S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరణం లేని చోటు

మనిషి పుట్టడం, పెరగడం, మరణించడం సహజంగా ప్రకృతిలో జరిగే విషయాలు. కాని మనిషి మరణించి మట్టిలో కలిసిపోవడాన్ని శివ జీర్ణించుకోలేక పోయాడు. పైగా సృష్టిలో ఎక్కడో మరణం లేని చోటు ఉంటుంది. తాను అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండిపోవచ్చు అనుకున్నాడు. ఒకరోజు ఇంటి నుండి బయలుదేరాడు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎంత బతిమలాడినా వినలేదు. మరణం లేని చోటును తను కనిపెడతాను అని దృఢ నిశ్చయంతో ఇల్లు విడిచిపోయాడు. అతని కుటుంబం అతని కోసం ఎంతో విలపించింది.
శివ కొన్ని రోజులు ప్రయాణించి ప్రయాణించి మరణం లేని చోటు గురించి కనిపించిన వాళ్లనల్లా ప్రశ్నిస్తూ సమాధానం రాకున్నా పట్టుదల వదలకుండా సాగిపోయాడు. అలా ఒకరోజు వెళుతూ ఉంటే ఎదురుగా పెద్ద గుట్ట కనిపించింది. అది రాళ్లతో నిండి ఉంది. తెల్లటి గడ్డమున్న ఒక ముసలి వ్యక్తి ఆ రాళ్లను తోపుడు బండిలో నింపి తీసుకుపోతున్నాడు. శివ ఆ ముసలి వ్యక్తితో మరణం లేని చోటు గురించి అడిగాడు. ముసలతను ‘ఆ సంగతి అయితే తెలీదు కానీ ఈ గుట్టలోని రాళ్లను తీసేసి చదును చేసేంత వరకు నేను బతుకుతాను. నువ్వు నాతోబాటుంటే అన్నాళ్లు బతుకుతావు’ అన్నాడు. ‘ఎన్నాళ్లు?’ అన్నాడు శివ. వంద సంవత్సరాలు అన్నాడు ముసలతను. ఐతే వంద సంవత్సరాల తరువాత ఉండవన్న మాట. నేను వెళుతున్నా అని శివ సాగిపోయాడు. మరుసటి రోజు ఒక అరణ్య మార్గంలో వెళుతూ ఉంటే ఒక ముసలతను చెట్టు నరుకుతూ కనిపించాడు. శివ మరణం లేని చోటు గురించి అడిగాడు. ఆ వృద్ధుడు ‘ఆ సంగతేమో కానీ ఈ అడవిని నరికే పనిలో ఉంటే చాలా కాలం జీవించవచ్చు’ అన్నాడు. ఎనే్నళ్లు అని శివ అడిగితే మూడు వందలేళ్లు అన్నాడు వృద్ధుడు. అంతేనా అని పెదవి విరిచి శివ సాగిపోయాడు. కొన్నాళ్లకు ఒక సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బాతు సముద్రం నీళ్లు తాగుతుంది. ఒక ముసలివాడు చూస్తున్నాడు. మరణం లేని చోటు గురించి శివ అడిగాడు. ‘మరణం లేని చోటు సంగతేమో గానీ ఈ బాతు సముద్రం నీళ్లు తాగేదాకా మనం బతికి ఉండవచ్చు’ అన్నాడు. ఎనే్నళ్లని శివ అడిగితే ఐదు వందలేళ్లు అన్నాడు ముసలాడు. తరువాత ఎలా అనుకుంటూ శివ సాగిపోయాడు.
ఒకరోజు నిర్జన ప్రదేశంలో సాగిపోతోంటే ఆ సాయంత్రం వెండి రంగులో ధగధగలాడుతున్న భవనం కనిపించింది. శివ వెళ్లి తలుపు తట్టాడు. మోకాళ్ల దాక తెల్లటి గడ్డమున్న వృద్ధుడు తలుపు తెరిచాడు. ‘మరణం లేని చోటు’ అని శివ అనగానే ‘ఇదే! నువ్వు నిర్మలంగా ఉండొచ్చు’ అని ఆహ్వానించాడు. నిద్ర, ఆహారం, ఆకలి వేటితోను నిమిత్తం లేకుండా హాయిగా, ఉల్లాసంగా కాలం సాగిపోయింది. ఒకరోజు శివ ‘మా కుటుంబం వాళ్లని చూడాలనుంది’ అన్నాడు. వృద్ధుడు వాళ్లెప్పుడో చనిపోయారన్నాడు. ‘పోనీ మా ఊరు చూసొస్తా’ అన్నాడు. వృద్ధుడు ఒక తెల్ల గుర్రాన్ని ఇచ్చి ‘వెళ్లిరా, కానీ గుర్రం మాత్రం దిగకు’ అన్నాడు.
శివ ఉత్సాహంగా గుర్రమెక్కి వాయు వేగంతో తన ఊరు చేరాడు. కానీ మారిపోయిన పరిసరాలతో కలత పడి తిరిగి బయల్దేరాడు. గుర్రం మీద సాగుతూ ఉంటే పాత చెప్పుల కుప్పను తోపుడు బండిలో నింపుకున్న వృద్ధుడొకడు ‘బాబూ! బండిని అక్కడిదాకా తీసుకెళ్లడానికి సాయం చెయ్యి’ అన్నాడు. తనకు టైం లేదని శివ అన్నాడు. కానీ వృద్ధుడు దీనంగా బతిమలాడాడు. తప్పని సరై తన కాలు మాత్రం నేల మీద పెట్టాడు. వృద్ధుడు వెంటనే వింత ఆకారంలోకి మారి శివను నేలపైకి లాగి ‘నేను ఎవరనుకున్నావు? మరణాన్ని. నీ కోసం తిరిగి అరిగిపోయిన చెప్పులు ఇవన్నీ. ఇన్నాళ్లకు దొరికావు’ అంది మృత్యువు.
శివ జీవితం అలా ముగిసింది.

- సౌభాగ్య, 9848157909