S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాక్టికల్ జోక్

వెక్చీ తన బూట్లని విప్పి, కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని కాళ్లని సౌకర్యంగా రేడియేటర్ మీద ఉంచగానే డోర్ బెల్ మోగింది. మళ్లీ బూట్లు తొడుక్కోడానికి ఆగకుండా వెక్చీ లేచి వెళ్లి తలుపు తెరిచాడు.
‘ఇది రుడాల్ఫ్ వెక్చీ ఇల్లేనా?’ బయట పోర్చ్‌లో నిలబడ్డ ఓ సన్నటి నలభై ఏళ్ల వ్యక్తి ప్రశ్నించాడు.
‘అవును’ వెక్చీ బదులు చెప్పాడు.
‘అతను ఎక్కడ ఉన్నారో దయచేసి చూపిస్తారా?’
‘ఎవర్ని?’ వెక్చీ కొద్దిగా ఆశ్చర్యంగా అడిగాడు.
‘మిస్టర్ వెక్చీని. నేను అండర్‌టేకర్ని (శవ సంస్కారాలు చేసే ఈవెంట్ మేనేజర్) అతని శవానికి ఎంబామ్ చేయాలని వచ్చాను’
వెక్చీ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. కొద్ది క్షణాలు మాట్లాడలేక పోయాడు. తేరుకున్నాక అడిగాడు.
‘తమాషా చేస్తున్నావా? నేనే రుడాల్ఫ్ వెక్చీని. ఎంబామింగ్ అవసరం ఉన్నవాడిలా కనిపిస్తున్నానా?’
అండర్‌టేకర్ లోపలకి రాకుండా అడ్డు నిలబడి అడిగాడు.
జాన్ ఫ్యునరల్ పార్లర్ యజమాని ఐన జాన్ నివ్వెరపోతూ చూసాడు.
‘నా పేరు, ఈ అడ్రస్ ఎవరిచ్చారు?’ వెక్చీ అడిగాడు.
‘ఎవరో ఫోన్ చేసి, ఈ అడ్రస్ ఇచ్చి నన్ను ఇక్కడికి రమ్మన్నారు. ఈ అడ్రస్‌లోని వెక్చీ మరణించాడని, తక్షణం అతని శవానికి ఎంబామింగ్ చేయాల్సి ఉందని చెప్పాడు. మీకు అసౌకర్యాన్ని కలిగించినందుకు ఐయాం సారీ మిస్టర్ వెక్చీ. మీకా అవసరం లేనందుకు సంతోషం.’
‘మీకు ఫోన్ చేసింది ఆడా? మగా?’
‘మగ కంఠం’
‘పేరు చెప్పాడా?’
‘లేదు. మీ పొరుగింటాయన అని చెప్పాడు. పేరు చెప్పినా బహుశ మారుపేరు చెప్పి ఉండేవాడు.’
జాన్ వెనక్కి తిరిగి ఆలోచనగా సాగి, జేబులోంచి తన విజిటింగ్ కార్డుని తీసిస్తూ చెప్పాడు.
‘మిస్టర్ వెక్చీ. ఎప్పటికైనా నా సేవ మీకు అవసరం రావచ్చు. ఇది మీ దగ్గర ఉంచండి’
జాన్ బయటకి వెళ్లాక వెక్చీ కోపంగా తలుపు మూసి మళ్లీ కూర్చుని రేడియేటర్ మీద కాళ్లని ఉంచాడు. అతను జాన్‌కి ఎవరు ఫోన్ చేసారా అని బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు. బహుశ తన పేరు గల మరొకరు మరణించి ఉంటారని, జాన్ తప్పు అడ్రస్‌కి వచ్చి ఉంటాడని భావించాడు. ఐతే తన ఆలోచన మీద వెక్చీకి అనుమానం కలిగింది.
కొద్దిసేపటికి మళ్లీ డోర్ బెల్ మోగింది.
ఆ సాయంత్రం తన ఏకాంతానికి భంగం కలిగించేది ఎవరా అని చిరాకు పడుతూ లేచి వెళ్లి మళ్లీ తలుపు తెరిచాడు. ఓ పేకేజ్‌తో కొరియర్ బాయ్ బయట నిలబడి ఉన్నాడు. అతను రసీదు పుస్తకాన్ని ముందుకి చాపి చెప్పాడు.
‘దయచేసి ఇక్కడ సంతకం చేయండి’
‘ఎందుకు?’
‘మీకో పేకేజ్‌ని డెలివరీ చేయడానికి వచ్చాను’
వెక్చీ దాని వంక చూశాడు. దానికి పేపర్ చుట్టినా లోపల ఏముందో ఇట్టే గ్రహించాడు. శవం మీద ఉంచడానికి గౌరవ సూచకంగా పంపే రింగులా గుండ్రంగా అల్లిన పూల బొకే. అతను తక్షణం దాన్ని అందుకుని కాగితం చింపాడు. లోపల ఉన్నది శవం మీద ఉంచే బొకేనే. దానికి కట్టిన పింక్ రంగు కార్డ్ మీద ‘రుడాల్ఫ్ వెక్చీ’ అని బంగారు అక్షరాలతో రాసి ఉంది.
వెక్చీ మొహం కోపంతో జేవురించింది. ఆ పూల బొకేని అతని మెడకి వేలాడదీసి ఉగ్రంగా అరిచాడు.
‘వెళ్లు అవతలకి’
‘సంతకం సర్?’ వాడు బిత్తరపోతూ అడిగాడు.
‘సంతకం లేదు. గింతకం లేదు’
వాడి మొహం మీదే తలుపు మూశాడు. కొద్ది క్షణాల తర్వాత తమాయించుకుని తలుపు తీసి బయట ఏం చేయాలో తెలియక నిలబడ్డ కొరియర్ బాయ్‌ని చూసి అడిగాడు.
‘సారీ... దీన్ని ఎవరు పంపారు? నేను చావలేదు. నేనే రుడాల్ఫ్ వెక్చీ.’
‘ఓ సారీ సర్... మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం. మా ఆఫీస్‌కి ఫోన్ చేసి ఆ వివరాలు తెలుసుకోండి’
అతను జేబులోంచి ఓ విజిటింగ్ కార్డ్ తీసిచ్చాడు. తర్వాత బతిమాలుతున్నట్లుగా అడిగాడు.
‘ఇందులో నా తప్పు లేదు కదా సర్? దయచేసి రసీదు మీద సంతకం చేస్తారా?’
వెక్చీ రసీదు మీద సంతకం చేసిచ్చాడు.
‘దీన్ని తీసుకోరా?’ అతను పూలగుత్తిని చూపిస్తూ అడిగాడు.
‘చెత్తబుట్టలో పారేయ్’ మళ్లీ కోపంగా అరిచి వెక్చీ తలుపు మూసాడు.
కూర్చుని ఆవేశం తగ్గాక ఆలోచించసాగాడు. ఇందాక తను అనుమానించినట్లుగా జాన్ పొరపాటుగా తప్పు చిరునామాకి రాలేదు. ఎవరో అతన్ని తన దగ్గరికి పంపారు. కొంత డబ్బు ఖర్చు చేసి, తనకి అందుతుందని తెలిసి శవానికి పంపే పూలగుత్తిని పంపారు.
ఇది ఎవరి పనై ఉండచ్చు?
ఎవరో తన చావుని గాఢంగా కోరుకుంటున్నారని వెక్చీకి అనిపించింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కూడా అనిపించింది. లేదా తన మిత్రుల్లో ఎవరైనా తన మీద ప్రాక్టికల్ జోక్ వేసారా? అదే నిజమైతే త్వరలో వాళ్లంతట వాళ్లే తనకి చెప్తారు. ఆ ఆలోచన అతనిలో కోపాన్ని పారద్రోలి శాంతిని కలిగించింది.
పావుగంట తర్వాత టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని చెప్పాడు.
‘హలో’
అవతలి వైపు క్షణకాలం నిశ్శబ్దం.
‘హలో. ఎవరు?’ వెక్చీ అడిగాడు.
‘మీరు ఎవరు?’
‘ఓ! రిచర్డ్ . ఏమిటి?’ గొంతుని గుర్తుపట్టి అడిగాడు.
‘వెక్చీ?’
‘అవును. వెక్చీనే. ఏమిటి సంగతి?’ వెక్చీ ప్రశ్నించాడు.
‘నువ్వు... నువ్వు.. నీకేం కాలేదా?’
‘కాలేదు. అదేం ప్రశ్న?’
‘ఇప్పుడే ఎవరో నాకు ఫోన్ చేసి నువ్వు అరగంట క్రితం హార్ట్ ఎటాక్‌తో పోయావని చెప్పారు. దాంతో నీకు ఫోన్ చేస్తున్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది?’
‘బ్రహ్మాండంగా ఉంది’
‘హార్ట్ ఎటాక్?’
‘రాలేదు. ఆ తప్పుడు సమాచారం చెప్పిన దుర్మార్గుడు ఎవరు?’
‘తెలీదు’
‘మగ కంఠమా?’
‘అవును. ఇంకా చాలామందికి చెప్పాలి. మీరు కూడా తెలిసిన వారికి చెప్పండి అని చెప్పి లైన్ కట్ చేసాడు’
‘ఎవరికైనా చేసావా?’ వెక్చీ సందేహిస్తూ అడిగాడు.
‘మన బాస్‌కి. సోలెన్‌కి. ఐడాకి... సారీ అది నిజమని నమ్మాను’
‘మళ్లీ వాళ్లకి ఫోన్ చేసి అబద్ధమని చెప్పు. నా మీద ఎవరు ప్రాక్టికల్ జోక్ వేసారో చెప్పగలవా?’ వెక్చీ అడిగాడు.
‘తెలీదు. అది నీకే బాగా తెలియాలి’
అతను మరోసారి సారీ చెప్పి అవతలి వైపు రిసీవర్ని పెట్టేసాక వెక్చీ ఫోన్ మళ్లీ మోగింది. అది అతని
అక్కయ్య నించి. తను క్షేమంగానే ఉన్నానని చెప్తే, ఆశ్చర్యపోయింది. మాట్లాడటం పూర్తయ్యాక ఆలోచించి హుక్‌ని నొక్కి, వదిలి స్థానిక పోలీస్‌స్టేషన్ నంబర్‌కి డయల్ చేశాడు. డెస్క్ సార్జెంట్ టోనీ లైన్‌లోకి వచ్చాక చెప్పాడు.
‘నా పేరు రుడాల్ఫ్ వెక్చీ. నేను బతికే ఉన్నాను... కాని...’ తన బాధని వివరించాడు.
అలాంటి చాలా వింత ఫిర్యాదులని తన సర్వీస్‌లో విని ఉన్న సార్జెంట్ టోనీ ఎవర్నైనా వెంటనే పంపిస్తానని చెప్పాడు. ఆ తర్వాత వెక్చీకి ఫోన్‌ల వెల్లువ ఆరంభమైంది. అతని బంధుమిత్రులు అతను పోయాడని అనుకుని ఫోన్‌లు చేసి ‘మిస్టర్ డిక్’ కోసం అడగసాగారు.
‘మిస్టర్ డిక్? ఆ పేరు గల వాళ్లెవరూ ఇక్కడ లేరు’ వెక్చీ జవాబు చెప్పాడు.
‘వెక్చీ పోయాడని, అక్కడ మిస్టర్ డిక్ అన్ని వ్యవహారాలు చూస్తున్నాడని ఎవరో ఫోన్ చేసి చెప్పారు?’
వెక్చీ అందరికీ తను జీవించే ఉన్నాడని, ఎవరో తన మీద ప్రాక్టికల్ జోక్ వేసారని చెప్పాడు. చివర్లో చెప్పాడు.
‘నేను జీవించే ఉన్నానని తెలిసి నిరాశ చెందే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. మీరు అలాంటి వారు కాదని ఆశిస్తాను’
ఇరవై నిమిషాల తర్వాత డోర్ బెల్ మోగింది. పోలీస్ సార్జెంట్ టోనీ వచ్చాడు. జరిగింది అతనికి వెక్చీ మరోసారి వివరిస్తూంటే అతను మధ్యమధ్యలో నవ్వుతూ నోట్‌బుక్‌లో రాసుకున్నాక అడిగాడు.
‘మీకు శత్రువులు ఎవరున్నారు?’
‘ఎవరూ లేరు’
‘అజాత శత్రువుగా ఈ కాలంలో ఎవరూ ఉండలేరు. చెప్పండి. ఎవరికి మీరంటే ద్వేషం ఉంది?’
‘ఐ మీన్, నేను చావాలని కోరుకునేంత శత్రువులు ఎవరూ లేరు. మా నాన్న పోయాక ఆస్థి పంపకాలు జరిగాయి. మా బావగారు నేను వాళ్లని మోసం చేసి, మా నాన్నతో ఆస్థి మొత్తం రాయించుకున్నానని ఆరోపించారు. ఐనా అది ఎనిమిదేళ్ల క్రితం సంగతి. ఆ తర్వాత చాలాసార్లు కలిసాం. ఆ ద్వేషం ఆయనలో లేదనే చెప్పాలి’
‘ఎక్కడైనా ద్వేషం పెరుగుతూంటుంది తప్ప తగ్గడం జరగదు. ఇంకా? మీ భార్య వైపు?’
‘మా ఆవిడ పోయి నాలుగేళ్లయింది. కారు ప్రమాదం. ఆ తర్వాత అటు వైపు వాళ్లతో నాకు సంబంధాలు లేవు’
‘ఆఫీస్‌లో?’
కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు.
‘ఊహు. ఎవరితో పేచీలు లేవు’
అతను మరి కొన్ని ప్రశ్నలు వేసాక చెప్పాడు.
‘సరే. విచారిస్తాం’
డోర్ బెల్ మోగింది. వెక్చీ తలుపు తెరిచాడు.
అతని పక్కనే బాడీని మోసుకెళ్లడానికి వెంట వచ్చిన వాడు ఉన్నాడు.
‘ఎవరి బాడీ? వెక్చీదా?’ సార్జెంట్ అడిగాడు.
‘అవును’
‘లోపలకి రండి’
సార్జెంట్ వాళ్లని ప్రశ్నించాడు. అదే కథ. లేట్ రుడాల్ఫ్ వెక్చీ బంధువుగా చెప్పుకున్న ఒకతను ఫోన్ చేసి, ఆ చిరునామాకి వచ్చి, వెక్చీ శవాన్ని ఫ్యూనరల్ హోంకి తరలించమని గంట క్రితం కోరాడు.
‘సారీ. వ్యాపారం పోయి టైం వృధా ఐంది’ అతను గొణుక్కుంటూ వెళ్లాడు.
వెక్చీ బాధగా చెప్పాడు.
‘చూసారా? బతికుండగానే ఎవరో నన్ను చిత్రవధ చేసి చంపుతున్నారు. మీరు వాడిని వెంటనే పట్టుకోవాలి’
‘ఇది ఎవరో ఆరంభించిన ప్రాక్టికల్ జోక్’ సార్జెంట్ చెప్పాడు.
‘అతను ఎవరో కనుక్కోండి’
‘అలాగే. తెలీగానే మీకు ఫోన్ చేస్తాను’
మరికొద్దిసేపటికి కేటరర్ ఫోన్ చేశాడు.
‘ఎంతమంది భోజనం పంపాలి?’ అడిగాడు.
‘సారీ. పంపక్కర్లేదు. చచ్చినతను మళ్లీ లేచి కూర్చున్నాడు. బంధుమిత్రులంతా వెళ్లిపోయారు’ చెప్పి కోపంగా రిసీవర్ పెట్టేసాడు.
* * *
రెండు వారాలు గడిచినా వెక్చీ మీద ఎవరు ప్రాక్టికల్ జోక్ వేసారో తెలీలేదు. పోలీసుల విచారణలో ప్రగతి కనిపించలేదు. కారణం వాళ్లకి ఎక్కడా దోషి వర్ణన కాని, ఇతర వివరాలు కాని దొరకలేదు. అన్ని సందర్భాల్లో దోషి ఫోన్‌లోనే మాట్లాడాడు. ఆ కాల్‌ని రిసీవ్ చేసుకున్న వాళ్లు ఆ కంఠాన్ని గుర్తు పట్టలేమని చెప్పారు.
‘వెక్చీ! ఎవరో కాని మీ మీద బాగా పగతో ఉన్నారు. మిమ్మల్ని చంపాలనేంత. అది చెయ్యలేక ఈ పని చేసి పగ చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నార. కాని అది చల్లారడం లేదు. లేదా ప్రాక్టికల్ జోక్‌గా మొదలెట్టి ఇంత దూరం వచ్చాక తన పేరు బయట పెట్టడానికి సిగ్గు పడినట్లున్నాడు’ సార్జెంట్ టోనీ చెప్పాడు.
మరో వారం గడిచాక మళ్లీ కథ పునరావృతమైంది. వెక్చీ అందరకీ జవాబులు చెప్పలేక సతమతమయ్యాడు.
మరో రెండువారాల తర్వాత కూడా అదే పునరావృతం అయ్యాక వెక్చీ ఇంకో బ్రాంచికి బదిలీని కోరాడు.
‘నన్ను ఎక్కడికి బదిలీ చేస్తున్నారో బయటి వాళ్లకి ఎవరికీ చెప్పకండి’
‘వాడెవడో తెలుసుకోకుండా పారిపోతావా?’
‘ఆ పని పోలీసులు చూసుకుంటారు. నాకు నా మనశ్శాంతి ముఖ్యం. రాత్రుళ్లు పీడకలలతో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టడం లేదు’
‘సరే. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ మీద బదిలీని రికమండ్ చేస్తూ హెడ్డ్ఫాస్‌కి రాస్తాను’ బాస్ చెప్పాడు.
మరో వారం తర్వాత వెక్చీ షికాగో నించి పధ్నాలుగు వందల మైళ్ల దూరంలోని చిన్న ఊరికి వెళ్లిపోయాడు. అతనికి వీడ్కోలు పార్టీ ఇచ్చారు. మర్నాడు మధ్యాహ్నం వెక్చీ తన కొలీగ్, మిత్రుడు థామస్ ఇంట్లో షికాగోలోని ఆఖరి భోజనం చేసాక వెక్చీని ఆ దంపతులు ఎయిర్‌పోర్ట్‌లో దింపారు.
తిరిగి వెళ్తూ కారు డ్రైవ్ చేసే థామస్ పక్కన కూర్చున్న అతని భార్య చెప్పింది.
‘నేను చెప్పలా?’
‘నిజమే. మంచి ఆలోచనే చేసావు. వెక్చీకి రావాల్సిన ప్రమోషన్ ఇప్పుడు నాకు వస్తుంది. అతన్ని తొలగించడానికి మనం హత్య చేయలేంగా?’ థామస్ నవ్వుతూ ఆనందంగా చెప్పాడు.
*
(ఈ కథ ఆధారంగానే కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ యుగంధర్ పాత్రతో, ‘ప్రాక్టికల్ జోకర్’ అనే 144 పేజీల నవలని 1960లలో రాసారు.)
*
(లేరి ఎలెన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి