బిజిలీ చెప్పిన పాఠం
Published Saturday, 23 January 2016చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తుంటే చిన్న కుక్కపిల్ల కన్పించింది. ఒక్కటే. దాని చుట్టూ ఎవరూ లేరు. చూస్తే చాలా ముద్దుగా అన్పించింది. మెరిసే కళ్లు. ఆనందంతో కదిలే చెవులు. దాన్ని చూడగానే నాకు ప్రేమ కలిగింది. దగ్గరికి తీసుకుని దాని తల మీద నిమిరాను.
అంతే!
ఇక నన్ను వదిలిపెట్టలేదు. దాన్ని వదిలేసి ఇంటికి నడుస్తుంటే అది నా వెంటపడింది. నా కాళ్ల చుట్టూ తిరుగుతూ నన్ను కదలకుండా చేసింది. కొద్దిసేపు అక్కడే నిల్చొని దాన్ని వదిలి నడవడం మొదలుపెట్టాను. కాని అది నన్ను వదలిపెట్టలేదు. తన తలని నా కాళ్ల దగ్గర పెడుతూ నన్ను వదిలిపెట్టలేదు.
ఏం చెయ్యాలో తోచలేదు. కాస్సేపు అక్కడే ఉండి ఇంటికి బయల్దేరాను. అది నా వెంటపడింది. కుక్కను ఎందుకు తెచ్చావని అమ్మ అంటుందని భయం. ఆ కుక్క నా వెంటే మా ఇంటికి వచ్చింది.
ఆ కుక్కను చూడగానే ఇంట్లో వాళ్లందరూ ఆకర్షితులయ్యారు. మా అక్క దాన్ని ‘బిజిలీ’ అంది. అది బిజిలీగా మా ఇంట్లో స్థానాన్ని సంపాదించింది.
అందరి చుట్టూ తిరుగుతూ అందరికీ ప్రేమపాత్రమైంది. స్కూల్‌కి వెళ్తుంటే రోజూ బయటిదాకా వచ్చి సాగనంపేది. స్కూలు నుంచి ఇంటి దగ్గరికి రాగానే ఎదురొచ్చి ఆహ్వానించేది.
బిజిలీ నా చిన్నతనంలో ఓ స్నేహితురాలై పోయింది. సాయంత్రం స్నేహితులు ఎప్పుడన్నా రాకపోయినా ఏమీ అన్పించకపోయేది. అంతలా పెనవేసుకు పోయింది. ఓ మూడు సంవత్సరాల తరువాత అనారోగ్యంతో చనిపోయింది. డాక్టర్ వచ్చి మందులు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
ఆ తరువాత ఏ కుక్కనీ పెంచుకోలేదు. బిజిలీ రూపం ఇంకా మా మనస్సు నుంచి చెక్కుచెదరలేదు. అది చూపించిన ప్రేమ మేమెవ్వరమూ మర్చిపోలేదు.
ఓ చిన్న ప్రేమపూర్వకమైన చిరునవ్వు, స్పర్శ బిజిలీని మా ఇంటికి రప్పించింది. మాతోపాటూ వుండేలా చేసింది. ఓ స్నేహితునిలా నాతో ఆడుకుంది. అమ్మలా నన్ను కాపాడింది. మా ఇంటి చుట్టూ తిరిగింది. మా అందరికీ నేస్తం అయ్యింది.
బహుశా నా కన్నా ముందే ఎంతో మంది ఆ కుక్కపిల్లని చూసి ఉంటారు. కానీ దాన్ని ఎవరూ ప్రేమపూర్వకంగా చూసి ఉండకపోవచ్చు. చూసి ఉంటే అది నాకు దొరకకపోయేది. నాకు ఇంత ప్రేమని పంచకపోయేది.
మనం ఎవరినీ ప్రేమించకపోతే మనల్ని ఎవరూ ప్రేమించరేమో. ఇది మా బిజిలీ చెప్పిన పాఠం.