S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విలువ-విలువలు

మొదటి బహుమతి రు.10 వేలు పొందిన కథ
*
దూరపు బంధువుల ఇంట్లో పెళ్లి. సిటీలోనే ఫంక్షన్ హాల్‌లో చేస్తున్నారు.
సరిగ్గా ముహూర్తం టైముకి మేమిద్దరం వెళ్లాం. బంధుమిత్రులంతా ఎదురొచ్చి ఆహ్వానించారు. వీఐపీగా చూస్తూ హడావిడి చేశారు. తిన్నగా మండపం మీదకి తీసుకెళ్లగా అక్షింతలేసి చిన్న గిఫ్టు ఇచ్చాం.
‘వీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. పెద్ద హోదాలో ఉండటమే కాదు గొప్పగా సంపాదించారు. కోట్లకి పడగెత్తారనుకోండి. ఎన్నో ఇళ్లూ, షాపులూ, పల్లెలో తోటలూ - అబ్బో చాలా ఉన్నాయి. మాకు బాగా దగ్గరి బంధువులు’ అంటూ గొప్పగా మగ పెళ్లివారికి పరిచయం చేశారు.
నా భుజాలు రెండంగుళాలు పెరిగాయి.
అసలిందుకే పిలవడం ఆలస్యం ప్రతి ఫంక్షన్‌కీ వెళ్తూంటాం. పది మంది మన గురించి, మన ముందు గొప్పగా చెప్పుకుంటే ఆ ఆనందమే వేరు. ఇక భార్య ముందు పొడిగితే ఆ థ్రిల్లే వేరు. అసలు జనం మన స్థాయి, మన హోదా, మన సంపాదన బంధుమిత్రులకి చాటుకునే అవకాశం కల్పించడానికే ప్రతీ శుభకార్యాన్నీ ఒక వేడుకగా చేస్తున్నారేమో అన్పిస్తూంటుంది.
అందరి అభినందనలూ మెచ్చుకోలు చూపులూ వినయాభిమానాలూ స్వీకరిస్తూ భోజనశాలకు వెళ్లాం. మమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి ప్లేట్లలో అన్ని రకాలూ పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు.
కబుర్లు నంజుకుంటూ లంచ్ ముగించి వెనుదిరిగాం. కారు దాకా వచ్చి వీడ్కోలిచ్చారు.
‘మన బంధువుల్లోకెల్ల మీరే గొప్ప స్థాయిలో ఉన్నారు. అందుకనే అంతా పోటీ పడి మరీ పొగిడేస్తున్నారు’ కారు కదిలేక అంది సులోచన.
‘్ధన మూల మిదం జగత్!’ నవ్వాను.
సెల్ మోగింది. ‘చెప్పు...’
‘మీరు చెప్పిన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను సార్...’
‘అక్కడే ఉండు. వచ్చేస్తున్నా’
సెల్ కట్టేశాక అడిగింది ‘పెద్ద చేపా?’
‘మోస్తరు... పాతిక వేలు’
‘వాళ్లంతా క్రితం జన్మలో మీకు రుణపడి ఉంటారు. ఇప్పుడీ రకంగా తీర్చేసుకుంటున్నారు’
‘అవునంతే మరి...’
పెట్రోలు బంకులోకి కారు పోనిచ్చి ఒక పక్కగా ఆపాను.
అతడు పరుగున కారు దగ్గరికి వచ్చాడు. కారు అద్దం దించాను. అతడి చేతిలోని నోట్ల కట్ట చూసి మందహాసం చేశాను. ‘అన్నీ పెద్ద నోట్లేనా?’
‘మీ బోటి పెద్దలకి చిన్న నోట్లిస్తానా!’
చెయ్యి చాచి ఇవ్వబోయాడు. అందుకోలేదు. ‘కవర్లో పెట్టి వెనక సీట్లో ఉంచు’
అతడు తన బ్యాగ్‌లో వెదికాడు. కవరు దొరకలేదు కాబోలు. ఏదో కరపత్రాన్ని చుట్టి వెనుక సీట్లో ఉంచాడు.
‘నీ పని అయిపోయినట్టే. రేపొచ్చి ఆర్డర్ తీసుకో’
అతడు చేతులు జోడించాడు. కారు ఇంటికి పోనిచ్చాను.
మాది ఇండిపెండెంట్ హౌస్. బాగా అభివృద్ధి చెందిన లొకాలిటీ. మా ఏరియాకి నేనే వీఐపీని. రోజూ ఠంచనుగా కుళాయి నీళ్లు రావడానికీ, మా ప్రాంత రోడ్లు ప్రతిరోజూ ఊడ్చడానికీ, ఎప్పటికప్పుడు డ్రైనేజ్ శుభ్రం చేస్తూండటానికీ కారణం నేనూ, నా హోదాయేనని అందరికీ తెలుసు. అందుకనే నన్నో విశిష్ట వ్యక్తిగా చూస్తారు. గౌరవిస్తారు.
