S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి మనసు

రాజమహేంద్రవరం దగ్గరగా వున్న ద్వారపూడిలో రంగయ్య ఒక హోటల్ నడుపుతున్నాడు. రుచికి శుచికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆ హోటల్‌కి మంచి పేరు వచ్చింది. రంగయ్య దగ్గర కాళిదాసు, మాణిక్యం అనే ఇద్దరు వంటవాళ్లు పనిచేసేవారు. వంట చేయడంలో వారిది అందెవేసిన చెయ్యి. ఏ కూరలైనా సరే బహు చక్కగా వండేవారు. రంగయ్య వారిని చాలా బాగా చూసుకునేవాడు. ఎప్పటికప్పుడు వారి జీతాలు పెంచేవాడు.
రంగయ్య హోటల్‌లో భోజనం చేసిన ప్రతి వారూ ‘చాలా బాగుందయ్యా భోజనం. నీకు బాగా వంట చేసే పనివాళ్లు దొరకడం నీ అదృష్టం’ అనేవారు. అలా రోజూ అందరే అనే మాటలు కాళిదాసు, మాణిక్యంపై ప్రభావం చూపాయి. మా వల్లనే ఈ హోటల్ నడుస్తోంది అనుకోసాగారు. అప్పటి నుండి వారి ప్రవర్తన మారింది. జీతం ఇంకా పెంచాలని, సెలవులు అడిగిన వెంటనే ఇవ్వాలని ఆంక్షలు పెట్టసాగారు. పోనీలే అని రంగయ్య వారు అడిగిన జీతం ఇచ్చేవాడు. రాన్రాను వారి ధోరణి రంగయ్యకు కష్టంగా మారింది. ఇక వీరితో తను హోటల్ నడపడం సాధ్యం కాదని తలచాడు. ఆ రోజు నుంచి హోటల్‌కి వచ్చేవారితో తను వైద్యం నిమిత్తం కేరళ వెళ్లాలని, కొంతకాలం హోటల్ మూసేస్తున్నానని చెప్పసాగాడు. కాళిదాసు, మాణిక్యం ‘మా జీతాలు ఇంకా పెంచకపోతే మేము మీ వద్ద పని మానేసి మరొక చోటికి పోతాం’ అని బెదిరించారు.
అదే రోజు కోసం చూస్తున్న రంగయ్య ‘సరే.. ఏం చేస్తాం? మీరు లేకపోతే హోటల్ నడపలేను కదా! ఇదిగో మీకు రావలసిన మొత్తం.. రేపటి నుండి నేను హోటల్ మూసేస్తున్నాను. మరొకచోట ఎక్కువ జీతానికి పనిలో చేరండి’ అని చెప్పాడు.
పనివాళ్లు సరిగా లేకపోవడం వలన రంగయ్య హోటల్ మూసేసాడని చాలామందికి తెలిసిపోయింది. అలా రంగయ్య దగ్గర పని మానేసిన కాళిదాసు, మాణిక్యం మరొక హోటల్‌కి వెళ్లి పని అడిగారు. ‘రంగయ్య ఇచ్చినంత జీతం ఇవ్వలేం. మా దగ్గర సెలవులు పెట్టడం కుదరదు. నచ్చితే చేరండి. లేకుంటే లేదు’ అన్నారు వాళ్లు. మరొకరైతే రంగయ్య దగ్గరే చేయలేకపోతే మా దగ్గర అసలు చేయలేరు. మేం ఆయనంతలా చూడలేము అన్నారు. ఇలా వెళ్లిన ప్రతిచోట వాళ్లకు నిరాశే ఎదురైంది.
హోటల్ మూసేసిన రంగయ్య రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అక్కడ పలుచోట్ల గాలించినా సరైన వంటవాళ్లు దొరకలేదు. మధ్యాహ్న సమయానికి ఒక వీధిలోకి చేరాడు. అటుగా పోతున్న ఒక వ్యక్తితో ‘అయ్యా! ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా’ అని అడిగాడు.
‘హోటలా! ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఈ వీధి చివర శారదమ్మ అనే ఒకామె కొద్దిమందికి మాత్రమే వండి పెడుతుంది. అది కూడా ముందుగా చెప్పాలి. ప్రయత్నించండి. మీకు ఒకవేళ భోజనం దొరకచ్చు’ అన్నాడు.
అతను చెప్పిన ఇంటికి వెళ్లాడు రంగయ్య. అక్కడ ఒక యువతి కొంతమందికి భోజనం పెడుతోంది. అదొక ధర్మసత్రంలా కనిపించింది రంగయ్యకు.
‘రండి. భోజనం చేస్తారా?’ అని అడిగింది.
‘ఆ...’ అంటూ ఇంటి వెనకవేపున్న పెరట్లో కాళ్లు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు రంగయ్య.
‘ఈ రోజు కూరలు కొద్దిగా ఉన్నాయి’ అంటూ... కూరలు, పచ్చళ్లతో భోజనం వడ్డించింది. పచ్చని అరటిఆకు.. గోంగూర పప్పు, వంకాయ కూర, దోసకాయ పచ్చడి, సాంబారు, గడ్డ పెరుగు.. చాలా బాగుంది భోజనం. ధర కూడా చాలా తక్కువ. భోజనం ముగించాక ‘ఏమమ్మా.. ఇంత చక్కటి భోజనం పెట్టావు కదా.. మరి చాలా తక్కువమందికి మాత్రమే వంట చేస్తున్నావు ఎందుకు? ఎక్కువ మందికి వండి అమ్మచ్చుగా..’ అన్నాడు.
‘లేదయ్యా! వాళ్లు రావడమే గగనం. చాలాకాలం నుండి అలవాటైన వారు మాత్రమే ఇక్కడకు వస్తారు. ఎప్పుడో ఒకసారి మీలా కొత్తవారు రావడం, మాకు గిట్టుబాటు కావడం లేదు. కాని మరొక పని లేక ఇలా కుటుంబ పోషణ కోసం ఈ హోటల్ నడుపుతున్నాను’ అందామె.
ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నాడు రంగయ్య.
ఆమె, ఆమె భర్త ఇద్దరూ వంట చేస్తారు. శారదమ్మ కూరలు, పచ్చళ్లు చేస్తే అతను అన్నం, సాంబారు మొదలైనవి చేస్తాడు. ఇద్దరిది వంట చెయ్యడంలో పనిమంతులు. వారికొక కొడుకు. వాడిని బడిలో చేర్పించాలి. అన్నీ తెలుసుకున్న రంగయ్య తన గురించి కూడా వాళ్లకు తెలిపాడు. వాళ్లకు అభ్యంతరం లేకపోతే తనతో ద్వారపూడి రమ్మన్నాడు. రంగయ్య మాటతీరు వాళ్లకి నచ్చడంతో వారి మకాం ద్వారపూడికి మార్చేశారు.
రంగయ్య హోటల్ తిరిగి ప్రారంభమైంది. ముందు కంటే రుచిగా.. భోజనాలు తయారయ్యాయి. రేటు కూడా తగ్గించాడు. శారదమ్మ కొడుకుని దగ్గరలోని బడిలో చేర్చాడు. హోటల్ మరింత పుంజుకుంది. పని పోగొట్టుకున్న కాళిదాసు, మాణిక్యంలకు వారు చేసిన తప్పు తెలిసింది. మంచి వారికి మంచే జరుగుతుందని శారదమ్మ కుటుంబానికి, రంగయ్య విషయంలో మరోసారి రుజువైంది.

-కూచిమంచి నాగేంద్ర