చదరంగం
Published Saturday, 20 May 2017చదరంగం ఆటని జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు మనకి బోధపడతాయి. సైనికుడు (పాన్) ఎప్పుడూ ముందు అడుగు వేస్తాడు. అతనికి వెనక అడుగు వేసే అవకాశం లేదు. ‘రాజు’ ఒక్క అడుగు మాత్రమే వేస్తాడు. అన్ని వైపులా అడుగు వేసే అవకాశం ఉంటుంది. వెనక్కి కూడా అడుగు వేయవచ్చు. కానీ ఎప్పుడూ రక్షణలో ఉంటాడు. ఒక్క గుర్రం మాదిరిగా తప్ప, మంత్రి అందరిలా నడుస్తాడు.
చదరంగం ఆట ఆడుతున్న వాళ్లని మనం గమనిస్తే వాళ్లు ఒక్కోసారి సైనికునిలా కన్పిస్తారు. మరోసారి రాజులా కన్పిస్తారు. సైనికునిలా అన్పించినప్పుడు ఒక అడుగు మాత్రమే వేయగలరు. మొదటిసారి మాత్రం రెండు అడుగులు వేయగలరు. సైనికుడే కానీ ఐదు అడుగులు వేస్తే మంత్రిలా మారిపోతాడు. అయితే ఆ ఐదు అడుగులు వేసే పరిస్థితి ఉండాలి. చుట్టూ కోట గోడ వుంటే తప్ప రాజుకి రక్షణ ఉండదు. ఇదీ సైనికుడి, రాజు పరిస్థితి.
‘రాజులా వుండాలా? సైనికునిలా ఉండాలా?’ ఈ ప్రశ్న తరచూ మనల్ని తొలుస్తూ ఉంటుంది.
సైనికునిలా ఉంటే మంత్రి అవుతామో లేదో తెలియదు. ఆ ఐదారు అడుగులు వేసే వరకు బ్రతికి ఉంటామో లేదో తెలియదు. రాజులా ఉంటే కోట గోడ ఉండాలి. అలా లేనప్పుడు ఆట ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
అందుకే మనం సైనికునిలా ఉండకూడదు. రాజులా వుండకూడదు. చదరంగం ఆటలో మనం ఆట ఆడే వ్యక్తిలా ఉండాలి. మనం సైనికుడిలా వున్నా రాజులా వున్నా మనలని ఆడించే వ్యక్తులు వేరే ఉంటారు. వాళ్లు ఆడించిన విధంగా మనం ఆడాల్సి ఉంటుంది. మన జీవితం మన నియంత్రణలో ఉండదు. మన నిర్ణయాలు మనల్ని ప్రభావితం చేయవు. ఇతరుల నిర్ణయాలు మనలని ప్రభావితం చేస్తాయి. మన జీవితాన్ని ఇతరుల నిర్ణయాలు ప్రభావితం చేయకూడదు.
చదరంగం ఆటలోని వస్తువుల్లా మనం మారకూడదు. మన జీవితాన్ని మనమే ప్రభావితం చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని ఆశావాహ దృక్పథంతో మనం ప్రభావితం చేయాలి. సైనికుని ఐదు అడుగులు మనమే వేయించి మంత్రిని చేయాలి. రాజు చుట్టూ కోట గోడ కట్టి మనమే కాపాడాలి.
చదరంగంలోని వస్తువుల మాదిరిగా మనం మారకూడదు. వస్తువులని నడిపే వ్యక్తులుగా మనం మారాలి. జీవితం చదరంగమే. కానీ ఆట ఆడించే వ్యక్తులం మనం కావాలి.