కారుని ఇంటి ముందు రోడ్డు పక్కన పార్కు చేశాను. రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్న యువకులు కొంచెం పైకెళ్లిపోయారు.
గొడవ పడుతున్న పిల్లలు కామ్ అయిపోయారు. ఇరుగూ పొరుగూ వౌనంగా మారిపోయి తలలు తిప్పి మా వంక అభిమానంగా చూశారు.
ఇంట్లోకెళ్లి మెత్తని సోఫా మీద కాళ్లు చాపి మరీ రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను.
‘టీ పెట్టనా?’
‘వద్దులే. కాస్సేపు నడుం వాలుస్తాను...’
‘ఆఫీసుకెళ్లరా?’
‘మూడ్ లేదు’
‘మీ కోసం ఆఫీసు గాని ఆఫీసు కోసం మీరు కాదు. గవర్నమెంటు దత్తపుత్రులు’ నవ్వింది సులోచన.
‘నేనింకా స్వంత పుత్రుడ్నీ, స్వంత రాజ్యమూ అనుకుంటున్నానే!’ ఆవలిస్తూ లేచాను.
మంచమెక్కగానే నిద్ర పట్టేసింది. లేచేసరికి ఏడు గంటలు. స్నానం చేసొచ్చేసరికి మందు సరంజామా సర్ది ఉంచింది సులోచన.
టీవీలో న్యూస్ ఛానల్ పెట్టాను. గ్లాసులోకి డ్రింక్ పోసుకుని ఐస్ క్యూబ్‌లు వేసుకుంటున్న వాణ్ణల్లా వార్త విని మ్రాన్పడిపోయాను. సులోచన కొయ్యబారిపోయింది.
‘ఏంటండీ ఏం చెబుతున్నారూ. మోడీ నిజంగానే పెద్ద నోట్లు రద్దు చేశాడా? అతడికేం పోయేకాలం వచ్చిందండీ!’ లబలబలాడింది.
నా మెదడు బ్లాంక్ అయింది. నోరు తెరవలేక గుడ్లప్పగించి చూస్తూండిపోయాను.
‘నిజంగానే వెరుూ్య అయిదొందల నోట్లు చెల్లవా?’ ఆదుర్దాగా అడిగింది.
‘రేపట్నుంచి చెల్లవుట...’
‘మన దగ్గరున్న డబ్బంతా...’ కళ్లనీళ్ల పర్యంతమవుతోంది.
స్ప్రింగులా లేచి లోపలికి దూసుకెళ్లాను. లాకర్లలో, బీరువాలో, పెద్ద మంచానికున్న సీక్రెట్ అరల్లో దాచిన వెయ్యి, అయిదు వందల నోట్ల కట్టల్ని బయటకి తీసి కుప్పగా పోశాను.
‘విల్లా కొంటానని మూడు నెలల్నుంచి ఊరేగుతున్నారు. కొనేసి ఉంటే బావుండేది’
‘చాలా పెద్ద పొరబాటు చేశాను. వసూలు చెయ్యడం మీద చూపిన శ్రద్ధ మదుపు చెయ్యడం మీద చూపలేదు. అర్థాంతరంగా మోడీ ఇలా మెరుపు దాడి చేస్తాడని ఏ మాత్రం ఊహించలేదు. మన వద్ద దగ్గర దగ్గర 50,60 లక్షలుంటాయి’ దుఃఖం పొంగి రాగా గొంతు పూడుకుపోయింది.
‘ఇప్పుడేం చేద్దామండీ’ ఏడుపు స్వరంతో అడిగింది సులోచన.
‘ఎలా వోలా మార్చెయ్యాలి...’
‘బ్యాంకుల్లో ఉన్న డబ్బుకేం ఫరవాలేదు కదా?’
‘అవి నిక్షేపంగానే ఉంటాయి కాని, లాకర్లలో దాచిన క్యాష్ 20, 30 లక్షలకి ప్రమాదం వస్తుంది. అంత సొమ్ము మార్చాలంటే చాలా కష్టం...!’
‘బ్యాంకు మేనేజర్లు మీకు తెలుసుగా’
‘తెలుసు గాని, వాళ్లకి కలిసొచ్చేట్లుంటే ఎందుకు సహకరిస్తారు? పెర్సంటేజ్ ఇమ్మంటారు’
‘పోతే పోయింది. ఎంతో కొంత పడేసి మార్చుకోవాలి. లేకపోతే మొత్తం సొమ్మంతా చిత్తు కాగితాలై పోతాయండీ!’
గుండె గుభిల్లుమంది. గుటకలు మింగుతూ నోట్ల కట్టల వంక చూశాను. చుట్ట చుట్టుకున్న కట్ల పాముల్లా కన్పించాయి.
ఎందర్నుంచో ఎన్నో రకాలుగా బెదిరించి భయపెట్టి ఒత్తిడి తెచ్చి వసూలు చేశాను. ఎన్నో రూల్సు వంచి, మెలికలు పెట్టి, లొసుగుల్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా సంపాదించాను! లంచాల గడ్డి అయితేనేం నోట్లన్నీ నిఖార్సైనవే! రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ముద్రించినవే.
ఇప్పుడీ సొమ్మంతా గాలి కెగిరిన పేలపిండి అవదు కదా?
‘ఏమైనా మాట్లాడండీ. మీరలా వౌనంగా ఉంటే నాకు భయమేస్తోంది...’
‘ఇంత డబ్బు బ్యాంకులో వేయలేం. నగదుగానే మార్చుకోవాలి. నాలుగు వేలు వరకే మార్చుకోవచ్చు...’
‘మీరూ నేనూ పదిసార్లు పది బ్యాంకుల్లో మారుద్దాం. మన పనిమనిషినీ, దాని మొగుడ్నీ రమ్మంటాను. మీ ప్యూన్లనీ రమ్మనండి...’
సంతోషం ఉప్పెనలా పొంగి వచ్చింది. ‘అడ్డా కూలీల్ని తీసుకొస్తే పని జరగొచ్చు. కాదంటే వాళ్లు డబ్బు మార్చేక నిజాయితీగా తిరిగిచ్చే వాళ్లవ్వాలి. అలాగని మన దగ్గర ఎంతో డబ్బు ఉందని నలుగురికీ తెలీనివ్వకూడదు. అదింకా ప్రమాదం. ఏసీబీ వాళ్లకి ఉప్పందితే కొంప కొల్లేరై పోతుంది...’ కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తూ అన్నాను.
సులోచన భయ విహ్వలయయ్యింది.
‘నువ్వేం భయపడకు. నీకు తెలుసుగా. నేను చాలా తెలివైనవాణ్ణి. తిమ్మిని బమ్మిని చేసేస్తాను. తేలిగ్గా ఎరకి దొరికే రకాన్ని కాదు. ఇవాళ్టి దాకా డబ్బు పోగెయ్యడం గురించే ఆలోచించాను. ఇప్పుడిహ చేతిలోని డబ్బు మార్చుకోవడం గురించాలోచించాలి. ఎలాంటి ఖర్మ వచ్చి పడిందో చూడు’
‘కొంత డబ్బు మా అన్నయ్యికిచ్చి మార్చమంటే?’
పెదవి విరిచాను. ‘మొన్నటి నెలలో వాళ్లమ్మాయి పెళ్లికి రెండు లక్షలు సర్దమంటే బీదరపులు అరిచాంగా!’
‘పోనీ మా చెల్లెలి సాయం తీసుకుంటే?’
‘అనిత మహా చలాకీ. హాం ఫట్‌మని ఇట్టే మాయం చేసేస్తుంది. బొమికలు కూడా మిగల్చదు’ నాలుక చప్పరించాను.
‘ఏదో దారి దొరుకుతుంది లెండి. ముందు కాస్త మందు పుచ్చుకుని భోంచేద్దురు గాని లేవండి’
‘ఇంకెక్కడి ఆకలి. ఎప్పుడో చచ్చిపోయింది. ముందు ఇందులోంచి ఎలాంటి నష్టం వాటిల్లకుండా బయటపడాలి...’
నోట్ల కుప్ప ముందు ఇద్దరం విచారంగా కూర్చున్నాం. ఎందుకో శవ జాగారం చేస్తున్నట్టు అన్పించింది. నిజమే. మా పెద్ద నోట్లిప్పుడు శవంతో సమానం! నానా గడ్డీ కరిచి సంపాదించిన రంగుల నోట్లు ప్రాణం లేని వట్టి కాగితాలై పోయాయి! ఎంత చిత్రం!
‘ఈ నోట్లని బంగారు దుకాణాల్లోనూ తీసుకోరంటారా?’
‘తెల్లారితే కాఫీ హోటల్ వాడూ తీసుకోడు’
‘ఇంత హఠాత్తుగా ఆ మోడీ ఇలా మోళీ చేస్తే ఎలాగండీ... పెళ్లిళ్లుంటాయి. పబ్బాలుంటాయి. రోగాలుంటాయి, రొచ్చులుంటాయి, యాత్రలుంటాయి. ఇంకెన్నో అత్యవసర పనులుంటాయి!’ నిష్ఠూరంగా అంది.
‘ఆసుపత్రుల్లో, పెట్రోలు బంకుల్లో కొన్ని రోజుల దాకా తీసుకుంటారు’
‘ఇంకేం, అక్కడ మార్చేద్దాం..’ కళ్లు మెరుస్తోంటే అంది సులోచన.
తలాడించాను. కొంచెంగా రిలీఫ్ అవుతూ.
ఆ రాత్రి నిద్రాదేవి మా వంక కనె్నత్తి చూడలేదు.
పదింటికి బ్యాంకుకి పరుగెత్తాను. బ్యాంకు ముందరి క్యూలు చూసి డీలా పడ్డాను. అయినా వెళ్లి మేనేజర్ని కలిశాను. కమీషన్ ఇస్తానన్నా లొంగలేదు ‘డిపాజిట్ చెయ్యండి లేదా లైన్లో నిలబడి మార్చుకోండి’ అన్నాడు నిష్కర్షగా.
ఎక్కడో పిచ్చోడు! నాది వైట్‌మనీ అయితే వీడి బోడి సలహా కోసం ఎందుకొస్తానూ!
ప్యూన్ని పిలిచాను. ‘అర్జంటుగా పదిమందిని చూడు. పెద్దనోట్లు మార్చాలి. వాళ్లు నాలుగైదు రోజుల దాకా కావాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మళ్లీ మళ్లీ లైన్లలో నిలబడి నోట్లు మార్చాలి. మార్చిన ఆ డబ్బుతో ఉడాయించకూడదు. మంచి వాళ్లని, తెలిసిన వాళ్లని చూడు. మీ కాలనీ వాళ్లైతే మరీ మంచిది’
‘ఈ రోజుల్లో మంచి వాళ్లు మచ్చుకి కూడా కనపడరు సార్. అంతా దగుల్బాజీలే. మన అవసరం అని తెలిస్తే ముందే నెత్తికెక్కేస్తారు’
‘నాలుగైదొందలు పడేద్దాంలే. ఆధార్ కార్డు కాపీ తీసుకుని రమ్మను చాలు’ అతడి ధోరణి నచ్చక విసుగ్గా అన్నాను.
మొత్తానికి ఓ పనె్నండు మందిని తీసుకొచ్చాడు. సాయంత్రానికి నాలుగు లక్షలు మార్చాం. తిండీ తిప్పలూ మాని ఆ దగ్గర్లోని చెట్టుకింద తిష్టవేసి అందర్నుంచీ జాగ్రత్తగా వసూలు చేశాను.
ఇంట్లో అడుగుపెడుతోంటే అంది సులోచన. ‘నిన్న రాత్రంతా నగల షాపులు తెరిచే ఉంచారట. ధర అడ్డంగా పెంచినా ఎందరో కొనేశారట. టీవీలో చూపిస్తున్నారు’
‘అరెరె. మనకా ఐడియా రాలేదు చూడు. భలే ఛాన్స్ మిస్సయ్యాం’ బాధతో సుళ్లు తిరిగాను.
‘పోనీలెండి. మనకెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది’ వేదాంతం వల్లించింది.
నేనలా స్థిమిత పడలేకపోయాను. లంచాలు తీసుకోవడమూ బ్రహ్మ విద్యేనని నాలాంటి వాళ్లకి మాత్రమే తెలుస్తుంది!
ప్రభుత్వం రూలు మార్చింది. రోజుకి ఒక్కసారే మార్చుకోవచ్చంటూ వేలిమీద చుక్కలెయ్యడం మొదలెట్టారు. ఆ దెబ్బకి కుదేలై పోయాను.
సడన్‌గా కొండల్రావు గుర్తొచ్చాడు. అతడు నా కొలీగే. నేను చేప అయితే అతడు తిమింగలం. అతడికి ఫోన్ చేసి దారి చూపమని అభ్యర్థించాను.
‘రెండున్నర లక్షల దాకా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. దానికి ఐటీ వాళ్లు లెక్కాపత్రం అడగరు. బంధుమిత్రుల ఖాతాల్లో వేసుకోవచ్చు. జన్ ధన్ ఖాతాల వాళ్లైనా ఫరవాలేదు. ఆ తర్వాత సొమ్ముని నీ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి. కొంత రిస్కు ఉంటుంది. 10% కమీషన్‌తో కొందరు మార్చి ఇస్తున్నారు మరి...’ అంటూ ఒకరి నెంబరిచ్చాడు.
ఒడ్డున పడిపోయినట్టేనని సంబరపడ్డాడు. తిన్నగా కమీషన్ ఏజెంట్ ఇంటికెళ్లిపోయాను.
‘ఇప్పుడు కమీషన్ 20%. బ్యాంకోళ్లు పెంచేశారు. ఇవాళ పాత నోట్లు తెచ్చి, రేపు కొత్త నోట్లు పట్టుకెళ్లండి’
అతడ్ని నమ్మలేకుండా ఉన్నాను. అలాగని నమ్మకుండా ఉండనూ లేకపోయాను. శాంపిల్ డోస్‌గా ఆరు లక్షలు ఇచ్చాను.
మరుక్షణం నుంచీ ఒకటే ఆందోళన. అతడు గోల్‌మాల్ చేస్తాడేమోనని భయం. ఎంతో కష్టపడి, ఎంతో రిస్కు చేసి సంపాదించిన సొమ్ముని అతడు స్వాహా చేస్తే? ఎవరికీ చెప్పుకోలేను, గట్టిగా అడగలేను, నిలదీయలేను! ఎంతటి దౌర్భాగ్యం దాపురించిందీ!
మోడీ కొమ్ములూ, కోరలూ పెంచి, పెద్ద నాలిక, బానపొట్టతో ఒక రాక్షసుడిలా కన్పించసాగాడు నా కళ్లకి! లేకపోతే ఇంత దారుణంగా రద్దు చేయడం ఏవిటి! గాంధీగారి బొమ్మ ఉన్న నోట్లు చెల్లకుండా పోయాయంటే ఇంక లోకంలో నీతికీ, సత్యానికీ చోటెక్కడ!
తిన్నగా ఏజెంటు దగ్గరికెళ్లాను. ఫెళఫెళలాడుతున్న కొత్త రెండు వేల నోట్ల కట్టలు చేతిలో పెట్టాడు. నా టెన్షన్ మాయమైంది.
‘చాలా థాంక్సోయ్. సాయంత్రం మళ్లీ కొంత తెచ్చిస్తాను’
‘40% కమీషన్’
అవాక్కయ్యాను. ‘పాత కస్టమర్ని. మరీ ఇంత దారుణంగా పెంచేస్తే ఎలా?’
‘మీకిష్టమైతేనే’ మరో మాటకి అవకాశం ఇవ్వలేదు.
అక్కడేమీ అనలేక ఇంటికెళ్లి సులోచన దగ్గర వాపోయాను. ‘ఎంత అన్యాయమో చూడు, సగానికి సగం మింగేస్తారంట. మనుషులు బాగా దిగజారిపోయారు. లోకంలో న్యాయం, ధర్మం బొత్తిగా లేకుండా పోయాయి’
‘కలికాలం! అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అంతేగా!’
తుళ్ళిపడి ఆమె ముఖంలోకి చూశాను. నేనూ అలాగే సంపాదించానని ఎత్తి పొడుస్తోందా? నాదంతా అవినీతి సొమ్మే కదా అని చెప్పక చెబుతోందా?
‘అడిగినంతా పడేసి మార్చుకోకపోతే ఎందుకూ పనికిరాకుండా పోతాయి కదండీ. పోనీ బంధువులందరి ఖాతాల్లోనూ వేయిస్తే?’
‘వద్దొద్దు. అల్లరై పోతాం. పరువు పోతుంది. ఐటీ వాళ్లతోనూ వేగలేం. దానికన్నా ఈ పద్ధతే నయం!’
పది లక్షలు తీసుకుని వెళ్లబోతోంటే కాశమ్మ వచ్చింది.
రోడ్డు వైడెనింగులో తన ఇల్లు పోకుండా చూడమని గత నెల రోజుల్నించీ నా చుట్టూ తిరుగుతోంది. నిజానికి ఆమె ఇల్లు పోదు. పోతుందని మా వాళ్లు భయపెట్టారు. దండుకోడానికిదో మార్గం!
‘ఇక్కడి కెందుకొచ్చావ్? ఆఫీసుకి రా.. వెళ్లెళ్లు’ కసిరాను.
‘మీరు ఆఫీసుకి రావట్లేదని చెప్పేరు. మీరు అడిగినంత డబ్బు తెచ్చాను...’ గబగబా అయిదొందల నోట్లు తీసివ్వబోయింది.
ఆశగా చూసిన వాడ్నల్లా సడన్‌గా అరికాలి మంట నెత్తికెక్కగా, ఆగ్రహంగా మారిపోయాను.
‘నేన్నీ కళ్లకెలా కన్పిస్తున్నాను? చెల్లని నోట్లు తెచ్చి నా ముఖాన కొడితే నీ పని చేస్తాననుకున్నావా? వెళ్ళెళ్ళవమ్మా. కొత్త నోట్లో వంద నోట్లో పట్టుకురా. అప్పుడు నీ పని చూస్తా. లేకపోతే నీ ఇల్లు గోవిందే!’ బెదిరించాను.
‘బాబ్బాబు. అంత మాటనకండి. కొత్తవెక్కడా దొరకట్లేదు సావీఁ. చచ్చీ చెడి ఇవి తెచ్చాను...’
‘చెబుతుంటే నీక్కాదూ. వీటికేం విలువలేదు. ఏం తిప్పలు పడతావో పడి, వీటిని మార్చి, రెండ్రోజుల్లో పట్రా. లేకపోతే నీ పని చెయ్యలేను’ తెగేసి చెప్పేను.
ఆమె నిస్సహాయంగా చూస్తూండిపోయింది.
నాల్రోజుల తర్వాత ఆఫీసుకెళ్లాను. ఫైల్సు మీద దృష్టి పెట్టలేకపోయాను. అందరి పరిస్థితీ నాలాగే ఉంది. నిజానికి మోడీ జ్వరంతో మూల్గుతున్నారు. కలుగుల్లోని ఎలుకలన్నీ లోపల ఊపిరాడక ఒక్కసారిగా బయటకొచ్చేసినట్టుగా ఉంది పరిస్థితి! అంతా నాలాగానే గందరగోళ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
చాలామంది జన్‌ధన్ ఖాతాల్లో రెండున్నర లక్షలు చొప్పున జమ చేసి, తిరిగి తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. ఒకేసారి అంత సొమ్ము ఎక్కడ్నుంచొచ్చిందని ఆరా తీస్తే? అదీ చావే!
‘నవరంధ్రాలని ఒక్కొక్కటిగా మూసేస్తున్నట్టుగా ఉంది. ఎవరికీ ఊపిరాట్టం లేదు. కాలం మారినట్టే ఉంది. మనమూ మారాలేమో!’ ఓ కొలీగ్ గొణిగాడు.
‘తాటాకు చప్పుళ్లకు కుందేళ్లే బెదురుతాయి. మనం కాదు’ కమీషన్ ఏజెంట్ దన్నుతో ధీమాగా అన్నాను. నవ్వాను.
కాని అందర్తోనూ మాట్లాడేక నా భయాలు రెట్టింపయ్యాయి. హత్య చేసి శవాన్ని ఇంట్లో దాచి పెట్టుకున్నట్టుగా అన్పించింది. ఇంత దాకా 30 లక్షలే మార్చగలిగాను.
సాధ్యమైనంత త్వరగా మిగతా సొమ్మంతా మార్చెయ్యడం ఉత్తమం అన్పించి ఏజెంటుకి ఫోన్ చేశాను.
నోట్ల మార్పిడికి సహకరించిన బ్యాంకు మేనేజర్ని పోలీసులు అరెస్టు చేశారట. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఆ ముక్క చెప్పి, ఇక తనకి ఫోన్ చేయొద్దని కోరాడు.
నడినెత్తిన పిడుగు పడ్డట్టు వణికిపోయాను. తీగలాగితే నా డొంక కదుల్తుందేమోనని భయపడుతూ గబగబా ఇంటికెళ్లాను.
‘దెయ్యాన్ని చూసిన వాడిలా ఉన్నారేంటి?’ గుమ్మంలోనే ప్రశ్నించింది ఇల్లాలు.
‘దెయ్యాలు ఒక్కసారే పీక్కుని తింటాయి. కాని ఇంట్లోని నోట్ల కట్టలు నా ప్రాణాన్ని కొంచెం కొంచెం కొరుక్కు తినేస్తూ నరకాన్ని చవి చూపిస్తున్నాయి’ నిస్పృహగా అన్నాను. జరిగిందంతా వివరించాను.
దుఃఖోధృతిని తట్టుకోలేక విస్కీని ‘రా’గానే తాగుతూ కూర్చున్నాను.
ఇంతింత కళ్లతో భయంగా చూసింది. ‘మీరేం ఇదవ్వొద్దు. అది లంచాల సొమ్ము. పాపపు సొమ్ము. అందుకనే ఎలా వచ్చిందో అలాగే పోతోంది!’ కళ్లొత్తుకుంది.
‘నానె్సన్స్. పాపం పుణ్యం అంటూ ఏమీ లేవు. నువ్వు అనవసర భయాల్తో నా బీపీ పెంచకు. ఇంకా మన దగ్గర చాలా డబ్బుందే. అదంతా నష్టపోయినట్టే. తలుచుకుంటే చాలు గుండెలు తరుక్కుపోతున్నాయి’
నాకు తెలీకుండానే కన్నీళ్లు పొంగి వచ్చాయి.
‘అయితేనేం, మన దగ్గర మనం తినలేనంత సొమ్ము ఉందిగా...’ నచ్చచెప్పబోయింది.
‘వందా వెరుూ్య కాదే, 30 లక్షల రూపాయలకు రెక్కలొస్తాయి తెలుసా!’ ఏడుపు స్వరంతో బిగ్గరగా అన్నాను.
దారులన్నీ మూసుకు పోయాయని అర్థమవుతోంది. గుండెలు ఘార్ణిల్లాయి. నాకు తెలీకుండానే ఏడ్చేశాను. సులోచన కంగారు పడింది. ఓదార్చింది.
కాస్సేపటికి తేరుకున్నాను. ‘నేను బంతినే. మళ్లీ లేస్తాను. నా ప్రతాపం చూపిస్తాను. ఒక్క ఏడాదిలో ఆ నష్టాన్నంతా పూడ్చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటాను’ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ అన్నాను.
‘ఇంకెప్పుడూ ఇలా డబ్బు రూపేణా ఎక్కువ సొమ్ము ఉండొద్దు’ అనునయంగా అంది.
