మరింత లోతుగా
Published Saturday, 22 July 2017ఆలోచన సామాన్యం. అంటే అందరికి వస్తుంది. అందులో ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరి ఆలోచన వారికి వస్తుంది. శరీరంలో కూడా ఇదే రకమయిన వైవిధ్యం. ఇదే రకమయిన సమానత్వం కనపడుతున్నాయి. మెదడు, చేతన అన్నవి మరొక స్థాయిలో వైవిధ్యానికి, సామాన్యతకు ఉదాహరణలుగా ఉన్నాయి.
జీవులన్నింటిలో ఆలోచన ఉంది. కానీ, ఎక్కడికక్కడ ఆలోచనకు పరిధులు ఉన్నాయి. పుల్లను పుట్టలోకి జొనిపి చీమలను సంపాదించుకుని తినే ఎలుగుబంటి సాంకేతిక ఆలోచన గల జంతువు. దానికి లోతుకు చేరవచ్చునని తెలిసింది. లోతును తోడి తీసి లోతు లేకుండా చేయవచ్చునన్నది మాత్రం తోచలేదు. మనిషి ఆలోచన మరింత ముందుకు సాగింది. కనుకనే, తనను తాను గొప్ప స్థాయిలో ఊహించడం మొదలయింది. మానవ జన్మ అన్న మాట పుట్టింది. మిగతా జీవులు ఏమనుకుంటున్నదీ తెలియదు. అన్ని జీవులలోనూ ఉన్నది అవే రసాయనాలు. రసాయనాలకు స్థిరత్వం అన్నది మరొక విషయం. విశ్వమంతటా రసాయనాలు ఉన్న పరిస్థితులు మనకు తెలియవు. మనిషి గమనించింది చాలా తక్కువ. ఆ తక్కువ తెలివిడితోనే ప్రపంచం మొత్తం గురించి, విశ్వం మొత్తం గురించి, మరింత ముందుకు ఆలోచనలు సాగుతున్నాయి. ఆలోచనలకు పరిధి లేకపోవడం విచిత్రం. కాళ్లు కదలలేని చోట్లన్నీ, కళ్లు చూడలేని చోట్లన్నీ, మనసు అనే మెదడు చూడగలుగుతున్నది! విశ్వంలో మన వంటి జీవులను, పరిస్థితులను ఊహించి వెతుకుతున్నది. మిగతా చోట్ల జీవం, అందునా మన వంటి జీవం, ఇంకా ప్రశ్నగానే ఉంది. విశ్వంలో భూమి చోటు, భూమి మీద పరిణామంలో మనిషి చోటు, ఆలోచించదగిన విషయాలు.
అవగాహనను దాటిన ఆలోచనలు (బియాండ్ ద అండర్‌స్టాండింగ్) నిజమవుతున్నాయి.
ఆలోచనలు కేవలం ఆలోచనలు కావు. అనే్వషణలుగా మారుతాయి. పరిశీలన, ప్రయోగం, పరికరాలు ఒక క్రమంలో సాగితే, అది సైంటిఫిక్ పద్ధతి. కేవలం ఆలోచనలుగానే సాగితే, అది మరొక పద్ధతి. ఇవి రెండూ బలంగా సాగాయి. ఇక మీద సాగుతాయి. ఎక్కడో ఏదో సమాధానం దొరికిన భావం చాలామందికి, చాలా చోట్ల కలిగింది. సమాధానాలకు పేరు పెట్టారు. దాన్ని ఒక శాస్త్రం అన్నారు. అక్కడ సంబరం మొదలయింది. ఆలోచన ముందరికి సాగలేదు. సాగినా, వాటికి పరిధులు ఏర్పడ్డాయి. ఆర్థిక శాస్త్రం అన్న ఆలోచన వేసే కొమ్మలకు ఒక పరిధి ఏర్పడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ సంగతి కూడా అర్థమయింది. కనుకనే, మరింత ముందుకు ఆలోచించే పద్ధతి వచ్చింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలు అన్న పద్ధతి పుట్టింది. నిజానికి అదే మొదటి పద్ధతి. పరిధులు మధ్యలో వచ్చాయి! ఆలోచన ఒక అంతం కాదు. అది ఎప్పుడూ ఆరంభమే!
కొత్త ఆలోచనలకు ఒకప్పటి ఆలోచనలు ఆధారంగా నిలబడితే, అది మరింత వింత పరిస్థితి. పాత ఆలోచనలను ఎప్పటికప్పుడు సరిచూసుకుని ఖాళీలు పూరించుకునే ప్రయత్నం జరగవలసినంత జరగడం లేదు. పరిణామానికి ఒక క్రమం ఆపాదించినట్టే, పరిశోధనకు, ఆలోచనకు కూడా అనుకోకుండానే ఒక క్రమం వచ్చేసింది! ఇవన్నీ ఎక్కడికక్కడ జరిగినప్పుడు ఎక్కువ విషయాలు తెలిశాయి. తెలిసిన విషయాల మధ్య పరస్పర సంబంధాలను పరిశీలించే పద్ధతి కూడా వచ్చింది. ఒక పెద్ద వల తయారయింది. మనిషి ఈ వలలో చిక్కుకుని, అందులోని దారుల వెంట నడుస్తున్నాడు. పాత ఆలోచనల్లో చిక్కుకుపోయాడు.
జీవశాస్త్రం గురించి మాట్లాడేవారందరూ డార్విన్ పరిణామ వాదాన్ని ప్రమాణంగా ముందు ఉంచుకుని ఆలోచిస్తున్నారు. ప్రతీ రంగంలోనూ ఈ రకమయిన పరిస్థితి తప్పకుండా ఉంది. సైన్స్‌లో ఇది మరీ ఎక్కువయింది. వౌలికమయిన విషయాలు మొత్తం తెలిసిపోయాయి అన్న భావం ఈ మధ్యన బాగా కనపడుతున్నది. సైన్స్ మరిక అవసరం లేదు, అది ముందుకు సాగడానికి మరేమీ లేదు అంటున్నారు. ఈ సాగడం ముందుకే అన్న భావం విచిత్రమయినది. రసాయనాలు ఒకచోట చేరి జీవంగా మారినప్పుడు ఈ ఆలోచన లేదు. పరిణామంలో రకరకాల జంతు, వృక్షాలు ఏర్పడినప్పుడు ఈ ఆలోచన లేదు.
ఆలోచనలను ఒకచోట చేర్చి పేరు పెట్టిన తరువాత పరిధులు వచ్చాయి! తెలివికి సైన్స్ అని పేరు లేనప్పుడు కూడా సైన్స్ సాగింది. మిగతా అన్ని రంగాలూ అదే పద్ధతిలోనే సాగాయి. అన్నీ మనిషి చేసిన ఆలోచనలే. ఆ మనిషే ప్రపంచమంతటా విస్తరించాడు. కనుకనే, మనిషి ఆలోచనలు అన్ని రంగాలలోనూ ఒకే పద్ధతిలో సాగుతున్నాయి! ప్రతీ ఆలోచనకు ఆధారంగా పాత ఆలోచనలు నిలబడుతున్నాయి! ఆలోచన ఒక పద్ధతిలో సాగుతున్నది. స్వతంత్రంగా సాగడం లేదు. సైన్స్‌లో కూడా పరికరాలు, పద్ధతుల కారణంగా ఆలోచనలు ఒక క్రమంలో సాగుతున్నాయి. ఈ పరికరాలు, పద్ధతులు తెలియని సైన్స్‌ను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు బహుశా అవే మరిన్ని తెలియని సంగతులు బయటపడకుండా అడ్డు తగులుతున్నాయేమో ఆలోచించాలి!
ఆలోచనలు గొలుసులుగా సాగనవసరం లేదు. కొత్త దారిలో ఆలోచనలు అవసరమని అందరూ అంటున్నారు. ఆ మాటను కూడా పాత ఆలోచన ఆధారంగా అంటున్నారు! ఆలోచనలకు వేసిన ఒక ఫ్రేమ్ కారణంగా రంగాలు పుట్టాయి. ఆ పరిధిలోనే సిద్ధాంతాలు పుట్టాయి. రంగాలు ఎంత పెరిగినా, ఫ్రేమ్ కూడా పెరిగి ఆ లోపలే ఉంటున్నాయి. హద్దులు లేని ఆలోచనలు అవసరం. హద్దులు రాక ముందు ఆలోచనలు సాగిన పద్ధతి అవసరం. అన్ని వేపులకు అడ్డు లేకుండా ఆలోచనలు సాగడం అవసరం. మతం, విశ్వం, పదార్థం, సమాజం అన్నింటిలోనూ ఆలోచనలు మరింత స్వతంత్రంగా సాగితే, అన్నింటి మధ్యనా సామాన్య లక్షణాలు కనిపిస్తాయి.
గణాంక శాస్త్రంలో ఒక సిద్ధాంతం ప్రకారం ఒక వర్గం లోపల ఉండే వైవిధ్యం, వేరు వేరు వర్గాల మధ్యన ఉండే వైవిధ్యం కన్నా ఎక్కువ. ఇది మనుషులలోని వైవిధ్యానికి కూడా వర్తిస్తుంది. ప్రపంచంలోని, విశ్వంలోని మొత్తం వైవిధ్యానికి వర్తిస్తుంది. పద్ధతి లేదనుకున్న చోట కూడా పద్ధతి కనపడుతుంది. అసలు ఎక్కడా ఏ పద్ధతీ లేదన్న విషయం కూడా కనపడుతుంది! ఇది ద్వైధీభావంగా కనిపిస్తే తప్పులేదు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం మనకు తెలిసిందే. కనుక ఆలోచనలు అన్ని రంగాలలో హద్దులను దాటి అన్ని దిక్కులకు సాగాలి.
పరిధులను దాటి కనిపించే పద్ధతులు నచ్చవు. అన్నీ మన ఆలోచన ప్రకారమే జరగాలి. అప్పుడు మాత్రమే అది మన ప్రపంచం అవుతుంది. సెల్‌ఫోన్‌లో ఒక ఆట ఆడుతాము. ఆ ఆట చాలా మామూలుగా ఉంటుంది. దాన్ని తయారుచేసింది మనలాంటి మనిషే అని తెలుసు. అందులోని ప్రతి సమస్యకు సమాధానం ఉంటుందని కూడా తెలుసు. కానీ, ఒకచోట మనం పట్టుబడిపోతాము. ఎన్ని రకాల ప్రయత్నించినా, ఆ చుంచును పారిపోకుండా ఆపలేము. చుంచు పారిపోతుంది. ఆటలో ఏర్పాటు చేసిన నవ్వులు మనల్ని మరింత అవమానానికి గురి చేస్తాయి. అప్పుడిక పరిస్థితి అసలే నచ్చదు. చివరికి కోపంగా ఆ ఆటను కంప్యూటర్‌లో నుంచి లేదా ఫోన్‌లో నుంచి అన్ ఇన్‌స్టాల్ చేసేస్తాం! అక్కడ ఏదో మోసం జరిగిందన్న భావం మన చేత ఆ పని చేయిస్తుంది. కానీ మోసం లేనే లేదు. మన ఆలోచనలకు అక్కడ ఒక తాత్కాలిక ప్రతిబంధకం ఎదురయింది. నిజంగా లేనిది మన ఓపిక.
ఈ ప్రపంచంలో ఈ రకం పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.
ఈ ఆలోచనలు నిజానికి కొత్తవి కాదు. ఇప్పటికే చాలామందికి కలిగి ఉంటాయి. ఆ విషయం తెలియకుండానే ఈ ఆలోచనలు చాలామందికి కలిగి ఉంటాయి. ఆ గుంపులో నేనూ ఒకణ్ణి కావడం పరిణామంలో ఒక భాగం. జీవంలోని స్వయం పాలన పద్ధతిలో ఇదీ ఒక భాగం!