S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చాలా సంగతులు

లియో సిలార్డ్ అని ఒక భౌతికశాస్త్ర పరిశోధకుడు ఉండేవాడు. అతనికి గొప్ప పేరు లేదు. మిత్రుడు హాన్స్ బెత్ మాత్రం కొంచెం పేరున్నవాడు. లియో మిత్రుడితో తనకు డయరీ రాయాలని ఉందని చెప్పాడు. పరిశోధకులు రాసిన సంగతులను పుస్తకాలుగా ప్రచురించడం అలవాటు. లియో మాత్రం తనకు అట్లాంటి ఉద్దేశం లేదని అన్నాడు. తాను చేస్తున్న పనులు దేవునికి తెలియాలని రాసే ప్రయత్నం అని కూడా అన్నాడు. ‘ఆ సంగతులు దేవునికి తెలియవని అనుకుంటున్నావా?’ అని బెత్ ప్రశ్నించాడు. లియో మాత్రం ‘తెలిసే ఉంటాయి. కానీ, నాకు తెలిసిన నిజాలు దేవునికి తెలియవు’ అన్నాడు. అదొక సంగతి.
మొదట్లో, దేవుడు భూమిని సృష్టించాడు. ఆ చుట్టుపక్కల మాత్రం ఏమీ లేదు. ఆ ఒంటరితనాన్ని దేవుడు బాగా గమనించాడు. ‘ఈ మట్టిలో నుంచి జీవులను తయారుచేద్దాం. కనీసం మట్టికయినా మన పని గురించి తెలుస్తుంది’ అనుకున్నాడు. ఇక దేవుడు ఇప్పుడు ప్రపంచంలో కదలాడుతున్న జీవులన్నింటినీ తయారుచేసి వదిలాడు. అందులో మనిషి కూడా ఉన్నాడు. మట్టి నుంచి రూపు పొందిన జీవుల్లో మాట చేతనయింది మాత్రం ఒక్క మనిషికే! మనిషి కూచుని చుట్టూ చూస్తున్నాడు. దేవుడు పక్కనే వచ్చి కూచుని మరీ దగ్గరగా ఒంగి ఒక్క మాట అన్నాడు. ‘ఈ సృష్టి అంతా ఎందుకయ్యా?’ అని అడిగాడు. ‘ప్రపంచంలోని ప్రతిదానికీ ప్రయోజనం అంటూ ఉండాలా?’ అని కూడా అడిగాడు. మనిషి వెంటనే ‘ఉండాలి గదా?’ అని అనేశాడు. ‘అయితే మరి ఈ సృష్టికంతా ఉండవలసిన ప్రయోజనం గురించి ఆలోచించవలసింది నీవే!’ అంటూ దేవుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది మరో సంగతి. ఈ సంగతులేవీ నేను సృష్టించినవి మాత్రం కావు. కుర్ట్ వనెగుట్ అనే ఒక రచయిత. అతను చాలా విచిత్రమయిన విషయాలను చాలా విచిత్రంగా రాస్తూ వెళ్లిపోయాడు. ఈ మరో సంగతి ఆయన రాసిన ఒక పుస్తకంలో కనిపించింది. మొదటి సంగతి నిజంగానే జరిగింది.
ఇక మీరు చదివారు. చదువుతున్నారు. మరింత ముందుకు చదువుతారు. అందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను కూడా. మీరు ఇంతదాకా రావడమే ఒక గొప్ప. కోపగించుకోకండి. కొంత చదివితే అర్థమవుతుంది. కనుక చదవండి. మీరు ఇక్కడిదాకా వచ్చినందుకు, నేను ఇక్కడిదాకా వచ్చినందుకు, నేను రాసిన నాలుగు అక్షరాలను మీరు చదువుతున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. మీరు, నేను, అనగా మనము ఇక్కడిదాకా రావడం, నేను రాయడం, మీరు చదవడం నిజంగా అద్భుతాలు. నా పిల్లలు, నేను ఎప్పుడూ ఈ రకం విషయాలను గురించి మాట్లాడుకుంటాము. ఆశ్చర్యపడుతుంటాము. చివరకు మేమొక సిద్ధాంతం చేసుకున్నాము. ఆశ్చర్యపడడానికి ఈ ప్రపంచంలో చాలాచాలా సంగతులు ఉన్నాయి. ఆశ్చర్యం మనకు చేతగావాలి, అన్నది మా సిద్ధాంతం.
ఈ ప్రపంచం, ఇందులో మీరు, నేను ఉన్నామంటే అది మామూలుగా జరగలేదు. ఇక ఈ కాగితాలు, వాటి మీద రాతలు చదవడం, ఇంకా మనం చేస్తున్న మిగతా పనులన్నీ మామూలుగా మాత్రం వీలు కాలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి.
నేను మేనేజ్‌మెంట్ క్లాసులు చెప్పిన కాలంలో తరచుగా సందర్భం చూచి ఒక ప్రశ్న అడిగేవాణ్ణి. ఆ ప్రశ్న చాలా చోట్ల వాడుకున్నాను. అడిగే నేను, అదే నేను అయినా, నా ఎదురుగా ఉండేవాళ్లు మాత్రం ప్రతిసారీ మారుతుండేవారు. అది నాకున్న వెసులుబాటు. ‘మీరెవరు?’ అన్నది ఆ ప్రశ్న. ఎవరినో ఒకరిని ఎంచుకుని ఆ ప్రశ్న అడిగేయడమే! ఆ ప్రశ్న మిమ్మల్నే అడిగాననుకోండి. మీరు వెంటనే జవాబు ఇవ్వలేరు. క్లాసులో వాళ్లు కూడా అదే గజిబిజిలో పడేవాళ్లు. నాలుగు క్షణాలు ఆలోచించి, ‘నేను ఒక మనిషిని’ అని జవాబిచ్చేవారు. నిజం చెపుతున్నాను. ఎన్నిసార్లు, ఎన్నిచోట్ల ప్రశ్న అడిగినా, ఇదే జవాబు వచ్చింది. ఎందుకో నాకు తెలియదు. నేను ఎక్కువ కష్టపడకుండా ప్రతిచోటా ఒకే జోకు వేశాను. ‘మీరు మనిషి అయితే.. మరి మిగతా మేమంతా కప్పలుగా కనిపిస్తున్నామా?’ అన్నది ఆ కుళ్లు జోకు. నాకు తెలుసు నా జోకు బాగుండలేదని! కానీ, దానితో పని జరుగుతుందని మాత్రం తెలుసు. అందరూ ఒక్కసారి ఆలోచనలో పడేవారు. అందరి ఆలోచనలు ఒకేలాగ ఉండవని కూడా తెలుసు.
నేను అంటే, నా శరీరమా? నా ఆలోచనలా? ఇవన్నీ కలిసిన నేను అంటూ ఉన్నానా? నాలోని నేను ఎక్కడ ఉన్నాను? ఈ ప్రశ్నలు తాత్వికంగా వినిపిస్తే, తప్పు నాది కాదు. మనిషి ఆలోచన ఆ రకంగా సాగింది. మనకూ అదే పద్ధతి అలవాటయింది. నేను అలిసిపోకుండా ఒక మాట చెపుతుంటాను. నాకు సైన్స్ తలకెక్కిందని. అంటే, సైన్స్ నాకు అర్థమయిందని మాత్రం కాదని మనవి. ప్రతీ విషయాన్ని సైన్స్ పద్ధతిలో ఆలోచించడం మాత్రం నాకు అలవాటయింది. అందుకు నేను సంతోషిస్తున్నాను కూడా.