‘ఉంచను. కొత్త రెండువేల నోట్లూ రద్దు చేస్తారనీ, ఇంట్లోని బంగారానికీ లెక్కలు తీస్తారనీ, లాకర్లూ చెక్ చేస్తారనీ రకరకాల రూమర్స్ వాట్సప్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక నుంచి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన నీడనీ అనుమానించాలి’
నా వంక సాభిప్రాయంగా చూస్తూ , స్వరం తగ్గించి అంది సులోచన ‘మనకున్న దానితో తృప్తిపడలేమా? ఈ పరుగుళ్లు ఎందుకు? అవినీతి సొమ్ముకు అంగలార్చడం ఎందుకు, ఇలా టెన్షన్లు పడటం ఎందుకు?’
నవ్వాను. ‘ఇంకో ఏడేళ్లలో రిటైరై పోతాను. అప్పుడు వృద్ధ నారీ పతివ్రతలా అయిపోతాను. అప్పుడా వేదాంతపు కబుర్లు బయటి వాళ్లకి చెబుదాం’
నిస్సహాయంగా చూసి నిట్టూర్చింది.
‘పిచ్చి ఆలోచన్లూ పిచ్చి సెంటిమెంట్లూ వద్దు. గొడ్డుకు తిన్నది పుష్టి మనిషికి ఉన్నది పుష్టి. ఈ మాటా పెద్దవాళ్లు చెప్పిందే. గుర్తుంచుకో’
మర్నాడు ఆఫీసు కెళ్లేసరికే ఓ పెద్ద బిల్డర్ నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అయిదు అంతస్తుల బిల్డింగ్ తాలూకు ప్లాన్ చూపించి వివరించాడు. పై వాళ్లతో అన్నీ మాట్లాడాననీ, నేను శంఖంలో పోస్తే చాలన్నాడు. ఆ స్థలంలో అన్ని అంతస్తులకి రూల్సు ప్రకారం అనుమతి ఇవ్వకూడదు. కాని అతడికివ్వాలి. అందుకని ఒకటిస్తానన్నాడు. పెదవి విరిచాను. ఇదే ఇదివరకైతే ఎగిరి గంతేసేవాణ్నే. కానిప్పుడు పాత నష్టం పూడ్చుకోవాలి. కొత్త లాభమూ వదులుకోకూడదు. అందుకని మూడు అడిగాను. ‘పైవాళ్లకి లయన్ షేర్ ఇచ్చే ఉంటావు. ఇదో లెక్కా!’ అనీ అన్నాను. అతడు లేచి వౌనంగా వెళ్లిపోయాడు. నివ్వెరబోయాను.
అతడి ధీమా ఏమిటి? పై వాళ్లకి ఫిర్యాదు చేస్తాడా? ఒక్క క్షణం ముచ్చెమటలు ముంచెత్తాయి. నా మీద కంప్లయింట్ చేసి బతగ్గలడా? ఎక్కడ లేని కొర్రీలూ వేసి, కోతిపుండును బ్రహ్మరాక్షసిని చేసి, రాచిరంపాన పెట్టనూ! అనుమతి ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుపడనూ!
రెండ్రోజుల తర్వాత అతడి మనిషి వచ్చాడు. ‘మీ మాటా మా సారు మాటా కాదుగాని రెండుకి డీల్ ఓకే చేద్దాం. మీదీ మాదీ భార్యాభర్తల సంబంధం!’
నిమిష కాలం ఆలోచించినట్టు నటించి సరే అన్నాను. ‘యాభై వేలు తెచ్చాను. ఇక్కడే ఇమ్మన్నారా బయటికొస్తారా?’
‘ఇది నా క్యాబిన్. ఇక్కడేమీ సీసీ కెమెరాలు లేవులే. ఉన్నా పనిచేయవు’ బిగ్గరగా నవ్వాను.
అతడిచ్చాడు. పుచ్చుకున్నాను. అన్నీ కొత్త రెండువేల నోట్లే. సొరుగులో పెట్టుకుని, ‘ఈ ముక్క ఆవాళే చెప్పి వుంటే ఈపాటికి అనుమతి మీ చేతిలోకి వచ్చేసేది కదా’
‘ఆయన తిక్కమనిషి. తన మాట కాదంటే సహించలేరు’
అతడి మాటలు పూర్తి కాకుండానే ముగ్గురు ఆగంతకులు లోపలికి దూసుకొచ్చారు. మ్రాన్పడి చూశాను. సొరుగులోంచి సొమ్ము బయటికి తీశారు.
వాళ్లు ఏసీబీ వాళ్లని అర్థమై పోయింది. నవనాడులూ కృంగిపోతోంటే తల పట్టుకున్నాను. ఇదెలా జరిగింది? ఆ బిల్డర్ పనేనా లేక తనంటే కిట్టని క్రింది వాళ్లో.. పైవాళ్లో...! నా అనుమానం కాశమ్మ మీద కేంద్రీకృతమైంది! అలాంటి వాళ్లే ఇలాంటి దౌర్భాగ్యపు పని చేస్తారు!
కోపంతో లోలోన రగిలాను. కాశమ్మ కన్పిస్తే అమాంతం మింగేసేలా ఉన్నాను.
క్షణాల్లో వార్త ఆఫీసంతా దావానలంలా పాకిపోయింది. అంతటా ఒకరకమైన శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది.
‘మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. మీ ఇంట్లో సోదా చెయ్యాలి. పదండి’
‘ఎందుకు?’ కీచుగొంతుతో అడిగాను.
‘ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని కంప్లయింట్ వచ్చింది’
అమాంతం పాతాళానికి కూరుకుపోయాను. మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు విలవిల్లాడాను.
ఇంటికెళ్లాం. మా ఇంటిని ఫొటోలు తీశారు. విలువను మధించారు. మా ఏరియా జనం పోగయ్యారు. మీడియా గద్దలూ వాలిపోయాయి. బ్రేకింగ్ న్యూస్‌కి తెర లేచింది.
నా పరువు, ప్రతిష్ఠ, గౌరవం, మర్యాదా అన్నీ కట్ట కట్టుకుని నడిరోడ్డు మీద పడ్డాయి! అది చూసి బంధువులు ‘మా బాగా జరిగింద’ని చంకలు కొట్టుకుంటారేమో, ఖర్మ!
ఎవరి వంకా చూడలేక అవమానాగ్నిలో దహించుకుపోతూ తలొంచుకుని కూర్చున్నాను.
ఇల్లంతా క్రిందా మీదా చేసేశారు. దస్తావేజులు, బంగారు నగలు అన్నీ ‘తవ్వి’ తీశారు. లాకర్లలోని వెయ్యి, అయిదు వందల నోట్ల కట్టలూ బయటకి తీశారు.
‘ఈ సొమ్మెక్కడిది?’ ప్రశ్నించారు.
‘ఆ నోట్లు చెల్లవు. చిత్తుకాగితాలతో సమానం. వాటికి ఎలాంటి విలువా లేదు’
‘కావొచ్చు. కాని ఇవి కలిగి ఉండటమూ చట్టప్రకారం నేరమే. ఆ సంగతి అలా ఉంచితే, ఇంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏ రకంగా సంపాదించారు?’
‘అవి చెల్లవయ్యా మగడా. కావలిస్తే ఇప్పుడు మీ ముందే తగలబెట్టేస్తాను...’ ఆవేశపడ్డాను.
‘సారీ. వాటికి లెక్క చెప్పాల్సిందే’
నీళ్లు నమిలాను. డొక్క చీల్చినా లెక్క చెప్పలేను. గమ్మునుండిపోయాను.
బంగారం లెక్క వేస్తోంటే, ‘ఇదంతా మా పుట్టింటి వాళ్లు పెట్టింది. ఇవ్వను’ అడ్డం పడింది సులోచన.
‘లెక్కలూ, బిల్లులూ చూపించండి. 500 గ్రాముల వరకూ ఓకే. అంతకు మించి ఉంటే ఎలా కొన్నదీ ఆధారాలు చూపించాల్సిందే’ నిస్సహాయంగా నిలబడిపోయింది.
ఇంతలో గుణగుణ నడుచుకుంటూ వచ్చింది కాశమ్మ. నా గుండెలు గుబగుబలాడాయి. పొమ్మని కళ్లతో సైగ చేశాను కాని ఆమె చూడలేదు.
ఇంట్లో జరుగుతోన్నది పట్టించుకోకుండా తిన్నగా నా దగ్గరకి వస్తోంటే, ‘రావద్దు రావద్దు. వెళ్లిపో’ కోపంగా అరిచాను.
ఆమె పట్టించుకోలేదు. ‘మీరు చెప్పినట్టే నానా అగచాట్లూ పడి వంద నోట్లు పోగేసి తెచ్చాను సావీఁ. మాట తప్పేదాన్ని కాదు. మీరు అడిగినంతా తెచ్చాను. నా పని అయ్యేట్టు చూడండి. నా ఇల్లు నిలబెట్టండి. మీ రుణం ఉంచుకోను. చచ్చి మీ కడుపున పుడతాను...’ అంటూ బలవంతంగా నా చేతిలో ఆ నోట్లు కుక్కింది. నేను విసిరేశాను. ‘్ఫ అవతలకి’ గర్జించాను.
ఆమె అపార్థం చేసుకుంది. గబుక్కున నా కాళ్ల మీద పడిపోయి గట్టిగా పట్టేసుకుంది. దయ చూపమని బతిమాలసాగింది.
ఏసీబీ అధికారులు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా చూస్తోంటే, పాత వెయ్యి నోటులా దరీ దిక్కుతోచక విలువ, మారకం విలువ రెండూ ఒకేసారి కోల్పోయినట్టు విలవిల్లాడాను. అమాంతం భారరహితుడ్నై పోయాను! భూమిలోకి కృంగిపోయాను!

సింహప్రసాద్.. 9849061668