S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగ్గురు మూర్ఖులు

పూర్వం రంగాపురంలో రంగయ్య అనే కూలి వాడుండేవాడు. వాడు ప్రతిరోజూ పొద్దుటే చద్దన్నం మూట కట్టుకొని దగ్గరలోని బస్తీకి వెళ్లేవాడు. పని కోసం ప్రయత్నించేవాడు. అక్కడ ఏదైనా పని దొరికితే ఏ రోజుకారోజు కూలీ డబ్బులు చేతిలో పడేవి. వాటితో బియ్యం, పప్పులు కొనుక్కొని ఇంటికి చేరేవాడు.
ఒకరోజు రంగయ్య బస్తీకి వెళ్లేసరికి వాడికి ఎల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు కూలీలు కలిశారు. వీరు మరో పల్లెకి చెందినవాళ్లు. అప్పుడప్పుడు రంగయ్యతో కలిసి గుత్తా పనులు పట్టేవారు.
ఆ ముగ్గురూ కలిసి బస్తీ తిరిగారు. అదృష్టవశాత్తూ వారికి వారం రోజులకు సరిపడా పని దొరికింది. చివర్లో వచ్చిన డబ్బులు సమానంగా పంచుకోవడం వారికి అలవాటు.
మరునాడే ఆ గుత్తా పనిలో చేరారు. ఒక షావుకారి పాత ఇంటిని కూల్చేసి మట్టిని తొలగించాలి. ఎల్లయ్య పైకెక్కి గోడలు పడగొడుతుంటే పుల్లయ్య తట్టకెత్తితే రంగయ్య మట్టి తట్ట ఎత్తుకెళ్తాడు.
మూడవరోజు ఎల్లయ్య పైకెక్కి గోడను కూల్చేస్తుంటే గోడ పగులులో ఒక బంగారు దండ కడియం కనపడింది. పాతతరం కడియం. బరువుగానే ఉంది. దాన్ని పరిశీలించిన ఎల్లయ్య ‘ఇది దాచెయ్’ అంటూ పుల్లయ్య మీదికి విసిరాడు. పుల్లయ్య చూచి సంబరంగా పంచెలో దాచేశాడు. కానీ ఈలోగా రంగయ్య అదంతా చూడనే చూసి తనకూ భాగం కావాలన్నాడు. గొడవెందుకని పుల్లయ్య సరేనన్నాడు. ఆ పిదప పని సాగలేదు. సాయంత్రం పని ముందుగానే ముగించారు. ఎవరి మనసు మనసులో లేదు. అందరూ లింగాపురం చేరారు.
బంగారు దండ కడియం పంపకం గుట్టు బయటపడకుండా పంచుకోవాలి. అదీ సమస్య. చివరికి గొడ్డలితో మూడు ముక్కలు చేసుకున్నారు. రంగయ్య మాత్రం తనకు సొమ్ము కావాలన్నాడు. పుల్లయ్యే రెండు ముక్కలు తీసుకున్నాడు. సొమ్ము తొందర్లోనే ఇస్తానన్నాడు. ఐతే రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. దాంతో రోజులు గడిచాయి. కాని పుల్లయ్య రంగయ్యకు సొమ్ము చెల్లించలేదు.
వారం రోజుల గోడ పనిని రెండు వారాలకు ముగించారు. కూలీ డబ్బులు సమానంగా పంచుకున్నారు. అంతా బాగానే ఉంది కాని బంగారం దొరికిన సంతోషంతో రోజూ రాత్రిళ్లు బాగా తిని తాగి తందనాలాడారు. ఆ ఖర్చంతా పుల్లయ్యే భరించాడు.
చివరికి రంగయ్య తిరగబడ్డాడు. సొమ్ము కావాలని పట్టుబట్టాడు. తిని తాగిన దానికి చెల్లు అన్నాడు పుల్లయ్య. ఎల్లయ్య, పుల్లయ్య ఒక్కటై పోయారు. రంగయ్య బెదిరింపులు చెల్లలేదు. రంగయ్యకు తిక్కరేగింది. నేరుగా బస్తీకి వెళ్లి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సైనికులు రంగప్రవేశం చేసి ఆ ముగ్గుర్నీ కారాగారంలో వేసి విషయమంతా కక్కించారు. బంగారు ముక్కల్ని షావుకారుకి ఇప్పించారు.
బంగారు దండ గడియం వల్ల మిత్రులుగా ఉన్న ఆ ముగ్గురు మూర్ఖులు శాశ్వతంగా శత్రువులై పోయారు. అది మాత్రం చేరాల్సిన చోటుకు చేరింది. భద్రంగా ఉండిపోయింది. ఆలోచన, శాంతం, సహనం లేని ఆ ముగ్గురూ అన్నింటా చెడిపోయారు.

-వాసాల నరసయ్య