S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 43

పురాణవేత్తయిన ఆ సుమంత్రుడు ప్రజలతో నిండి ఉన్న ఆ అంతఃపుర ద్వారాన్ని దాటి నిర్మానుష్యమైన వాకిలిని చేరుకున్నాడు. అక్కడ విల్లంబులు ధరించిన రాజభక్తిగల యువకులు ఏమరిపాటు లేకుండా మనసు లగ్నం చేసి కాపలా కాస్తున్నారు. తెల్లటి దుస్తులని ధరించి, చక్కగా అలంకరించుకుని, చేతిలో బెత్తాలతో జాగ్రత్తగా ఉన్న వృద్ధ ద్వారపాలకులని చూశాడు. ఎప్పుడూ రాముడి క్షేమానే్న ఆలోచించే ఆ వృద్ధులు సుమంత్రుడ్ని చూడగానే లేచారు. వినయం గల సుమంత్రుడు మర్యాదగా వాళ్లతో చెప్పాడు.
‘సుమంత్రుడు ద్వారం దగ్గర వేచి ఉన్నాడని వెంటనే వెళ్లి రాముడికి చెప్పండి’
రాజక్షేమం కోరే వాళ్లు రాముడి దగ్గరికి వెళ్లి సీతతో ఉన్న రాముడికి ఆ మాట చెప్పారు.
తన తండ్రికి ఆంతరంగికుడైన సుమంత్రుడు వచ్చినట్లు తెలియగానే రాముడు అతన్ని ఆనందపెట్టాలని తన దగ్గరకే పిలిపించుకున్నాడు. మంచి బట్టలు ధరించి బంగారు ఆసనం మీద ఇంద్రుడిలా కూర్చున్న రాముడ్ని సుమంత్రుడు చూశాడు. పంది రక్తంలా ఎర్రగా ఉన్న సుగంధాన్ని రాముడు ఒంటికి పూసుకుని ఉన్నాడు. చేతిలో వింజామరతో పక్కనే నిలబడ్డ సీతతో ఆ రాముడు చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడిలా వెలిగిపోతున్నాడు. దశరథుడి నించి అనేక సత్కారాలు పొందే సుమంత్రుడు సౌకర్యమైన ఆసనం మీద, సూర్యుడిలా ప్రకాశించే, కోరికలు తీర్చే రాముడికి వినయంగా నమస్కరించి చెప్పాడు.
‘కౌసల్యా పుత్రుడివైన ఓ రామా! నీ తండ్రి, రాణి అయిన కైకేయి నిన్ను చూడాలని కోరుతున్నారు. వెంటనే అక్కడికి వెళ్లు’
తేజశ్శాలి అయిన రాముడు సుమంత్రుడ్ని గౌరవించి సీతతో చెప్పాడు.
‘సీతా! మహారాజు, మహారాణి కలిసి నా గురించి, నా రాజ్యాభిషేకం గురించి ఏదో ఆలోచిస్తున్నారని నిశ్చయంగా చెప్పగలను. మంచి తెలివితేటలు, నల్లటి కళ్లు గల కైకేయి మహారాజు చేయబోయేది గ్రహించి, ఆయనకి ఇష్టమైంది చేయడానికి నన్ను పిలిపిస్తోంది. మహారాజు మనసు ప్రకారం నా తల్లి కైకేయి నా మంచిని, లాభాన్ని కోరుతోంది. మన అదృష్టం వల్ల మహారాజు, రాణి నాకు అర్థకామాలని సంపాదించి ఇచ్చే సుమంత్రుడ్ని దూతగా పంపారు. ఒకేచోట ఉన్న నా తల్లిదండ్రుల నించి తగిన దూత వచ్చాడు. ఈ రోజే రాజు నాకు రాజ్యాభిషేకం చేస్తాడు. ఎంతో ఆనందంగా ఉంది. నేను వెంటనే రాజు దగ్గరికి వెళ్తాను. నువ్వు ఈ పరివారంతో కలిసి సుఖంగా ఉండు.’
భర్తతో గౌరవించబడ్డ, నల్లటి కళ్లు గల సీత మనసులో మంచిని కోరుతూ భర్తని ద్వారం దాకా సాగనంపి చెప్పింది.
‘బ్రహ్మ దేవేంద్రుడికి ఇచ్చినట్లుగా, రాజసూయ యాగం చేసే సమర్థత గల బ్రాహ్మణులతో సేవించబడే ఈ రాజ్యాన్ని మహారాజు నీకు ఇస్తాడు. దీక్ష తీసుకుని, వ్రతం పాటిస్తూ శుచిగా జింక చర్మాన్ని ధరించి, చేతిలో లేడి కొమ్ముతో ఉన్న నిన్ను చూసి ఆనందిస్తాను’
ఉత్సవ సమయంలో ధరించే మంచి అలంకారాల్లో ఉన్న రాముడు సీత అంగీకారం తీసుకుని సుమంత్రుడితో కలిసి ఇంటి నించి బయలుదేరాడు. కొండ గుహలో నివసించే సింహం పర్వతం నించి బయటకి వచ్చినట్లుగా తన ఇంట్లోంచి బయటకి వచ్చిన రాముడు, వినయంగా చేతులు కట్టుకుని ద్వారం దగ్గర నిలబడ్డ లక్ష్మణుడ్ని చూశాడు. పురుషులలో ఉత్తముడైన రాముడు మధ్య వాకిలి దగ్గర మిత్రులని కలుసుకున్నాడు. తన దర్శనం కోసం అక్కడికి వచ్చిన అందర్నీ చూసి వారి దగ్గరకి వెళ్లి పలకరించి పులి చర్మం కప్పిన, అగ్నితో సమానంగా వెలిగిపోయే ఉత్తమమైన రధాన్ని ఎక్కాడు. మేఘ్ధ్వనిలా చప్పుడు చేసే విశాలమైన ఆ రధాన్ని మణులతో, బంగారంతో అలంకరించడంతో కళ్లు మిరుమిట్లు గొలిపే దాని కాంతి మేరు పర్వతంలా ఉంది.
లక్ష్మణుడు రెండు చేతులతో గొడుగు, వింజామరని పట్టుకుని రధం ఎక్కి అన్న వెనకాల రక్షణగా నిలబడ్డాడు. తేజస్సుతో ప్రకాశించే దేవేంద్రుడిలా రాముడు ఎక్కిన వెంటనే ఏనుగు పిల్లల్లా ఉన్న ఉత్తమమైన గుర్రాలు కట్టిన ఆ రధం బయలుదేరింది. అందమైన ఆ రధం మేఘంలా చప్పుడు చేస్తూ మహా మేఘం నించి చంద్రుడు బయటకి వచ్చినట్లుగా ఇంటి నుంచి బయలుదేరింది.
నాలుగు వైపుల నించీ జన సముదాయం రణగొణ ధ్వనితో వెంట బయలుదేరారు. గంధం పూసుకుని, కవచాలని తొడుక్కుని, కత్తులు, బాణాలు ధరించిన వీరులైన భటులు ముందు నడిచి వెళ్లారు. ముఖ్యమైన వందల మంది సైనికులు ఉత్తమమైన గుర్రాలని, ఏనుగుల్ని ఎక్కి రాముడి రధాన్ని అనుసరించారు. వాద్య ధ్వనులు, వందిమాగధుల స్తోత్రాలు, వీరుల సింహనాదాలు దారంతా నిండిపోయాయి. శత్రునాశకుడైన రాముడు వెళ్లేప్పుడు చక్కగా అలంకరించుకున్న స్ర్తిలు నాలుగు వైపులా మేడల కిటికీల దగ్గర నించుని అతని మీదకి మంచి పువ్వులని చల్లారు. మేడల మీద, నేల మీద ఉన్న ఉత్తమమైన స్ర్తిలు రాముడికి నమస్కరించి అతనికి ఇష్టం కలిగించే మంచి మాటలు మాట్లాడారు.
