S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..46 మీరే డిటెక్టివ్

ఆ రోజు కూడా ఆశే్లష సమయానికే హరికథ వినడానికి గుడికి చేరుకున్నాడు. హరిదాసు రాముడికి నమస్కరించి కథని ఇలా కొనసాగించాడు.
‘పురుష శ్రేష్ఠుడైన రాముడు తండ్రికి నమస్కరించి వెళ్లిపోతూంటే, అంతఃపుర స్ర్తిలు పెద్దగా ఏడ్చారు. రాముడ్ని వెళ్లద్దని పాదాల మీద పడి ఏడుస్తూ అంతఃపుర స్ర్తిలు వేడుకున్నారు. ‘ఏ రాముడు తండ్రి చెప్పకపోయినా తండ్రికీ, అంతఃపురానికి సంరక్షణ చేసేవాడో అలాంటి రాముడు ఇప్పుడు ప్రసావానికి వెళ్లిపోతున్నాడు. పుట్టింది మొదలు రాముడు తల్లైన కౌసల్య మీద చూపించే భక్తిశ్రద్ధలు మన దగ్గరా చూపించేవాడు. కోపం తెచ్చే పనులు చేయకుండా, కోపం వచ్చిన వారి కోపాన్ని కూడా పోగొట్టే రాముడు తనని ఎవరైనా నిందించినా కోప్పడేవాడు కాదు. అలాంటి రాముడు ఇవాళ ప్రవాసం వెళ్తున్నాడు. బుద్ధిలేని మన రాజు అందరికీ గతైన రాముడ్ని వదిలేసి అన్ని ప్రాణులనీ తినేస్తున్నాడు.’ ఇలా దూడలని కోల్పోయిన ఆవుల్లా ఆ రాజు భార్యలంతా గట్టిగా ఏడుస్తూ భర్తని నిందించారు. పుత్రశోకంలో ఉన్న దశరథుడు అంతఃపురం నించి వినిపించే ఆ భయంకరమైన ఏడుపుని వింటూ తన ఆసనం మీద పడి ఉన్నాడు.
దుఃఖంతో ఉన్న ఇంద్రియ నిగ్రహం గల రాముడు ఏనుగులా నిట్టూరుస్తూ లక్ష్మణుడితో కలిసి తల్లి అంతఃపురానికి వెళ్లాడు. అక్కడ రాముడు ఆ ఇంటి తలుపు దగ్గర కూర్చుని ఉన్న పూజనీయుడైన ఓ వృద్ధుడ్ని, నిలబడి ఉన్న మరి కొందరినీ చూశాడు. విజయవంతుల్లో శ్రేష్ఠుడైన రాముడ్ని చూడగానే వారంతా వెంటనే లేచి నిలబడి ‘నీకు జయమగు గాక!’ అని చెప్పారు. రాముడు మొదటి వాకిలి దాటి రెండో వాకిట్లో వేద సంపన్నులు, రాజ గౌరవాన్ని పొందేవారు, వృద్ధులు ఐన బ్రాహ్మణులని చూశాడు. రాముడు ఆ బ్రాహ్మణులకి నమస్కరించి మూడో వాకిలిని రక్షించే బాల, వృద్ధ స్ర్తిలని చూశాడు. నాలుగో వాకిలి లోని వారు రాముడ్ని చూసి వెంటనే ఆనందంగా లోపలకి వెళ్లి కౌసల్యకి ప్రియమైన రాముడి రాక గురించి చెప్పారు.
కౌసల్య కొడుకు క్షేమం కోరుతూ ఆ ఉదయం విష్ణు పూజ చేస్తోంది. ఎప్పుడూ వ్రతాలు చేసే కౌసల్య శుభమైన తెల్లటి పట్టుచీరలో, మంత్రాలతో అగ్నికి సంతోషంగా హోమం చేస్తోంది. రాముడు శుభకరమైన తన తల్లి అంతఃపురంలోకి ప్రవేశించి అగ్నికి హోమం చేసే తల్లిని చూశాడు. పూజ కోసం సిద్ధం చేసిన పెరుగు, అక్షింతలు, నెయ్యి, ప్రసాదాలు, హవిస్సులు, పేలాలు, తెల్లని పూలమాలలు, పాయసం, పులగం, సమిధలు, పూర్ణకుంభాలు మొదలైనవి చూసాడు. వ్రతాలతో నీరసించిన కౌసల్య తెల్లటి పట్టుచీరలో దేవతా స్ర్తిలా ప్రకాశిస్తూ దేవతలకి జలతర్పణాలు ఇచ్చింది.
చాలా కాలం తర్వాత వచ్చిన, తనకి ఆనందాన్ని కలిగించే కొడుకుని చూసి సంతోషంతో కౌసల్య ఆడ గుర్రం తన పిల్ల దగ్గరికి వెళ్లినట్లుగా వెళ్లింది. రాముడు ఎదురుగా వచ్చిన తల్లికి ప్రదక్షిణం చేసి ఆమె పాదాలకి నమస్కారం చేశాడు. అతన్ని కౌగిలించుకుని తలని వాసన చూసింది. శత్రుభయంకరుడైన తన కొడుకు రాముడిని ప్రేమగా కౌసల్య దీవించింది.
‘వృద్ధులు, ధర్మాత్ములు, మహాత్ములైన రాజర్షులకి ఎంత ఆయుర్దాయం, కీర్తి ఉంటాయో నీకూ అంత ఆయుర్దాయం, కీర్తి లభించుగాక! నీ వంశధర్మం ప్రకారం రాజ్యాన్ని పాలించు. రామా! నీ తండ్రి దశరథ మహారాజు చేసిన ప్రతిజ్ఞని తప్పడు. ధర్మాత్ముడైన నీ తండ్రి ఈ రోజు నిన్ను వరాజ్యానికి రాజుని చేస్తన్నాడు.’
కౌసల్య భోజనం చేయమని కోరింది. ఆమె చూపించిన ఆసనాన్ని తాకి, నమస్కరించి, వినమ్ర స్వభావం గల రాముడు తల్లి మీద గౌరవంతో ఇంకా వినమ్రంగా దండకారణ్య ప్రయాణానికి ఆమె అనుమతి పొందడానికి ఆమెతో ఇలా చెప్పాడు.
‘అమ్మా! ఓ గొప్ప ఆపద వచ్చిందని నీకు తెలీదు. దీనివల్ల నీకు, సీతకి, లక్ష్మణుడికి చాలా దుఃఖం కలగబోతోంది. నేను దండకారణ్యానికి వెళ్లబోతున్నాను. నాకీ ఆసనం దేనికి? నేను దర్భాసనం మీద కూర్చునే కాలం వచ్చింది. నేను పధ్నాలుగు సంవత్సరాలు మునిలా నిర్మానుష్యమైన అడవిలో నివసించాలి. మహారాజు ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చి నన్నో మునిలా దండకారణ్యంలో ఉండేలా చేస్తున్నాడు. నేను అడవిలో దొరికే దుంపలు, పళ్లతో జీవిస్తూ పధ్నాలుగు సంవత్సరాలు నివసించాలి’
ఆ మాటలు విన్న కౌసల్య గొడ్డలితో నరికిన సాలవృక్షంలా, స్వర్గం నించి పడిన దేవతలా నేల మీద పడిపోయింది. మూర్ఛ వచ్చి అరటి చెట్టులా నేలపైన పడి ఉన్న తల్లిని రాముడు లేవదీశాడు. బరువు మోసిన గుర్రంలా పడి ఉన్న ఆమెని రాముడు చేత్తో తాకాడు. సుఖానికి అర్హురాలై దుఃఖంతో బాధపడే కౌసల్య లక్ష్మణుడు వింటూండగా పురుష శ్రేష్ఠుడైన రాముడితో చెప్పింది.
