S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అధికులం

నేను మేజిస్ట్రేట్‌గా చేరిన కొత్తలో మాకు శిక్షణని ఇవ్వడానికి అకాడెమి లేదు. అందుకని మమ్మల్ని ఓ పదిహేను రోజులు పోలీసులు ఎలా పని చేస్తారో, వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పోలీస్ అకాడెమికి పంపించారు. అప్పుడు అది అంబర్‌పేటలో వుండేది.
మా బ్యాచ్ అప్పటికే ఓ ఆరు నెలలు కోర్టుల్లో న్యాయమూర్తులుగా పని చేసిన వ్యక్తులు. అందరికీ పోలీసులంటే అదో రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంది. తాము పోలీసుల కంటే అధికులమన్న భావన అందరిలో నెలకొంది.
చాలామంది పోలీస్ అధికారులు, ప్రాసిక్యూటర్లు మాతో తమ జ్ఞాన సంపత్తిని పంచుకున్నారు. ఆంజనేయ రెడ్డి లాంటి పోలీసు అధికారులు దర్యాప్తు గురించి క్లాసు తీసుకుంటే, బాలకృష్ణ లాంటి ప్రాసిక్యూటర్లు భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని అంశాల గురించి మాకు క్లాసు తీసుకున్నారు. వాళ్ల క్లాసులు చాలా బాగున్నాయి. కానీ మా వాళ్లలో న్యాయ మూర్తులమన్న అహం ఎక్కువగా ఉంది. అధికులమన్న భావన ఇంకా ఎక్కువగా ఉంది. క్రింది స్థాయి న్యాయమూర్తులే అయినా చాలామందిలో బాగా అహం వచ్చేసింది. అందులో అప్పటికే ఆరు మాసాలు న్యాయమూర్తులుగా ఉన్నత ఆసనం మీద కూర్చుండి వచ్చిన వారు కదా!
అప్పుడు ఆంజనేయ రెడ్డిగారు పోలీసు అకాడెమి డైరెక్టర్. న్యాయమూర్తులంటే ఆయనకి గౌరవం. అందులో మేం వేరే విభాగానికి చెందిన వాళ్లం. మమ్మల్ని అతిథులుగా ఆయన చూస్తున్నారు. మా వాళ్ల ప్రవర్తన కొంత కష్టం కలిగించినా ఏమీ అనలేదు. ఏమైనా అనే అవకాశం ఆయనకు ఉంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి అధికులమన్న భావన ఉండకూడదని ఆయనకు అన్పించి ఉండవచ్చు. అందుకు ఆయన ఓ చిన్న పని చేశారు.
తెల్లవారి నోటీసు బోర్డులో ఓ వేమన పద్యాన్ని పెట్టారు. అది మా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా పెట్టారు. అది ఈ పద్యం.-
అనువుగాని చోట నధిగుల మనరాదు
కొంచమైన నదియు గొదవగాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.
మాలో అధికులమన్న అహంభావం ఉన్న చాలామందికి ఆ పద్యం సూటిగా తాకింది. ఆ తరువాత కొంచెం తగ్గినారు. ఒద్దికగా వున్నారు.
మనం చెప్పదల్చుకున్న విషయాన్ని సుతిమెత్తగా ఎలా చెప్పాలో, బాధ పెట్టకుండా ఎలా చెప్పాలో మాలో చాలామందికి బోధ పడింది. పదిహేను రోజుల శిక్షణలో ఇంతకన్నా గొప్ప పాఠం మరేం ఉంటుంది?

- జింబో 94404 83001