ఓ ప్రశ్న, ఓ జవాబు
Published Monday, 8 February 2016యూనివర్సిటీ హాస్టల్‌లో మా రూం పక్కన ఓ మిత్రుడు ఉండేవాడు. అతనిది వేరే జిల్లా. నాది వేరే జిల్లా. బాగా డబ్బు సంపాదించాలన్నది అతని కోరిక.
కలిసిన ప్రతిసారి డబ్బులు ప్రస్తావన తెచ్చేవాడు. తాను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి బాగా డబ్బు సంపాదించాలని అతని కోరిక. ‘లా’ చదువు అయిపోయిన తరువాత ఎవరి బతుకు వేటలో వాళ్లు పడిపోయాం. కొత్తలో కొన్ని నెలలు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆ కొంతకాలానికి ఉత్తరాలు తగ్గిపోయి పండుగలకి, కొత్త సంవత్సరాలకి గ్రీటింగ్‌లు పంపుకునే వరకు వచ్చాం. ఆ తర్వాత తర్వాత అది కూడా ఆగిపోయింది. మొబైల్ ఫోన్లు, వాట్సప్‌లు లేని కాలం అది.
నేను న్యాయవాద వృత్తి వదిలి న్యాయమూర్తి ఉద్యోగంలోకి మారడం, వివిధ ప్రాంతాలు తిరిగి హైదరాబాద్‌కి చేరుకోవడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఓ రోజు మా మిత్రుడు ఇంటికి వచ్చాడు.
కాసేపు కాలేజీ ముచ్చట్లు, హాస్టల్ విషయాలు మాట్లాడుకున్న తరువాత పిల్లల గురించి మాట్లాడుకున్నాం.
ఆ తరువాత ఆదాయ సంపాదన వైపు మా సంభాషణని మరలించాడు మా మిత్రుడు.
తాను బాగా సంపాదించానని చెప్పాడు. శామీర్‌పేటలో 50 ఎకరాల తోట ఉందని, నగరంలో పెద్ద ఇల్లు ఉందని, ఇంకా నాలుగైదు ప్లాట్లు, కరీంనగర్‌లో రెండు ఇండ్లూ కట్టించానని చెప్పాడు. ఓ యాభై లక్షలు బ్యాంక్‌లో వున్నాయని చెప్పాడు. ఇంకా ఏమేమో చెప్పి, నా వైపు చూశాడు. ఆ చూపులోని ఆంతర్యం తెలిసిందే. నేను ఏం సంపాదించానని అతని ప్రశ్న.
నా దగ్గర ఏం ఉంటాయి. ఊళ్లో వున్న స్థలం అమ్మి హైదరాబాద్‌లో ఓ ప్లాట్ కొనుక్కున్నాను. ఓ యాభై పుస్తకాలు. మూడు వందల కవితలు, ఓ రెండు వందల కథలు, లెక్కలేనన్ని వ్యాసాలు రాసి ఉంటాను. మనసులో ఇవి చెబుతామని అనుకుంటూ వుండగా మళ్లీ నా వైపు చూశాడు నా మిత్రుడు.
ఏం వుంది!
కొన్ని వందల కవిత్వాలు/ కొన్ని పదుల కతలు
మరికొన్ని వందల వ్యాసాలు
మోపెడు డైరీలు
దాన్నిండా/ గీతలు అక్షరాలు
కొట్టివేతలు
పక్షులూ, పద చిత్రాలు
జీవిత చిత్రణలు, మరెన్నో జీవన రేఖలు
ధ్వనులూ, ప్రతిధ్వనులూ/ ఉత్ప్రేక్షలు, ఉపమానాలు
మరికొన్ని లెక్చర్ నోట్స్
ఇదే
నా ఆస్తి
ఇంకా
మా ఇద్దరు పిల్లలు
ఇదే నా జీవితం/ ఇంతే నా జీవితం
ఇంతే కాదు మిత్రమా
ఓ టేబుల్, ఓ కుర్చీ
గినె్న నిండా పండ్లు
పాడుకోవడానికి పిల్లనగ్రోవీ
ఇంతకన్నా
ఇంకా
ఏం కావాలి చెప్పు.