S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యజమాని తెలివి (సిసింద్రీ కథ)

అమరావతి వస్త్రాలయ సంస్థ పట్టుచీరల వ్యాపారంలో గుంటూరులో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఆ అభివృద్ధితో కలిగిన ఆనందంలో మరో పెద్ద వస్త్రాలయాన్ని విజయవాడలో కూడా ప్రారంభించాలని ఆ సంస్థ యజమాని శివకుమార్ అనుకున్నాడు.
ఆ సందర్భంగా సంస్థలో చాలా కాలంగా పని చేస్తున్న టీం మేనేజర్లకు జీతాలు పెంచుతున్నట్లు తెలియజేసి సమావేశం ఏర్పాటు చేయమన్నాడు.
అందుకుగాను జనరల్ మేనేజర్ అనంత పద్మనాభం ప్రతిభావంతులైన నలుగురిని ఎంపిక చేశాడు.
యజమాని శివకుమార్ వారిని ఉద్దేశించి ‘చూడండి! గుంటూరులో మన సంస్థ అభివృద్ధికై పనివాళ్లను తీర్చిదిద్దడంలోనూ, వ్యాపారాన్ని నడిపించటంలోనూ మీరు చక్కగా కృషి చేశారని మన జనరల్ మేనేజర్‌గారు చెప్పారు. అయితే నలుగురి ప్రతిభ, నలుగురి కృషి, నలుగురి తెలివితేటలు ఒకేలాగా ఉంటాయనుకోవటం అవివేకం. నేను మీలో ఎవరు ప్రథమం? ఎవరు ద్వితీయం అలా జీతాల పెంపు నిర్ణయించబోతున్నాను’ అన్నాడు.
అంతే..
చాణక్యరావు లేచాడు. వినయంగా నమస్కరించి మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘నాగభూషణం సరుకు తెప్పించటం మాత్రమే చేశాడు. కానీ దానిని అమ్మించటం చాలా కష్టం. అమ్మకాలే కదా వ్యాపారానికి ముఖ్యం. మొదటి స్థానం అమ్మకాలదే. ఇక సత్యనారాయణ.. జీతాలు ఇవ్వటం.. చిట్టా పద్దులు, డబ్బు సరిచూసుకోవటం తప్ప మరేమీ చేయలేదు. అమ్మకాలుంటేనే కదా డబ్బు సమకూరేది. మొదటి స్థానం అమ్మకానిదే!
ఇక ఆంజనేయులు. చిన్న వ్యాపారస్థులకు అప్పుగా సరుకు ఇప్పించటం, వసూలు చేయటం తప్ప వేరే శ్రమేమీ లేదు. నగదు వ్యాపారం. సంతోషాన్నిస్తే అప్పుల వ్యాపారం దిగుళ్లనిస్తుంది. నగదు అమ్మకాలు నడిపించింది నేనే! నాదే మొదటి స్థానం. జనరల్ మేనేజర్‌గారు మేం అందరమూ సమానం అనీ, అలా నిర్ణయించటం తప్పు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు’ అంటూ మరోమారు రెండు చేతులు జోడించి కూర్చున్నాడు చాణక్యరావు.
* * *
‘దుకాణం వ్యాపారంతో సమానంగా చిన్న వ్యాపారులతో వ్యాపారం చేయించాను. అప్పులు ఇప్పించాను. వసూలు చేసి ఇచ్చాను. అది ఎంత కష్టమో మీకు తెలుసు. నాదే మొదటి స్థానం. జనరల్ మేనేజర్‌గారూ మీరైనా చెప్పండి’ అన్నాడు ఆంజనేయులు పద్మనాభం వైపు జాలిగా చూస్తూ.
‘జీతాలతోనే పనులన్నీ జరిగేది. చిట్టాపద్దులు సరిగా చూసుకోకపోతే నష్టమెంతో లాభమెంతో మోసపోయిందెంతో మిగిలిందేమిటో నిజాయితీగా చూసుకోకపోతే వ్యాపారమే ఉండదు. నా తెలివి నా నిజాయితీ నా కష్టమే గొప్పది. నాదే మొదటి స్థానం!’ నిష్ఠూరంగా అన్నాడు సత్యనారాయణ మిగతా వారివైపు అసహనంగా చూస్తూ.
‘అందరం కష్టపడితేనే ఈ స్థాయిలో మన సంస్థకు పేరొచ్చింది. అందరూ అన్ని పనులూ చేయలేరు. అన్ని పనులూ అవసరమైనవే కష్టమైనవి కూడా.
అందరికీ సమానంగా జీతం పెంచటం మేలు. లేదా మా నలుగురి పనులూ గమనిస్తూ మా అందరి కష్టాలు తెలిసిన వాడు కాబట్టి జనరల్ మేనేజర్ చెప్పినట్టు నిర్ణయించండి ఎవరు ప్రథములో? తరువాత తరువాత స్థానాలెవరివో?’ అన్నాడు నాగభూషణం జనరల్ మేనేజర్ పద్మనాభం వైపు గౌరవంగా, అది నీ ధర్మం అన్నట్లుగా చూస్తూ.
‘యజమానినైన నేను నిర్ణయం తీసుకుంటే కూడా వ్యతిరేకించి మాట్లాడతావా? నీకు జీతం పెంచటం లేదు. నిన్ను ఉద్యోగంలోంచి తొలగించేస్తున్నాను’ అన్నాడు శివకుమార్ గంభీరంగా.
‘అయ్యా! మన నాగభూషణం చాలా మంచి మేనేజర్. నమ్మకస్థుడు. మిగతా మేనేజర్లు సెలవుల్లో వెళ్లినప్పుడు ఇతర మేనేజర్ల పనులు చూసుకుంటూ నాకూ సహాయంగా ఉండేవాడు’ అంటూ వివరిస్తున్న పద్మనాభం మాటలు పూర్తి కాకముందే...
‘అయ్యా! అలా పెద్ద మేనేజర్ని కాకా పట్టి మిమ్మల్ని కూడా తప్పుపట్టే స్థితికి వచ్చాడు’ ఆవేశంగా అన్నాడు చాణక్యరావు నాగభూషణం వైపు అసహ్యంగా చూస్తూ.
‘పద్మనాభంగారూ! మీరు ఇంకేమీ మాట్లాడకండి. నా నిర్ణయానికి తిరుగులేదు. నాగభూషణం స్థానంలో వేరొక సమర్థుణ్ని నియమించండి. మాణిక్యరావుకి, సత్యనారాయణకి, ఆంజనేయులుకి ముగ్గురికీ తలా ఐదు వేలు జీతం పెంచండి’ అంటూ ఆజ్ఞ జారీ చేశాడు యజమాని శివకుమార్.
‘పద్మనాభంగారూ!మీరు మమ్మల్ని నడిపించిన పెద్దలు కదా. నాకు జీతం పెంచకపోయినా ఫరవాలేదు. కనీసం ఉద్యోగంలోంచి తీసివేయవద్దని, యజమానిగారికి మీరైనా నచ్చజెప్పండి. అది మీ ధర్మం’ అన్నాడు బాధగా నాగభూషణం.
‘ఆలోచించండి’ అన్నాడు పద్మనాభం యజమాని వైపు చూస్తూ.
‘ఆలోచించాను.. కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. జనరల్ మేనేజర్‌వైన నీకు అతను సహాయం చేశాడు. అందరూ సమానంగా కష్టపడితేనే వ్యాపారాభివృద్ధి అయ్యిందని నమ్ముతున్నాడు. ఇతరులను తనకన్న తక్కువ వారంటూ వాదించటం లేదు. జనరల్ మేనేజర్‌గా నీ నిర్ణయాలకు విలువ ఇస్తున్నాడు. జనరల్ మేనేజర్‌గా నీ బాధ్యతలేవో తనకు తెలియటం చేత, గౌరవంగా గుర్తు చేస్తున్నాడు. అవసరం అయితే.. ఒక జనరల్ మేనేజర్ అనేవాడు.. యజమాని నిర్ణయాలను వ్యతిరేకించటం, సలహాలు ఇవ్వటం తప్పు కాదు. అది కూడా బాధ్యత ధర్మం అని నమ్ముతున్నాడు. అంటే.. అతను ఒక జనరల్ మేనేజర్ లక్షణాలను అనుభవం ద్వారా పొందగలిగాడు. అందుకే.. అతన్ని విజయవాడలోని మన సంస్థకు జనరల్ మేనేజర్‌గా నియమిస్తున్నాను. మరి ఇక్కడ అతని ఉద్యోగం ఖాళీయే కదా. అందులో మరొకరిని నియమించటం మీ బాధ్యత కదా’ అన్నాడు నవ్వుతూ పద్మనాభం వైపు చూస్తూ, నాగభూషణం భుజం తడుతూ ప్రేమగా.
ఆనందంతో యజమానిని చూస్తూ చేతులు జోడించాడు నాగభూషణం.
తన యజమాని అవగాహనా పటిమని చూసి ఆశ్చర్యపోయారందరూ. ఆ మేథాశక్తియే తమ వ్యాపారాభివృద్ధికి కారణమని అందరూ గ్రహించారు.

- జి.సందిత