‘తల్లికి ఆనందం కలిగించే ఓ రామా! నీ ప్రయాణం ఫలవంతమై, తండ్రి రాజ్యాన్ని స్వీకరించే నిన్ను చూసి నీ తల్లి కైకేయి తప్పక ఆనందిస్తుంది’
స్ర్తిలందరిలోకి రాముడికి ఇష్టమైన సీత ఉత్తమమైందని వారు భావించారు. ‘రోహిణి చంద్రుడితో కలిసినట్లు రాముడ్ని భర్తగా పొందిన సీతాదేవి పూర్వం గొప్ప తపస్సు చేసి ఉంటుంది అనడంలో సందేహం లేదు’ అనుకున్నారు. పై అంతస్థుల్లోంచి స్ర్తిలు మాట్లాడిన ఆ మాటలని రహదారి మీద వెళ్లే రాముడు విన్నాడు. అంతేకాక రాముడు అక్కడ గుమిగూడిన పౌరులు చాలా సంతోషంగా తన గురించి చెప్పుకునే మాటలని కూడా విన్నాడు. ‘రాముడు ఈ రోజు రాజానుగ్రహం వల్ల ఈ రాజ్యలక్ష్మిని పొందుతున్నాడు. రాముడు మనకి రాజు కాబోతున్నాడు. రాముడు మన దేశాన్నంతా చాలాకాలం పరిపాలించడం ప్రజలకి గొప్ప లాభం. మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇతను రాజైతే ఎవరూ, ఎన్నడూ కష్టాలని కాని, దుఃఖాన్ని కాని చూడరు’
ముందు నడుస్తున్న రధం తోలేవాళ్లు, మాగధులు మంచి మాటలు చెప్తూండగా, ఉత్తమమైన వాయిద్యాలు వాయించే వాళ్లూ స్తుతిస్తూండగా రాముడు ధ్వనిచేసే గుర్రాలు, ఏనుగులతో కలిసి ఇంద్రుడిలా బయలుదేరి వెళ్లాడు. అనేక రత్నాలు, వివిధ వస్తువుల దుకాణాలతో, ఏనుగులు, గుర్రాలతో కిక్కిరిసి పరిశుభ్రంగా ఉన్న రాజమార్గాన్ని చూసాడు. నాలుగు దారుల కూడలి జనాలతో నిండి ఉంది.
(అయోధ్య కాండ సర్గ 16 శ్లోకాలు 1-47)
ఆశే్లషకి హరిదాసు చెప్పిన ఏడు తప్పులని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయింది. కారణం అతను హరికథకి వచ్చే ముందే 16వ సర్గని చదివి రావడంతో అవి తెలిసాయి.
మీరు ఆ ఏడు తప్పులని కనుక్కోగలరా?
* *
మీకో ప్రశ్న
*
కౌసల్య తల్లిదండ్రులు ఎవరు?
*
గత వారం‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
ప్ర: అర్ధ సాధకుడు
దశరథుడికి ఏమవుతాడు?
జ: దశరథుడి ఎనిమిది మంది
మంత్రులలో ఒకడు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు సమాధానాలు:
*
1.సుమంత్రుడితో రాముడ్ని తీసుకురమ్మని కైకేయి చెప్పింది. మంధర కాదు. అసలు ఆమె అక్కడ లేనే లేదు.
2.రాముడిది కర్కాటక లగ్నం. కన్యా లగ్నం కాదు.
3.మంగళకరమైన ఎనిమిది మంది కన్యలు సిద్ధంగా ఉన్నారు. ఎంత మందో హరిదాసు చెప్పలేదు.
4.పైకప్పు ఉన్న, గుర్రాలు కట్టిన రథాన్ని ఎక్కి, సుమంత్రుడు రాముడి అంతఃపురానికి చేరుకున్నాడు. హరిదాసు ఇది చెప్పలేదు.
5.రాముడు ఎక్కాల్సిన ఏనుగు పేరు శతృంజయం. ఆ పేరు హరిదాసు మృత్యుంజయం అని తప్పుగా చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి