S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నడుమునొప్పి తగ్గేదెలా? (మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: నడుమునొప్పి తీవ్రంగా ఉంటోంది. మందులేమీ వద్దు. బెడ్‌రెస్ట్ తీసుకోవాలంటున్నారు. నొప్పి బిళ్లలు వేసుకున్నా పని చేయటం లేదు. ఆహారంలో మార్పులు ఏమైనా సూచిస్తారా?
-కైలాస్‌నాథ్ (ఖరగ్‌పూర్)
జ: మానవాళికి సంబంధించి ప్రాచీనమైన ఐదు బాధల్లో నడుము నొప్పి ఒకటి. ప్రతి 10 మందిలో తొమ్మిది మందికి జీవితంలో నడుము నొప్పి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. అందులో ఐదుగురికి తప్పనిసరిగా ప్రతి ఏడాదీ తిరగబెడుతూనే ఉంటుంది.
నడుము నొప్పిని వైద్యపరంగా లుంబాగో అని పిలుస్తారు. వచ్చిన నొప్పి ఒక నెలలోపు తగ్గితే అది ముంచుకొచ్చిన నొప్పి (అక్యూట్) అనీ, మూడు నెలలపాటు తగ్గకపోతే అది దీర్ఘవ్యాధిగా మారిందనీ అర్థం. ఇందుకు నడుము లోపల కండరాలు, నరాలు ఎముకలలో తేడాలు ఏర్పడటం ఒక కారణం అయి ఉండవచ్చు. సాధారణంగా మామూలు నడుము నొప్పిని అశ్రద్ధ చేసి దీర్ఘవ్యాధిగా మార్చుకొనేది మనమే. మన ఆహార విహారాలే అందుకు ప్రధాన కారణాలవుతాయి.
నడుము నొప్పితో బాధపడేవారిలో 85 శాతానికి నడుము లోపల ఏ కారణమూ ఏ తేడాలూ లేకుండా కూడా నొప్పి ఏర్పడుతోంది. అందుకు వారి ఆహార విహారాలు, ఆలోచనా సరళి, మనస్తత్వాలే కారణం అవుతున్నాయి. ఉద్యోగ వత్తిడులు, ఎక్కువసేపు కూర్చొని పని చేయటం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం ఇవన్నీ నడుమునొప్పికి తగిన కారణాలే.
అవసరానికి మించి రెఫ్రిజిరేటర్లలో ఆహార పదార్థాలను నిల్వవుంచుకుని తినటం, వేళాపాళా లేని ఆహార అలవాట్లు, టీవీలకు అంటుకుపోయి, అర్ధరాత్రి దాకా జాగరణ చేయటం, ఆందోళనలు, దిగుళ్లు, వత్తిళ్లు, చింతా శోక భయ దుఃఖాదులన్నీ నడుము నొప్పికి కారణాలే! మలబద్ధత, అజీర్తి, గ్యాసు, పేగుపూత లాంటి జీర్ణకోశ వ్యాధులు కూడా నడుము నొప్పిని తెచ్చి పెడతాయి. నొప్పి మందులు తిరిగి కడుపులో బాధల్ని పెంచుతాయి. ఈ విధంగా నొప్పి ఎన్నటికీ తగ్గనిదిగా మారిపోతుంది.
రోజువారీగా విరేచనం ఫ్రీగా కావటం కోసం మొదటి బిళ్ల వేసుకొన్న మొదటిరోజే మొదటి తప్పు చేసినట్టు. కొన్ని రోజులపాటు విరేచన మాత్రలు వాడాక ఇంక అవి పనిచేయక, ఎప్పటికప్పుడు పెద్ద మందు కోసం వెదకవలసి వస్తుంది. ఒక దశలో విరేచనం కోసం మందే లేని పరిస్థితి వస్తుంది. నడుమునొప్పి విడవకుండా వచ్చేవారు తేలికగా అరిగే ఆహారం తీసుకోవటానికి అలవాటు పడాలి. నొప్పి రాక మునుపు ఏ విధమైన ఆహార పదార్థాలు, ఏ విధమైన జీవన విధానం కొనసాగిస్తున్నామో, సయాటికా నడుము నొప్పి వచ్చాక కూడా అదే పద్ధతిని కొనసాగించటం వలన మాత్రమే నడుమునొప్పి దీర్ఘవ్యాధిగా మారుతోంది. దీర్ఘవ్యాధిగా అది మారటానికి మనం మారకపోవటమే కారణం. ఇప్పుడు మార్చవలసింది వైద్యుణ్ణి కాదు. ఔషధాన్నీ కాదు. మారాల్సింది మనమే! మనం వ్యాధిని పెంచే మన అలవాట్లని ఎంత మార్చుకున్నాం. ఎంత మారాం అనే అంశం చాలా ముఖ్యమైంది. బరువు తగ్గే ప్రయత్నం చేయండి. బరువు తగ్గాలన్నా ఆహారంలో మార్పు అవసరమే!
ఒక్కదానికి జాగ్రత్త తీసుకుంటే అన్ని వ్యాధులకూ సర్వరోగ నివారణలాగా ఉపయోగపడుతుంది. అతిగా పులుపూ, అమితంగా నూనె, ఎక్కువగా తీపి, ఇవి గ్యాసునీ, మలబద్ధతనీ, స్థూలకాయాలనే కాదు. నడుమునొప్పిని కూడా పెంచుతాయి. మామూలు అన్నంకన్నా పులిహోర, బిరియానీ, పలావులు కష్టంగా తిరిగి నొప్పిని పెంచుతాయి. ఇగురు కూరలన్నీ నొప్పిని తగ్గిస్తాయి. నొప్పి తగ్గాలంటే మామూలుగా వండుకున్న కూరనే తినాలి. ఈ కూరల్లో చింతపండు లేదా నిమ్మరసం, లేదా మామిడికాయ ముక్క వగైరా గానీ, బెల్లం, శనగ పిండి కానీ, నూనెలో వేసి వేయించటం గానీ చేస్తే సయాటికా నడుమునొప్పి పెరుగుతుంది. తీపి పదార్థాలు, పాలు, ఫ్రిజ్జులో ఉంచిన అతి చల్లని పెరుగు, పాలు, అలచందలూ, బఠాణీలూ, శనగలు, బొబ్బర్లు, అధిక ప్రొటీన్లు కలిగిన పప్పు్ధన్యాలన్నీ వాతపు నొప్పుల్ని, నడుము నొప్పినీ పెంచేవిగానే ఉంటాయి. చన్నీళ్ల స్నానం, చల్లగాలులలో తిరగటం నడుమునొప్పి ఉన్నవారికి చెడుని కలిగిస్తాయి.
బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, బెండ, దొండ, వంకాయ, ఇవన్నీ లేతవిగా ఉంటే ఎలాంటి అపకారమూ చెయ్యవు. ముదిరిన వంకాయ, ముదిరిన బెండకాయలు నడుమునొప్పిని పెంచుతాయి. కూరగాయల రసాన్ని తీసి అందులో చింతపండు వేయకుండా చారు కాచుకొని రోజూ తాగుతూ ఉంటే నడుమునొప్పి త్వరగా తగ్గుతుంది.
బాగా చలవచేసే ఆహార పదార్థాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. బార్లీ, సగ్గుబియ్యం, సబ్జా గింజల్లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. రాగులు, సజ్జలూ ఎక్కువ ఉపయోగపడతాయి. ముఖ్యంగా నలభై వయసు దాటిన వారందరూ విధిగా రాగులూ, సజ్జలూ, బూడిదగుమ్మడి, సొర, బీర లాంటి చలవనిచ్చే కూరగాయల వాడకం బాగా పెరగాలి. రాగి, జొన్న, సజ్జ వీటిని మొలకెత్తించి వేటికదే మరపట్టించుకోండి. కొంచెం గోధుమపిండిలో రాగి లేదా జొన్న లేదా సజ్జ పిండి కలిపి పుల్కాలు చేసుకొని పెరుగు పచ్చడితో నంజుకొని తినండి. ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా లాంటి టిఫిన్లన్నీ నడుమునొప్పి పెరిగేందుకే తోడ్పడతాయి. వాటిని వదిలేస్తేనే నొప్పి తగ్గుతుంది.
*

సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com