S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసుంటేనే మార్గం! (కథ)

రాంబాబు ఒక ఉపాధ్యాయుడు.
బదిలీ మీద ఆ పంచాయతీ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. పాఠశాలను చూడగానే అతడు ముచ్చటపడ్డాడు. పాఠశాల ఆ గ్రామపు పొలిమేరలో విశాలమైన స్థలంలో నిర్మించబడి ఉంది. చుట్టూ స్థలం. మధ్యలో పాఠశాల. స్థలానికి చుట్టూ నాలుగు వైపులా ప్రహరీ గోడ నిర్మించింది పంచాయతీ కార్యాలయం.
ప్రహరీ గోడల మధ్యలో ఎర్రటి నేల. ఆ నేల మీద ఎక్కడా ఒక్క మొక్క కూడా లేదు. పాఠశాలను చూసి ఎంత ముచ్చటపడ్డాడో, పచ్చదనం కలికానికి కూడా లేని బీడు భూమిని చూసి రాంబాబు అంత నిరుత్సాహపడ్డాడు. రాంబాబు తరగతులకు వెళ్తున్నాడన్నమాటే గాని అతడి దృష్టి మొత్తం బీడు నేల మీదే ఉంది. మొక్కలను పెంచుకుంటే ఎంత బాగుంటుంది?
తన ప్రధానోపాధ్యాయుడినీ, తోటి ఉపాధ్యాయులనూ ఈ విషయం గురించి అడిగాడు రాంబాబు. ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది నిరుత్సాహంగా చూసి పెదవి విరిచారు. ‘మనకు ఉన్న తలనొప్పులు చాలవా?’ అన్నారు ప్రధానోపాధ్యాయులు.
గ్రామ పంచాయతీ పెద్దలను కలుసుకున్నాడు రాంబాబు.
ఉపాధ్యాయుల కంటే ఘనులు వాళ్లు.
రాంబాబుతో, ‘మీ జీతం రాళ్లు మీకు వస్తే చాలదా? అనవసరపు బెడదలు కొని తెచ్చుకోవద్దు’ అన్నారు పంచాయతీ పెద్దలు.
ప్రజలు చెల్లించే పన్నులతో మాత్రమే జీతాలు, ప్రభుత్వం వారి ఖర్చులూ, సంక్షేమ పథకాలూ, ఇతరత్రా నిర్వహణ ఖర్చులూ అమలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దలు ఆ సంగతి మర్చిపోయారు. ప్రజలు తమ అభివృద్ధి కోసం తమ ఆదాయాల నుండి కొంత మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు.
అటవీ సంరక్షణ శాఖ వారిని సంప్రదించాడు రాంబాబు. అవసరమైన నీడనిచ్చే మొక్కలు, కంటికి అందంగా కనిపించే మొక్కలు, తక్కువ నీటిని గ్రహించి, ఎలాంటి నేలలోనైనా పెరిగే మొక్కలు తనకు కావాలని ఆ శాఖ వారికి దరఖాస్తు పెట్టుకున్నాడు రాంబాబు.
అటవీ సంరక్షణ శాఖ వారు సంతోషించారు. ఇటువంటి ఉత్సాహపరులే వారికి కావాలి. తమ బరువును రాంబాబు మోస్తానంటే వారు సంతోషించరా? రాంబాబు కోరిన అన్ని జాతుల మొక్కలూ అతడికి అందించారు. బడి ఆవరణలో మట్టి పొట్లాలతో ఉన్న మొక్కలు ప్రత్యక్షమయ్యాయి.
మరునాటి పాఠశాల సమావేశంలో రాంబాబు మాట్లాడాడు.
‘మొక్కలు విడిచిపెట్టిన ప్రాణవాయువు మనకు ఎంతో అవసరం. మనం విడిచిపెట్టిన బొగ్గుపులుసు వాయువును మొక్కలు స్వీకరిస్తాయి. సూర్యరశ్మితో ఆ వాయువును కలుపుకొని, తమలోని పత్రహరితాన్ని ఉపయోగించుకుని పిండి పదార్థాన్ని తయారుచేసుకుంటాయి. ఈ రకంగా చేసి ప్రకృతిలో బొగ్గుపులుసు వాయువు శాతాన్ని తగ్గిస్తాయి. ఆ రకంగా మొక్కలు మనకు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. పైగా వాటి పచ్చదనం మన కంటికి కావలసిన ఆరోగ్యం అందిస్తుంది. వాటి నీడ మనకు ఆనందాన్ని ఇస్తుంది’ అంటూ చెప్పాడు రాంబాబు.
సమావేశంలోనే కొంతమంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. రాంబాబుతో చెయ్యి కలిపారు. మొక్కల పెంపకానికి శాయశక్తులా సహకరించారు.
ఏ నేలా చూడు నేల కాదు.
ఏ మొక్కా పనికిరానిది కాదు.
ఏ పిల్లవాడూ పనికిమాలిన వాడు కాదు.
ఒకడు బాగా శరీర శ్రమను ఓర్చుకోగలడు. మరొకడు ఎంతసేపైనా సరే అలసిపోకుండా చదవగలడు. ఒక్కొక్కడు లెక్కలంటే ఇష్టపడతాడు. మొక్కలంటే మరొకడికి ఇష్టం. రాంబాబు ఇటువంటి విద్యార్థులను స్పష్టంగా గుర్తించాడు.
విద్యార్థినీ విద్యార్థులు శ్రమదానం చేశారు. ఆవరణకు లోతట్టున చుట్టూ మొక్కలు పాతారు. నూతి నుండి నీళ్లు తెచ్చి మొక్కలకు పోశారు. తరువాత మొక్కలకు చుట్టూ పాదులు కట్టారు. పచ్చిరొట్ట ఎరువు వేశారు.
బడి ఆవరణలో కొంత కాలానికి ఒక ఉద్యానవనమే వెలసింది.
పాఠశాల వార్షికోత్సవ సభలో రాంబాబును పొగడ్తలతో ముంచెత్తారు సాటి సిబ్బంది.
‘నాది దర్శకత్వం మాత్రమే. కష్టపడిన వారంతా సాటి ఉపాధ్యాయ సిబ్బందీ, పిల్లలూను. ఈ ఘనత అందరికీ చెందుతుంది’ అన్నాడు రాంబాబు.
‘ఘనత ఎవరికి చెందినా మొదట మీ మనసులో ఆలోచన మెదిలింది. ఆ ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. ఆలోచన సానుకూలం కావడానికి మార్గం ఏర్పడింది. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఆలోచన బడి వాతావరణానే్న మార్చేసింది. పిల్లలకు ప్రకృతి పట్ల ప్రేమను పెంచడం మీ జీవితాన్ని సార్థకపరచింది’ అన్నారు అధ్యక్ష స్థానంలో ఉన్న విద్యాశాఖాధికారి.

-బి.మాన్‌సింగ్ నాయక్