S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫిర్ భీ చల్ తే

అతను నడవాలనే అయిదవ అంతస్తు నుంచి కిందకు దిగాడు. అందుకే ఆగకుండా నడుస్తున్నాడు. బయలుదేరగానే ఎవరో అడిగినట్లున్నారు ‘వాకింగా?’ అని. అందరూ నడుస్తారు. ఇంట్లో ఒక గది నుంచి మరొక గదికి నడుస్తారు. ఏదో అవసరం వచ్చిందని అంగడి దాకా నడుస్తారు. అదంతా నడక. నిజానికి నడక అవసరం లేనప్పుడు, ప్రత్యేకంగా బయలుదేరి, ఆగకుండా నడిస్తే అది వాకింగ్. అందుకు ప్రత్యేకమయిన జోళ్లు, దుస్తులు కూడా ఉంటాయి. అతను అటువంటి హంగులు ఏవీ లేకుండానే నడుస్తున్నాడు. కాయికంగా, అంటే శరీరపరంగా కూడా సగటు మనిషి అతను. అందుకే అందరితో కలిసిపోయి నడుస్తున్నాడు. అయితే అతను ఆలోచిస్తూ నడుస్తున్నాడు. నడుస్తూ ఆలోచిస్తున్నాడు. అట్లా ఎంతమంది ఆలోచిస్తారు? అసలు ఆలోచించడం అవసరమా? అతనికి ఈ ప్రశ్నలు ఎప్పుడూ ఎదురయినట్లు లేదు. కనుక ఆలోచిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి ఆలోచనలో పడి, తనను తాను మరచిపోతాడు. ప్రపంచాన్ని మరచిపోతాడు. ముందే మెయిన్‌రోడ్ మీద, కాదులెండి, పక్కన నడుస్తున్నాడు. అక్కడ తనను తాను మరిచిపోతే మరేమయినా ఉందా? అతనికి అంతటి ఆలోచన కలగటం లేదు.
అంతసేపు ఆలోచిస్తే, మొదటి నుంచి తుది దాకా, ఒకే సంగతి గురించి ఆలోచించడం కుదురుతుందా? ఆలోచనలో ఉన్నప్పుడు, కంటికి కనిపించే వ్యవహారం మెదడు దాకా చేరదు కానీ అసాధారణంగా ఏదయినా జరిగితే, ఆలోచన తెగుతుంది. అదుగో! అతనెవరో మోటార్‌సైకిల్ మీద, ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా వస్తున్నాడు. ప్రమాదం అని తెలిసి కూడా వచ్చేస్తున్నాడు. తను చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా వచ్చేస్తున్నాడు. అతని కారణం అతనికి ఉంటుంది. రోడ్‌లో మధ్యన డివైడర్స్ వేశారు. దానికి తన వేపు వాళ్లు రాక, మరోవేపున పోక. అవును పోక, అంటే వక్క, అంటే సుపారీ, అంటే ఛాలియా! అది కాదు సంగతి. అతను శాసన ఉల్లంఘనం చేస్తున్నాడు. మనిషికి, తప్పు చేయడంలో సంతోషం దొరుకుతుందని అనుమానం. పాతకాలం నుంచి మరొకరి వస్తువును మనదిగా చేసుకుంటే అందులో ఒక మజా! దేవాల కోసం యుద్ధాలు. ఆటబొమ్మ కొరకు కీచులాటలు. అన్ని చోట్ల తప్పు చేయాలన్న తపన. అందరు చూస్తుండగా తప్పు చేస్తే అదొక బహదూరీ! అంటే శౌర్యం. ఈ మధ్యన ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో ఎక్కువగా పని చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర ఆగరు. ఇందాకటి మనిషిలాగ, ట్రాఫిక్‌కు ఎదురుగా వస్తారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తారు. మీరు చేస్తున్నది పొరపాటు, అని చెపితే, ఎవరూ పట్టించుకోరు. తప్పు చేసినందుకు సుంకం కట్టే పద్ధతి ఒకటి ఉండేది. అప్పుడు ఆ వసూలు చేసే మనిషి కూడా తప్పు చేస్తాడు. అతనికీ తప్పులో ఆనందం. పైగా నాలుగు ‘రాళ్లు’ దొరుకుతాయి గద! అందుకే ఫొటో తీసి, ఆ బండి యజమానికి, నోటీసు పంపుతున్నారు. ఈ మధ్యన డబ్బులకు విలువ లేకుండా పోయింది. నోటీస్ వస్తే, అందులో సూచించిన మొత్తం కడతారు. మళ్లీ తమ దారిలో తాము తప్పులు చేస్తూనే ఉంటారు.
ఆలోచన తెగింది. ఎందుకు తెగింది. మళ్లీ ఏదో జరిగింది. ఏం జరిగింది? అదే అర్థం కావడంలేదు. అక్డ చూపులు ఒక షాపు మీదకు పోయినట్లు అనుమానం. ఆ పక్క నుంచి మరో సందు వచ్చి మెయిన్ రోడ్‌కు కలుస్తుంది. షాపును చూడాలి. అటుగా వచ్చే వాహనాల నుంచి తప్పించుకోవాలి. అదీ సంగతి. అందుకే ఆలోచన తెగింది. షాపును ఎందుకు చూడాలి? అక్కడ ఒకప్పుడు కనిపించిన ఒక వ్యక్తి కారణంగా చూడాలి. అతను ఒకసారి, ఆ వీధిలోని ఒక అంగడి కొరకు వెతుకుతున్నాడు. పైన బోర్డ్ కనిపించాలి. కానీ అందులోకి పోయేందుకు తోవ మాత్రం తెలియలేదు. అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగానే ఆ షాపు ముందు ఒక అమ్మాయి కనిపించింది. అందంగా ఉంది. బంగారు తల్లిలాగ ఉంది. ఆమె అంగడిలో ఏదయినా కొనడానికి వచ్చిందా? తీరు మాత్రం అట్లా కనిపించలేదు. అది చీరెల అంగడి. ఆమె అక్కడ ఊరికే నిలబడి ఉంది. ‘అమ్మా! పై అంగడిలోకి ఎట్లా వెళ్లాలి?’ అతను అడిగాడు. ఆమె దారి చూపించింది. అతను వెళ్లాడు. మరి ఇవాళ ఎందుకు ఆ అంగడి వేప చూడాలి? అమ్మాయి కనిపిస్తుందనా? ఒకవేళ కనిపిస్తే ఈసారి ఏం అడుగుతాడు తాను? ఇవాళ అక్కడ ఏ పనీ లేదు. ఇవాళ ఎక్కడా ఏ పనీ లేదు. ఇవాళ కేవలం వాకింగ్. ఇంగ్లీషులో జే వాకింగ్ అని ఒక మాట ఉంది. అంటే జాగ్రత్త లేకుండా, పరిసరాలు పట్టకుండా, పని లేకుండా తిరగడం అని అర్థం. ఇవాళ అతను అచ్చం అదే పద్ధతిలో ఉన్నాడు. ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపు అయినట్టుంది. అయినా తిరిగి ఇంటి ముఖం పట్టే ఆలోచన లేదు. రోడ్డు, రోడ్ (మొదటిది తెలుగు, తరువాతది ఇంగిలీషా?) అవతల అంగడిని చూడాలి. సరే! ఉంది! ఉందనుకో! నీ కోసం ఆమె అక్కడ నిలిచి చూస్తున్నదా? నీకు ఆమె గుర్తుండిపోయింది. ఆమెకు నీవు గుర్తుండే అవసరం, ఆస్కారం లేవు? అమ్మాయి, ఒక్కసారిగా ఆలోచనల నుంచి ఓఝల్ అయింది. అంటే మాయం అయిందని అర్థం. అమ్మాయి అక్కడ ఉంటే, ఇక్కడి నుంచే చూచి, వీలయితే విష్ చేసి వెళ్లిపోవాలి. ఇవాళ ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉంది. అటువేపు వెళ్లవలసిన అవసరం తనకు లేదు. వెళ్లదలచుకున్నా కష్టపడాలి. ఇటుగా వస్తున్న ప్రవాహం లాంటి ట్రాఫిక్‌లో డివైడర్ దాకా దాటాలి. అప్పుడు ఆ విభాజనిని దాటాలి. విభజించేది విభాజని. అంటే డివైడర్. అప్పుడు అటుగా పోతున్న అవతలి ట్రాఫిక్ వరదను ఈదాలి. ఈ లోపల అవతలికి ఎందుకు పోయిందీ, మరిచిపోయినా ఆశ్చర్యం లేదు!
కట్! వెనుక నుంచి భీకరమయిన బస్సు బూయ్యిమంటూ బూరా ఊదింది. అవును మరి బస్‌స్టాప్ వచ్చేసింది. ఆ బస్ (బస్సు - తెలుగు) పక్కకు వచ్చి ఆగాలి. కొందరు దిగాలి. మరి కొందరు ఎక్కాలి. ఎందులో ఎక్కాలి? బస్‌లో ఎక్కాలి? ఏ బస్‌లో ఎక్కాలి? ఏమిటా ప్రశ్న? తేరిపార చూస్తే అదే తెలుస్తుంది. ఒకే నంబర్ గల బస్సులు (బస్‌లు అనవచ్చా? బసెస్ గదా ప్లూరల్? దుప్పట్లలో సింగిల్ దుప్పట్లు ఉంటాయి. అవి ఒకరు కప్పుకోవడానికి పనికి వస్తాయి. మరి ఇద్దరికి సరిపడే పెద్ద దుప్పటిని ఏమంటారు? ఒకాయన ప్లూరల్ అన్నాడు. కానీ దాన్ని డబుల్ అంటారు!) వరుసగా మూడు వచ్చి ఒక దాని వెనుక ఒకటి ఆగాయి. వాటిలో మధ్యలో బస్ కొంచెం బీదగా ఉంది. చివరది కొంచెం ఖాళీగా ఉంది. కానీ, డాబుగా ఉంది. ఎందులో ఎక్కాలి తేల్చుకోలేక ఒకతను మూడవ బస్‌లోని ఖాళీకి ఆకర్షితుడయి అటుగా కదిలాడు. ఓపిక లేని ఆ బస్ డ్రయివరు, బీద బస్ పక్కగా దూరి తుర్రుమన్నాడు. దాని వెంట పరుగెత్తడం అంత మంచిది కాదనుకుని వెనక్కు తగ్గుతుంటే, మొదటి బస్ వెళ్లిపోయింది. రెండవది, కదిలి మొదటి బస్ ఏర్పరిచిన ఖాళీలోకి దూరింది. రన్నింగ్, పోనీ వాకింగ్, పోనీ మూవింగ్ బస్‌లోకి ఎక్కడం కొంతమందికి సరదా! అతను గమనిస్తున్న ఒకతనికి ఆ సరదా లేదు. అదేం కాదు. ఆ పని చేతగాదు. ‘స్టాప్, స్టాప్’ అని అరుస్తూ మరీ బీద బస్ వెంట పడ్డాడు. కానీ, అక్కడ దిగవలసిన వారు దిగిపోయి, ఎక్కవలసిన వారు ఎక్కువగా లేనందుకు బీద బస్‌స్టాప్ లేదు. ఆపలేదు. ఆగలేదు. వెళ్లిపోయింది. ఆ ఒకతను అమాయకుడు. అరవకుండా నిలబడిపోయాడు. అది గమనిస్తున్న మరొకాయన, పోనీ మరొకతను ఉపన్యాసం లంకించుకున్నాడు. అంటే మొదలుపెట్టాడు. ఎవరు? అతను కాదు. అతను వీలయితే నడుస్తాడు. ఆలోచిస్తాడు. పాపం, ఇప్పుడు కీ, యివ్వని, బ్యాటరీ లేని గడియారం లాగ ఆగిపోయాడు. ఒకతను బస్సు మిస్సు అయ్యి ఉస్సురుమంటున్నాడు. మరొకతను వ్యాఖ్యానం చేస్తున్నాడు.
‘ఈ బస్సులు ఇంతే. మనం ఒక నంబర్ గురించి వస్తే, అది అరగంటదాకా రాదు. ఆలోగా అనవసరమయిన బస్సులు, అదే పనిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. విసిగి వెళ్లిపోదామనుకుంటే, ఇక రెండు, మూడు, కొండొకచో నాలుగు, బస్సులు తరుముతున్నట్లు వస్తాయి. బస్సులు రాకపోవడం, రావడం గురించి ఒక ఉదాహరణ ఉంది గానీ, వినడానికి బాగుండదు! సరే, బస్ ఎక్కామే అనుకుందాం. సీటు దొరకదు. కండక్టర్ చిల్లర అంటాడు. లేదంటే, టికెట్ వెనుక ఒక బొమ్మ గీసి యిస్తాడు. దిగేలోపల మరిచిపోతే, ఆ డబ్బులు గోదారిలో పోయినట్లే. మరొకతను ఏదో చెపుతూనే ఉన్నాడు. ఎవరూ వినడం లేదు. అతను మాత్రం వింటున్నాడు. అతనుడు అనగా శరీరము లేనివాడు అయినా వింటున్నాడు. శరీరం అంటే చెవులుంటాయి. శరీరం లేకుంటే చెవులెక్కడివి. అంటే మనం అనుసరిస్తున్న ఈ ‘అతను’ అతనుడు, మారుడు, మన్మథుడు కాదు. ఉఠ్ఠి సీదా, సాదా, సీధా మనిషి! వింటున్నాడు. కానీ నడవడం లేదు! హాశ్చర్యం! అతను ఆగాడు! తరువాత ఏం జరిగింది? వేచి చూడక తప్పదు!

కె. బి. గోపాలం