S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలోచించగలిగితే

రెండు వారాలుగా సాగుతున్న ఈ చర్చ మరింత దూరం నడవాలని నా అభిమతం. నేను చెప్పదలుచుకున్న సంగతులు నేనే చెప్పాలి. మరొకరు చెప్పరు. కనుక చెపుతున్నాను. దయచేసి నా కొరకు చదవండి.
మనకు రూపాన్ని ఇచ్చిన రసాయనాలు విశ్వమంతటా ఉన్నాయి. కానీ, విశ్వంలో మరెక్కడా మన భూమి వంటి గ్రహం, దాని మీది వివరాలు ఉన్న సూచనలు లేవు. అన్నిటినీ మించి, జీవం అనే రసాయనాల పోగులు మరెక్కడా లేవనే అంటున్నారు. ఇక మనుషుల సంగతి గురించి చెప్పవలసిన అవసరమే లేదు. మనుషులు అనే రసాయనం కుప్పలకు తెలివి పుట్టిందని అనుకున్నాం కదా, కనుకనే, తెలివిగా ప్రపంచంలో మరెక్కడయినా, తమలాంటి తెలివి ఉందేమోనన్న వెతుకులాట కూడా మొదలయింది.
జీవము, తెలివి దొరకలేదు సరికదా, మన ఉనికికి ఆధారమయిన నీళ్లు కూడా మరెక్కడా లేవని తెలిసింది. ఎక్కడో కొన్ని చోట్ల ఎప్పుడో ఒకప్పుడు నీరు ఉండేదని చెప్పుకుని సంతోషపడుతున్నారు. సూర్యుడు అనే మన నక్షత్రం చుట్టూ తిరుగుతున్న మిగతా గ్రహాలలో కూడా నీళ్లు, గాలి, రాళ్లు మన దగ్గర ఉన్నట్టు లేవు. ఇక మిగతా నక్షత్రాల చుట్టూ గ్రహాలు కూడా ఎక్కువగా లేవు. ఎక్కడన్నా ఉంటే, అక్కడ వాటి తీరు మన భూగ్రహంలాగ లేదు. మనం ఉన్న ఈ భూమి మీద మాత్రం మనకు అనుకూలంగా, మరెన్నో భౌతిక, రసాయనిక లక్షణాలు మన కొరకే అన్నట్టు ఏర్పడి ఉన్నాయి. మనం ఉండాలంటే, అసలు జీవం ఉండాలంటే ఒక వాతావరణం ఉండాలి. అందులో మనకు అవసరమయ్యే వాయువులు ఉండాలి. జీవులకు గాలి, నీరు లేనిదే మనుగడ లేదు. ఆ తరువాత తిండి కావాలి. తిండి తయారుచేసుకునే పద్ధతులు కావాలి. అంటే, చెట్లు కావాలి. ఆ చెట్లు తమ తిండిని తామే తయారుచేసుకోవాలి. మిగతా జీవులకు తిండిని అందించాలి. అన్ని జీవులు ఒకే రకం చెట్లను తింటామంటే కుదరదు. ఏ జాతికి అనువయిన తిండి ఆ జాతికి ఏర్పాటు అయి ఉండాలి. అది చాలకపోతే, జంతువులు మరో రకం జంతువులను తింటాయి. పరిణామంలో కొన్ని జంతువులు చెట్లను తినడం మానేశాయి. జంతువులను మాత్రమే తింటున్నాయి. ఎంత దూరం వెళ్లినా, విషయంలోని అసలు సంగతి మాత్రం మారదు! ఇవన్నీ రసాయనాల కుప్పలే! ఆలోచించగలిగితే, ఆశ్చర్యపడగలిగితే, ఈ కథను ఎన్నో మార్గాలలో ఎంత దూరానికయినా ముందుకు సాగించవచ్చు. ఆ కథ పేరే సైన్స్!
కథను భాగాలుగా విడగొడితే, దేనికదే వేరు కథ. అన్ని కథలనూ కలిపి అర్థం చేసుకోగలిగితే, అది మన గురించిన కథ. కనుక, కథను మనం తెలుసుకోవడం అవసరం. శరీరంలోని రసాయనాలకు శరీరంలో ఉన్నామని తెలియదు. అట్లాగే, సైన్స్‌లో ఉన్న మనకు, మిగతా జీవులకు మనమే సైన్స్ అని తెలియదు! తెలుసుకుంటే, సంతోషంగాను, ఆశ్చర్యంగానూ ఉంటుందని మీకు అనిపిస్తే, నాకు ఆనందం. మీరు చదువుతారు, నేను రాస్తాను. మన మధ్యన సంబంధం సాగుతుంది. ఈ సంబంధం సాగాలని పై నుంచి ఎవరూ చెప్పనవసరం లేదు. జీవులు జీవులలాగ ఒక పద్ధతిలో ఉండాలని పై నుంచి ఎవరూ చెప్పడం లేదు. అవి జీవులుగా సాగుతున్నాయి. మనం మనముగా సాగాలి. మన గురించి మనం తెలుసుకోవాలి.
పరిణామం ఒక క్రమం కాదు. ఒక గమ్యం కొరకు జరగలేదు. అయినా, అందులో నుంచి మనిషి పుట్టాడు. మనిషిని రసాయనాల కుప్ప అన్నాము. జీవం పుట్టిన మొదట్లో ఒకచోట చేరిన కొన్ని రసాయనాలు చిత్రంగా జీవం మనుగడకు ప్రణాళికను తయారుచేశాయి. మనుగడకు అవసరమయిన సరంజామాగా అవే సర్దుకున్నాయి. జన్యు పదార్థం పుట్టింది. పరిణామం సాగింది. లెక్కలేనన్ని జాతులు పుట్టాయి. వాటిలో గట్టివి మనగలిగాయి. ఇక్కడ ఒక పెద్ద చిక్కు మొదలవుతుంది. పరిణామాన్ని అందరూ ఈ గట్టి అన్న మాట ఆధారంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. పరిణామం అంటే, పోరాటం అనుకున్నారు. ప్రకృతిని ఒక మహాకవి రక్తపిపాసిగా కూడా వర్ణించారు. పరిసరాలకు అనువుగా మారగలిగిన ప్రాణులు మనగలిగాయి. ఇందులో బలానికి, పోరాటానికి చోటు లేదు. ఉన్నదల్లా సర్దుకుపోయే గుణం.
డిస్కవరీ, మరొక చానెల్‌లో కార్యక్రమాలను చూస్తే, పులులు, సింహాలు, మొసళ్లు, పాములను మాత్రమే చూపిస్తుంటారు. జీవ ప్రపంచంలో ఇవి గొప్ప జంతువులు కానేకావు. మనిషికి కొంచెం ఆసక్తి కలిగిస్తాయి కనుక వాటిని మాత్రమే చూపిస్తారు. లక్షల ఏండ్లయినా తట్టుకుని బతుకుతున్న మిగతా జాతులను పట్టించుకోరు. ఈ రకానికి ఒక ఉదాహరణ, బొద్దింకలు అనే జిల్ల పురుగులు. తెర మీద ఎలుకలు, పురుగులను చూపిస్తే, ప్రకటనలు రావు. ప్రేక్షకులు ఉండరు. ఇంతకంటే విచిత్రమయిన సంగతి చెట్లను గురించి పట్టించుకోకపోవడం. ఆనిమల్ ప్లానెట్ అని చానెల్ ఉంది. మొత్తం జీవుల మనుగడకు ఆధారమయిన మొక్కలు, చెట్ల గురించి మాత్రం కార్యక్రమాలు కనిపించవు. పరిణామం గురించి లోతుగా ఆలోచిస్తే, అక్కడ కూడా జాతులన్నీ తమంతకు తాము మారిన తీరు కనపడుతుంది.
మొదట్లోనే రసాయనాల కుప్పలో ఈ స్వంత సమన్వయం మొదలయింది. అది కొనసాగింది. తెలివి తెలిసిన మనిషి దానికి జీవం అని పేరు పెట్టుకున్నాడు. ఒకే కణంతో ఉండే జీవుల గురించి మనిషికన్నా ఎన్నో రెట్లు పెద్ద జీవుల దాకా ఎన్నో జాతులు వచ్చాయి. చిత్రంగా అన్ని జాతులూ ఒక్క కణంగానే మొదలవుతున్నాయి. అండం అనే ఒక కణం నుంచి మొత్తం జంతువు పెరిగేలోపల ఆ జాతి ఆవిష్కరణ మార్గంలో జరిగిన పరిణామం మార్పులన్నీ మరోసారి నాటకంలా జరుగుతాయని చెప్పే సిద్ధాంతం ఉంది. జీవం ఒక కణంగా తేమ వాతావరణంలో పుట్టింది. బహుకణ రూపాలు, కణజాలాలు మొదట నీటిలో తరువాత నేలపై పెరిగాయి. మనిషి పెరుగుదల కూడా ఈ రకంగానే ఉంటుంది. పూర్తిగా పెరిగిన మనిషిలో ఈ నాటకపు ఫలితం కనిపిస్తుంది తప్ప, నాటకం వివరాలు కనిపించవు.
పరిణామం గురించి అందునా మనిషి పరిణామం గురించి చర్చించే సమయంలో మనకు కాలక్రమం గురించిన ఆలోచన ఉండడం లేదని అనుకున్నాము. మనిషికి తాను మనిషినని తెలియని దశలో పరిస్థితి గురించి ఊహించగలగాలి. కొంతకాలానికి ఆలోచన గురించి తెలిసింది. ఉనికి లేదా అస్తిత్వం గురించి తెలిసింది. ఇక తత్వశాస్త్రం మొదలయింది. ఇవాళటికి కూడా పుట్టిన శిశువుకు చాలాకాలం వరకూ స్వతంత్రంగా బతికే వెసులుబాటు లేదు. మిగతా జంతువులు, పశువులలో మాత్రం చిన్న శిశువు, నిమిషాలలో తనంతట తాను కదులుతుంది. తల్లి కడుపులోనుంచి బయటపడిన మరుక్షణం లేచి నిలబడే ప్రయత్నం చేస్తుంది. మనిషికి చాలా కాలం వరకూ తన గురించి తెలియదు. తలిదండ్రుల రక్షణ చాలా జంతువుల్లో ఉన్నా, మనిషిలో ఉన్న పద్ధతి వేరు. మానవ శిశువు మనుగడ, తిండి, రక్షణ అన్నింటి కొరకు అమ్మ మీద ఆధారపడాలి. ఈ సంబంధానికి కూడా ఒక హద్దు ఉంది. నేను అన్న భావన సరిగ్గా ఎప్పుడు మొదలయ్యేది తెలియదు.
నేను అన్న మాట రాగానే, ఆత్మరాహిత్యం అన్న మాట కూడా గుర్తుకు వస్తుంది. భౌతికంగా ఉన్న శరీరం మీరూ, నేను కాదు. మనిషికి మెదడు ఉంటేనే అందులో ఆలోచన ఉంటేనే, అక్కడ ఒక నేనుకు చోటు ఉంది. ఎవరికి వారు నేను. గుంపుగా కలిపి చూస్తే మానవుడు. అక్కడ కొన్ని సమాన లక్షణాలు! నేను ఎంత ప్రత్యేకమో అంత సామాన్యం! ఈ మాటలో నుంచి మనిషికి తెలిసిన తెలివి మార్గాలు, అంటే, శాస్త్రాలు అన్నీ మొదలవుతాయి. సైన్స్ అంటున్న భౌతిక ప్రపంచం కాని, మెదడులో ఉన్న మరొక ప్రపంచం కానీ, సమాజంలో ఉన్న పరస్పర సంబంధాల మీద పుట్టిన మొత్తం శాస్త్రాలు కానీ, ఇక్కడి నుంచే మొదలవుతాయి.
నేను అన్నది ఒక సామాజిక చేతన. అది ఒక వ్యక్తి చేతన కాదు. ఈ మాట ఆశ్చర్యంగా వినిపించవచ్చు. ఎదుట మరొకరు ఉంటే నేను, మీరు వేరుగా ఉండవచ్చు. ఒక్కరుగా ఉంటే నేను, మీరు లేరు. మీరుంటే, నేను నేను! మీకు మీరు నేను, నేను మీరు! ఇది సరదాకు చెపుతున్న మాట కాదు. అసలు సిసలయిన సైన్స్ ప్రకారం కూడా కాలం, గమనం లేకుంటే ప్రపంచం లేదు. స్థలం కాలం మీద ఆధారపడుతుంది. రెండూ కలిసి గమనం మీద ఆధారపడుతుంది.

కె. బి. గోపాలం