మీరు పుస్తకం పట్టుకుని చదువుతున్నారంటే, అక్కడ లక్షలాది, కాదేమో, కోట్లాది అనాలేమో! (లక్షలాది, కోట్లాది అనే మాటలు ఎవరు పుట్టించారో గానీ, ఇందులో వ్యాకరణం ఎక్కడో జారిందని నా అనుమానం) కనుక కథను మళ్లీ మొదటి నుంచి చెప్పుకుందాము. మీరు పుస్తకం పట్టుకుని చదువుతున్నారంటే, కోట్లకొద్ది జీవకణాలు కుప్పగా చేరి కలిసి పని చేస్తూ, ఒక కార్యక్రమంలో ఉన్నాయని అర్థం. నన్ను వదిలేస్తే, ఇంకొంచెం లోతుకు పోతాను. కోట్లకొద్దీ కణాలంటే, ఆ తరువాతి పెద్ద అంకె పేరు నాకు పట్టదు. ఆ అంకెకొద్ది రసాయనాలు, అణువులు, పరమాణువులుగా పరుగులు పెడుతున్నాయి. అవి నిజంగా గజిబిజిగా తిరుగుతూ, ఒక రూపానికి, ఒక వ్యక్తిత్వానికి, ఆధారమయి నిలబడ్డాయంటే, అందులో అబద్ధం ఏమన్నా ఉందా? మీరు అంటే, ఒక రసాయనాల కుప్ప అని ఎవరన్నా ఇంతకు ముందు చెప్పారా? కానీ అది నిజం కదా! మీరయినా అంతే, నేనయినా అంతే! అయితే, మీలోను, నాలోనూ ఉండే రసాయనాలు ఒకటే. మనం మాత్రం వేరువేరు! ఇక్కడే ఉంది చిక్కు. ఇందులోనే సమాధానం కూడా ఉంది. రసాయనాలను కుప్ప పోశారంటే, ఎవరో మీలాంటి, నాలాంటి వాళ్లు పోయలేదు. అవి వాటంతట అవే కుప్పగా చేరాయి. ఆ కుప్పలో ఒక క్రమం పుట్టింది. ఆ క్రమం సాగుతూ వచ్చింది. ఎనె్నన్నో కుప్పలు వచ్చాయి. పోయాయి. అయినా, క్రమం సాగుతూనే ఉన్నది.
జీవులను దేవుడు తయారుచేశాడని ఆయనెవరో అన్న మాటను నేను మొదట్లోనే చెప్పాను. ఆ దేవుడు మనిషిని పట్టుకుని ప్రశ్న అడిగాడట. అరటిచెట్టు లాగ బతుకుతావా? చంద్రుడిలాగ బతుకుతావా?’ అని! అరటిచెట్టు పిలకలు వేసి తాను మాత్రం పోతుంది. చంద్రుడు తగ్గి, మరింత తగ్గి, తిరిగి పెరుగుతాడు. ఆ కథలో తెలివిని మనిషికి వదిలేసి, మనిషే అరటిచెట్టు తీరును ఎంచుకున్నాడని చెపుతారు. మొత్తానికి రసాయనాల కుప్పకు, వాటితో తయారయిన కణాల కుప్పకు మనిషి స్థాయి చేరుకున్న తరువాత, తెలివి కూడా తోడయింది. కనుకనే, ఇవాళ మీరు, నేను, అనగా మనము ఈ రకంగా ఉన్నాము!
జీవం పుట్టిన తరువాత, దాని మనుగడలో ఒక క్రమం ఉండాలని ఎవరు నిర్ణయించారు? ఒకే కణంతో ఉన్న జీవి రెండుగా విడిపోవాలని ఎవరు సూచించారు?
ఇటువంటి సంగతులు చదవడానికి మీకు ఎంత ఓపిక ఉందో తెలియదు. నాకు మాత్రం ఇది అన్నిటికన్నా బాగుంటుంది.

చిత్రం.. ఐన్‌స్టీన్ - లియో సిలార్డ్

కె. బి. గోపాలం