S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆడవాళ్లతో పేచీ

డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ స్లోవన్ దీర్ఘంగా నిట్టూర్చి తన ముందు కూర్చున్న ఆ వృద్ధురాలికి మనుషులు తమ ఇష్టప్రకారం ఎప్పుడైనా మాయం అవుతూంటారని నచ్చజెప్పసాగాడు. కాని కోపధారైన మిసెస్ బ్రిక్స్ తన కూతురు అలా మాయం కాలేదని గట్టిగా చెప్పింది.
‘నా సూసాన్ అలాంటిది కాదు. ఇది స్వేచ్ఛా దేశం అని, ఎవరైనా కావాలని మాయం అవచ్చని మీరు చెప్పినా నేను అంగీకరించను’
‘కాని సూసాన్ మీ సూసాన్ కాదు. పెళ్లై మూడేళ్లు గడిచాక ఆమె మీకు చెందింది కాదు. ఇప్పుడు ఆమె సూసాన్ కేవండిష్ అని మీరే చెప్పారు. ఆమెకి మాయం అయ్యే హక్కుంది’ స్లోవన్ ఓపికగా వివరించాడు.
‘కాని నా కూతురు గత నెల రోజులుగా నాతో మాట్లాడలేదు. అది సబబా?’ ఆవిడ అడిగింది.
‘ఆమె మైనర్ కాదు కదా? ఇష్టం లేకపోతే మీతో మాట్లాడదు’
‘కానీ ఆఫీసర్. నేన ఆఖరిసారి చూసినప్పుడు సూసాన్ జీవించి ఉంది. తర్వాత మాయం అయింది’
‘మీకు అర్థం కావడంలేదు. ఆమె కావాలనే మీకు కనపడకపోవచ్చు’
మిసెస్ బ్రిక్స్ లాంటి తల్లి తనకి ఉండి ఉంటే, తనూ సూసాన్‌లా మాయం అయ్యేవాడని అనుకున్నాడు.
‘కాని ఇలా ఎన్నడూ జరగలేదు. పెళ్లైనప్పటి నించి ప్రతీ వారాంతంలో నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ప్రతీ నాలుగో వారాంతంలో నన్ను చూడటానికి వస్తూనే ఉన్నారు. పనికిమాలిన వెధవైన ఆమె భర్త ఇంట్లో నేను అడిగే చిన్నచిన్న మరమ్మతులని చేసేవాడు కాడు. సూసాన్ నా షాపింగ్ చేసి పెట్టేది’
‘అలాగా?’
స్లోవన్‌కి అత్తగారి ఇంట్లో మరమ్మతులు చేయని మంచివాళ్లైన పరిచయం. కాని ఆ సంగతి చెప్పడానికి అది సమయం కాదు అనుకున్నాడు.
‘ఆమె క్షేమంగా ఉందని నాకు అనిపించడం లేదు. అందుకని మీరేం చెప్పినా సరే, ఆమె కనపడటం లేదని ఫిర్యాదు చేస్తున్నాను’ ఆవిడ చెప్పింది.
‘మీరు ఆఖరిసారి మీ అమ్మాయిని చూసినప్పుడు ఆమె సరిగ్గానే ఉందా?’
‘సరిగ్గా ఉందా అని ఏ అర్థంతో అడిగారో కాని, శారీరకంగా సూసాన్ మాంసం కొట్టు వాడి కుక్కలా ఆరోగ్యంగా ఉంది’
‘అలాగా?’ అంతదాకా నిశ్శబ్దంగా ఉన్న డిటెక్టివ్ కానిస్టేబుల్ క్రాస్‌బీ చెప్పాడు.
‘విడాకులు ఇవ్వడానికి తన భర్త అంగీకరించాడని చెప్పినా కూడా ఆమె ఆనందంగా లేదు’ ఆవిడ చెప్పింది.
‘విడాకులా?’ స్లోవన్ పోలీస్ చెవులు నిక్కబొడుచుకున్నాయి.
‘చివరకి అతన్ని వదిలేయాలని సూసాన్ నిర్ణయించుకుంది. క్రిస్ట్ఫర్ కేవండిష్ చాలా బద్ధకస్థుడు’
‘అంటే ఉద్యోగం చేయడం లేదా?’ క్రాస్‌బీ అడిగాడు.
స్లోవన్ ఓ కాగితం అందుకుని ఆవిడ చెప్పే వివరాలు రాయడం ఆరంభించాడు.
‘అతను కంప్యూటర్ ఉద్యోగిట. రోజంతా ఇంట్లోనే మానిటర్ ముందు కూర్చుని దాన్ని ఉద్యోగం అంటాడు. అతను నిజంగా పని చేస్తున్నాడో లేదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది?’
‘అది తెలుసుకోవడానికి ఓ కొలబద్ధ ఉందిగా?’
‘ఏమిటది?’ ఆవిడ స్లోవన్‌ని అడిగింది.
‘డబ్బు సంపాదన’
‘అతను బానే సంపాదించేవాడు. వాళ్లకో అందమైన పాత ఇల్లుంది. చిన్న ఇల్లని నేను వెళ్లేదాన్ని కాదు. ఒకటే పడక గది..’
‘... నేను అదే అడగబోతున్నాను..’
‘...అదృష్టవశాత్తూ వాళ్లకి సంతానం లేదు. సూసాన్ పిల్లలు వద్దనుకుంది. ఎందుకని నన్ను అడక్కండి. ఒక్క బెడ్‌రూం ఇంట్లో ఎవరు పిల్లల్ని కంటారు? ఇల్లు మారే దాకా పిల్లల్ని కనద్దని నేనే సలహా ఇచ్చాను’ ఆవిడ కోపంగా చెప్పింది.
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ స్లోవన్ కాగితంలో ఏదో రాసుకున్నాడు.
‘ఆ ఇంట్లో సగభాగం సూసాన్‌ది. విడాకులు మంజూరైతే అన్నిట్లో సగ భాగం సూసాన్‌దే. కాబట్టి ఆర్థికంగా సూసాన్‌కి ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఆమె క్షేమంగా ఉందో, లేదో మీరు తెలుసుకోవాలి’
‘మీరు మీ అల్లుడ్ని సంప్రదించారా? విడాకులు మంజూరైనా, కాకపోయినా అతను ఆమె భర్తే కదా? వాళ్లు విడిపోయినా ఆమె ఎక్కడ ఉందో అతనికి తెలుస్తుంది కదా?’ క్రాస్‌బీ అడిగాడు.
‘సమస్య ఏమిటంటే అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు’ మిసెస్ బ్రిక్స్ చెప్పింది.
‘అంటే ఆమె భర్త కూడా కనపడటం లేదా?’ స్లోవన్ ఆసక్తిగా అడిగాడు.
‘ఆ ఇల్లు అమ్ముడైందని తెలిసే దాకా అతను కూడా మాయమయ్యాడని నాకు తెలీదు. ఇల్లు అమ్మాక ఎక్కడికో వెళ్లిపోయాడు. కాని ఎక్కడికో తెలీదు. నన్నడిగితే అది సూసాన్ అదృష్టమే. క్రిస్ట్ఫర్ కేవండిష్‌ని పెళ్లి చేసుకోవద్దని నేను కనీసం వంద సార్లు చెప్పాను. ఐనా నా మాట వినలేదు’
‘అతను మీ అమ్మాయికి తగడా?’ బ్రహ్మచారైన కానిస్టేబుల్ క్రాస్‌బీ అడిగాడు.
‘ఎంత మాత్రం’ మిసెస్ బ్రిక్స్ గట్టిగా శ్వాస తీసుకోగానే ఆవిడ ఆ విషయాన్ని వివరంగా చెప్పబోతోందని గ్రహించిన స్లోవన్ ఆవిడని ఆపుతూ అడిగాడు.
‘మీ అమ్మాయి ఆఫీస్‌లో ఆమె కొలీగ్స్‌ని అడిగారా?’
‘అడిగాను. కాని సరైన సమాచారం ఎవరూ ఇవ్వలేదు’
‘అంటే?’ క్రాస్‌బీ అడిగాడు.
‘సూసాన్ బర్బరీలోని ఓ ఏజెన్సీలో తాత్కాలిక టైపిస్ట్‌గా పని చేసేది. ఓ రోజు ఎవరో ఫోన్ చేసి ఇక సూసాన్ ఉద్యోగానికి రాదని చెప్పారట’
‘ఎవరో?’ స్లోవన్ చురుగ్గా చూస్తూ ప్రశ్నించాడు.
‘సూసానే చేసిందని వాళ్లు గట్టిగా చెప్పలేక పోయారు. ఫోన్ చేసింది ఆవిడే అని కూడా గట్టిగా చెప్పలేదు. అప్పుడే సూసాన్ మాయమైందని నాకు అర్థమైంది’
‘అలాగా? వారిల్లు అమ్మేసారని ఎలా తెలుసు’
‘ఎస్టేట్ ఏజెంట్ ద్వారా. ఇల్లు అమ్మిన వారాంతంలో మూవర్ విదర్‌స్పూర్ ఆ ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్లిపోయాడు. ఆ సామాన్ని ఎక్కడికి తీసుకెళ్లావని అతన్ని అడిగితే చెప్పలేదు. ‘కమర్షియల్లీ సెన్సిటివ్’ సమాచారం కాబట్టి చెప్పనన్నాడు’
స్లోవన్ ఆ విషయం రాసుకున్నాడు. ఎస్టేట్ ఏజెంట్‌ని, విదర్‌స్పూన్‌ని ప్రశ్నించాలి అనుకున్నాడు.
‘మా అమ్మాయి, అల్లుడు లాయర్లని అడిగినా చెప్పమన్నారు. ‘క్లైంట్ కాన్ఫిడెన్షియాలిటీ’ సమాచారం అన్నారు’
‘అది సబబే’ స్లోవన్ గొణిగాడు.
‘ఇంకోటుంది’
‘ఏమిటది?’
‘క్రిస్ట్ఫర్ సామానుతోపాటు ఆ వేన్‌లో సూసాన్ సామాను కూడా వెళ్లింది’
‘అతని సామాను మాత్రమే వెళ్లలేదా?’ కానిస్టేబుల్ క్రాస్‌బీ కొద్దిగా నివ్వెరపోతూ అడిగాడు.
‘లేదు. ఆ సామాను ఎక్కించడం నేను దగ్గరే ఉండి చూశాను. ఆమె గర్భవతి కాకపోవడం మంచిదైంది. పిల్లల్ని కనాలనుకుంది కాని ఎందుకో ఆగిపోయింది. ఆమె డాక్టర్ని ఆమె ఎక్కడ ఉందని అడిగితే అతను కూడా ‘క్లైంట్ కాన్ఫిడెన్షియాలిటీ’ సమాచారం అనే చెప్పాడు. హిపోక్రైట్స్ అనే గ్రీక్ వెధవ వల్ల చెప్పలేదు. పైగా అతను క్రిస్టియన్ కాదు. యూదై ఉంటాడని నా అనుమానం’
‘కనీసం పిల్లలు లేకపోవడం వల్ల విడాకులు తేలిగ్గా వస్తాయి. అందుకు సంతోషించాలి’ స్లోవన్ చెప్పాడు.
‘అవును. నాది దూరాలోచన. కాని అంతా దురాలోచన అంటారు’
‘్థంక్ యు మిసెస్ బ్రిక్స్. మేము ఆమెని కనుక్కునే ప్రయత్నం చేస్తాం’
‘సూసాన్ కారు. అది కూడా నాకు బాధగా ఉంది’ లేచే ప్రయత్నం చేయకుండా ఆవిడ చెప్పింది.
క్రాస్‌బీ మొహంలోకి వెలుగు ప్రవేశించింది.
‘కారు నంబర్ తెలుసా?’ అతను తక్షణం అడిగాడు.
‘నా కూతురు కారు నెంబర్ నాకెందుకు తెలీదు. మేక్ కూడా తెలుసు’ ఆవిడ తిడుతున్నట్లుగా చెప్పింది.
‘కారు విషయంలో మీకున్న బాధేమిటి?’ స్లోవన్ వెంటనే అడిగాడు.
‘ఆమె మాయం అవక మునుపు దాన్ని అమ్మేసింది. లేదా ఎవరో అమ్మారు’
‘డబ్బుకా? లేక ఎక్సేంజ్‌గానా?’ క్రాస్‌బీ ప్రశ్నించాడు.
‘డబ్బుకే’
‘మీకెలా తెలుసా సంగతి?’ స్లోవన్ అడిగాడు.
‘షోరూంలో దాన్ని నేను చూశాను. అంతేకాక కారు డీలర్లని ‘కమర్షియల్లీ సెన్సిటివ్’ సమాచారం అనే పిచ్చి ఆలోచన ఉండదు’
‘దాని అసలు విలువ ఎంతో తప్ప. అది మాత్రం చెప్పరు’ క్రాస్‌బీ గొణిగాడు.
‘ఆ సంగతి నాకు తెలీదు. నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి ఎన్నడూ కారు కొనలేదు. వాళ్ల ఇల్లు బస్‌రూట్లోనే ఉండటం నా అదృష్టం. ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లేదాన్ని’
‘మీ అల్లుడు ఏ కారుని ఉపయోగించేవాడు. ఈ రోజుల్లో కారు యజమానుల పేర్లు, చిరునామాలని పోలీసులు కాంతి వేగంతో కనుక్కోగలరు’ స్లోవన్ అడిగాడు.
‘క్రిస్ట్ఫర్‌కి సొంత కారు లేదు. ఇంట్లోంచి పని చేస్తున్నాడు కాబట్టి కారు అక్కర్లేదు అనేవాడు. అంతేకాక ప్రపంచ పర్యావరణ సమస్యకి తను బాధ్యుడు అవకూడదనే పిచ్చి ఆలోచన కూడా ఉంది. గ్లోబల్ వార్మింగ్‌ని ఆ వెధవ ఏం ఆపగలడు?’
‘ఇంకేమైనా చెప్తారా?’ స్లోవన్ అడిగాడు.
‘అంతే’
‘సరే మేడం. మేము మళ్లీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం’
‘అలాగే. త్వరలో మీరు సూసాన్‌ని కనుక్కోగలరని ఆశిస్తాను. కాని వాడు దాన్ని ఏదో చేసి ఆ డబ్బుతో పారిపోయాడని నా అనుమానం’
‘ఇందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?’
మిసెస్ బ్రిక్స్ వెంటనే తన హేండ్‌బేగ్ తెరచి అందులోంచి ఓ కాగితాన్ని తీసిచ్చి చెప్పింది.
‘ఇది’
అది ఎస్టేట్ ఏజెంట్ వారి ఇంటిని అమ్ముతామని తయారుచేసిన బ్రోచర్.
‘వివరంగా చెప్పండి’ స్లోవన్ దాన్ని చదివి అడిగాడు.
‘పూర్తిగా చదివారా? ముఖ్యంగా గేరేజ్ గురించి’ ఆవిడ అడిగింది.
‘విడి గేరేజ్. ఇటుకలతో కట్టిన గోడల మీద రాతి కప్పు కలది. వర్క్ బెంచ్, టూల్ అల్మైరా, రెండు ఎలక్ట్రికల్ పాయింట్స్.. దీంట్లో మీకేం ఆధారం కనిపించింది?’
‘ఈ బ్రోచర్‌లో ముఖ్యమైంది తెలివిగా ఇవ్వలేదు’ ఆవిడ చెప్పింది.
‘ఏమిటది?’
‘సిమెంట్ చేయలేదు. రాళ్లు పరిచారు’
‘అంటే?’ క్రాస్‌బీ అనుమానంగా అడిగాడు.
‘ఓ చోట నాలుగు రాళ్లు తీసి మళ్లీ వేసిన గుర్తు నాకు కనపడింది. మళ్లీ సిమెంట్ చేశారు’
స్లోవన్ భృకుటి ముడివడింది. అతను చాలా పాతదైన పోలీసు పద్ధతిలో ఆవిడని వదిలించుకున్నాడు. ఆవిడ వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి, తమ విచారణ ఎలా సాగుతోందో త్వరలో తెలియజేసాతనని చెప్పి పంపించాడు.
* * *
స్లోవన్ సూపరింటెండెంట్ బల్ల మీద ఓ కాగితాన్ని ఉంచాక ఆ కేసు గురించి చర్చించాడు.
‘నేను ఆ ఇంటిని చూశాను సర్. ఆవిడ చెప్పింది నిజమే. సిమెంట్ రంగులో తేడాని బట్టి ఇటీవలే ఆ రాళ్లని తీసి పరిచారు’
‘అలాగా?’
‘ఎస్టేట్ ఏజెంట్ చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటిని అమ్మిన చెక్‌ని అంగీకారం ప్రకారం వాళ్లే బేంక్‌లో డిపాజిట్ చేశారు. అది క్రిస్ట్ఫర్, సూసాన్ల జాయింట్ అకౌంట్’
‘దాంట్లోంచి ఇద్దరిలో ఎవరైనా డబ్బు తీయచ్చా?’
‘తీయచ్చు. కాని క్రిస్ట్ఫర్ కేవండిష్ సంతకాలు మాత్రమే విత్‌డ్రా చేసిన చెక్స్ మీద ఉన్నాయి’
బేంక్ స్టేట్‌మెంట్‌ని చూశాకు సూపరింటెండెంట్ చెప్పాడు.
‘అది కనుక్కోమనే మిసెస్ బ్రిక్స్ మనల్ని కోరుతోంది. సామాను సంగతి?’
‘అతను ఆల్మ్‌స్టోన్‌లోని ఓ ఇంటికి ఆ ఫర్నిచర్ని చేరేశాడు. ఆ సామాన్ని ఏ ఇంటికి తీసుకెళ్లాడో ఎవరికీ చెప్పద్దని కేవండిష్ విదర్‌స్పూన్‌ని గట్టిగా అనేకసార్లు కోరాట్ట. ఆడవాళ్ల పేచీ అని చెప్పాట్ట. బహుశ అతను తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆ ఇంట్లో ఉండబోతున్నాడని విదర్‌స్పూన్ ఊహించినా ఆ సమాచారాన్ని మిసెస్ బ్రిక్స్‌కి చెప్పలేదు’
‘కేవండిష్‌ని ప్రశ్నించావా?’
‘లేదు. అతను ఆ ఇంట్లో లేడు. సామాను తప్ప ఆ ఇంట్లో ఎవరూ నివసిస్తున్న సూచనలు లేవు’
‘ఇరుగు పొరుగు’ ప్రశ్నించాడు.
ఆసక్తిగల ఇరుగు పొరుగు వల్ల చాలా పోలీసు కేసులు పరిష్కారం అవుతూంటాయి.
‘పక్కింటావిడ వారం క్రితం ఓ యువతీ యువకుల జంట ఆ ఇంటికి రావటం చూసిందిట. కంచె అవతల నించి వాళ్లని పలకరించి టీకి ఆహ్వానించిందట. తాము వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలని, కొద్ది రోజులు సెలవు మీద వెళ్తున్నామని చెప్పారట’
‘విదర్‌స్పూన్ ఊహ కరెక్టే’ సూపరింటెండెంట్ చెప్పాడు.
‘ఓ టేక్సీ వచ్చి వారిని ఎక్కించుకుని వెళ్లిందని, మళ్లీ వాళ్లు కనపడలేదని పొరుగావిడ చెప్పింది’ స్లోవన్ చెప్పాడు.
సూపరింటెండెంట్ ఆలోచనగా పెన్సిల్‌తో బల్ల మీద కొట్టాడు. తర్వాత చెప్పాడు.
‘టేక్సీ కంపెనీలని కాంటాక్ట్ చేసి ఆ రోజు వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలుసుకో. ముఖ్యం గా విషయం స్పష్టంగా అర్థం అవుతోంది స్లోవన్. నువ్వు వెంటనే ఆ రాళ్లని తీసి తవ్వించు’
‘నేనూ అదే అనుకుంటున్నాను సర్. అందుకు వారంట్ కోసం కోర్టులో సబ్మిట్ చేయాల్సిన కాగితాలని తయారుచేశాను’
సూపరింటెండెంట్ బల్ల మీది కాగితాన్ని చదివి సంతకం చేశాడు.
* * *
వారంట్ చేతికి రాగానే ఆ ఇంటి బయట పోలీస్ వేన్, స్లోవన్ పెట్రోల్ కారు ఆగాయి. వేన్లోంచి చేతిలో గునపాలు, పారలతో తవ్వే పనివాళ్లు దిగారు. దాన్ని కొన్న యజమాని గేరేజ్ తలుపుని తెరిచాడు. స్లోవన్ ఎక్కడ తవ్వాలో చూపించాడు. నిపుణులైన ఆ పనివాళ్లు రాళ్లకి ఏం కాకుండా నాలుగడుగుల చతురస్రంలోని రాళ్లని వెలికి తీశారు. కింద కొత్తగా తవ్వి పూడ్చిన మట్టి కనిపించింది. వెంటనే వాళ్లు దాన్ని తవ్వడం ఆరంభించారు.
రెండడుగుల లోతు తవ్వాక పలుగుని ఏదో అడ్డుకుంది. శబ్దాన్ని బట్టి అది లోహమని క్రాస్‌బీ చెప్పాడు.
‘దాన్ని బయటకి తీయండి’ స్లోవన్ ఆజ్ఞాపించాడు.
మట్టిని తొలగించి కింద నించి ఓ దృఢమైన నలుచదరపు ఇనప్పెట్టెని బయటకి తీశారు. దానికి అంటిన ఇసుక, సిమెంట్లని తుడిచారు.
‘ఇంకాస్త లోతుకి తవ్వితే మనం వెదికేది బయటపడుతుంది. ఇందులో ఏం దాచాడో తేలిగ్గా ఊహించచ్చు’ క్రాస్‌బీ చెప్పాడు.
‘నేరస్థులు ఎప్పుడూ ఏదో తప్పు చేస్తూంటారు. దీన్ని పగలకొట్టండి’ క్రాస్‌బీ సూచించాడు.
‘దీనికి తాళం లేదు సర్’ ఓ పనివాడు చెప్పాడు.
క్రాస్‌బీ గట్టిగా ఆశ్చర్యపోయాడు. నిరాశ కూడా చెందాడు. స్లోవన్ ఆ పెట్టె మూతని తెరిచి చూస్తే లోపల చిన్న ప్లాస్టిక్ జిప్ బేగ్ తప్ప ఇంకేం లేవు. చిరునామాలో మార్పు అని కొత్త చిరునామాని రాసే, ఏ స్టేషనరీ దుకాణంలోనైనా అమ్మే ఓ కార్డ్ కనిపించింది. వాటర్‌ప్రూఫ్ పెన్‌తో ఓ చిరునామా దాని మీద రాసి ఉంది.
‘ఇది విదర్‌స్పూన్ సామాను డెలివరీ చేసిన ఇంటి అడ్రస్’ క్రాస్‌బీ చెప్పాడు.
‘అవును. దాని వెనక ఏదో రాసి ఉంది. చదువు’ స్లోవన్ కోరాడు.
క్రాస్‌బీ కార్డ్‌ని వెనక్కి తిప్పి చదివాడు.
‘టు హోం సో ఎవర్ ఇట్ మే కన్‌సర్న్... నాకు ఇది అర్థం కాలేదు. ఎవర్ని ఉద్దేశించి రాసింది?’ క్రాస్‌బీ గొణిగాడు.
‘మనల్నే. చదువు’
‘స్ట్రిక్ట్‌లీ కాన్ఫిడెన్షియల్. గమనిక. మా అమ్మకి మేం ఎక్కడ ఉన్నామో దయచేసి చెప్పకండి. నేను ఇప్పుడు గర్భవతిని. సూసాన్’ అనే సంతకం కనిపించింది.
ఆ సాయంత్రం స్లోవన్ సూపరింటెండెంట్‌తో చెప్పాడు.
‘విదర్‌స్పూన్‌తో కేవండిష్ ఆడవాళ్లతో పేచీ అని చెప్పిన విషయం అబద్ధం కాదు సర్. మనం ఆ ఆడది మరెవరో అనుకున్నాం. కాని అత్తగారని కనుక్కోలేకపోయాం.’

(కేథరిన్ ఎయిర్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి