S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొలిమి - బాడిసె

పల్లె పల్లెగా ఉన్నప్పుడు, వ్యవసాయం, వ్యవసాయంగ ఉన్నప్పుడు, ఊర్లో కులవృత్తుల అవసరం, వారికి గౌరవం ఉండేవి. ఇక్కడ నేను కుల వ్యవస్థ గురించి చర్చించే ప్రయత్నం చేయడంలేదు. మా పల్లెలో తాడి, తాటి చెట్లు లేవు. మా ప్రాంతంలో ఈతచెట్లు ఉండేవి. అవి గూడ మా ఊళ్లో లేవు. అయినా ఊళ్లో గౌండ్లు అనే ఈడిగె వాండ్లు ఉండిరి. ఇప్పటికీ ఉన్నరు. మా అసలయిన స్వంత ఊళ్లో పొలం ఉండేది. అందులో ‘ఈదులు’ అంటే ఈతచెట్లు వందల సంఖ్యలో ఉండేవట. వాటికిగాను, ఏటా కొంత ఆదాయం కూడా వచ్చినట్టు గుర్తు.
మా పొలం ఉండేది, నాయన తన అమ్మమ్మ ఊరికి చేరుకున్నడు. అది మా తాత ఉండగనే జరిగింది. ఇక్కడ గూడ కొంత పొలం ఉండేది. అదేమంత పెద్ద పొలంగాదు. అంత కాపుదనం గాదు. అయినా ఇంటికి సరిపోయే వరి మా పొలంలోనే పండించుకోని తిన్నము. పాలేటికాండ్లవి రెండు గడాలు. మావి రెండు. గడెము అంటే రెండు ఎద్దులు. నాగలి. ఈ నాగలి బజారులో కొంటే దొరుకదు. తగిన చెట్టు నరికి కర్ర తెచ్చుకోవాలె. దాన్ని వడ్ల, అంటే వడ్రంగి ఆయన నాగలిగ తయారుచేస్తడు. నాగలి అంటే ఒక్క ముక్కగాదు. పల్లె సంగతులు తెలియని వాండ్లకు ఈ సంగతులు తెలియవు. పల్లెవాండ్లమయిన నా వంటి వాండ్లకు ఇవి దప్ప మరొక సంగతి తెలియదు. నాగలిలో నేలను చీల్చే భాగం పేరు దుంప. దాన్ని సరిగ్గ పట్టి నడిపే భాగం మెడితోక. నాగలి నుంచి, పొడుగాటి కర్ర. దాని చివర అడ్డముగ కాడిమాను. దానికి రెండు ఎద్దులను కట్టేందుకు ఏర్పాట్లు. వివరాలు అనవసరం గానీ, వడ్ల నారాయణ నాగలి తయారుచేస్తడు. దుంపలో ఒక ఇనుప ముక్క ఉంటుంది. దాని పేరు కఅరు. అదే నేలను చీల్చుతుంది. కర్రును దుంపకు బిగించేందకు కొండి ఉంటుంది. కర్రు, కొండి అన్నవి ఇనుప భాగాలు. వాటిని కమ్మరి రామచెంద్ర తయారుచేస్తడు. నాకు, ఈ వడ్ల, కమ్మర్ల పనితనం చూడాలని ఆసక్తి శాన ఉండేది. రామచెంద్రి చల్లపూట మాత్రమే కొలిమి పెట్టేవాడు. అంటే ఉదయాన, సాయంత్రం అన్నమాట. ఆ సమయానికి నేను అక్కడికి చేరుకునేవాణ్ని. ఆ యినుమును నిప్పుల్లో ఎర్రగా కాల్చడం, డన్నులు, సుత్తెలతోటి కొట్టి, కావలసిన సామాను తయారుచేయడం అది చూడచక్కని వ్యవహారం. పెద్ద సుత్తెను యువకులు ఎత్తి కొడుతుంటే వాండ్ల కండరాలు తిరిగి, చెమట పట్టి భలేగా కనిపించేవి. ఆ పనిలోని లయ, సమన్వయం నిజంగా ఆశ్చర్యకరమయినవి. పొద్దునే్న బడికి పోవాలన్నది నిజమే. కానీ స్నానపానాదులకు ముందే కమ్మరి కొలిమిని కొంచెం సేపయినా చూడవలసిందే. కొలిమికి గాలి ఊదేటందుకు తిత్తిగాక, ఒక చక్రంతో ఏర్పాటు ఉండేది. నాకు ఆ చక్రం తిప్పాలని ఉత్సాహం. కానీ రామచెంద్రి ఊరుకోడు. ‘నీకెందుకయ్యా! కష్టము’ అంటడు. అది నా మీదనున్న గౌరవానికి గుర్తు.
వడ్ల వాండ్ల పని, గూడ ఇంటికి పక్కనే ఉండే అశోక చెట్ల నీడలో జరిగేదని గుర్తు. చెట్టు బోదెగా వచ్చిన ఒక కర్రను, పెద్ద బాడిసే తోటి, నారాయణ, దూలముగ మార్చిన తీరు యింకా గుర్తుంది. ఆ ఊపులో ఎక్కడ తేడా వచ్చినా అంత బాడిసే, ఆయన కాళ్లకు తగులుతుంది. కానీ, ఎన్నడు అట్ల తగలలేదు. అదే ఒడుపు, పనితనము. ఆ పని చూడడములో నాకు అంతులేని ఆనందము. కోత మెషీన్లు వచ్చిన తరువాత వడ్రంగులకు కష్టము తప్పింది అన్నరు. నాకు మాత్రం అట్ల తోచలేదు. చదువుకుంటున్న నా కలాలు, కాయితాలు ఎవరన్న ఎత్తుకపోతే ఎట్ల ఉంటుంది?
అన్ని పనులు మెషీనే్ల చేస్తయి. మనుషులు, పనితనాల అవసరం లేదు. అందరు చదువుల వెనుక ఎగబడతరు. అందరు క్లర్కులు, పనిమనుషులు అవుతరు. కర్ర వస్తువుల కార్ఖానాలో వడ్రంగులకే గాక ఎవరికయినా సరే పనిచేసే అవకాశం ఉంటుంది. వృత్తిపనుల వారు తమ పనితనంతో సంపద సృష్టించుకున్నారు. ఆ పనితనం పదిమంది మధ్యన పడింది. ఎవరికీ కాకుండ పొయ్యింది. కులవృత్తులు లేకుంటే కాలం గడవదు. అయితే, అవి ఇప్పుడు వృత్తులు. వాటికీ కులాలకు సంబంధం లేదు. కులాలు ఉండాలని నేను అనడం లేదు. కానీ పనితనం మాత్రం, ఎవరికీ పట్టని విషయంగ మారింది. అది నా బాధ.
మా ఊళ్లో మొదట్లో కుమ్మర్లు లేరు. కుమ్మర్లకు, వ్యవసాయానికి సూటగ సంబంధం లేదు. కాని బతుకుతోటి సంబంధం ఉంది. నేను పల్లె వదిలి పట్నం చేరేవరకు గూడ, యింట్లో పప్పు, చారు మాత్రం కట్టెల పొయ్యి మీద కుండలోనే తయారయ్యేవి. పాలు, పెరుగు కూడ కుండలలోనే. ఆ రుచులు వేరు. కానీ, నేనే, గ్యాస్ పొయ్యి కొని ఇంట్లో అమర్చి వచ్చిన. దాని మీద కుండతోటి వండుకునేందుకు కుదరదు. ఊళ్లోకి ఒక కమ్మరి కుటుంబం వలస వచ్చింది. వాండ్లు ఇల్లు కట్టుకున్నరు. పక్కననే కుండలు కాల్చే ఆవము గూడ కట్టినరు. ఊరంత రైలుకట్టకు ఇవతల ఉండేది. అప్పుడే అవతల గూడ ఒకటొకటి ఇండ్లు లేచినట్టు గుర్తు. కుమ్మరి వాండ్లకు ఊరంత కలిసి ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చినరా? లేక వాండ్లు కొన్నరా? నాకు తెలియదు. నా మట్టుకు నాకు పోయి చూచేటందుకు మరొక పనితనం దొరికింది. వడ్ల, కమ్మర్ల ఇండ్లు మా యింటికి దగ్గర. కుమ్మరి ఇల్లు కొంచెం దూరం. అయినా వీలు దొరికినప్పుడంత అక్కడ చేరుకునేవాణ్ని. కుమ్మరి సారె అనే ఆ చక్రం తిప్పేది శాన ఒడుపుతో కూడిన పని. కర్రతోటి సారెను గిరగిర తిప్పి, ఆ వేగం తగ్గేలోపల మంటిని రూపాలలోకి మార్చడం నిజంగ గొప్ప విద్య! నేను సారె తిప్పే ప్రయత్నం చేసిన. కానీ, పిల్లగాణ్ని గనుక ఎత్తు సరిపోలేదు, అన్నడు కుమ్మరాయన. పేరు గుర్తులేదు. ఎంత అన్యాయము. పచ్చి కుండలను కర్ర పలకతోటి కొట్టి, అంతట మందం ఒకే తీరుగ చేసేది అసలు విద్య! అది గూడ నాకు చేతగాలేదు.
సంబంధము లేని సంగతి ఒకటి గుర్తుకు వస్తున్నది. కుమ్మరివాండ్ల దగ్గర ఒక పెంపుడు గాడిద ఉండేది. ఆ కాలంలో పిల్లలు పుడితే పురిటిలోపల, అంటే పది దినాల లోపల వాండ్లకు గాడిద పాలు తాపేవారు. కడుపు నిండ గాదు. ఏవో కొన్ని చుక్కలు. నాకు కుమ్మర్లు మిత్రులు మరి! గనుక గాడిద పాల కొరకు కొన్నిసార్లు పెద్దవాండ్లు నన్ను పంపడము, నేను వాటిని తేవడము గుర్తున్నది. గాడిద పాలలో ఏదో మంచి లక్షణము ఉండి ఉంటుంది. తరువాత ఎన్నడు ఈ సంగతిని పట్టించుకోలేదు. ఆ మధ్యన ఒకసారి పాలమూరికి పోయినప్పుడు, తిరుగు దారిలో, బస్ స్టాండ్ వరకు పోలేదు. మెట్టుగడ్డ మీద బస్‌లు ఆపుతరని ఆడనే నిలవడి, ఎదురుచూస్తున్న. ఆ పక్కన గోడ వెంట, కుండలు, కూజాలన్ని పేర్చి అమ్ముతున్నరు. నేను అటు వేపు చూచిన. అక్కడున్న ఆడ మనిషి పరిచయం చిరునవ్వింది. తప్పులేదని నేను గూడ నవ్విన! ‘గోపయ్యా! బాగున్నవా?’ అని అభిమానముగ పలుకరించింది ఆ తల్లి. అది పల్లె పద్ధతి. ఆమె మా ఊరి కుమ్మరి అన్నమాట! అంతలో బస్ వచ్చింది అనుకుంట.
మాది అసలయిన బీద పల్లె. అందుకేనేమో అక్కడ అవుసలి అంటే కంసాలి వాండ్లు గూడ లేరు. కుమ్మరుల వలెనే, ఒక కుటుంబము వచ్చి ఊళ్లో చేరుకున్నరు. వాండ్ల యింట్లో ఒక పిల్లవాడు మా తమ్ముని వయసువాడు. అప్పటికి నేను చదువు కొరకు పాలమూరులో చేరడము, నిత్యము పోయి రావడము జరుగుతున్నది. అందుకేనేమో, కంసాలుల యింట్లో పనితనాన్ని చూడడం గురించి ఎక్కువ జ్ఞాపకం లేదు. మా పల్లెలో మేదర్లు చాల కుటుంబాలే ఉన్నరు. కానీ వాండ్లంత చదువులు, ఉద్యోగాలకు చేరుకున్నరు. అయినా పల్లె అవసరానికి తగిన చాటలు, జల్లెడలు, గంపలు వాండ్లే తయారుచేసి ఇస్తుండిరి. ఎండకాలం వచ్చిందంటే విసనకర్రలకు గిరాకీ. వెదురుగొట్టం పిడి పట్టుకోని గుండ్రంగ తిప్పగలిగే విసనకర్రలు ఉండేవి. పొయ్యిలోకి గాలి కొరకు మొరటు విసనకర్రలు ఉండేవి. వెదురును సన్నని బద్దలుగా చీల్చడం, రకరకాల ఆకారాలలోకి అల్లికలు, చూడడం గుర్తున్నది. ఈ మధ్యన ప్లాస్టిక్ చేటలు, జల్లెడలు వచ్చినట్టు చూస్తే మాత్రం ఒక్కసారి బాధ కలిగింది.
గుడిలో దీపం పెట్టాలంటే బ్రాహ్మలే అవసరం అనే రోజులు కావివి. ఎవరన్న పెట్టవచ్చు. అందుకే, వడ్ల పని, కమ్మరం, కుమ్మరం గూడ ఎవరన్న చెయ్యవచ్చు. చేస్తున్నరు కూడ. కానీ వృత్తిగా చేయడం వేరు. హాబీగా చేయడం వేరు.
నాకు నాదస్వరం వాద్యం నేర్చుకోవాలని గట్టి కోరిక ఉండేది. ఇప్పుడేమో నేర్చుకోవలసిన వాండ్లే నేర్చుకుంటు లేరట! నాదస్వరానికి కులముతో సంబంధం ఉన్నదా? అది నా అనుమానము!

కె. బి. గోపాలం