S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సూక్ష్మ చిత్రకళలో ఘనాపాటి

కృషి, నిబద్ధత, పట్టుదల, ఏకాగ్రత ఉంటే మనిషి సాధించలేనిది లేదు. ఓర్పుతో ఎంత కష్టమైన పనినైనా ఇట్టే చేసి చూపించవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణే రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన సురేంద్ర కుమార్ అపార్య. అతను ఎంతటి ప్రతిభావంతుడంటే బియ్యం గింజ మీద వందలాది అక్షరాలు రాయగలడు. సన్నని తల వెంట్రుక మీద బొమ్మలు వేయగలడు. ఇందుకు అతను చూపించే ఏకాగ్రత, పట్టుదల, నేర్పుని గమనించిన వారు ఔరా అనకతప్పదు.
అతను పదవ శతాబ్దానికి చెందిన పురాతన రాజస్థానీ చిత్రకళకు చెందిన బొమ్మలను ఎంతో నేర్పుగా బియ్యపు గింజలు, తల వెంట్రులపై గీచి ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డునే సాధించాడు. అతను ఒక్క బియ్యపు గింజపై ఏకంగా 1749 అక్షరాలను రాయడం ద్వారా గిన్నిస్ రికార్డును సాధించి అనితర సాధ్యమైన ప్రతిభను చాటుకున్నాడు. ఈ ఫీట్ గత 25 సంవత్సరాలుగా చెక్క చెదరకుండా ఉంది. దీనిని బద్ధలుకొట్టే మొనగాడు ఇంకా పుట్టుకు రాలేదంటే సురేంద్ర కుమార్ అపార్య నైపుణ్యం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఎవరైనా ఒక్కసారి రికార్డులకెక్కడమో, ప్రముఖులు, నిపుణుల ప్రశంసలు అందుకోవడమో మనం చూస్తుంటాం. కానీ సురేంద్ర కుమార్ అపార్య ఏకంగా ఏడుసార్లు గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించడం ద్వారా తన టాలెంట్‌ని నిరూపించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే సన్నని తల వెంట్రుకపై అతను 249 అక్షరాలు రాసి తన ప్రతిభకు ఎల్లలు లేవని సాధించి చూపాడు. అలాగే అతను జవహర్‌లాల్ నెహ్రూ గురించిన ఒక వ్యాసాన్ని ఇరవై ఇంటూ పద్ధెనిమిది మిల్లీమీటర్ల పోస్టేజ్ స్టాంపుపై రాశాడు. ఇదే వ్యాసాన్ని గనుక సాధారణ నోటు పుస్తకంపై రాయాల్సి వస్తే దాదాపు ఆ వ్యాసాన్ని రాయడానికి ఆ నోట్సులోని పద్ధెనిమిది పేజీల్లో రాయాల్సి ఉంటుంది.
నిజానికి అతనికి ఈ కళపై ముందు నుండి అవగాహన గానీ, అభిరుచి అనేవి గానీ లేనే లేవు. ఒకనాడు అతను గిన్నిస్ ప్రపంచ రికార్డులకి చెందిన పుస్తకాన్ని చదువుతుంటే అందులోని ఒక్కొక్క రికార్డు అతన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. తమదైన శైలిలో అందులో రికార్డు హోల్డర్లు సాధించిన ఘనతలను చదివాక తాను కూడా ఏదైనా అరుదైన ఘనతను సాధించి అలా గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించాలని సురేంద్ర కుమార్ అపార్య భావించాడు. అయితే ఏం చేయాలో అతనికి వెంటనే బోధపడలేదు. బాగా ఆలోచించిన తర్వాత మినీయేచర్ ఆర్ట్‌పై అతని దృష్టి పడింది. అనుకున్నదే తడువు అందుకు తగ్గ సరంజామా సిద్ధం చేసుకున్నాడు. అయితే అనుకున్న వెంటనే అందులో సిద్ధహస్తుడు కాలేదు అతను.
చూడడానికి, చెప్పుకోవడానికి చాలా సులభంగానే అనిపించినా మినీయేచర్ స్టైల్‌లో కంటికి కనిపించని పరిమాణంలో అక్షరాలు రాయడం అంటే మాటలు కాదని ఆ పని మొదలుపెట్టిన తర్వాత అతను తెలుసుకున్నాడు. ఆ పని చేస్తుండగా ఆ కష్టం తెలిసి వచ్చి, తాను ఆ పని విజయవంతంగా పూర్తి చేయలేనని అతనికి అనిపించింది. దాంతో కొన్నిసార్లు అతను ఫస్ట్రేషన్‌కి కూడా గురయ్యాడు. అయితే ఇతరుల్లా అలా అనిపించిన వెంటనే అస్తస్రన్యాసం చేయలేదు అతను. ఆ నిస్పృహ నుండి బయటపడిన తర్వాత మళ్లీ ప్రయత్నించేవాడు. ఫెయిల్యూర్ వచ్చినా దిగులును దరి చేరనివ్వక పదేపదే ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు.
ఈ దశలో అతని అవస్థలు చూసిన ఇంట్లో వాళ్లు ‘ ఈవయసులో ఈ పనులన్నీ నీకెందుకు. చక్కగా పని చేసుకుంటూ, నచ్చినట్లు ఉండక’ అనేవారు. అయితే సురేంద్ర కుమార్ అపార్య వాళ్ల మాటలను పట్టించుకునేవాడు కాదు. తాను మినీయేచర్ ఆర్ట్‌లో ఎలాగైనా రాణిస్తానని, ఇతరులు సాధించలేని రికార్డులను అందులో తాను సాధిస్తానని అతను గట్టిగా నమ్మి తన ప్రయత్నాలను వదిలి పెట్టకుండా మొక్కవోని దీక్షతో అభ్యాసం కొనసాగించాడు. అతని పట్టుదల, కృషి, సహనాలకు చివరికి అతనికి మినీయేచర్ ఆర్ట్ అనే కళ పట్టుబడింది.
చక్కటి లెన్స్, సన్నని బ్రష్‌లు అతను ఈ కళను సాధించడానికి ఎంతగానో ఉపకరించాయి. వాటితో పాటు యోగా కూడా అతన్ని రికార్డు హోల్డర్‌గా మలిచింది. తొలుత అతను ఈ కళను ప్రాక్టీస్ చేస్తుండగా చేతులు వణికేవి. దీనిని అధిగమించాలంటే యోగాయే సరైన దారి అని అతను నిర్ణయించుకున్నాడు. యోగా చేసి వణికే తన చేతులను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత మినీయేచర్ ఆర్ట్‌ని ముమ్మ
రంగా సాధన చేశాడు. సన్నని బియ్యపు గింజలు, కంటికి కనిపించనంత పల్చని తల వెంట్రుకలపై
అక్షరాలు రాయడానికి, బొమ్మలు గీయడానికి ఒక్కోసారి ఊపిరి బిగబట్టాల్సి వచ్చేది. ఆ విద్య కూడా అతనికి యోగా వల్లే సాధ్యమయింది. మినీయేచర్ ఆర్ట్ సాధనలో ఉన్న సమయంలో అతను ఏకంగా కొన్నిసార్లు రెండు నిముషాల వరకు ఊపిరి తీయకుండా అనుకున్న ఎఫెక్ట్ వచ్చే వరకు పని చేసేవాడు.
అలా మినీయేచర్ ఆర్ట్‌లో నిష్ణాతుడిగా మారిన సురేంద్ర కుమార్ అపార్య నైపుణ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం అనేక అవార్డులతో అతన్ని సత్కరించింది. అతను తనకి ముప్ఫై ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు 1989లో జపాన్ ఆర్డిస్టు పేర ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు.
జపాన్ కళాకారుడు ఒకరు సన్నని బియ్యపు గింజపై 184 అక్షరాలు రాస్తే సురేంద్ర కుమార్ అపార్య అంతకంటే ఎక్కువ అక్షరాలు రాసి ఆ రికార్డును బద్ధలుకొట్టాడు. అతని నైపుణ్యం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అతని భార్య అతన్ని అనుకరిస్తూ మినీయేచర్ ఆర్ట్‌లో కృషి చేయడం మొదలుపెట్టారు. సన్నని తల వెంట్రుకపై అక్షరాలు రాస్తూ 24 సార్లు ఆమె కూడా మన్ననలు అందుకున్నారు. కాగా అరుదైన తన నైపుణ్యంతో టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేంద్ర కుమార్ అపార్య మిల్లీమీటరు పరిమాణంలో భగవద్గీతను గానీ ఖురాన్‌ను గానీ రాసి తన పేరు చిరస్థాయిగా లిఖించుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు.

-దుర్గాప్రసాద్ సర్కార్