‘రామా! సుకుమారంగా పెరిగిన నువ్వు వెంట పరివారం లేకుండా అడవిలో ఎలా జీవించగలవు? నాకు సంతానం లేకపోతే ఇంత దుఃఖం ఉండేది కాదు. నువ్వు నాకు దుఃఖాన్ని కలిగించడానికే పుట్టావు. గొడ్రాలికి ‘నాకు సంతానం లేదే?’ అనే విచారం తప్ప ఇంకే దుఃఖం ఉండదు కదా. రామా! పూర్వం నేను ఎన్నడూ భర్త అధికారంలో ఉన్నప్పుడు శుభాన్ని కాని, సుఖాన్ని కాని అనుభవించలేదు. కొడుకు అధికారంలోకి వచ్చాక అనుభవిస్తానని అనుకునేదాన్ని. అలాంటి నేను అందరికంటే మంచిదాన్నై ఉండి, మాటలతో మనసుని బాధించే, నా కంటే అధములైన సవతుల ఎన్నో చెడ్డ మాటలని వినాల్సి ఉంది. నాకు ఇప్పుడు అంతులేని విచారం కలిగింది. దీన్ని మించిన దుఃఖం ఆడవాల్లకి ఏముంటుంది? నాయనా! నువ్వుండగానే నన్ను చిన్నచూపు చూస్తున్నారు. నువ్వు వనవాసానికి వెళ్లాక ఇక చెప్పేదేముంది? నాకు చావు తప్పదు. కైకేయి దాసీ వాళ్లతో సమానంగా, అంతకంటే తక్కువగా కూడా నన్ను చూస్తుంది. నా భర్త స్వేచ్ఛ లేకుండా నన్ను అదుపు చేస్తాడు. ఇప్పుడు నా దాసీలు కూడా ఇక మీదట భరతుడికి భయపడి నన్ను పలకరించరు. కైకేయి ఎప్పుడూ కోపంతో మండిపడుతూంటుంది. కష్టాలతో ఉన్న నేను కటువుగా మాట్లాడే ఆమె మొహాన్ని ఎలా చూడగలను?
రామా! నీకు ఉపనయనం జరిగాక ఎప్పటికైనా ఈ విచారాలు పోతాయనే ఆశతో పదిహేడేళ్లుగా వేచి ఉన్నాను. కాబట్టి రామా! సవతులు వల్ల కలిగే అవమానాన్ని, అంతులేని గొప్ప విచారాన్ని ఈ ముసలితనంలో నేను ఎక్కువ కాలం సహించలేను. పూర్ణచంద్రుడు లాంటి నీ మొహం కనపడక విచారించే నేను దీనంగా ఈ జీవితాన్ని ఎలా గడపగలను? దురదృష్టవంతురాలైన నేను ఎన్నో ఉపవాసాలు, పూజలు, శ్రమ కలిగే వ్రతాలు చేసి నిన్ను ఎంతో కష్టపడి పెంచాను. అదంతా వృధా ఐపోయింది. ఇది విని కూడా నా మనసు వర్షాకాలంలో కొత్త నీరు కలిసిన నది గట్టులా బద్దలవడం లేదు. అందువల్ల ఇది చాలా గట్టిదని అనుకుంటున్నాను.
నిజంగా నాకు చావే లేదు. యమలోకంలో నాకు చోటు లేదు. అందువల్లే యముడు నన్ను ఏడ్చే ఆడ లేడిని సింహం లాక్కెళ్లినట్లుగా ఇప్పుడే నన్ను బలవంతంగా లాక్కెళ్లడం లేదు. ఈ విచారం నా శరీరమంతా వ్యాపించినా నా హృదయం స్థిరంగా ఉంది తప్ప ముక్కలై నేల రాలడం లేదు. ఇది నిజంగా ఇనుముతో చేయబడింది. అకాల మరణం రాదన్నది నిజం. నేను చేసిన వ్రతాలు, దానాలు, నియమాలు అన్నీ వృధా ఐపొయ్యాయి కదా అని చాలా విచారిస్తున్నాను. సంతానం కోసం నేను చేసిన తపస్సు కూడా చవిటి నేలలో నాటిన విత్తనంలా వ్యర్థమై పోయింది. ఎక్కువ కష్టంలో ఉన్న వాడు కాలం తీరకపోయినా ఇష్టప్రకారం చావగలిగితే నువ్వు లేని నేను, దూడ లేని ఆవులా ఇప్పుడే యమ లోకానికి వెళ్లిపోయేదాన్ని. ఐనా ఈ జీవితంతో ఏం ప్రయోజనం. రామా! నువ్వు లేని నా జీవితం వ్యర్థం. బలహీనమైన ఆవు లేగ దూడ వెంట వెళ్లినట్లు నేను ప్రేమగా నీతో అడవికి వస్తాను’
కౌసల్య రాముడికి వచ్చిన పెద్ద ఆపద గురించి ఆలోచిస్తూ, కోపం, విచారాలతో కొడుకుని చూసి కినె్నర స్ర్తిలా అనేక విధాలుగా విలపించింది. ఏడుస్తున్న కౌసల్యతో దీనంగా నిలబడ్డ లక్ష్మణుడు సమయోచితంగా ఇలా చెప్పాడు. (అయోధ్య కాండ సర్గ 20)
ఆశే్లష వెంట ఆ రోజు వచ్చి ఆ హరికథని విన్న వాడి అమ్మమ్మ మీనమ్మ ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో చెప్పింది.
‘హరిదాసు ఏడు తప్పులు చెప్పాడ్రా. ఇంటికెళ్లాక అయోధ్య కాండలోని ఇరవైయ్యవ సర్గ తీసి చూడు. అందులో ఇవి లేవు’ అని ఆవిడ ఆ తప్పుల్ని తిరిగి ఇంటికి వెళ్తూ చెప్పింది. మీరా తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
రాముడికి దశరథుడు అడవికి వెళ్లమని సూటిగా చెప్పాడా? లేదా?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
చిలుక ముందు రామ అనే పేరు ఎందుకు వచ్చింది?
రాముడు సీతని తప్ప పరస్ర్తిని ఎరగనట్లుగా, చిలుక కూడా జీవితాంతం ఒకే ఆడ చిలుకతో జత కడుతుంది. కాబట్టి దానికి ‘రామ చిలుక’ అనే పేరు వచ్చింది.

*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.హరిదాసు చెప్పింది ఇరవైయ్యవ సర్గ కాదు. పంతొమ్మిదో సర్గ.
2.అక్కడ వశిష్ఠుడు లేడు. ‘వశిష్ఠుడు వింటూండగా’ అని హరిదాసు తప్పు చెప్పాడు.
3.‘్భరతుడి రాజ్యాభిషేకం గురించి రాజు నాకు స్వయంగా చెప్పలేదే అన్న ఒక్క బాధే నా హృదయాన్ని కాల్చేస్తోంది’ అని రాముడు కైకేయితో అన్న ముఖ్యమైన మాటలని హరిదాసు చెప్పలేదు.
4.మీ నాన్న స్నానం కాని, భోజనం కాని చేయడు అని మాత్రమే కైకేయి చెప్పినట్లుగా వాల్మీకి రాసాడు. అగ్నికార్యం కాని అన్నది హరిదాసు కలిపి చెప్పాడు.
5.రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లబోతున్న రాముడి మనసులో ఎలాంటి విచారం కలగలేదు అని చెప్తూ వాల్మీకి ‘లోకంలోని సుఖదుఃఖాలకి అతీతుడైన యోగిలా’ అని పోల్చాడు. ఇది హరిదాసు చెప్పలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి