S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంగీతం - స్నేహం

సంగీత కచేరీకి వెళ్లడం, వినడం, సంతృప్తి కొన్ని సందర్భాలలో అసంతృప్తితో తిరిగి రావడం వింత కాదు. చాలా కాలంగా కొంతమంది ఆ కచేరీలను రికార్డ్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. స్పూల్ టేప్ రికార్డర్ మాత్రమే ఉండే కాలంలో కూడా రికార్డింగ్ చేయడం. కాపీలు తీసి కావలసిన వాళ్లతో పంచుకోవడం నడుస్తూనే ఉన్నది. కానీ చేతిలో నాలుగు కాసులు ఆడడం మొదలయిన మరుక్షణం ఒక టేప్‌రికార్డర్ కొన్నాను. రేడియోలో వచ్చే మంచి కచేరీలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. అట్లాగని నేను వందల కచేరీలు రికార్డ్ చేసుకోలేదు. ఇవాళ ఇంట్లో వేల గంటల సంగీతం చేరింది. వేల కాసెట్స్, కొన్ని స్పూల్ టేప్‌లు జమ కూడినయి. వాటిని డిజిటైజ్ చేయడం, అంటే కంప్యూటర్‌లోకి మార్చడం కొన్ని సంవత్సరాలుగా కుటీర పరిశ్రమగా సాగుతున్నది.
నాలాంటి వాళ్లు కొందరు అప్పటికే సంగీత ప్రియ అనే నెట్‌గ్రూప్ మొదలుపెట్టారు. మార్చిన సంగీతాన్ని అందరితోనూ పంచుకుంటున్నారు. చూస్తూండగానే శ్రీనీ అనే తెలుగు తమిళుని కారణంగా గ్రూప్ వారికి స్వంత వెబ్‌సైట్ వచ్చింది. అందులో ఇవాళ అంతులేని సంగీతం, అందరికీ ఉచితంగా అందుతున్నది. ఆ సైట్‌కు సంగీతం అందించిన వారు చాలామంది ఉన్నారు. వారిలో ఆరుగురిని ‘ప్రాలిఫిక్’ దాతలుగా పేర్కొన్నారు. అంటే వాళ్లు చాలా సంగీతం ఇచ్చారు, ఇస్తున్నారని అర్థం. ఆరుగురిలో భవదీయుడు గోపాలం, విజయగోపాల్ అనే పేరుతో కనబడతాడు. కారణాంతరాల వల్ల ఈ మధ్యన ఆపి పెట్టాను కానీ, నేను అరుదయిన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అభిమానులకు అందజేశాను. అందుకుగాను ‘రసిక ప్రియ’ అనే అంతర్జాతీయ బహుకృతి కూడా అందుకున్నాను.
నేను రేడియోలో ఉద్యోగం చేసిన మాట నిజం. అక్కడ పెద్ద అధికారిగా ఉండేవాడిని. కానీ అప్పట్లో అక్కడి సంగీతం ఇంటికి తేవచ్చు అన్న ఆలోచన కూడా రాలేదు. సేకరణ ఉద్యోగం వదిలిన తరువాత మొదలయింది. సంగీత ప్రియ గ్రూప్‌లోకి, ఎట్లా ప్రవేశించాను అన్న వివరాలు నిజంగా గుర్తు రావడంలేదు. ఒక్కొక్కటిగా కచేరీలు అందించడం మొదలుపెట్టాను. చాలులే అనుకుంటున్న సందర్భంలో బరోడా వాసి గురుమూర్తితో నెట్ పరిచయం అయింది. అతను వ్యాపారవేత్త. కలిగినవాడే అనిపిస్తుంది. అయితే నాలాగే కొంచెం తిక్కమనిషి. మూర్తి నాకు ఒక బోధన చేశాడు. ఇంట్లో వందలాది కాసెట్స్ చేరితే వినడం తగ్గిపోతుంది. ధ్యాసగా వినడం మరింత తగ్గిపోతుంది. డిజిటైజేషన్ చేయడం మొదలుపెడితే, ప్రతి నిమిషం ధ్యాసగా వినవలసి వస్తుంది. అప్పుడు సంగీతంలోని రుచి మరింత బాగా తెలుస్తుంది అన్నాడు అతను. మిత్రుడు, వేణుగాన విద్వాంసుడు ఎన్.ఎస్.శ్రీనివాసన్ సేకరించిన రికార్డింగ్‌లను ఆయన సతీమణి శారదమ్మ దయతో నాకు ఇచ్చింది. ఇక కంప్యూటర్ వాడకం బాగా తెలుసు గనుక, కాసెట్‌లోని రికార్డింగ్‌ను రకరకాలుగా డిజిటైజేషన్ నా అంత నేనే నేర్చుకున్నాను. పాటలను విడగొట్టడం, గోల తొలగించడం మొదలయినవన్నీ వచ్చేశాయి. మిత్రులు సాయం చేశారు. అయితే సంగీతం ఎంతకాలమని దొరుకుతుంది? అక్కడే సంగీత మైత్రి మొదలయింది. సంగీత దానం మొదలయింది.
మద్రాస్‌లో అంటే చెన్నయ్‌లో త్యాగరాజన్ అని ఒక పెద్ద మనిషి. తొంభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు. డబ్బులకు కొదవలేదు గానీ పలకరించే వారు లేరు. ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. అతను చాలా కాలంగా సంగీతం రికార్డింగ్‌లు సేకరించాడు. చాలా భాగాన్ని మార్పించాడు కూడా. చెవులు వినిపించవు. ఒకడే ఉంటాడు. ఆయనకు ఎందుకో నా మీద అభిమానం మొదలయింది. సంగీత ప్రియ గ్రూపులో నేను చర్చలలో పాల్గొన్నందుకు ఇలాంటి ఎందరో నన్ను గుర్తుంచుకుని పలకరించారు. తన దగ్గరున్న సంగీతమంతా నాకు ఇస్తనని ఆయన ప్రతిపాదించాడు. ఇంకేముంది? పండగే. ఎవరూ సాయం లేకున్నా పాపం ఆయన రికార్డింగ్‌లు పంపడం ప్రారంభించాడు. వాటి నాణ్యత అంత బాగుండేది కాదు. నేను శక్తియుక్తులనంతా ఉపయోగించి, రికార్డింగ్‌ల నాణ్యత పెంచి, గ్రూప్‌లో పంచడం సాగించాను. అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. త్యాగరాజన్ వయసు చెప్పాను గదా! మరీ పాత రికార్డింగ్స్ ఆయన దగ్గర నుంచి రాసాగాయి. ఒక్కసారిగా మహారాజపురం విశ్వనాథ అయ్యర్ రికార్డింగ్స్ షేర్ చేశాను. ఆయన రికార్డింగ్‌లు రెండు మాత్రమే చలామణీలో ఉన్నాయి. అటువంటిది ఒక్కసారిగా మూడు రికార్డింగ్స్ నేన యిచ్చేసరికి అందరూ బిత్తరపోయారు. నిజానికి నాకు, నా సాంకేతిక నైపుణ్యానికి గుర్తింపు కలుగుతుండగా, సంగీతం దానం చేసినవారు చాలమాంది ఉన్నారు. వారిలో మళ్లీ ‘ప్రాలిఫిక్’ వాళ్లను గురించి ముందు చెపుతాను. త్యాగరాజన్‌తో దోస్తీ రానురాను వ్యక్తిగత స్థాయికి చేరింది. ఆయనకు నేను ఆత్మబంధువులాగ కనిపించసాగాను. పెద్ద అక్షరాలతో నిత్యం మెయిల్ పంపుతాడు. కంప్యూటర్ వాడకం మాత్రం ఆయనకు బాగా వచ్చు. ఫోన్ చేసి మాట్లాడాలి అంటే, చెవులు వినిపించవు. వసతుల గురించి, తిండి గురించి, కొడుకు గురిచి ఆంతరంగిక విషయాలు కూడా నాతో పంచుకోసాగాడు ఆయన. నాకు తెల్లజుట్టు పట్ల గౌరవం ఎక్కువ. త్యాగరాజన్ తన ఫొటో కూడా పంపించాడు. అందాడు. కానీ నిస్సహాయుడు. తన భార్య ఫొటో పంపించాడు. ఆమె వీణ విద్వాంసురాలు. పేరు కమల. ఎంత కష్టపడి దాచుకున్నాడో గానీ, ఆమె వీణావాద్యం రికార్డింగ్స్ నాకు ఇచ్చాడు. వాటిని పంచడం కొంచెం కష్టం అయింది.
గ్రూప్ పెరిగింది. సంగీతం ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. కనుక వచ్చే సంగీతం మీద కొంత నియంత్రణ మొదలయింది. కనుక కమలగారి సంగీతం అంత సులభంగా ఎక్కించలేక పోయాను. కానీ, అప్పటికి నేను ఒక బ్లాగ్ మొదలుపెట్టాను. అరుదయిన సంగీతం ముక్కలను అందులో వినే పద్ధతిలో పెట్టే ఒక ‘శ్రవణం’ సిరీస్ మొదలుపెట్టాను. అన్నట్టు ఆ బ్లాగ్ పేరు లోకాభిరామం. అక్కడి నుంచే ఈ కాలం ఆలోచన, నాకు కాదు, పత్రిక వారికి మొదలయింది. ఇప్పుడు బ్లాగ్ కొంచెం మందగించింది. కాలం మాత్రం అయిదవ సంవత్సరంలో అడుగుపెట్టింది. మొదటి మూడు సంవత్సరాల వ్యాసాలు రెండు సంకలనాలుగా బజార్లోకి ఈ మధ్యనే వచ్చాయి. అయితే అది ప్రస్తుతం అప్రస్తుతం.
నా బ్లాగ్‌లో సంగీతం వినే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. సంవత్సరాలుగా నేను కొత్త పోస్ట్‌లు చేయకున్నా, పాత రికార్డింగ్స్ వినేవారు, మిగతా అంశాలు చదివేవారు వస్తూనే ఉన్నారు. అక్కడ కమలగారి వీణ అందరి దృష్టిలో పడింది. ముసలాయన సంతోషానికి అంతం లేదు. ఇంచుమించు కంటనీరు పెట్టుకున్నాడు. నేను ఆయనను ఇంటికి తీసుకురావాలన్న ఆలోచనలో పడ్డాను. ఆయన వద్ద చేరిన సంగీతం మొత్తం నాకు చేరింది. సంతోషం పట్టలేక పెద్దాయన, వద్దంటున్నా నాకు ఒక బహుమతిని పంపించాడు. ఆయన ఇచ్చిన సీడీలన్నీ వినడానికి నాకు ఒక డిస్క్‌మన్ పంపించాడు. అది నా దగ్గర పదిలంగా ఉంది. త్యాగరాజన్ మాత్రం లేడు. నేను చెన్నయ్ వెళ్లి చూడాలి ఆయనను అనుకుంటూ ఉండగానే పాపం తాను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పుడు ఆయన కుమారుడు అమెరికా నుంచి వచ్చాడు. అతను తండ్రి మెయిల్ తీయగలిగాడు. నాకు వార్త తెలియజేస్తూ ఒక సందేశం వంటిది రాశాడు. ‘నాన్న ఒంటరివాడు. ఆయన చివరి రోజుల్లో నీ వల్ల ఎంతో సంతోషం పొందగలిగాడు. ఆ సంగతి నాకు తెలుసు. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియదు’ అన్నాడు అతను మెయిల్‌లో. నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి.
పెద్దాయన తన అనుభవాలను రాసేవాడు. కలకత్తాలో తాము ఉండగా మదురై మణి అక్కడ కచేరీకి రావడం, చలికి తట్టుకోలేక సతమతమవుతున్న ఆయనకు తాను రజారుూ లేదా మరొకటి ఇవ్వడం, ఆయన కమలామనోహరి పాడటం, ఎన్ని సంగతులో? సంగీతానికి సంబంధించని సంగతులు కూడా చాలా చెప్పాడు పెద్దాయన. అన్నట్టు కంప్యూటర్ కారణంగా ఆయన ఫొటో నాకు మిగలలేదు. పోయింది!
కేవలం సంగీతం కారణంగా నాకు మిత్రులయిన వారు చాలామంది ఉన్నారు. వారిలో కొందరు మరీమరీ సన్నిహితులయ్యారు. వాళ్లందరినీ నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. పుస్తకాలు, సంగీతం ఇచ్చిన వారు నా బతుకు నాణ్యత పెంచారు. వారిని ఎట్లా మరవగలను?

కె. బి. గోపాలం