S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 38

మీకో ప్రశ్న

సగరుడి అరవై వేల మంది కొడుకులు కాలి బూడిదైన
కపిల మహర్షి ఆశ్రమం నేడు ఎక్కడ ఉంది?

ఆశే్లష హరిదాసు చెప్పే రామాయణాన్ని వినడానికి వచ్చాడు. ఆయన ఇలా కొనసాగించాడు.
ఆ తర్వాత క్రూరురాలైన కైకేయి దుఃఖంతో విలపించే, స్పృహ లేక అల్లాడే, శోకంతో నిండి దాంట్లోంచి బయట పడాలని కోరుకునే ఆ దశరథుడితో ఇంకా క్రూరమైన మాటలు పలికింది.
‘సర్వ ధర్మాలు తెలిసిన ఓ రాజా! రెండు వరాలు ఇచ్చి ఇప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్నావు. మరి నువ్వు ధార్మికుడివని లోకానికి ఎలా చెప్పగలవు? అనేక మంది రాజర్షులు దీని గురించి అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఏ కైకేయి అనుగ్రహం వల్ల నేను ఇంకా జీవించి ఉన్నానో, ఏ కైకేయి నన్ను రక్షించిందో ఆ కైకేయికి మాట ఇచ్చి తప్పాను అని చెప్తావా? వరం ఇస్తానని ఇప్పుడే చెప్పి మళ్లీ ఇంకేదో మాట్లాడే నువ్వు రాజులకే కళంకాన్ని తెస్తున్నావు. డేగకి, పావురానికి మధ్య వైరం కలిగినప్పుడు శైబ్యుడు డేగకి తన మాంసాన్ని ఇచ్చాడు. సముద్రుడు తాను పూర్వం దేవతలకి ఇచ్చిన మాట మీద నిలబడి చెలియలి కట్టని దాటడం లేదు. ఇలాంటి పూర్వీకుల చరిత్రని గుర్తు తెచ్చుకుని నీ ప్రతిజ్ఞని అబద్ధం చేయకు. ఓ దుష్టబుద్ధీ! నువ్వు ధర్మాన్ని విడిచి రాముడ్ని రాజ్యాభిషిక్తుడ్ని చేసి నిత్యం కౌసల్యతో క్రీడిద్దామని కోరుకుంటున్నావు. నేను కోరింది అధర్మం అవచ్చు. లేదా ధర్మం అవచ్చు. సత్యం లేదా అసత్యం అవచ్చు. కాని నువ్వు నాకు ఇచ్చిన వరాలని కాదనడానికి వీల్లేదు. రాముడు పట్ట్భాషిక్తుడైతే ఇప్పుడే నువ్వు చూస్తూండగానే విషం తాగి మరణిస్తాను. రాముడి తల్లి కౌసల్యకి ఒక్కసారైనా నమస్కరించడం కంటే నాకు మరణమే శ్రేయస్కరం. రాజా! భరతుడి మీద, నా మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. రాముడ్ని ప్రవాసం పంపడం తప్ప మరి దేనికీ నేను సంతోషించను’
దశరథుడు ఎంత విలపించినా తర్వాత కైకేయి మారు మాట్లాడలేదు. కైకేయి కోరిన రామ వనవాసం, భరతుడి రాజ్యాభిషేకం అనే చెడ్డ కోరికలని వినగానే దశరథుడు నిశే్చష్టుడై పోయి వౌనంగా ఉండిపోయాడు. ఆయన అప్రియంగా మాట్లాడే తన ప్రియురాలైన కైక వైపు కళ్లార్పకుండా చూశాడు. మనసుకి ఇష్టం లేని, విచారాన్ని కలిగించే, పిడుగు పాటులాంటి ఘోరమైన ఆ మాట విన్న ఆ రాజుకి సంతోషం కలగలేదు. కైక నిర్ణయం, ఆమె చేసిన శపథం తలచుకుని ఆయన నిట్టూర్చి మొదలు కూల్చబడ్డ చెట్టులా నేలకూలాడు.
అప్పుడు ఆ రాజు పిచ్చివాడిలా, విపరీతంగా ప్రవర్తించే రోగిలా, మంత్రం వల్ల శక్తి తొలగిన పాములా అయి కైకేయితో దీనంగా ఇలా చెప్పాడు.
‘పిశాచం పట్టి మనసు చెడిన దానిలా నాతో మాట్లాడుతున్నావు. సిగ్గులేదా? నీ చిన్నతనంలో ఇలాంటి చెడు బుద్ధిని నేను ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు అది కనిపిస్తోంది. భరతుడు రాజ్యాన్ని పొందాలని, రాముడు అడవికి వెళ్లాలని వరాలు కోరుతున్నావు. నీకు ఎవరి వల్ల భయం కలిగింది? నీ భర్తకి, లోకానికి, భరతుడికి ఇష్టమైంది చేయాలని అనుకుంటే, భరతుడికి రాజ్యాన్ని ఇవ్వాలి, రాముడు అడవికి వెళ్లాలనే కోరికలని వదిలెయ్. క్రూరురాలా! పాపపు ఆలోచనలు గలదానా! నీచురాలా! పాపపు పనులు చేసేదానా! నాలోనూ, రాముడిలోనూ నీకు విచారించదగ్గ అవరోధాలు ఏమి కనపడ్డాయి.
‘అడవికి వెళ్లు’ అని చెప్పగానే వివర్ణమై, గ్రహణం పట్టిన చంద్రుడిలా మారే రాముడి ముఖాన్ని ఎలా చూడగలను? నేను స్నేహితులతో ఆలోచించి ఓ చక్కటి నిర్ణయం తీసుకున్నాను. శత్రువులు సేనని తిప్పికొట్టినట్లు ఆ నిర్ణయాన్ని నువ్వు విఫలం చేయడం నేను ఎలా చూడగలను? అనేక ప్రాంతాల నించి వచ్చిన రాజులంతా ననే్నమంటారు? మూర్ఖుడైన ఈ దశరథుడు ఇంతకాలం ఎలా రాజ్యం చేశాడో అనరా? గుణవంతులు, విద్యావంతులు ఐన పెద్దలు వచ్చి రాముడు ఏమయ్యాడు? అని అడిగితే నేనేం చెప్పాలి? ‘కైకేయి బలవంతం చేయడంతో రాముడ్ని అడవికి పంపాను’ అని చెప్పనా? రాముడు అడవికి వెళ్తే కౌసల్య ననే్నమంటుంది? ఇంత అప్రియం చేసిన తర్వాత ఆమెకి ఏం బదులు చెప్పగలను? ఎప్పుడూ నా క్షేమాన్ని కోరే, కొడుకు మీద ప్రేమగల, మంచి మాటలే మాట్లాడే కౌసల్య ఓ దాసిలా, స్నేహితురాలిగా, భార్యగా, సోదరిగా, తల్లిగా నా సంతోషం కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, నీకు కోపం వస్తుందేమో అనే భయంతో ఆమె సత్కారానికి అర్హురాలైనా ఆమెని నేను సత్కరించలేదు. నీకు ఎన్నో మంచి ఉపకారాలు చేశాను. అవి ఈనాడు అపథ్యమైన కూరలు కలిపి తిన్న అన్నం రోగిని పీడించినట్లుగా నన్ను పీడిస్తున్నాయి. రాముడు నేను చేసిన అపకారం వల్ల అడవికి వెళ్లడం చూసి భయపడే సుమిత్రకి నా మీద నమ్మకం ఏముంటుంది? నేను మరణించినట్లు, రాముడు అరణ్యానికి వెళ్లినట్లు రెండు చెడ్డ వార్తలని, సీత దీనంగా వినాల్సి వస్తుంది. ఎంత కష్టం! హిమాలయ ప్రాంతాల్లో కినె్నరుడ్ని పోగొట్టుకున్న కినె్నరలా సీత నా పక్కనే దుఃఖిస్తూంటే నా ప్రాణాలు విలవిల్లాడుతాయి. రాముడు అరణ్యానికి వెళ్లడం, సీత ఏడవడం చూశాక నేను జీవించాలని ఏ మాత్రం కోరుకోను.
‘కైకా! రాముడు వనవాసానికి వెళ్లాక నేను జీవించను. మంచిది అనుకుని విషం కలిపిన మద్యం తాగినట్లు అందమైన దానివి, చెడ్డ దానివి ఐన నువ్వు మంచి దానివి అని ఇంతదాకా అనుకున్నాను. ఇదివరకు మంచి మాటలు మాట్లాడుతూ నన్ను చాలా బుజ్జగిస్తూ మాట్లాడేదానివి. ఇప్పుడు వేటగాడు పాట పాడి లేడిని పట్టుకుని చంపినట్లు చంపేస్తున్నావు. పెద్దలంతా వీధుల్లో గుమిగూడి కొడుకుని అమ్ముకున్న నన్ను ‘ఇతను చాలా చెడ్డవాడు’ అని మద్యపానం చేసిన బ్రాహ్మణుడ్ని నిందించినట్లుగా తప్పక నిందిస్తారు. నీ మాటలు విని వాటిని సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమి దుఃఖం వచ్చి పడింది! ఏమి కష్టం వచ్చి పడింది? పూర్వజన్మలో చేసిన పాపంలా ఈ దుఃఖం వచ్చి పడింది కదా.
‘పాపాత్మురాలా! పూర్వం ఏదో పాపం చేసిన నేను నీ స్వభావం తెలీక చాలా కాలం నిన్ను పోషించాను. చివరికి నువ్వు నా మెడకి ఉరితాడు అయ్యావు. ఇంతకాలం నీతో ఉంటూ నువ్వు మృత్యుదేవతవి అని గుర్తించలేక పోయాను. ఎవరూ లేని చోట చిన్నపిల్లవాడు తాచుపాము మీద చెయ్యి వేసినట్లుగా నిన్ను చేరదీసాను. మహాత్ముడైన ఆ రాముడికి దురాత్ముడైన నేను తండ్రిని అని చెప్పడం కూడా తప్పే. ఈ ప్రపంచం అంతా నన్ను తప్పక దూషిస్తుంది. అందులో తప్పు లేదు. ‘కామానికి లొంగిపోయి, ఆడదాని మాట విని ప్రియమైన కొడుకుని అడవికి పంపే ఈ దశరథుడు ఎంతటి మూర్ఖుడు?’ అని లోకులు నిందిస్తారు. చిన్నతనం నించి ఇంతదాకా రాముడు వ్రతాలతో, బ్రహ్మచర్య ధర్మాలతో, గురువులు విధించిన నియమాలతో చాలా శ్రమ పడ్డాడు. భోగాలు అనుభవించే కాలం వచ్చాక కూడా మళ్లీ చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. నా కొడుకైన రాముడు నా మాటకి ఎదురు చెప్పడు. అడవికి వెళ్లమని నేను చెప్పగానే తప్పక ‘అలాగే’ అంటాడు. నేను రాముడ్ని అడవికి పంపమని ఆజ్ఞాపించగానే అతను ‘నేను పోను’ అని చెప్పి నా ఆజ్ఞని ధిక్కరించడం నాకు ఇష్టం. కాని రాముడు ఎన్నడూ నా ఆజ్ఞని జవదాటడు. అతను కపటం లేని పరిశుద్ధమైన మనసు కలవాడు. కాబట్టి రాముడు నా ఆజ్ఞని అతిక్రమించడం నాకు ఇష్టమే అని తెలుసుకోలేడు. దాంతో రాముడ్ని చూసి నేను ‘నువ్వు అడవికి పో’ అని ఆజ్ఞాపించగానే ‘మంచిది’ అంటాడే తప్ప ఇంకేం మాట్లాడడు.
‘రాముడు అడవికి వెళ్లగానే సర్వలోక నిందితుడు, క్షమించదగని వాడు ఐన నన్ను మృత్యువు యమ లోకానికి తీసుకుపోతుంది. మనుషుల్లో ఉత్తముడైన రాముడు అడవికి వెళ్లగానే నేను మరణిస్తాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వారి విషయంలో ఏం ఘోర కృత్యాలు చేస్తావో? నన్ను, రాముడ్ని, లక్ష్మణ శత్రుఘు్నలని కోల్పోయిన కౌసల్య శోకాన్ని భరించలేక నన్ను అనుసరిస్తూ మరణిస్తుంది’ ఇలా దశరథుడు పలు విధాల వాపోవసాగాడు.
‘అయ్యా! దీంతో అయోధ్య కాండ సర్గ పనె్నండు పూరె్తైంది. రేపు పదమూడో సర్గలోకి వెళ్దాం’ హరిదాసు చెప్పాడు.
(అయోధ్యకాండ సర్గ 12 శ్లోకం 37 నించి 90 దాకా)
మళ్లీ హరిదాసు ఆ కథలో ఆరు తప్పులని చెప్పాడు. వాటిని కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

దశరథుడికి ఇద్దరు ఇష్టులు. వారు ఎవరు?
1.రాముడు 2.కైకేయి

కిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1.11,12 సర్గలోని 36వ శ్లోకం దాకా హరిదాసు చెప్పాడు. కాని ఒక్క సర్గ మాత్రమే చెప్పానని చెప్పడం నిజం కాదు.
2.ముప్పై మూడు మంది దేవతలు విందురు గాక అన్నది. సర్వదేవతలు అన్నది తప్పు.
3.‘దేవాసుర యుద్ధంలో’ అని కైకేయి చెప్పింది తప్ప ఉట్టి ‘యుద్ధంలో’ అని చెప్పలేదు.
4.రాముడి రాజ్యాభిషేకానికి సంబారాలన్నీ సమకూరాయి కదా. వాటితోనే భరతుడికి రాజ్యాభిషేకం చేయి’ అని కైకేయి కోరింది. కాని హరిదాసు దీన్ని చెప్పలేదు.
5.కైకేయి ‘దండకారణ్యం’లో అని చెప్పింది తప్ప ఉత్తి అరణ్యం అనలేదు.
6.రాముడు ఇవాళే అడవికి వెళ్లడం నేను చూడాలి అని కైకేయి చెప్పిన మాటల్ని హరిదాసు చెప్పలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి