చిక్కగ కనబడేవి. నక్షత్రాలు, లక్షల కోట్ల సంఖ్యలో ఒకచోట దట్టంగా చేరిన ప్రాంతాన్ని గెలాక్సీ అంటరు. మన సౌరమండలం కూడా మిల్కీవే లేదా పాలపుంత అనే ఒక గెలాక్సీలో ఉంది. అది అంటే పాలపుంత ఆకాశంలో ఒక పక్కన పెద్ద పట్టీలాగ కనిపించేది. అన్ని నక్షత్రాలు ఉన్నందుకు అది చుక్కలుచుక్కలుగా గాక వెలుగు పరిచిన పట్టీలాగ ఉండేది. నాగరికత పేరున భూగోళం పగలు రాత్రి వెలుగుతూ ఉంటుంది. ఈ కాంతి కాలుష్యం కారణంగా ఇక మీద పాలపుంత కనిపించదని పరిశోధకులు అర్థం చేసుకున్నారు. దానే్న బాధగా ప్రకటించారు. దానే్న నేను చదివి మరింత బాధతో ఈ నాలుగు అక్షరాలు రాస్తున్నాను.
మానవ జాతి పుట్టిన నాటి నుంచి నేటి వరకు, తన అవసరాలు, సౌకర్యాలు అన్న యావ తప్ప, సమతూకం గురించిన ధ్యాస లేదు. కనుక ప్రపంచం మారిపోయింది. అంటే, మనుషులు ఇంత స్వార్థపరులుగా ఉండకూడదన్న భావం ధ్వనించినట్లయితే, అది నా తప్పు కాదు. నక్షత్రాలు కనిపించకపోతే కొంప మునుగుతుందా? లైట్లు లేకుండా బతకమంటావా? అని అడిగేవారు ఉంటారని నాకు తెలుసు! ఒక్కొక్కటిగా లెక్కపెట్టి చూస్తే మనం పోగొట్టుకుంటున్న విషయాల తీరు తెలుస్తుంది. అంతకు మించి ఒక్కొక్కటిగా మన బతుకులలో భాగమయిన విషయాలు తెరమరుగయే వేగం పెరిగిందన్న సంగతి కూడా అర్థమవుతుంది.
నేను గడిచిన నాలుగు సంవత్సరాలలో లోకాభిరామంలో సీతాఫలాల గురించి ఒకటికన్న ఎక్కువ సార్లే చెప్పినట్లు నాకు బాగ గుర్తున్నది. సీతాఫలాలు మా బతుకులలో ఎంతో ముఖ్యమయిన ఒక భాగం. వాటిని తోటలుగా పెంచి పోషించిన వారు ఎవరూ లేరు. అది అడవి పంట. ఊరు, అంటే ఇండ్లు ముగిసిన చోటి నుంచి మొదలు ఎంత దూరము పోయినా సీతాఫలం చెట్లు కనిపిస్తూనే ఉండేవి. వాటికి స్వంతదారులని ఉండరు. అవి అందరి ఆస్తి. కావలసిన వారు కోసుకుని తిని ఆ పళ్లతో కడుపు నింపుకోవచ్చు. మా ఒక్క పల్లె చుట్టు అడవుల నుంచి నిత్యం పదిహేను, పదహారు లారీల పండ్లు ఎగుమతి అయ్యేవి అంటే వాటి గురించి అర్థం చేసుకోవచ్చు. ఎవడో ఒకడు గంప నింపుకుని కాయలు అమ్ముదామని బయలుదేరుతడు. ఎవరూ కొనరని వేరుగ చెప్పనవసరం లేదు. ‘నీళ్లు పోసి పెంచినవా? అమ్ముతనని వచ్చినవు. గంప ఆడ (అక్కడ) పెట్టు. అన్నం పెడతరు. తినిపో!’ అని నాయిన అంటే ఆ మనిషి వినయముగ గంప దింపి, అన్నం తిని పోతడు. రెండునాళ్ల తరువాత వచ్చి ఖాళీ గంప తీసుకపోతడు. ఇప్పుడు బజార్లో సీతాఫలాలు అమ్ముతున్నరు. అటువంటి నాసి పండ్ల వేపు మేము కనె్నత్తి చూచిన గుర్తు కూడ లేదు. సంవత్సరంలో ఒకసారి కూడా తినకుంటే ఏదో లోటు కనిపిస్తుంది. ఎంత, అని అడిగితే, ఆపిల్‌తో సమంగ రేటు చెపుతరు. నాకు ఒక్కసారి గతం గుర్తుకు వస్తుంది. నిజం చెపుతున్నాను. నేను ఇవాళటి వరకు సీతాఫలం ఒకటి గూడ కొని తినలేదు.
అంత కమ్మని పండు మరొకటి లేదు! ఆ సీతాఫలాలు కొంతకాలం అయితే కనిపించకుండ పోతయి. వాటిని తోటలుగా పెంచే ప్రయత్నం, లేదంటే అడవులను కాపాడే ప్రయత్నం ఎక్కడన్న జరుగుతున్నదా? సీతాఫలం లేకుంటే కొంప మునుగుతుందా? మునగదు. కానీ బతుకలో ఒక భాగం తెగిపోతుంది.
అంత దూరం ఎందుకు? మామిడి తోట ఉంటే, అందులో వంద చెట్లు ఉంటే, వంద రకాలు ఉండేవి. దేని రుచి దానికే ప్రత్యేకం. వెతికి కొన్ని రకాలను సంపాయించి తినడం మాకు అలవాటు. మామిడి చెట్లు అన్నింటిని నరికనరు. కొత్త మామిడి తోటలు వేసినరు. అందులో వంద చెట్లు ఉంటే అన్నీ ఒకటే రుచి. బైంగన్‌పల్లి, బంగినపల్లి, దాని తల్లి అనగా మొత్తం మీద బేమిషాన్ అనే రకం ఒకటే ఎనభయి శాతము కనబడుతున్నయి. గడ్డం తాత పండ్లు కావాలంటే దొరుకుతయా? జొన్నలరావి పండ్లు కనీసం కనబడతయా? ఉన్నవి తినమని చెపితే, తింటాను. కానీ అసంతృప్తితో మిగిలిపోతాను. ఈసారి వేసవిలో పల్లెరకం పండ్లు ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుని తిన్నము. అదొక సంతృప్తి! కానీ పోయిన రకాలను తిరిగి తీసుకురాగల శక్తి సైంటిస్టులకు గూడ లేదు. సదాప మామిడి పేరు విన్నరా ఎవరన్న?
కనిపించకుండా పోయిన విషయాల గురించి గ్రంథం రాయవచ్చు. కప్పలు ఏమయినయి? నేను జంతుశాస్త్రం చదువుకున్న. ఆ తిక్క చదువు పేరున ఎన్ని కప్పలను, పావురాలను చంపితినో తలుచుకుంటే అసహ్యం పుడుతుంది. కప్ప కాళ్లు తింటరని, వాటిని అంటే కప్పలను పట్టి ఎగుమతి చేసిరి. అన్నింటికి మించి పొలాల మీద పురుగు మందులు వేసిరి. అంతకు ముందు కప్పలు, నత్తలు కావలసినన్ని ఉండేవి. పురుగుల మందుల పుణ్యమా అని అవి కనిపించకుండ పోయినయి. అవునుగానీ, ఇప్పుడు జంతుశాస్త్ర చదివే పిల్లలకు కప్పల కోత లేదనుకుంట! మంచి పని అయింది. వాటి మెదడు నుంచి బయలుదేరే నాడులను ప్రదర్శించాలని ఒక డిసెక్షన్. భాస్కరరావు గారని మా పంతులు ఒకాయన ఎంతటి అంకిత భావంగల వాడంటే ఎడమ చేతి బొటనవేలి గోటిని ఆయుధంగా మలిచి పెంచుకునేవాడు. ఫోర్‌సెప్స్ అవసరం లేకుండా, ఆ గోటితోనే జంతువుల శరీరాలను చీరేవాడు. కప్ప నాడులను చూపించాలంటే తనే వేలిని ఆ కప్ప నోట్లో దూర్చి లోపలి నుంచి ఒక ప్రదేశాన్ని ఎత్తి, నాడి సులభంగా కనిపించేటట్లు చేసేవాడు. నాకు అప్పుడే, అదంతా అసలు నచ్చలేదు. హాయిగా తెలుగు ఎమ్మేలో ఉండలేకపోతినా అనిపించేది. ఇప్పుడు ఆ భావం మరింత బలపడింది. పిచ్చి చదువులు గాకపోతే, కప్ప నరాల గురించి తెలుసుకున్నందుకు ఒరిగేది ఏమి? నా మిత్రులు క్షమింతురుగాక!

కె. బి. గోపాలం